మెడిక్లెయిమ్‌కు పరిమితులుంటాయ్‌! | Mediclaim policy Limitations | Sakshi
Sakshi News home page

మెడిక్లెయిమ్‌కు పరిమితులుంటాయ్‌!

Published Mon, Dec 19 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

మెడిక్లెయిమ్‌కు పరిమితులుంటాయ్‌!

మెడిక్లెయిమ్‌కు పరిమితులుంటాయ్‌!

అది ఆరోగ్య బీమా లాంటిది కాదు  
పాలసీ తీసుకునే ముందే నిబంధనలు చూడాలి
చాలా ఖర్చులు, వ్యాధులు దీని పరిధిలోకి రావు  
క్యాష్‌లెస్‌కూ కొన్ని ఇబ్బందులుంటాయి  


ఆరోగ్య బీమాకు సంబంధించి మెడిక్లెయిమ్‌ పాలసీలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. చాలా మంది దీన్ని ఒకరకంగా జీవిత బీమా పాలసీగా కూడా భావిస్తారు. అయితే, రెండింటికీ మధ్య చాలా తేడా ఉంటుందన్న సంగతి చాలామందికి తెలియదు. అలాగే, చికిత్స వ్యయాలకు సంబంధించి పరిమితుల ప్రతిబంధకాలూ ఉంటాయన్న విషయమూ తెలియదు. పైగా మెడిక్లెయిమ్‌ విషయంలో అపోహలు అనేకం ఉన్నాయి. వాటిని నివృత్తి చేసేదే ఈ కథనం...

అన్ని వ్యాధులకు కవరేజీ ఉంటుందా?
అన్నింటికీ ఉండదు. కేవలం అనారోగ్యానికి సంబంధించిన చికిత్సకు మాత్రమే కవరేజి ఉంటుంది. ఒకవేళ అనారోగ్యం కారణంగా మీరు సంపాదించలేని పరిస్థితి ఏర్పడితే దీని ద్వారా పరిహారమేమీ లభించదు. ఉదాహరణకు క్యాన్సర్‌ చికిత్సకు చాలా ఖర్చవుతుంది. కానీ దీని కారణంగా చాలా ఏళ్ల పాటు ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు. ఇలాగే, సుఖవ్యాధులు, టీకా సంబంధ సమస్యలు మొదలైనవి మెడిక్లెయిమ్‌ పరిధిలోకి రావు.

ఎన్ని ఆస్పత్రులు మారినా, రీయింబర్స్‌మెంట్‌ లభిస్తుందా?
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆస్పత్రి మారడానికి అవకాశం ఉంటుంది. 1) మరింత మెరుగైన చికిత్స కోసం 2) పాలసీ నియమ నిబంధనలకు అనుగుణంగా కేసును బట్టి థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ (టీపీఏ) అనుమతిస్తేనే ఇలాంటివి సాధ్యపడతాయి.

చికిత్సకు ఎంత ఖర్చయినా రీయింబర్స్‌ అవుతుందా?
దేనికైనా అపరిమితమైన ఖర్చులు రీయింబర్స్‌ కావు. ఆరోగ్య సమస్యను బట్టి ఆస్పత్రి వ్యయాలకు సంబంధించి చాలా మటుకు మెడికల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల్లో ఉపపరిమితులుటాయి. ఇవి తెలుసుకోకపోతే మన జేబు నుంచి అదనంగా పెట్టుకోవాల్సి రావొచ్చు. సమ్‌ అష్యూర్డ్‌ కన్నా తక్కువగానే ఉన్నప్పటికీ మొత్తం చికిత్స వ్యయాలను బీమా కంపెనీ క్లియర్‌ చేయకపోవచ్చు. గది అద్దె మొదలుకుని ఐసీయూ వ్యయాలు, డాక్టర్‌ ఫీజులు, ఎనస్థటిస్ట్, అంబులెన్స్‌ చార్జీలు, ఔషధాలు, ఆక్సిజన్, రక్తం, ఎక్స్‌రే వంటి పరీక్షలు మొదలైన వివిధ రకాల వ్యయాలకు మెడిక్లెయిమ్‌లో చాలావరకూ పరిమితులుంటాయి. సాధారణంగా ఒక రోజు వ్యవధి సమ్‌ అష్యూర్డ్‌ మొత్తంలో గది అద్దె వ్యయాలు ఒక్క శాతానికే పరిమితం. అదే ఐసీయూ చార్జీలపై పరిమితి రెండు శాతంగా ఉంటుంది. ఇవే కాకుండా ఆస్పత్రిలో చేరడానికి ముందు, డిశ్చార్జ్‌ అయిన తర్వాత ఎదురయ్యే వ్యయాలపైనా ఉప–పరిమితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెరుగైన ఆరోగ్యం కోసం ఈ రెండూ కీలకమే.

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఇన్సూరెన్స్‌ పాలసీనా?
సాధారణంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలతో.. తీవ్ర అనారోగ్యం వల్ల సంపాదించే సామర్ధ్యం తగ్గితే వాటిల్లే నష్టానికి కూడా పరిహారం లభిస్తుంది. ఆసుపత్రి బిల్లు ఎంతైనా సరే పూర్తి సమ్‌ అష్యూర్డ్‌ మొత్తం లభిస్తుంది. అయితే, మెడిక్లెయిమ్‌ అనేది ఆస్పత్రి చికిత్స వ్యయాల కవరేజీ కోసం మాత్రమే ఉద్దేశించినది.

హాస్పిటలైజేషన్‌ సహా అన్ని ఖర్చులకు కవరేజీ ఉంటుందా?
పూర్తిగా కాదు. దాదాపు ముప్ఫై రోజుల దాకా డాక్టర్లు, నర్సుల ఫీజులు, ఓటీ చార్జీలు, ఔషధాలు, రక్తం, ఆక్సిజన్, డయాగ్నస్టిక్‌ మెటీరియల్స్, ఎక్స్‌రే, కీమోథెరపీ, రేడియోథెరపీ, పేస్‌మేకర్, అవయవ మార్పిడి దాత ఖర్చులు మొదలైనవి నేరుగా ఆస్పత్రికి చెల్లించడం గానీ లేదా రీయింబర్స్‌ చేయడం గానీ జరుగుతుంది. ఈ ప్రక్రియలో మీకు ఆర్థికపరమైన ఆదాయమేమీ లభించదు. నిర్దిష్ట ప్రీ–హాస్పిటలైజేషన్, పోస్ట్‌–హాస్పిటలైజేషన్‌ చార్జీలు రీయింబర్స్‌ అవుతాయి.

క్యాష్‌లెస్‌తో అంతా సులభమేనా?
ఇది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముందుగా.. పాలసీదారు చేరిన ఆస్పత్రితో సదరు బీమా సంస్థకు ఒప్పందం ఉండాలి. అంతేకాదు ఆస్పత్రిలో ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ డెస్క్‌ ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే అవకాశం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

ఎప్పుడూ ఒకే నిబంధనలు ఉంటాయా?
అలాంటిదేమీ ఉండదు. వయస్సు పెరిగే కొద్దీ రిస్కూ పెరుగుతుంది కాబట్టి మెడిక్లెయిమ్‌ ప్రీమియంలూ పెరుగుతుంటాయి.

స్థూలంగా.. మెడిక్లెయిమ్‌ ఒక్కటే సరిపోదు. అలాగని హడావుడిగా అనేకానేక రైడర్లు, కవర్‌లు జోడించుకుంటే అనవసర గందరగోళం తప్ప అదనపు ప్రయోజనమేమీ ఉండదు. కనుక మీ కంపెనీ అందించే మెడిక్లెయిమ్‌ పాలసీని గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయండి. ఏవి వర్తిస్తాయో, ఏవి వర్తించవో తెలుసుకోండి. తద్వారా పూర్తి ప్రయోజనాలు పొందండి.




చీఫ్‌ కస్టమర్, మార్కెటింగ్‌  ఆఫీసర్, అవీవా ఇండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement