విదేశాల్లో ఉన్నా, ఇక్కడ పాలసీ కొనసాగించాలా? | sakshi special | Sakshi
Sakshi News home page

విదేశాల్లో ఉన్నా, ఇక్కడ పాలసీ కొనసాగించాలా?

Published Mon, Feb 20 2017 1:21 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

విదేశాల్లో ఉన్నా, ఇక్కడ పాలసీ కొనసాగించాలా?

విదేశాల్లో ఉన్నా, ఇక్కడ పాలసీ కొనసాగించాలా?

నేను ప్రవాస భారతీయుడిని, నేను భారత్‌లో ఉన్నప్పుడు ఒక మెడిక్లెయిమ్‌ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు నేను పనిచేసే చోట కంపెనీ నాకు బీమాను కల్పిస్తోంది. భారత్‌లో తీసుకున్న మెడిక్లెయిమ్‌ పాలసీని కొనసాగించటం సమంజసమేనా?  నేను రిటైర్‌ అయ్యాక భారత్‌కు వద్దామనుకుంటున్నాను.  ఈ పాలసీని ఇప్పుడు ఆపుచేసి, ఆతర్వాత కొనసాగించుకునే వీలు ఉందా? వివరించండి.
 –సురేశ్, ఈ మెయిల్‌ ద్వారా

మీరు విదేశాల్లో ఉన్నందున ఇక్కడ తీసుకున్న పాలసీని కొనసాగించడం వల్ల మీకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. దీనిని ఆపేయడమే మంచిది. ఇప్పు డు దీనిని ఆపుచేసి, మీరు భారత్‌ వచ్చినప్పుడు మళ్లీ ఈ పాలసీని కొనసాగించే వీలు లేదు. దీనికి బదులుగా మీరు భారత్‌కు వచ్చినప్పుడు కొత్త మెడిక్లెయిమ్‌ పాలసీని తీసుకోవలసి ఉంటుంది. అప్పుడు పాలసీ తీసుకుంటే, మీకు ఏమైనా రుగ్మతలు ఉంటే వాటి కవరేజ్‌కు కొంత లాక్‌–ఇన్‌–పీరియడ్‌ ఉంటుంది. పైగా ఆ వయస్సులో ప్రీమియమ్‌ కూడా అధికంగా ఉంటుంది. 60 ఏళ్ల వ్యక్తి రూ.5 లక్షల ఆరోగ్య బీమా తీసుకుంటే ప్రస్తుతం ఏడాదికి ప్రీమియమ్‌ రూ.20,000–24,000 రేంజ్‌లో ఉంటుంది. భవిష్యత్తులో ఈ ప్రీమియమ్‌ పెరిగే అవకాశాలున్నాయి. అయినప్పటికీ, ప్రస్తుతమున్న పాలసీని కొనసాగించడం కంటే భారత్‌కు వచ్చినప్పుడు కొత్త పాలసీ తీసుకోవడమే ఉత్తమం.

ఎల్‌ఐసీ జీవన్‌ ఆరోగ్య పాలసీలో అత్త మామలకు కూడా కవరేజ్‌ ఉంటుందని విన్నాను. నిజమేనా? ఈ పాలసీ సానుకూల, ప్రతికూలతలు ఏమిటి?                        
–హరి, విజయవాడ

ఎల్‌ఐసీ జీవన్‌ ఆరోగ్య పాలసీలో ఇతర సాధారణ ఆరోగ్య బీమా పాలసీలో లేని రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఈ పాలసీలో అత్త, మామలకు కూడా కవరేజ్‌ ఉంటుంది. రెండోది ఏదైనా శస్త్రచికిత్స జరిగితే, వాస్తవంగా ఖర్చయిన దానికంటే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. అయితే ఈ రెండు ప్రయోజనాలతో పాటు మూడు ప్రతికూలతలు ఈ పాలసీలో ఉన్నాయి. ఇతర ఆరోగ్య బీమా పాలసీలతో పోల్చితే ఇది ఖరీదైనది. ప్రీమియమ్‌లు ఎక్కువగా ఉంటాయి. నగదు రహిత వైద్యం లభించదు. పెద్ద శస్త్రచికిత్సలకైతే 50 శాతం క్యాష్‌ అడ్వాన్స్‌  మాత్రమే లభిస్తుంది. ప్రి, పోస్ట్‌ హాస్పిటలైజేషన్‌ వ్యయాలను ఈ పాలసీ కవర్‌ చేయదు. ఈ మూడు ప్రతికూలతల వల్ల ఈ పాలసీకున్న రెండు ప్రయోజనాలు పెద్దగా ప్రభావం చూపడం లేదు.

సూపర్‌ టాప్‌–అప్‌ మెడిక్లెయిమ్‌ పాలసీలను ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చా? ఏ ఏ సంస్థలు ఇలాంటి ప్లాన్లను ఆఫర్‌ చేస్తున్నాయి.
–శశికాంత్, విశాఖపట్టణం

సూపర్‌ టాప్‌–అప్‌ మెడిక్లెయిమ్‌ పాలసీలను ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. యునైటెడ్‌ ఇండియా సూపర్‌ టాప్‌–అప్‌ పాలసీ, రెలిగేర్‌ ఎన్‌హాన్స్, అపోలో మ్యూనిక్‌ ఆప్టిమ సూపర్‌.. మీరు ఎంచుకోవడానికి మంచి పాలసీలు. టాప్‌ అప్‌ ప్లాన్ల కన్నా సూపర్‌ టాప్‌ అప్‌ ప్లాన్ల వల్ల ప్రయోజనాలు అధికం. తక్కువ ప్రీమియమ్‌తో ఎక్కువ బీమా కవరేజ్‌ పొందవచ్చు. మీకు ఆరోగ్య బీమా పాలసీ లేకున్నా కూడా ఈ సూపర్‌ టాప్‌అప్‌ పాలసీ తీసుకోవచ్చు. వైద్య ఖర్చులు ఒక పరిమితిని మించితే (దీనిని డిడక్టబుల్‌ అమౌంట్‌/లిమిట్‌గా పరిగణిస్తారు– ఈ డిడక్టబుల్‌ అమౌంట్‌ను మీరు తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ లేదా మీరు భరించాల్సి ఉంటుంది) ఈ సూపర్‌ టాప్‌ అప్‌ పాలసీల కవరేజ్‌ ప్రారంభమవుతుంది. మీ వైద్య ఖర్చులు డిడక్టబుల్‌ అమౌంట్‌ను మించితే, ఆ మించిన మొత్తాన్ని ఈ పాలసీలు చెల్లిస్తాయి. ఈ పాలసీలను తీసుకునేటప్పుడు పాలసీ డాక్యు మెంట్‌ను, పాలసీ బ్రోచర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. మినహాయింపులను, వెయిటింగ్‌ పీరియడ్‌లను జాగ్రత్తగా గమనించండి.

నేను ఒక ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాను. నా రిటైర్మెంట్‌ అవసరాల కోసం  పెన్షన్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా ? లేకుంటే రిటైర్మెంట్‌ అవసరాల కోసం మంచి రాబడులు అందించే మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ సాధానాలను సూచించండి?
–జాన్సన్, సికింద్రాబాద్‌

రిటైర్మెంట్‌ అవసరాలకు పెన్షన్‌–ఇన్సూరెన్స్‌ ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయం కాదు. ఇన్వెస్ట్‌మెంట్‌ అవసరాల కోసం ఎప్పుడు బీమా పాలసీలు తీసుకోకూడదు. బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌.. వేర్వేరు. రెండింటికి వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలి. బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌  అంశాలు కలగలసి ఉన్న ఏ పాలసీ కూడా ఈ రెండు అంశాలకు(బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌) సరైన న్యాయం చేయలేదు. ఈ తరహా పాలసీలు స్వల్ప బీమా కవరేజ్‌ను మాత్రమే ఇస్తాయి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను ఇవ్వలేవు. మీ రిటైర్మెంట్‌ అవసరాల కోసం ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ను పరిశీలించండి. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత చదువులు, రిటైర్మెంట్‌ అవసరాల కోసం నిధి ఏర్పాటు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. నెలకు కొంత మొత్తం సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో రెండు విభిన్నమైన ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. మరో వైపు జీవిత బీమా కోసం ఏదైనా టర్మ్‌ బీమా పాలసీ తీసుకోండి. ఈ తరహా బీమా పాలసీల్లో ప్రీమియమ్‌లు తక్కువగా, బీమా కవరేజ్‌ అధికంగానూ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement