TPA
-
టెన్త్ ఫిజిక్స్ పేపర్–1లో నాలుగు మార్కులు కలుపుతాం
♦ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ప్రకటన ♦ 17 (బి) ప్రశ్న అటెంప్ట్ చేసిన విద్యార్థులకు వర్తింపు ♦ ఆ ప్రశ్న అస్పష్టంగా ఉందన్న నిపుణుల కమిటీ సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫిజికల్ సైన్స్ పేపర్–1లో 17 (బి) ప్రశ్న రాయడానికి ప్రయత్నించిన విద్యార్థులందరికీ 4 మార్కు లు కలపనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ప్రకటించారు. పేపరు–1లో ఇచ్చిన ప్రశ్నలు, వాటి స్థాయిపై కమిటీ సోమవారం పరిశీలన జరిపింది. 17 (బి) ప్రశ్నకు సంబంధించిన పటంలో ఫలిత నిరోధం కనుగొనేలా స్పష్టంగా లేదని తేల్చింది. కాబట్టి దానికి సమాధానం రాయడానికి ప్రయత్నించిన విద్యార్థులకు కమిటీ సిఫార్సు మేరకు 4 మార్కులను యాడ్ స్కోర్‌గా ఇవ్వనున్నట్లు సురేందర్‌రెడ్డి వివరించారు. ఫిజికల్ సైన్స్ పేపర్–1లోని ప్రశ్నలు సిలబస్ పరిధిలోనివేనన్నారు. ‘‘52 శాతం సులభ స్థాయి ప్రశ్నలు, 27 శాతం మాధ్యమిక స్థాయి ప్రశ్నలు, 21 శాతం కఠిన స్థాయి ప్రశ్నలుండాలన్న నిబంధనల మేరకు, బ్లూ ప్రింట్కు అనుగుణంగానే ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. ఒక్క మార్కు ప్రశ్నలు 7, 2 మార్కుల ప్రశ్నలు 6, 4 మార్కుల ప్రశ్నలు 4, అర మార్కుల ప్రశ్నలు 10 ఇచ్చాం. ప్రశ్నపత్రాన్ని పదో తరగతి బోధిస్తున్న, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులే రూపొందించారు. మోడరేటర్లుగా గతేడాది విధుల్లో పాల్గొన్న నిపుణులనే ఈసారీ నియమించాం. వారికి సబ్జెక్టుపై అనుభవముంది’’ అని చెప్పారు. అయితే వారు టీచర్లా, కాదా అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. పది మార్కులివ్వాలి: టీపీఏ టెన్త్ ఫిజికల్ సైన్స్ పేపర్లో విద్యార్థులకు 10 మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌కు తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) ప్రతినిధులు నాగటి నారాయణ, ప్రకాశ్ వినతిపత్రమిచ్చారు. ‘‘సిలబస్‌లో లేని ప్రశ్నలు 10 మార్కుల దాకా, అసంబద్ధమైన ప్రశ్నలు మరో 10 మార్కుల దాకా ఉన్నాయి. అందుకే విద్యార్థులందరికీ 10 మార్కులు కలపాలి’’ అని కోరారు. -
క్యాష్‌లెస్ చికిత్సలే కాస్త బెటర్!
♦ రీయింబర్స్మెంట్ విధానంలో ఇబ్బందులూ ఉన్నాయ్ ♦ అన్నీ పాలసీదారే చూసుకోవటం ఈజీ కాదు వైద్య చికిత్స ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మున్ముందు ఇంకా పెరుగుతాయి. వీటిని తట్టుకోవాలంటే కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా తప్పనిసరి. ఈ పాలసీ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. క్లెయిమ్‌ల గురించి అవగాహన కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యమన్నది నా అభిప్రాయం. సాధారణంగా వైద్య చికిత్స వ్యయాల క్లెయిమ్ కోసం రెండు మార్గాలున్నాయి. ఒకటి క్యాష్‌లెస్ (నగదు రహితం) విధానం కాగా, మరొకటి రీయింబర్స్మెంట్ క్లెయిమ్. క్యాష్‌లెస్ క్లెయిమ్ రెండు రకాలుగా ఉంటుంది. ఆస్పత్రిలో చేరడానికి 24 గంటల ముందే అనుమతులు తీసుకోవడం ఒకటి కాగా.. చేరిన ఇరవై నాలుగ్గంటలలోగా అప్రూవల్ తీసుకోవడం మరో విధానం. నగదురహిత విధానంలోనైతే ఆయా బీమా సంస్థల నెట్‌వర్క్‌లోని ఆస్పత్రుల్లో ఉండే హెల్ప్ డెస్క్ లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) క్లెయిమ్ విషయంలో సహకారం అందిస్తారు. నగదు రహిత క్లెయిమ్ ప్రక్రియ.. 1 ఆస్పత్రిలో చికిత్స గురించి ముందే ప్లాన్ చేసుకున్నట్లయితే దాని గురించి హాస్పిటల్‌లోని హెల్ప్‌డెస్క్‌కు తెలియజేయాలి. వారు ప్రీ–ఆథరైజేషన్ ఫారం నింపించడం, పాలసీదారు.. డాక్టర్ల సంతకాలు తీసుకోవడం మొదలైన ప్రక్రియ పూర్తి చేస్తారు. హాస్పిటలైజేషన్ కన్నా 24 గంటల ముందే నిర్దేశిత పత్రాలు జత చేసి ఆ ఫారంను బీమా కంపెనీకి పంపుతారు. 2 బీమా కంపెనీ తమకు అందిన క్యాష్‌లెస్ క్లెయిమ్ ఆథరైజేషన్ ఫారంను పరిశీలిస్తుంది. అంతా సవ్యంగా ఉంటే ఆమోదముద్ర వేస్తుంది లేదా క్లెయిమ్‌ను తిరస్కరిస్తుంది. అలా కాకుండా సందేహాలేమైనా ఉన్నా... అదనపు పత్రాలు కావాల్సి వచ్చినా తగు సూచనలు చేస్తుంది. 3 ఒకవేళ క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ క్లెయిమ్‌ను ఆమోదించినట్లయితే.. పాలసీ కవరేజీలోని పరిమితులకు లోబడి చార్జీలను నేరుగా ఆస్పత్రికి చెల్లిస్తుంది. పరిమితికి మించిన వ్యయాలను పాలసీదారే భరించాలి. ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించిన అన్ని ఒరిజినల్ పత్రాలు, బిల్లులను ఆస్పత్రి నేరుగా బీమా కంపెనీకి అందజేస్తుంది. 4 ఒకవేళ బీమా కంపెనీ ఏదైనా సందేహం లేవనెత్తినప్పుడు పాలసీదారు, ఆస్పత్రి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వగలిగిన పక్షంలో క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ రిక్వెస్ట్‌కు ఆమోదం లభిస్తుంది. 5 అలా కాకుండా క్లెయిమ్ దరఖాస్తును తక్షణం తిరస్కరించినా.. లేదా సందేహాలు నివృత్తి కాక తిరస్కరించినా.. హాస్పిటల్ బిల్లును పాలసీదారే స్వయంగా కట్టుకోవాలి. ఆ తర్వాత ఒరిజినల్ పత్రాలు, రసీదులు తీసుకోవాలి. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ ప్రక్రియ.. 1 బీమా కవరేజీ ఉన్న వారు ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాక బిల్లులను స్వయంగా చెల్లించాలి. చికిత్స పత్రాలు, రసీదులు అన్ని ఒరిజినల్స్ దగ్గర పెట్టుకోవాలి. 2 ఆ తర్వాత నిర్దేశిత ఫారంతో పాటు పత్రాలు, రసీదులను బీమా కంపెనీకి అందజేయాలి. 3 బీమా కంపెనీ క్లెయిమ్‌ను పరిశీలిస్తుంది. అన్నీ సవ్యంగా ఉంటే క్లెయిమ్‌ను తక్షణం ఆమోదిస్తుంది. ఒకవేళ ఏదైనా సందేహం తలెత్తితే, నివృత్తి చేసుకున్నాకే ఆమోదముద్ర వేస్తుంది. అలా కాకుండా ఒకవేళ సదరు చికిత్స గానీ, పాలసీలో పేర్కొన్న వాటిలో లేకపోతే క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశమూ ఉంది. సాధ్యమైనంత వరకూ రీయింబర్స్మెంట్ కోసం పత్రాలు దాఖలు చేయడం, ఫాలో అప్ చేస్తూ కూర్చోవడం వంటి బాదరబందీ లేకుండా సులభతరమైన క్యాష్‌లెస్ క్లెయిమ్ విధానం ఎంచుకోవడం మంచిది. క్లెయిమ్ ప్రక్రియంతా ఆస్పత్రే చూసుకుంటుంది. అదే రీయింబర్స్మెంట్ విషయానికొస్తే.. పాలసీదారే స్వయంగా ప్రతీదీ చూసుకోవాల్సి వస్తుంది. వీలైనంత వరకూ క్లెయిమ్‌ల పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాలు ఉన్న బీమా సంస్థల నుంచే పాలసీలు తీసుకోవడం శ్రేయస్కరం. క్లెయిమ్ తిరస్కరణకు చూపిన కారణాన్ని బట్టి రీయింబర్స్మెంట్ కోసం బీమా కంపెనీకి దరఖాస్తు చేయాలా వద్దా అన్నది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాలసీదారు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలోని జాబితాలో సదరు చికిత్స లేకపోతే క్లెయిమ్ చేసుకోవడం కుదరదు. ఒకవేళ అత్యవసరంగా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిన పక్షంలో మొదటి దశ మినహా మిగతా ప్రక్రియంతా కూడా యథాప్రకారంగానే కొనసాగుతుంది. ప్రీ–ఆథరైజేషన్ ఫారంను ఆస్పత్రిలో చేరిన ఇరవై నాలుగ్గంటల్లోగా నింపి పంపాల్సి ఉంటుంది. -
మెడిక్లెయిమ్‌కు పరిమితులుంటాయ్!
► అది ఆరోగ్య బీమా లాంటిది కాదు ► పాలసీ తీసుకునే ముందే నిబంధనలు చూడాలి ► చాలా ఖర్చులు, వ్యాధులు దీని పరిధిలోకి రావు ► క్యాష్లెస్కూ కొన్ని ఇబ్బందులుంటాయి ఆరోగ్య బీమాకు సంబంధించి మెడిక్లెయిమ్ పాలసీలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. చాలా మంది దీన్ని ఒకరకంగా జీవిత బీమా పాలసీగా కూడా భావిస్తారు. అయితే, రెండింటికీ మధ్య చాలా తేడా ఉంటుందన్న సంగతి చాలామందికి తెలియదు. అలాగే, చికిత్స వ్యయాలకు సంబంధించి పరిమితుల ప్రతిబంధకాలూ ఉంటాయన్న విషయమూ తెలియదు. పైగా మెడిక్లెయిమ్ విషయంలో అపోహలు అనేకం ఉన్నాయి. వాటిని నివృత్తి చేసేదే ఈ కథనం... అన్ని వ్యాధులకు కవరేజీ ఉంటుందా? అన్నింటికీ ఉండదు. కేవలం అనారోగ్యానికి సంబంధించిన చికిత్సకు మాత్రమే కవరేజి ఉంటుంది. ఒకవేళ అనారోగ్యం కారణంగా మీరు సంపాదించలేని పరిస్థితి ఏర్పడితే దీని ద్వారా పరిహారమేమీ లభించదు. ఉదాహరణకు క్యాన్సర్ చికిత్సకు చాలా ఖర్చవుతుంది. కానీ దీని కారణంగా చాలా ఏళ్ల పాటు ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు. ఇలాగే, సుఖవ్యాధులు, టీకా సంబంధ సమస్యలు మొదలైనవి మెడిక్లెయిమ్ పరిధిలోకి రావు. ఎన్ని ఆస్పత్రులు మారినా, రీయింబర్స్మెంట్ లభిస్తుందా? కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆస్పత్రి మారడానికి అవకాశం ఉంటుంది. 1) మరింత మెరుగైన చికిత్స కోసం 2) పాలసీ నియమ నిబంధనలకు అనుగుణంగా కేసును బట్టి థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) అనుమతిస్తేనే ఇలాంటివి సాధ్యపడతాయి. చికిత్సకు ఎంత ఖర్చయినా రీయింబర్స్ అవుతుందా? దేనికైనా అపరిమితమైన ఖర్చులు రీయింబర్స్ కావు. ఆరోగ్య సమస్యను బట్టి ఆస్పత్రి వ్యయాలకు సంబంధించి చాలా మటుకు మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఉపపరిమితులుటాయి. ఇవి తెలుసుకోకపోతే మన జేబు నుంచి అదనంగా పెట్టుకోవాల్సి రావొచ్చు. సమ్ అష్యూర్డ్ కన్నా తక్కువగానే ఉన్నప్పటికీ మొత్తం చికిత్స వ్యయాలను బీమా కంపెనీ క్లియర్ చేయకపోవచ్చు. గది అద్దె మొదలుకుని ఐసీయూ వ్యయాలు, డాక్టర్ ఫీజులు, ఎనస్థటిస్ట్, అంబులెన్స్ చార్జీలు, ఔషధాలు, ఆక్సిజన్, రక్తం, ఎక్స్‌రే వంటి పరీక్షలు మొదలైన వివిధ రకాల వ్యయాలకు మెడిక్లెయిమ్‌లో చాలావరకూ పరిమితులుంటాయి. సాధారణంగా ఒక రోజు వ్యవధి సమ్ అష్యూర్డ్ మొత్తంలో గది అద్దె వ్యయాలు ఒక్క శాతానికే పరిమితం. అదే ఐసీయూ చార్జీలపై పరిమితి రెండు శాతంగా ఉంటుంది. ఇవే కాకుండా ఆస్పత్రిలో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత ఎదురయ్యే వ్యయాలపైనా ఉప–పరిమితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెరుగైన ఆరోగ్యం కోసం ఈ రెండూ కీలకమే. క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ పాలసీనా? సాధారణంగా క్రిటికల్ ఇల్నెస్ పాలసీలతో.. తీవ్ర అనారోగ్యం వల్ల సంపాదించే సామర్ధ్యం తగ్గితే వాటిల్లే నష్టానికి కూడా పరిహారం లభిస్తుంది. ఆసుపత్రి బిల్లు ఎంతైనా సరే పూర్తి సమ్ అష్యూర్డ్ మొత్తం లభిస్తుంది. అయితే, మెడిక్లెయిమ్ అనేది ఆస్పత్రి చికిత్స వ్యయాల కవరేజీ కోసం మాత్రమే ఉద్దేశించినది. హాస్పిటలైజేషన్ సహా అన్ని ఖర్చులకు కవరేజీ ఉంటుందా? పూర్తిగా కాదు. దాదాపు ముప్ఫై రోజుల దాకా డాక్టర్లు, నర్సుల ఫీజులు, ఓటీ చార్జీలు, ఔషధాలు, రక్తం, ఆక్సిజన్, డయాగ్నస్టిక్ మెటీరియల్స్, ఎక్స్‌రే, కీమోథెరపీ, రేడియోథెరపీ, పేస్‌మేకర్, అవయవ మార్పిడి దాత ఖర్చులు మొదలైనవి నేరుగా ఆస్పత్రికి చెల్లించడం గానీ లేదా రీయింబర్స్ చేయడం గానీ జరుగుతుంది. ఈ ప్రక్రియలో మీకు ఆర్థికపరమైన ఆదాయమేమీ లభించదు. నిర్దిష్ట ప్రీ–హాస్పిటలైజేషన్, పోస్ట్–హాస్పిటలైజేషన్ చార్జీలు రీయింబర్స్ అవుతాయి. క్యాష్‌లెస్‌తో అంతా సులభమేనా? ఇది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముందుగా.. పాలసీదారు చేరిన ఆస్పత్రితో సదరు బీమా సంస్థకు ఒప్పందం ఉండాలి. అంతేకాదు ఆస్పత్రిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ డెస్క్ ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే అవకాశం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎప్పుడూ ఒకే నిబంధనలు ఉంటాయా? అలాంటిదేమీ ఉండదు. వయస్సు పెరిగే కొద్దీ రిస్కూ పెరుగుతుంది కాబట్టి మెడిక్లెయిమ్ ప్రీమియంలూ పెరుగుతుంటాయి. స్థూలంగా.. మెడిక్లెయిమ్ ఒక్కటే సరిపోదు. అలాగని హడావుడిగా అనేకానేక రైడర్లు, కవర్లు జోడించుకుంటే అనవసర గందరగోళం తప్ప అదనపు ప్రయోజనమేమీ ఉండదు. కనుక మీ కంపెనీ అందించే మెడిక్లెయిమ్ పాలసీని గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయండి. ఏవి వర్తిస్తాయో, ఏవి వర్తించవో తెలుసుకోండి. తద్వారా పూర్తి ప్రయోజనాలు పొందండి. చీఫ్ కస్టమర్, మార్కెటింగ్ ఆఫీసర్, అవీవా ఇండియా -
పెరాలసిస్ తగ్గడానికి ఎంత టైమ్...?
న్యూరాలజీ కౌన్సెలింగ్ మా అమ్మకు పెరాలసిస్ వచ్చి ఆర్నెల్లు అయ్యింది. టాబ్లెట్లు తీసుకుంటే తగ్గింది. ఆమెలో ఒక పక్కభాగం పనిచేయడం లేదు. అది బాగుకావడానికి ఎంత టైమ్ పడుతుంది. మళ్లీ పెరాలసిస్ వచ్చే అవకాశం ఉందా? మళ్లీ రాకుండా ఏం చేయాలి? - పవన్, విజయవాడ పెరాలసిస్ వచ్చిన రోగులకు రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు టీపీఏ అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. దీన్ని పక్షవాతం వచ్చిన నాలుగున్నర గంటలలోపే ఇవ్వాలి. అప్పుడు దాదాపు 50% - 60% వరకు మందిలో మంచి మెరుగుదల త్వరగా ఉంటుంది. ఎంత త్వరగా ఈ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే రోగి పరిస్థితి అంత మెరుగ్గా ఉంటుంది. ఇక కాలక్రమాన దెబ్బతిన్న మెదడు భాగం మెల్లగా బాగుపడేందుకు అవకాశం ఉండవచ్చు. కానీ... ఒకవేళ రోగి వృద్ధాప్యంలో ఉన్నా, డయాబెటిస్ లాంటిజబ్బులున్నా, మెదడులో కీలకమైన భాగాలు దెబ్బతిన్నా, పొగతాగే అలవాటు ఉన్నా రోగి పరిస్థితి మెరుగుపడటం కష్టం కావచ్చు. ఆర్నెల్లంటే అది చాలా త్వరగా జరిగినట్లే లెక్క. చాలామందిలో ఏడాది పట్టడం సాధారణం. ఫిజియోథెరపీలాంటి చికిత్స ప్రక్రియల వల్ల పనిచేయని భాగంలో వచ్చే చేతులు, వేళ్లు బిగుసుకుపోవడం, కొంకర్లుపోయినట్లుగా మారిపోవడం తగ్గడానికి ఏడాదికిపైగానే పట్టవచ్చు. క్రమపద్ధతిలో మందులు వాడటం, జీవనశైలిని పూర్తిగా ఆరోగ్యకరంగా మార్చుకోవడం ద్వారా 80% మందిలో రెండోసారి స్ట్రోక్‌ను నివారించవచ్చు. అయితే మొదటిసారి పక్షవాతం వచ్చిన నలుగురిలో ఒకరికి ఇది రెండోసారి వచ్చే అవకాశం ఉంది. అలాగే 40% మందిలో ఇది మొదటి ఐదేళ్లలోపు రావచ్చు. నా వయసు 29. గత ఏడాదిగా నా చేతివేళ్లలో వణుకు కనిపిస్తోంది. నాకు ఎనిమిదేళ్ల క్రితం ఫిట్స్ వచ్చాయి. ఆల్కహాల్ తీసుకునే అలవాటు కూడా కొద్దిగా ఉంది. ఈ వణుకు సమస్య మరింత పెరగకుండా పూర్తిగా తగ్గిపోవాలంటే ఏం చేయాలో సలహా చెప్పండి. - రాజ్, దిల్సుఖ్నగర్ మీ చేతి వణుకు సమస్యకు చాలా కారణాలు ఉంటాయి. ఫిట్స్ నివారణకు వాడే సోడియమ్ వాల్‌ప్రోయేట్ లేదా డైవాల్ప్రోయేట్ వంటి మందులవల్ల లేదా అతిగా మద్యం తీసుకోవడం/అకస్మాత్తుగా ఆపేయడం వల్ల వణుకు వచ్చే అవకాశం ఉంది. దీనికి మరో కారణం హైపర్థైరాయిడిజమూ కావచ్చు. ఒకవేళ మీరు బరువు కోల్పోతూ, మీలో ఆకలి పెరుగుతున్న లక్షణాలను గమనిస్తే హైపర్‌థైరాయిడిజమ్‌ను అనుమానించవచ్చు. ఇక మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే అవి వారసత్వంగా రావచ్చు. దానివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కుటుంబంలో ఇలాంటివి ఉండి వారసత్వంగా వచ్చిన సందర్భాల్లో దానికి పూర్తి చికిత్స దొరకదుగానీ... ప్రిమిడాన్ వంటి టాబ్లెట్లతో కొంతమేర ప్రయోజనం ఉంటుంది. ఆస్థమా ఉన్నవారిలో దాన్ని అదుపులో ఉంచడానికి వాడే మందుల వల్లా వణుకు రావచ్చు. కొద్దిసార్లు యాంగ్జైటీ, ఒత్తిడి, కాఫీ ఎక్కువగా తీసుకోవడం వంటి అంశాలూ వణుకును కలిగిస్తాయి. ప్రొప్రనలాల్, క్లోనోజెపామ్ వంటి మందులు వణుకును తగ్గించడానికి ఉపయోగపడతాయి. అయితే వీటిని తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్