క్యాష్‌లెస్‌ చికిత్సలే కాస్త బెటర్‌! | Cash-free claim better to medical expenses | Sakshi
Sakshi News home page

క్యాష్‌లెస్‌ చికిత్సలే కాస్త బెటర్‌!

Published Mon, Mar 20 2017 12:07 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

క్యాష్‌లెస్‌ చికిత్సలే కాస్త బెటర్‌! - Sakshi

క్యాష్‌లెస్‌ చికిత్సలే కాస్త బెటర్‌!

రీయింబర్స్‌మెంట్‌ విధానంలో ఇబ్బందులూ ఉన్నాయ్‌   
అన్నీ పాలసీదారే చూసుకోవటం ఈజీ కాదు  


వైద్య చికిత్స ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మున్ముందు ఇంకా పెరుగుతాయి. వీటిని తట్టుకోవాలంటే కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా తప్పనిసరి. ఈ పాలసీ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. క్లెయిమ్‌ల గురించి అవగాహన కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యమన్నది నా అభిప్రాయం. సాధారణంగా వైద్య చికిత్స వ్యయాల క్లెయిమ్‌ కోసం రెండు మార్గాలున్నాయి. ఒకటి క్యాష్‌లెస్‌ (నగదు రహితం) విధానం కాగా, మరొకటి రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌.

క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ రెండు రకాలుగా ఉంటుంది. ఆస్పత్రిలో చేరడానికి 24 గంటల ముందే అనుమతులు తీసుకోవడం ఒకటి కాగా.. చేరిన ఇరవై నాలుగ్గంటలలోగా అప్రూవల్‌ తీసుకోవడం మరో విధానం. నగదురహిత విధానంలోనైతే ఆయా బీమా సంస్థల నెట్‌వర్క్‌లోని ఆస్పత్రుల్లో ఉండే హెల్ప్‌ డెస్క్‌ లేదా థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ (టీపీఏ) క్లెయిమ్‌ విషయంలో సహకారం అందిస్తారు.

నగదు రహిత క్లెయిమ్‌ ప్రక్రియ..
1 ఆస్పత్రిలో చికిత్స గురించి ముందే ప్లాన్‌ చేసుకున్నట్లయితే దాని గురించి హాస్పిటల్‌లోని హెల్ప్‌డెస్క్‌కు తెలియజేయాలి. వారు ప్రీ–ఆథరైజేషన్‌ ఫారం నింపించడం, పాలసీదారు.. డాక్టర్ల సంతకాలు తీసుకోవడం మొదలైన ప్రక్రియ పూర్తి చేస్తారు. హాస్పిటలైజేషన్‌ కన్నా 24 గంటల ముందే నిర్దేశిత పత్రాలు జత చేసి ఆ ఫారంను బీమా కంపెనీకి పంపుతారు.

2 బీమా కంపెనీ తమకు అందిన క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ ఆథరైజేషన్‌ ఫారంను పరిశీలిస్తుంది. అంతా సవ్యంగా ఉంటే ఆమోదముద్ర వేస్తుంది లేదా క్లెయిమ్‌ను తిరస్కరిస్తుంది. అలా కాకుండా సందేహాలేమైనా ఉన్నా... అదనపు పత్రాలు కావాల్సి వచ్చినా తగు సూచనలు చేస్తుంది.

3 ఒకవేళ క్యాష్‌లెస్‌ హాస్పిటలైజేషన్‌ క్లెయిమ్‌ను ఆమోదించినట్లయితే.. పాలసీ కవరేజీలోని పరిమితులకు లోబడి చార్జీలను నేరుగా ఆస్పత్రికి చెల్లిస్తుంది. పరిమితికి మించిన వ్యయాలను పాలసీదారే భరించాలి. ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించిన అన్ని ఒరిజినల్‌ పత్రాలు, బిల్లులను ఆస్పత్రి నేరుగా బీమా కంపెనీకి అందజేస్తుంది.

4 ఒకవేళ బీమా కంపెనీ ఏదైనా సందేహం లేవనెత్తినప్పుడు పాలసీదారు, ఆస్పత్రి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వగలిగిన పక్షంలో క్యాష్‌లెస్‌ హాస్పిటలైజేషన్‌ రిక్వెస్ట్‌కు ఆమోదం లభిస్తుంది.

5 అలా కాకుండా క్లెయిమ్‌ దరఖాస్తును తక్షణం తిరస్కరించినా.. లేదా సందేహాలు నివృత్తి కాక తిరస్కరించినా.. హాస్పిటల్‌ బిల్లును పాలసీదారే స్వయంగా కట్టుకోవాలి. ఆ తర్వాత ఒరిజినల్‌ పత్రాలు, రసీదులు తీసుకోవాలి.

రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ ప్రక్రియ..
1 బీమా కవరేజీ ఉన్న వారు ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాక బిల్లులను స్వయంగా చెల్లించాలి. చికిత్స పత్రాలు, రసీదులు అన్ని ఒరిజినల్స్‌ దగ్గర పెట్టుకోవాలి. 2 ఆ తర్వాత నిర్దేశిత ఫారంతో పాటు పత్రాలు, రసీదులను బీమా కంపెనీకి అందజేయాలి. 3 బీమా కంపెనీ క్లెయిమ్‌ను పరిశీలిస్తుంది. అన్నీ సవ్యంగా ఉంటే క్లెయిమ్‌ను తక్షణం ఆమోదిస్తుంది. ఒకవేళ ఏదైనా సందేహం తలెత్తితే, నివృత్తి చేసుకున్నాకే ఆమోదముద్ర వేస్తుంది. అలా కాకుండా ఒకవేళ సదరు చికిత్స గానీ, పాలసీలో పేర్కొన్న వాటిలో లేకపోతే క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశమూ ఉంది.

సాధ్యమైనంత వరకూ రీయింబర్స్‌మెంట్‌ కోసం పత్రాలు దాఖలు చేయడం, ఫాలో అప్‌ చేస్తూ కూర్చోవడం వంటి బాదరబందీ లేకుండా సులభతరమైన క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ విధానం ఎంచుకోవడం మంచిది. క్లెయిమ్‌ ప్రక్రియంతా ఆస్పత్రే చూసుకుంటుంది. అదే రీయింబర్స్‌మెంట్‌ విషయానికొస్తే.. పాలసీదారే స్వయంగా ప్రతీదీ చూసుకోవాల్సి వస్తుంది. వీలైనంత వరకూ క్లెయిమ్‌ల పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాలు ఉన్న బీమా సంస్థల నుంచే పాలసీలు తీసుకోవడం శ్రేయస్కరం.

క్లెయిమ్‌ తిరస్కరణకు చూపిన కారణాన్ని బట్టి రీయింబర్స్‌మెంట్‌ కోసం బీమా కంపెనీకి దరఖాస్తు చేయాలా వద్దా అన్నది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాలసీదారు తీసుకున్న హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలోని జాబితాలో సదరు చికిత్స లేకపోతే క్లెయిమ్‌ చేసుకోవడం కుదరదు.

ఒకవేళ అత్యవసరంగా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిన పక్షంలో మొదటి దశ మినహా మిగతా ప్రక్రియంతా కూడా యథాప్రకారంగానే కొనసాగుతుంది. ప్రీ–ఆథరైజేషన్‌ ఫారంను ఆస్పత్రిలో చేరిన ఇరవై నాలుగ్గంటల్లోగా  నింపి పంపాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement