Medi-claim policy
-
మెడిక్లెయిమ్ సెగ్మెంట్‌పై మళ్లీ ఎల్ఐసీ చూపు!
న్యూఢిల్లీ: భారత బీమా రంగ దిగ్గజ సంస్థ– జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తిరిగి మెడిక్లెయిమ్ బీమా పాలసీ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి ఆసక్తిగా ఉంది. ఈ విషయంపై రెగ్యులేటర్– ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పేర్కొన్నారు. మెడిక్లెయిమ్ పాలసీ అంటే... మెడిక్లెయిమ్ పాలసీలు అంటే... నష్టపరిహారం (ఇన్డెమ్నిటీ) ఆధారిత ఆరోగ్య పథకాలు. అయితే మార్కెట్ నుండి ఈ పథకాలను ఉపసంహరించుకోవాలని 2016లో ఐఆర్డీఏఐ జీవిత బీమా సంస్థలను కోరింది. మూడు నెలల నోటీస్ పిరియడ్‌తో అప్పట్లో వాటి ఉపసంహరణ కూడా జరిగింది. జీవిత బీమా సంస్థలు ఇలాంటి ఆరోగ్య సంబంధ పథకాలు ఇవ్వడానికి సాంకేతికంగా అడ్డంకులు ఉన్నాయని అప్పట్లో రెగ్యులేటర్ భావించింది. నష్టపరిహార ఆధారిత ఆరోగ్య బీమా పథకాల కింద బీమా చేసిన మొత్తం వరకు వైద్య చికిత్స కోసం ఖర్చు చేసిన డబ్బుకు బీమా సంస్థ రీయింబర్స్మెంట్ (చెల్లింపులు) చేస్తుంది. 2016లో ఉపసంహరణకు ముందు జీవిత బీమా సంస్థల ఆరోగ్య పోర్ట్‌ఫోలియోలో 90–95 శాతం నష్టపరిహార ఆధారిత ఆరోగ్య బీమా పథకాలు (ఇన్డెమ్నిటీ) ఉండేవి. దీని ప్రకారం పాలసీదారు వైద్యుడిని సందర్శించిన తర్వాత లేదా వైద్య ఖర్చులను భరించిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను క్లెయిమ్ చేసే వీలుండేది. మళ్లీ మార్పు ఎందుకు? 2030 నాటికి ప్రతి పౌరుడు ఆరోగ్య బీమా పాలసీని కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ఆదేశాల నేపథ్యంలో జీవిత బీమా సంస్థలు ఆరోగ్య విభాగంలోకి తిరిగి ప్రవేశించే సమయం ఆసన్నమైందని ఇటీవలే కొత్త ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశిష్ పాండా అన్నారు.అయితే జీవిత బీమా సంస్థలను ఆరోగ్య బీమా పాలసీలను విక్రయించడానికి అనుమతించడం వల్ల కలిగే లాభ నష్టాలను రెగ్యులేటర్ మదింపు చేస్తోందని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్లలో జీవిత బీమా సంస్థలు ఆరోగ్య పాలసీలనూ విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 24.50 లక్షల మంది జీవిత బీమా ఏజెంట్లు ఉండగా, సాధారణ, ఆరోగ్య బీమా విభాగంలో కేవలం 3.60 లక్షల మంది ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. జీవిత బీమా సంస్థలను ఆరోగ్య బీమా రంగంలోకి అనుమతించినట్లయితే, ఏజెంట్ల సంఖ్య 600 శాతం పెరుగుతుంది. దీనివల్ల దేశంలో ఆరోగ్య బీమా వ్యాప్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా. -
విదేశాల్లో ఉన్నా, ఇక్కడ పాలసీ కొనసాగించాలా?
నేను ప్రవాస భారతీయుడిని, నేను భారత్‌లో ఉన్నప్పుడు ఒక మెడిక్లెయిమ్ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు నేను పనిచేసే చోట కంపెనీ నాకు బీమాను కల్పిస్తోంది. భారత్‌లో తీసుకున్న మెడిక్లెయిమ్ పాలసీని కొనసాగించటం సమంజసమేనా? నేను రిటైర్ అయ్యాక భారత్‌కు వద్దామనుకుంటున్నాను. ఈ పాలసీని ఇప్పుడు ఆపుచేసి, ఆతర్వాత కొనసాగించుకునే వీలు ఉందా? వివరించండి. –సురేశ్, ఈ మెయిల్ ద్వారా మీరు విదేశాల్లో ఉన్నందున ఇక్కడ తీసుకున్న పాలసీని కొనసాగించడం వల్ల మీకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. దీనిని ఆపేయడమే మంచిది. ఇప్పు డు దీనిని ఆపుచేసి, మీరు భారత్ వచ్చినప్పుడు మళ్లీ ఈ పాలసీని కొనసాగించే వీలు లేదు. దీనికి బదులుగా మీరు భారత్‌కు వచ్చినప్పుడు కొత్త మెడిక్లెయిమ్ పాలసీని తీసుకోవలసి ఉంటుంది. అప్పుడు పాలసీ తీసుకుంటే, మీకు ఏమైనా రుగ్మతలు ఉంటే వాటి కవరేజ్‌కు కొంత లాక్–ఇన్–పీరియడ్ ఉంటుంది. పైగా ఆ వయస్సులో ప్రీమియమ్ కూడా అధికంగా ఉంటుంది. 60 ఏళ్ల వ్యక్తి రూ.5 లక్షల ఆరోగ్య బీమా తీసుకుంటే ప్రస్తుతం ఏడాదికి ప్రీమియమ్ రూ.20,000–24,000 రేంజ్లో ఉంటుంది. భవిష్యత్తులో ఈ ప్రీమియమ్ పెరిగే అవకాశాలున్నాయి. అయినప్పటికీ, ప్రస్తుతమున్న పాలసీని కొనసాగించడం కంటే భారత్‌కు వచ్చినప్పుడు కొత్త పాలసీ తీసుకోవడమే ఉత్తమం. ఎల్ఐసీ జీవన్ ఆరోగ్య పాలసీలో అత్త మామలకు కూడా కవరేజ్ ఉంటుందని విన్నాను. నిజమేనా? ఈ పాలసీ సానుకూల, ప్రతికూలతలు ఏమిటి? –హరి, విజయవాడ ఎల్ఐసీ జీవన్ ఆరోగ్య పాలసీలో ఇతర సాధారణ ఆరోగ్య బీమా పాలసీలో లేని రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఈ పాలసీలో అత్త, మామలకు కూడా కవరేజ్ ఉంటుంది. రెండోది ఏదైనా శస్త్రచికిత్స జరిగితే, వాస్తవంగా ఖర్చయిన దానికంటే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. అయితే ఈ రెండు ప్రయోజనాలతో పాటు మూడు ప్రతికూలతలు ఈ పాలసీలో ఉన్నాయి. ఇతర ఆరోగ్య బీమా పాలసీలతో పోల్చితే ఇది ఖరీదైనది. ప్రీమియమ్‌లు ఎక్కువగా ఉంటాయి. నగదు రహిత వైద్యం లభించదు. పెద్ద శస్త్రచికిత్సలకైతే 50 శాతం క్యాష్ అడ్వాన్స్ మాత్రమే లభిస్తుంది. ప్రి, పోస్ట్ హాస్పిటలైజేషన్ వ్యయాలను ఈ పాలసీ కవర్ చేయదు. ఈ మూడు ప్రతికూలతల వల్ల ఈ పాలసీకున్న రెండు ప్రయోజనాలు పెద్దగా ప్రభావం చూపడం లేదు. సూపర్ టాప్–అప్ మెడిక్లెయిమ్ పాలసీలను ఆన్లైన్లో తీసుకోవచ్చా? ఏ ఏ సంస్థలు ఇలాంటి ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. –శశికాంత్, విశాఖపట్టణం సూపర్ టాప్–అప్ మెడిక్లెయిమ్ పాలసీలను ఆన్లైన్లో తీసుకోవచ్చు. యునైటెడ్ ఇండియా సూపర్ టాప్–అప్ పాలసీ, రెలిగేర్ ఎన్హాన్స్, అపోలో మ్యూనిక్ ఆప్టిమ సూపర్.. మీరు ఎంచుకోవడానికి మంచి పాలసీలు. టాప్ అప్ ప్లాన్ల కన్నా సూపర్ టాప్ అప్ ప్లాన్ల వల్ల ప్రయోజనాలు అధికం. తక్కువ ప్రీమియమ్‌తో ఎక్కువ బీమా కవరేజ్ పొందవచ్చు. మీకు ఆరోగ్య బీమా పాలసీ లేకున్నా కూడా ఈ సూపర్ టాప్అప్ పాలసీ తీసుకోవచ్చు. వైద్య ఖర్చులు ఒక పరిమితిని మించితే (దీనిని డిడక్టబుల్ అమౌంట్/లిమిట్‌గా పరిగణిస్తారు– ఈ డిడక్టబుల్ అమౌంట్‌ను మీరు తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ లేదా మీరు భరించాల్సి ఉంటుంది) ఈ సూపర్ టాప్ అప్ పాలసీల కవరేజ్ ప్రారంభమవుతుంది. మీ వైద్య ఖర్చులు డిడక్టబుల్ అమౌంట్‌ను మించితే, ఆ మించిన మొత్తాన్ని ఈ పాలసీలు చెల్లిస్తాయి. ఈ పాలసీలను తీసుకునేటప్పుడు పాలసీ డాక్యు మెంట్‌ను, పాలసీ బ్రోచర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. మినహాయింపులను, వెయిటింగ్ పీరియడ్లను జాగ్రత్తగా గమనించండి. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా రిటైర్మెంట్ అవసరాల కోసం పెన్షన్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా ? లేకుంటే రిటైర్మెంట్ అవసరాల కోసం మంచి రాబడులు అందించే మంచి ఇన్వెస్ట్మెంట్ సాధానాలను సూచించండి? –జాన్సన్, సికింద్రాబాద్ రిటైర్మెంట్ అవసరాలకు పెన్షన్–ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. ఇన్వెస్ట్మెంట్ అవసరాల కోసం ఎప్పుడు బీమా పాలసీలు తీసుకోకూడదు. బీమా, ఇన్వెస్ట్మెంట్.. వేర్వేరు. రెండింటికి వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. బీమా, ఇన్వెస్ట్మెంట్ అంశాలు కలగలసి ఉన్న ఏ పాలసీ కూడా ఈ రెండు అంశాలకు(బీమా, ఇన్వెస్ట్మెంట్) సరైన న్యాయం చేయలేదు. ఈ తరహా పాలసీలు స్వల్ప బీమా కవరేజ్‌ను మాత్రమే ఇస్తాయి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను ఇవ్వలేవు. మీ రిటైర్మెంట్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించండి. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత చదువులు, రిటైర్మెంట్ అవసరాల కోసం నిధి ఏర్పాటు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. నెలకు కొంత మొత్తం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో రెండు విభిన్నమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. మరో వైపు జీవిత బీమా కోసం ఏదైనా టర్మ్ బీమా పాలసీ తీసుకోండి. ఈ తరహా బీమా పాలసీల్లో ప్రీమియమ్‌లు తక్కువగా, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. -
మెడిక్లెయిమ్‌కు పరిమితులుంటాయ్!
► అది ఆరోగ్య బీమా లాంటిది కాదు ► పాలసీ తీసుకునే ముందే నిబంధనలు చూడాలి ► చాలా ఖర్చులు, వ్యాధులు దీని పరిధిలోకి రావు ► క్యాష్లెస్కూ కొన్ని ఇబ్బందులుంటాయి ఆరోగ్య బీమాకు సంబంధించి మెడిక్లెయిమ్ పాలసీలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. చాలా మంది దీన్ని ఒకరకంగా జీవిత బీమా పాలసీగా కూడా భావిస్తారు. అయితే, రెండింటికీ మధ్య చాలా తేడా ఉంటుందన్న సంగతి చాలామందికి తెలియదు. అలాగే, చికిత్స వ్యయాలకు సంబంధించి పరిమితుల ప్రతిబంధకాలూ ఉంటాయన్న విషయమూ తెలియదు. పైగా మెడిక్లెయిమ్ విషయంలో అపోహలు అనేకం ఉన్నాయి. వాటిని నివృత్తి చేసేదే ఈ కథనం... అన్ని వ్యాధులకు కవరేజీ ఉంటుందా? అన్నింటికీ ఉండదు. కేవలం అనారోగ్యానికి సంబంధించిన చికిత్సకు మాత్రమే కవరేజి ఉంటుంది. ఒకవేళ అనారోగ్యం కారణంగా మీరు సంపాదించలేని పరిస్థితి ఏర్పడితే దీని ద్వారా పరిహారమేమీ లభించదు. ఉదాహరణకు క్యాన్సర్ చికిత్సకు చాలా ఖర్చవుతుంది. కానీ దీని కారణంగా చాలా ఏళ్ల పాటు ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు. ఇలాగే, సుఖవ్యాధులు, టీకా సంబంధ సమస్యలు మొదలైనవి మెడిక్లెయిమ్ పరిధిలోకి రావు. ఎన్ని ఆస్పత్రులు మారినా, రీయింబర్స్మెంట్ లభిస్తుందా? కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆస్పత్రి మారడానికి అవకాశం ఉంటుంది. 1) మరింత మెరుగైన చికిత్స కోసం 2) పాలసీ నియమ నిబంధనలకు అనుగుణంగా కేసును బట్టి థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) అనుమతిస్తేనే ఇలాంటివి సాధ్యపడతాయి. చికిత్సకు ఎంత ఖర్చయినా రీయింబర్స్ అవుతుందా? దేనికైనా అపరిమితమైన ఖర్చులు రీయింబర్స్ కావు. ఆరోగ్య సమస్యను బట్టి ఆస్పత్రి వ్యయాలకు సంబంధించి చాలా మటుకు మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఉపపరిమితులుటాయి. ఇవి తెలుసుకోకపోతే మన జేబు నుంచి అదనంగా పెట్టుకోవాల్సి రావొచ్చు. సమ్ అష్యూర్డ్ కన్నా తక్కువగానే ఉన్నప్పటికీ మొత్తం చికిత్స వ్యయాలను బీమా కంపెనీ క్లియర్ చేయకపోవచ్చు. గది అద్దె మొదలుకుని ఐసీయూ వ్యయాలు, డాక్టర్ ఫీజులు, ఎనస్థటిస్ట్, అంబులెన్స్ చార్జీలు, ఔషధాలు, ఆక్సిజన్, రక్తం, ఎక్స్‌రే వంటి పరీక్షలు మొదలైన వివిధ రకాల వ్యయాలకు మెడిక్లెయిమ్‌లో చాలావరకూ పరిమితులుంటాయి. సాధారణంగా ఒక రోజు వ్యవధి సమ్ అష్యూర్డ్ మొత్తంలో గది అద్దె వ్యయాలు ఒక్క శాతానికే పరిమితం. అదే ఐసీయూ చార్జీలపై పరిమితి రెండు శాతంగా ఉంటుంది. ఇవే కాకుండా ఆస్పత్రిలో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత ఎదురయ్యే వ్యయాలపైనా ఉప–పరిమితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెరుగైన ఆరోగ్యం కోసం ఈ రెండూ కీలకమే. క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ పాలసీనా? సాధారణంగా క్రిటికల్ ఇల్నెస్ పాలసీలతో.. తీవ్ర అనారోగ్యం వల్ల సంపాదించే సామర్ధ్యం తగ్గితే వాటిల్లే నష్టానికి కూడా పరిహారం లభిస్తుంది. ఆసుపత్రి బిల్లు ఎంతైనా సరే పూర్తి సమ్ అష్యూర్డ్ మొత్తం లభిస్తుంది. అయితే, మెడిక్లెయిమ్ అనేది ఆస్పత్రి చికిత్స వ్యయాల కవరేజీ కోసం మాత్రమే ఉద్దేశించినది. హాస్పిటలైజేషన్ సహా అన్ని ఖర్చులకు కవరేజీ ఉంటుందా? పూర్తిగా కాదు. దాదాపు ముప్ఫై రోజుల దాకా డాక్టర్లు, నర్సుల ఫీజులు, ఓటీ చార్జీలు, ఔషధాలు, రక్తం, ఆక్సిజన్, డయాగ్నస్టిక్ మెటీరియల్స్, ఎక్స్‌రే, కీమోథెరపీ, రేడియోథెరపీ, పేస్‌మేకర్, అవయవ మార్పిడి దాత ఖర్చులు మొదలైనవి నేరుగా ఆస్పత్రికి చెల్లించడం గానీ లేదా రీయింబర్స్ చేయడం గానీ జరుగుతుంది. ఈ ప్రక్రియలో మీకు ఆర్థికపరమైన ఆదాయమేమీ లభించదు. నిర్దిష్ట ప్రీ–హాస్పిటలైజేషన్, పోస్ట్–హాస్పిటలైజేషన్ చార్జీలు రీయింబర్స్ అవుతాయి. క్యాష్‌లెస్‌తో అంతా సులభమేనా? ఇది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముందుగా.. పాలసీదారు చేరిన ఆస్పత్రితో సదరు బీమా సంస్థకు ఒప్పందం ఉండాలి. అంతేకాదు ఆస్పత్రిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ డెస్క్ ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే అవకాశం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎప్పుడూ ఒకే నిబంధనలు ఉంటాయా? అలాంటిదేమీ ఉండదు. వయస్సు పెరిగే కొద్దీ రిస్కూ పెరుగుతుంది కాబట్టి మెడిక్లెయిమ్ ప్రీమియంలూ పెరుగుతుంటాయి. స్థూలంగా.. మెడిక్లెయిమ్ ఒక్కటే సరిపోదు. అలాగని హడావుడిగా అనేకానేక రైడర్లు, కవర్లు జోడించుకుంటే అనవసర గందరగోళం తప్ప అదనపు ప్రయోజనమేమీ ఉండదు. కనుక మీ కంపెనీ అందించే మెడిక్లెయిమ్ పాలసీని గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయండి. ఏవి వర్తిస్తాయో, ఏవి వర్తించవో తెలుసుకోండి. తద్వారా పూర్తి ప్రయోజనాలు పొందండి. చీఫ్ కస్టమర్, మార్కెటింగ్ ఆఫీసర్, అవీవా ఇండియా