పెరాలసిస్ తగ్గడానికి ఎంత టైమ్...? | How much time to lose peralasis | Sakshi
Sakshi News home page

పెరాలసిస్ తగ్గడానికి ఎంత టైమ్...?

Published Mon, Jun 29 2015 10:56 PM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

How much time to lose peralasis

న్యూరాలజీ కౌన్సెలింగ్
మా అమ్మకు పెరాలసిస్ వచ్చి ఆర్నెల్లు అయ్యింది. టాబ్లెట్లు తీసుకుంటే తగ్గింది. ఆమెలో ఒక పక్కభాగం పనిచేయడం లేదు. అది బాగుకావడానికి ఎంత టైమ్ పడుతుంది. మళ్లీ పెరాలసిస్ వచ్చే అవకాశం ఉందా? మళ్లీ రాకుండా ఏం చేయాలి?
- పవన్, విజయవాడ

 
పెరాలసిస్ వచ్చిన రోగులకు రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు టీపీఏ అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. దీన్ని పక్షవాతం వచ్చిన నాలుగున్నర గంటలలోపే ఇవ్వాలి. అప్పుడు దాదాపు 50% - 60% వరకు మందిలో మంచి మెరుగుదల త్వరగా ఉంటుంది. ఎంత త్వరగా ఈ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే రోగి పరిస్థితి అంత మెరుగ్గా ఉంటుంది. ఇక కాలక్రమాన దెబ్బతిన్న మెదడు భాగం మెల్లగా బాగుపడేందుకు అవకాశం ఉండవచ్చు. కానీ... ఒకవేళ రోగి వృద్ధాప్యంలో ఉన్నా, డయాబెటిస్ లాంటిజబ్బులున్నా, మెదడులో కీలకమైన భాగాలు దెబ్బతిన్నా, పొగతాగే అలవాటు ఉన్నా రోగి పరిస్థితి మెరుగుపడటం కష్టం కావచ్చు.  ఆర్నెల్లంటే అది చాలా త్వరగా జరిగినట్లే లెక్క. చాలామందిలో ఏడాది పట్టడం సాధారణం. ఫిజియోథెరపీలాంటి చికిత్స ప్రక్రియల వల్ల పనిచేయని భాగంలో వచ్చే చేతులు, వేళ్లు బిగుసుకుపోవడం, కొంకర్లుపోయినట్లుగా మారిపోవడం తగ్గడానికి ఏడాదికిపైగానే పట్టవచ్చు. క్రమపద్ధతిలో మందులు వాడటం, జీవనశైలిని పూర్తిగా ఆరోగ్యకరంగా మార్చుకోవడం ద్వారా 80% మందిలో రెండోసారి స్ట్రోక్‌ను నివారించవచ్చు. అయితే మొదటిసారి పక్షవాతం వచ్చిన నలుగురిలో ఒకరికి ఇది రెండోసారి వచ్చే అవకాశం ఉంది. అలాగే 40% మందిలో ఇది మొదటి ఐదేళ్లలోపు రావచ్చు.
 
నా వయసు 29. గత ఏడాదిగా నా చేతివేళ్లలో వణుకు కనిపిస్తోంది.  నాకు ఎనిమిదేళ్ల క్రితం ఫిట్స్ వచ్చాయి.  ఆల్కహాల్ తీసుకునే అలవాటు కూడా కొద్దిగా ఉంది. ఈ వణుకు సమస్య మరింత పెరగకుండా పూర్తిగా తగ్గిపోవాలంటే ఏం చేయాలో సలహా చెప్పండి.
 - రాజ్, దిల్‌సుఖ్‌నగర్

 
మీ చేతి వణుకు సమస్యకు చాలా కారణాలు ఉంటాయి. ఫిట్స్ నివారణకు వాడే సోడియమ్ వాల్‌ప్రోయేట్ లేదా డైవాల్‌ప్రోయేట్ వంటి మందులవల్ల లేదా అతిగా మద్యం తీసుకోవడం/అకస్మాత్తుగా ఆపేయడం వల్ల వణుకు వచ్చే అవకాశం ఉంది. దీనికి మరో కారణం హైపర్‌థైరాయిడిజమూ కావచ్చు. ఒకవేళ మీరు బరువు కోల్పోతూ, మీలో ఆకలి పెరుగుతున్న లక్షణాలను గమనిస్తే హైపర్‌థైరాయిడిజమ్‌ను అనుమానించవచ్చు. ఇక మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే అవి వారసత్వంగా రావచ్చు. దానివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కుటుంబంలో ఇలాంటివి ఉండి వారసత్వంగా వచ్చిన సందర్భాల్లో దానికి పూర్తి చికిత్స దొరకదుగానీ... ప్రిమిడాన్ వంటి టాబ్లెట్లతో కొంతమేర ప్రయోజనం ఉంటుంది. ఆస్థమా ఉన్నవారిలో దాన్ని అదుపులో ఉంచడానికి వాడే మందుల వల్లా వణుకు రావచ్చు. కొద్దిసార్లు యాంగ్జైటీ, ఒత్తిడి, కాఫీ ఎక్కువగా తీసుకోవడం వంటి అంశాలూ వణుకును కలిగిస్తాయి. ప్రొప్రనలాల్, క్లోనోజెపామ్ వంటి మందులు వణుకును తగ్గించడానికి ఉపయోగపడతాయి. అయితే వీటిని తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది.
 
డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి
చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్,
మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement