Life Insurance Corporation (LIC)
-
ఎల్ఐసీ కొత్త ప్లాన్: సింగిల్ పేమెంట్.. జీవితాంతం ఆదాయం!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆఫ్ ఇండియా 'స్మార్ట్ పెన్షన్' (Smart Pension) ప్లాన్‌ను ప్రారంభించింది. పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రతను అందించే లక్ష్యంతో సంస్థ ఈ ప్లాన్ స్టార్ట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం.ఒక ఉద్యోగి తన పదవీ విరమణ తరువాత కూడా.. క్రమం తప్పకుండా ఆదాయం వస్తే బాగుంటుందని, ఇలాంటి ప్లాన్స్ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి ఎల్ఐసీ ప్రారంభించిన ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సింగిల్-ప్రీమియం, నాన్-పార్, నాన్-లింక్డ్ ప్లాన్ సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ యాన్యుటీ వంటి ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఎంచుకోవచ్చు. జీవిత భాగస్వాములు, తల్లిదండ్రులు, పిల్లలు, మనవరాళ్ళు, తోబుట్టువులు, అత్తమామలు వంటి కుటుంబ సభ్యుల కోసం జాయింట్ లైఫ్ యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకుంటే.. ప్రియమైనవారికి ఆర్థిక స్థిరత్వాన్నిఅందించవచ్చు.నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఇలా మీకు తగిన విధంగా యాన్యుటీ చెల్లింపులు ఎంచుకోవచ్చు. కొన్ని షరతులకు లోబడి.. కొంత మొత్తం లేదా పూర్తిగా కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ను.. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్-లైఫ్ ఇన్సూరెన్స్ (POSP-LI) మరియు కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్స్ (CPSC-SPV) వంటి ఏజెంట్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. లేదా ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.అర్హత & ప్లాన్ వివరాలు18 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఎవరైనా ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. అయితే మీరు ఎంచుకునే యాన్యుటీ ఆప్షన్లను బట్టి.. అర్హత మారుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఒకసారి యాన్యుటీ ఆప్షన్ ఎంచుకున్న తరువాత, దానిని మళ్ళీ మార్చలేము. ఎంచుకునే సమయంలోనే జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాలి.స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌కు.. మార్కెట్‌తో సంబంధం లేదు. మార్కెట్లు లాభాల్లో ఉన్నా.. నష్టాల్లో ఉన్న మీ డబ్బుకు గ్యారెంటీ లభిస్తుంది. నెలకు రూ. 1,000, మూడు నెలలకు రూ. 3,000, ఏడాది రూ. 12,000 చొప్పున పాలసీదారు యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ కోసం కనీస కొనుగోలు మొత్తం రూ. 1 లక్ష. గరిష్ట కొనుగోలుకు ఎలాంటి పరిమితి ఉండదు.ఇదీ చదవండి: అమితాబ్ అల్లుడు.. వేలకోట్ల కంపెనీకి రారాజు: ఎవరీ నందా?5, 10, 15, 20 సంవత్సరాలు.. ఇలా ఎంచుకున్న కాలమంతా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ద్వారా ఆదాయం వస్తుంది. అంతే కాకుండా ప్రతి ఏటా 3 శాతం లేదా 6 శాతం పెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. జీవితాంతం పెన్షన్ అందుకునే యాన్యుటీనికి కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ పరిచయం చేస్తూ.. ''పదవీ విరమణ అనేది సంపాదనకు ముగింపు కాదు, ఇది ఆర్థిక స్వేచ్ఛకు ప్రారంభం'' అని ఎల్ఐసీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.Retirement isn’t the end of earning—it’s the beginning of financial freedom! With LIC of India’s Smart Pension, enjoy a lifetime of steady income and stress-free golden years.https://t.co/YU86iMOu9M#LIC #SmartPension #PensionPlan pic.twitter.com/4bXUXbz90g— LIC India Forever (@LICIndiaForever) February 19, 2025 -
పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరిక
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. సైబర్ మోసాలు, సైబర్ నేరగాళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఫేక్ యాప్స్, ఫేక్ మెసేజ్‌లతో ప్రజలను దోచేస్తున్నారు. ఇలాంటి మోసాల భారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది.ఇందులో భాగంగానే మొబైల్ ఫోన్లలో కాలర్ ట్యూన్ ద్వారా హెచ్చరిస్తోంది. తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన పాలసీదారులకు, కస్టమర్లకు హెచ్చరిక నోటీసు జారీ చేసింది.''లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేరుతో మోసపూరిత మొబైల్ అప్లికేషన్లు చెలామణి అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది" అని పేర్కొంటూ ఎల్ఐసీ పరిస్థితిని స్పష్టం చేసింది. ఫేక్ యాప్స్ నమ్మితే.. మోసపోతారని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా మీ వ్యక్తిగత సమాచారం.. ఆర్థిక లావాదేవీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పింది.పాలసీదారులు, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. మీ లావాదేవీలు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే పూర్తయ్యేలా చూసుకోవాలని ఎల్ఐసీ పేర్కొంది. సేవల కోసం అధికారిక వెబ్సైట్ లేదా డిజిటల్ యాప్ వంటి వాటితో పాటు వారి వెబ్సైట్లో జాబితా చేసిన.. ఇతర చెల్లింపు గేట్వేలను మాత్రమే ఉపయోగించాలి. ఇతర ఫేక్ యాప్స్ ఉపయోగించి చెల్లింపు చేస్తే.. దానికి సంస్థ బాధ్యత వహించదని స్పష్టం చేసింది.1956లో ప్రారంభమైన ఎల్ఐసీ.. ప్రభుత్వ మద్దతుతో కూడిన కార్పొరేషన్ సంస్థ. ఇది రక్షణ, పొదుపు, పెట్టుబడి కోసం అందించే పాలసీలతో సహా విస్తృత శ్రేణి జీవిత బీమా అందిస్తుంది. అకాల మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు వ్యక్తులు & కుటుంబాలకు ఆర్థిక భద్రత, మద్దతును అందించడం మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా పొదుపు, సంపద సృష్టిని ప్రోత్సహించడం ఎల్ఐసీ ప్రధాన ఉద్దేశ్యం.ఇదీ చదవండి: మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం: ఇవి బెస్ట్ స్కీమ్స్..ప్రస్తుతం ఎల్ఐసీ.. ఏజెంట్లు, శాఖలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో పెద్ద నెట్వర్క్ కలిగి ఉంది. ఇది భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన.. విస్తృతంగా గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇందులో చాలామంది పెట్టుబడులు లేదా ఇన్సూరెన్స్ వంటివి చేశారు.Public caution notice for our policyholders and customers#LIC #CautionNotice pic.twitter.com/GEyLcxdGGK— LIC India Forever (@LICIndiaForever) February 4, 2025 -
ఎల్ఐసీ, ఐవోసీ భారీ డివిడెండ్లు
కేంద్రానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ డివిడెండ్లను అందించాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్ఐసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఎండీ సిద్ధార్థ మొహంతి రూ.3,662.17 కోట్ల డివిడెండ్ చెక్కును అందించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన ఎల్ఐసీ రూ.2,441.45 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను అందించింది. తాజాగా అందజేసిన డివిడెండ్‌తో కలిసి 2023–24లో సంస్థ మొత్తం రూ.6,103.62 కోట్ల డివిడెండ్‌ను అందించినట్లైంది. ఇక ఐవోసీ రూ.5,091 కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి సమరి్పంచింది. 2024–25లో ఇప్పటి వరకూ కేంద్రానికి రూ.10,604.74 కోట్ల డివిడెండ్ అందింది. 2023–24లో డివిడెండ్లు రూ.50,000 కోట్లుకాగా, 2024–25లో ఈ విలువ అంచనాలు రూ.56,260 కోట్లు. -
ఎల్ఐసీ పెట్టుబడులపై లాభాల పంట
కొంతమేర పెట్టుబడుల విక్రయం ∙అయినప్పటికీ పెరిగిన విలువ బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో పలు దిగ్గజ కంపెనీలలో గల వాటాలను కొంతమేర విక్రయించింది. ఇందుకు స్టాక్ మార్కెట్లు బుల్ వేవ్‌లో పరుగు తీస్తుండటం ప్రభావం చూపింది. అయినప్పటికీ గతేడాది ఎల్ఐసీ పెట్టుబడుల విలువ ఏకంగా 37 శాతంపైగా జంప్‌చేయడం విశేషం! వివరాలు చూద్దాంస్టాక్ ఎక్సే్ఛంజీలకు దాఖలైన సమాచారం ప్రకారం ఎల్ఐసీ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీలలో అత్యధిక పెట్టుబడులను కలిగి ఉంది. ఈ బాటలో టాటా, అదానీ గ్రూప్‌లలోనూ భారీగా ఇన్వెస్ట్ చేసింది. గత వారాంతానికల్లా దిగ్గజ కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 4.39 లక్షల కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2022–23)లో నమోదైన విలువతో పోలిస్తే ఇది 37.5 శాతం అధికం. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లో పెట్టుబడులు 34 శాతం ఎగసి రూ. 1.5 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో పెట్టుబడులను గతేడాది 6.37 శాతం నుంచి 6.17 శాతానికి తగ్గించుకుంది. ఇదేకాలంలో టాటా గ్రూప్ కంపెనీలలో వాటా 4.22 శాతం నుంచి 4.05 శాతానికి నీరసించింది. వీటి విలువ రూ. 1.29 లక్షల కోట్లు. ఇక అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ వాటా 4.27 శాతం నుంచి 3.76 శాతానికి దిగివచి్చంది. వీటి విలువ 49 శాతం దూసుకెళ్లి రూ. 64,414 కోట్లను తాకింది. ఎన్ఎస్ఈలో బుధవారం ఎల్ఐసీ షేరు 1.5% బలపడి రూ. 1,048 వద్ద ముగిసింది. ఈ ధరలో ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. 6.62 లక్షల కోట్లను అధిగమించింది.ప్రభుత్వం సైతం నిజానికి పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎల్ఐసీ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. రూ. 1,050 సమీపంలో కదులుతోంది. కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. దీంతో ఎల్ఐసీలో మైనారిటీ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం భారీగా నిధులు సమకూర్చుకునేందుకు వీలుంది. వీటిని మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు రోజుకో సరికొత్త గరిష్టాన్ని అందుకుంటూ జోరు చూపుతున్నాయి. దీనికితోడు ఏడాది కాలంలో పలు ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లు వేలంవెర్రిగా లాభాల పరుగు తీస్తున్నాయి. వెరసి ప్రభుత్వం వీటిలో కొంతమేర వాటాల విక్రయాన్ని చేపడితే.. సులభంగా బడ్జెట్ ప్రతిపాదిత డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను చేరుకోవచ్చని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎల్ఐసీ రూ. 2,441 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) కేంద్ర ప్రభుత్వానికి రూ. 2,441 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చెక్ అందుకున్నారు. ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెక్రటరీ వివేక్ జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
LIC Jeevan Dhara II Policy: ఎల్ఐసీ 'జీవన్ ధార 2' పాలసీ లాంఛ్..అదిరిపోయే బెన్ఫిట్స్!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జీవన్ ధార 2 పేరుతో యాన్యుటీ ప్లాన్‌ను లాంఛ్ చేసింది. జనవరి 22, 2024 నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి రానుంది. ఇక పాలసీని పొందేందుకు కనీస వయస్సు 20 సంవత్సరాలు ఉండాలి. వ్యవధిని బట్టి పాలసీలోకి ప్రవేశించే గరిష్ట వయస్సు (65/70/80 సంవత్సరాలు) మారుతుంటుంది. అధికారిక ప్రకటన ప్రకారం.. యాన్యుటీ ప్రారంభం నుండి రెగ్యులర్ ఇన్ కమ్ పొందవచ్చు. జీవన్ ధార 2 పథకం వివరాలు ►పాలసీ కట్టే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ వర్తిస్తుంది. ►ఒకేసారి డిపాజిట్ చేసి (యాన్యుటీని) ప్రతినెలా కొంత మొత్తాన్ని ఆదాయం రూపంలో పొందవచ్చు. దీనిని మూడు, ఆరు నెలలు, ఏడాదికి ఇలా చెల్లించుకోవచ్చు. ►యాన్యుటైజేషన్ లేదా ఇన్స్టాల్మెంట్ల రూపంలో డెత్ క్లెయిమ్ రాబడిని ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది. ► తీసుకునే ప్రీమియంను బట్టి పాలసీ దారులకు ప్రయోజనాలు అదే స్థాయిలో ఉంటాయి. ► రెగ్యులర్ ప్రీమియం- వాయిదా కాలం 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు, ► సింగిల్ ప్రీమియం- వాయిదా కాలం 1 సంవత్సరం నుండి 15 సంవత్సరాల వరకు, ►యాన్యుటీ టాప్-అప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ►ఈ ఎల్ఐసీ జీవన్ ధార 2 పాలసీపై లోన్ తీసుకోవచ్చు. ►పాలసీదారుడు మరణిస్తే ఏకమొత్తంగా పరిహారం పొందవచ్చు. లేదా వాయిదా పద్ధతుల్లోనూ పరిహారం తీసుకోవచ్చు. -
సొంత ఫిన్‌టెక్ ఏర్పాటులో ఎల్ఐసీ
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తాజాగా సొంత ఫిన్‌టెక్ విభాగాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను మదింపు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. మరోవైపు, కార్యకలాపాల డిజిటలీకరణ కోసం ప్రాజెక్ట్ డైవ్ (డిజిటల్ ఇన్నోవేషన్, వేల్యూ ఎన్హాన్స్మెంట్)ను చేపట్టామని, దీనికి కన్సల్టెంట్‌ను నియమించుకున్నామని పేర్కొన్నారు. కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా కస్టమర్లు తమ ఇంటి దగ్గరే మొబైల్ ఫోన్‌తో అన్ని సరీ్వసులను పొందగలిగేలా వివిధ ప్రక్రియలను సులభతరం చేస్తున్నట్లు మహంతి పేర్కొన్నారు. -
కొత్త పాలసీల ప్రీమియంలో కనిపించని వృద్ధి
ముంబై: జీవిత బీమా కంపెనీలు కొత్త పాలసీల ప్రీమియం రూపంలో జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.73,005 కోట్లను సమకూర్చుకున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన ప్రీమియం ఆదాయం రూ.73,674 కోట్లతో పోల్చి చూస్తే నికరంగా 0.9 శాతం మేర క్షీణించింది. జీవిత బీమా రంగంలోనే దిగ్గజ సంస్థ అయిన ఎల్ఐసీపై ఎక్కువ ప్రభావం పడింది. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో జీవిత బీమా కంపెనీల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 40 శాతం వృద్ధి చెందడం గమనార్హం. జూన్ క్వార్టర్లో ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం 7 శాతం క్షీణించి రూ.44,837 కోట్లకు పరిమితమైంది.(ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!) ఇండివిడ్యువల్ (వ్యక్తుల) సింగిల్ ప్రీమియం ఆదాయం 1.4 శాతం తగ్గి రూ.4,568 కోట్లుగా ఉంది. కానీ, క్రితం ఏడాది ఇదే కాలంలో ఎల్ఐసీ ఈ విభాగంలో 38 శాతం ప్రీమియం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఇండివిడ్యువల్ నాన్ సింగిల్ ప్రీమియం ఆదాయం 6.6 శాతం తగ్గి రూ.5,871 కోట్లుగా ఉంది. గ్రూప్ సింగిల్ ప్రీమియం 7.4 శాతం తగ్గి రూ.33,465 కోట్లుగా నమోదైంది. జూన్ త్రైమాసికం చివరి నెలలో మాత్రం ఎల్ఐసీ తొలి ఏడాది ప్రీమియం ఆదాయంలో 18.3 శాతం వృద్ధిని చూపించింది. మే నెలలో 4.1 శాతం క్షీణతతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించింది. ఇక ప్రైవేటు జీవిత బీమా సంస్థలు అన్నింటి నూతన ప్రీమియం ఆదాయం జూన్ క్వార్టర్లో 10.6 శాతం పెరిగి రూ.28,168 కోట్లుగా నమోదైంది. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!) -
ఎల్ఐసి సేవలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా.. ఇలా ప్రారంభించండి!
LIC WhatsApp Service: ఆధునిక కాలంలో చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీలు ఉంటాయి. అయితే మనకు ఇందులో ఏదైనా సందేహం వచ్చినా, సమస్య వచ్చిన నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అయితే సంస్థ ఇప్పుడు తమ పాలసీదారుల కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీసుని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ సర్వీసుల గురించి తెలుసుకోవచ్చు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎల్ఐసి కంపెనీ ప్రవేశపెట్టిన వాట్సాప్ సర్వీసు ద్వారా లోన్ ఎలిజిబిలిటీ, రీపేమెంట్ ఎస్టిమేట్, ప్రీమియం డ్యూ డేట్స్ వంటి వాటితో పాటు బోనస్ ఇన్ఫర్మషన్, లోన్ ఎలిజిబిలిటీ కొటేషన్, ఎల్ఐసి సర్వీస్ లింక్స్, పాలసీ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. (ఇదీ చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో నాలుగు బైకులు - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?) ఎల్ఐసి వాట్సాప్ సర్వీస్ ఉపయోగించుకోవడమెలా? మీ స్మార్ట్‌ఫోన్‌లో 8976862090 అనే నెంబర్‌కి 'హాయ్' అని మెసేజ్ చేయాలి. తరువాత మీకు 11 ఆప్షన్ కనిపిస్తాయి. అందులో మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దానిని సెలక్ట్ చేసుకోవాలి. మీరు ఎంచుకునే ఆప్షన్ని బట్టి రిప్లై వస్తుంది. వాట్సాప్ చాట్‌లోనే మీకు అవసరమైన వివరాలను ఎల్ఐసి షేర్ చేస్తుంది -
ఎల్ఐసీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. నికర లాభం అత్యంత భారీగా దూసుకెళ్లి రూ. 8,334 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 235 కోట్లు ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం రూ. 97,620 కోట్ల నుంచి రూ. 1,11,788 కోట్లకు జంప్ చేసింది. అయితే గత కాలంలో కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానందున ఫలితాలు పోల్చి చూడటం తగదని ఎల్ఐసీ పేర్కొంది. కాగా.. పెట్టుబడుల ఆదాయం రూ. 76,574 కోట్ల నుంచి రూ. 84,889 కోట్లకు ఎగసింది. అదానీ గ్రూప్‌పై.. క్యూ3లో వాటాదారుల నిధికి రూ. 2,000 కోట్లను ప్రొవిజన్లకింద బదిలీ చేయడంతో నికర లాభం రూ. 6,334 కోట్లుగా నమోదైనట్లు ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు. అదానీ గ్రూ ప్ యాజమాన్యంతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజులుగా అదానీ గ్రూప్ కంపెనీలలో తలెత్తిన సంక్షోభంపై ఇన్వెస్టర్ బృందం ద్వారా వివరణను కోరనున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ఎన్ఎస్ఈలో 0.5% పుంజుకుని రూ. 614 వద్ద ముగిసింది. -
బోలెడు బెనిఫిట్స్‌తో ఎల్ఐసీ కొత్త పాలసీ!
హైదరాబాద్: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్తగా ‘ధన్ వర్ష’ బీమా ప్లాన్‌ను (ప్లాన్ నంబర్ 866) ప్రవేశపెట్టింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని), నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, సింగిల్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్‌పాలసీ అని ఎల్ఐసీ ప్రకటించింది. జీవిత బీమా రక్షణ, పొదుపులను ఈ ప్లాన్‌లో భాగంగా ఆఫర్ చేస్తోంది. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే కుటుంబానికి పరిహారం చెల్లిస్తుంది. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే ఏక మొత్తంలో హామీ మేరకు చెల్లిస్తుంది. ఈ ప్లాన్ 2023 మార్చి వరకే అందుబాటులో ఉంటుంది. 10, 15 ఏళ్ల కాలాన్ని పాలసీ టర్మ్‌గా ఎంపిక చేసుకోవచ్చు. కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.1.25 లక్షలు కాగా, గరిష్ట మొత్తంపై పరిమితి లేదు. 3 ఏళ్ల వయసున్న చిన్నారి వయసు నుంచి ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్‌లో ఏటా గ్యారంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి. ఈ ప్లాన్‌కు అనుబంధంగా తీసుకునేందుకు ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ అందుబాటులో ఉన్నాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
మీ భవిష్యత్తుకు భరోసా.. ఎల్ఐసీ నుంచి కొత్త పెన్షన్ పాలసీ, బెనిఫిట్స్ కూడా బాగున్నాయ్
జీవిత బీమాలో అగ్రస్థాయి కంపెనీ అయిన ఎల్ఐసీ.. కొత్త పెన్షన్ ప్లాన్‌ను (ప్లాన్ నంబర్ 867) విడుదల చేసింది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్ ప్లాన్. రెగ్యులర్‌గా ఈ ప్లాన్‌లో పొదుపు చేసుకుంటూ.. కాల వ్యవధి తర్వాత యాన్యుటీ ప్లాన్ తీసుకుని పెన్షన్ పొందొచ్చని ఎల్ఐసీ తెలిపింది. ఒకేసారి చెల్లించే సింగిల్ ప్రీమియం ప్లాన్ లేదంటే రెగ్యులర్‌గా పాలసీ కాల వ్యవధి వరకు ప్రీమియం చెల్లించే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కనిష్ట, గరిష్ట ప్రీమియం పరిమితుల మధ్య పాలసీదారు తనకు అనుకూలమైన మొత్తాన్ని ప్రీమియంగా ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం రూపంలో చేసిన చెల్లింపులను నాలుగు ఫండ్స్‌లో ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది పాలసీదారు అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రీమియం అలోకేషన్ తదితర చార్జీలను ప్రీమియం నుంచి మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఆయా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ పాలసీలో 5–15 శాతం మధ్య గ్యారంటీడ్ అడిషన్ కూడా చెల్లిస్తారు. -
28 ఐపీవోలు .. రూ. 45,000 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య కాలంలో 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)ల ద్వారా రూ. 45,000 కోట్లు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతినిచ్చింది. వీటిలో 11 సంస్థలు ఇప్పటికే రూ. 33,254 కోట్లు సమీకరించాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌దే (రూ. 20,557 కోట్లు) ఉంది. ఏప్రిల్–మే నెలల్లోనే చాలా సంస్థలు ఐపీవోకి వచ్చాయి. మే తర్వాత పబ్లిక్ ఇష్యూలు పూర్తిగా నిల్చిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో తగిన సమయం కోసం పలు సంస్థలు వేచి చూస్తున్నాయని మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు తెలిపాయి. వీటిలో చాలా మటుకు కంపెనీలు రోడ్‌షోలు కూడా పూర్తి చేశాయని ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రావు చెప్పారు. ఐపీవోలకు అనుమతులు పొందిన సంస్థలలో ఫ్యాబ్ఇండియా, భారత్ ఎఫ్ఐహెచ్, టీవీఎస్ సప్లయ్ చైన్ సొల్యూషన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, మెక్లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్, కిడ్స్ క్లినిక్ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి. సెంటిమెంట్ డౌన్: గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) 52 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 1.11 లక్షల కోట్లు సమీకరించాయి. కొత్త తరం టెక్నాలజీ స్టార్టప్‌ల ఇష్యూలపై ఆసక్తి నెలకొనడం, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా పాలుపంచుకోవడం, లిస్టింగ్ లాభాలు తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. అయితే, ప్రస్తుతం సెకండరీ మార్కెట్ భారీగా కరెక్షన్కు లోను కావడం, పేటీఎం.. జొమాటో వంటి డిజిటల్ కంపెనీల పనితీరు ఘోరంగా ఉండటం, ఎల్ఐసీ వంటి దిగ్గజం లిస్టింగ్‌లో నిరాశపర్చడం వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ వివరించారు. క్యూలో మరిన్ని కంపెనీలు. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ .. ఐపీవో ప్రాస్పెక్టస్ దాఖలు చేసేందుకు గత రెండు నెలలుగా కంపెనీలు క్యూ కడుతుండటం గమనార్హం. జూన్–జూలైలో మొత్తం 15 కంపెనీలు సెబీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. సూలా విన్‌యార్డ్స్, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్, ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సాయి సిల్క్ కళామందిర్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. చిన్న నగరాల్లో అద్భుతంగా రా>ణించిన వ్యాపార సంస్థల ప్రమోటర్లు ఇప్పుడు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ముందుకు వస్తున్నారని మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎండీ అభిజిత్ తారే తెలిపారు. త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా నమోదవుతుండటం, ఆర్థిక డేటా కాస్త ప్రోత్సాహకరంగా కనిపిస్తుండటం తదితర అంశాలు, ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సహేతుకమైన ధరతో వచ్చే కంపెనీల ఐపీవోలకు సానుకూలంగా ఉండవచ్చని పేర్కొన్నారు. -
మెడిక్లెయిమ్ సెగ్మెంట్‌పై మళ్లీ ఎల్ఐసీ చూపు!
న్యూఢిల్లీ: భారత బీమా రంగ దిగ్గజ సంస్థ– జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తిరిగి మెడిక్లెయిమ్ బీమా పాలసీ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి ఆసక్తిగా ఉంది. ఈ విషయంపై రెగ్యులేటర్– ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పేర్కొన్నారు. మెడిక్లెయిమ్ పాలసీ అంటే... మెడిక్లెయిమ్ పాలసీలు అంటే... నష్టపరిహారం (ఇన్డెమ్నిటీ) ఆధారిత ఆరోగ్య పథకాలు. అయితే మార్కెట్ నుండి ఈ పథకాలను ఉపసంహరించుకోవాలని 2016లో ఐఆర్డీఏఐ జీవిత బీమా సంస్థలను కోరింది. మూడు నెలల నోటీస్ పిరియడ్‌తో అప్పట్లో వాటి ఉపసంహరణ కూడా జరిగింది. జీవిత బీమా సంస్థలు ఇలాంటి ఆరోగ్య సంబంధ పథకాలు ఇవ్వడానికి సాంకేతికంగా అడ్డంకులు ఉన్నాయని అప్పట్లో రెగ్యులేటర్ భావించింది. నష్టపరిహార ఆధారిత ఆరోగ్య బీమా పథకాల కింద బీమా చేసిన మొత్తం వరకు వైద్య చికిత్స కోసం ఖర్చు చేసిన డబ్బుకు బీమా సంస్థ రీయింబర్స్మెంట్ (చెల్లింపులు) చేస్తుంది. 2016లో ఉపసంహరణకు ముందు జీవిత బీమా సంస్థల ఆరోగ్య పోర్ట్‌ఫోలియోలో 90–95 శాతం నష్టపరిహార ఆధారిత ఆరోగ్య బీమా పథకాలు (ఇన్డెమ్నిటీ) ఉండేవి. దీని ప్రకారం పాలసీదారు వైద్యుడిని సందర్శించిన తర్వాత లేదా వైద్య ఖర్చులను భరించిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను క్లెయిమ్ చేసే వీలుండేది. మళ్లీ మార్పు ఎందుకు? 2030 నాటికి ప్రతి పౌరుడు ఆరోగ్య బీమా పాలసీని కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ఆదేశాల నేపథ్యంలో జీవిత బీమా సంస్థలు ఆరోగ్య విభాగంలోకి తిరిగి ప్రవేశించే సమయం ఆసన్నమైందని ఇటీవలే కొత్త ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశిష్ పాండా అన్నారు.అయితే జీవిత బీమా సంస్థలను ఆరోగ్య బీమా పాలసీలను విక్రయించడానికి అనుమతించడం వల్ల కలిగే లాభ నష్టాలను రెగ్యులేటర్ మదింపు చేస్తోందని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్లలో జీవిత బీమా సంస్థలు ఆరోగ్య పాలసీలనూ విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 24.50 లక్షల మంది జీవిత బీమా ఏజెంట్లు ఉండగా, సాధారణ, ఆరోగ్య బీమా విభాగంలో కేవలం 3.60 లక్షల మంది ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. జీవిత బీమా సంస్థలను ఆరోగ్య బీమా రంగంలోకి అనుమతించినట్లయితే, ఏజెంట్ల సంఖ్య 600 శాతం పెరుగుతుంది. దీనివల్ల దేశంలో ఆరోగ్య బీమా వ్యాప్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా. -
ఎల్ఐసీ మెగా ఐపీవోకి సన్నాహాలు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెగా పబ్లిక్ ఇష్యూ కోసం సన్నాహాలు వేగం పుంజుకుంటున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లుగా 50–60 సంస్థలను కేంద్రం షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీటిలో బ్లాక్‌రాక్, శాండ్స్ క్యాపిటల్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, స్టాండర్డ్ లైఫ్, జేపీ మోర్గాన్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. త్వరలోనే యాంకర్ ఇన్వెస్టర్ల జాబితాను కేంద్రం ఖరారు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదిత ఇన్వెస్టర్ల నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుందని ఒక అధికారి తెలిపారు. ఇందుకోసం నిర్దిష్ట వేల్యుయేషన్ శ్రేణిని వారి ముందు ఉంచినట్లు వివరించారు. ఆయా ఇన్వెస్టర్ల అభిప్రాయాల మేరకు ఎల్ఐసీ వేల్యుయేషన్ దాదాపు రూ. 7 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వేల్యుయేషన్ ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో మదుపు చేసేందుకు ఆసక్తి చూపే ఇన్వెస్టర్ల సంఖ్య మరింతగా పెరుగుతోందని అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో వేల్యుయేషన్‌పైనా సత్వరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. 25 శాతం డ్రాపవుట్..: ఆసక్తిగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఎంత మేరకు పెట్టుబడులు పెడతాయో తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి కమిటీ.. వాటి నుంచి ప్రతిపాదనలు తీసు కున్నట్లు అధికారి చెప్పారు. ఇప్పటికే షార్ట్‌లిస్ట్ చేసిన సంస్థల్లో దాదాపు 25% ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకునే (డ్రాపవుట్) అవకాశం ఉందని భావిస్తున్నట్లు వివరించారు. మరింత మంది ఇన్వెస్టర్లను భాగస్వాములను చేసేందుకు, సెబీ నిబంధనల మేరకు .. ఐపీవోలో విక్రయించే షేర్ల సంఖ్యను కూడా కేంద్రం పెంచవచ్చని తెలిపారు. సుమారు 12 యాంకర్ ఇన్వెస్టర్లు దాదాపు రూ. 18,000 కోట్ల పెట్టుబడులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూ ద్వారా 31.6 కోట్ల షేర్ల (దాదాపు 5% వాటా) విక్రయం ద్వారా రూ. 63,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. మారిన పరిస్థితులతో 7% వరకు వాటాలను విక్రయించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మే 12 దాటితే మళ్లీ ఐపీవో ప్రతిపాదనలను సెబీకి సమర్పించాల్సి రానున్న నేపథ్యంలో ఏదేమైనా పబ్లిక్ ఇష్యూను ఏప్రిల్‌లోనే ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఎల్ఐసీ ప్రాస్పెక్టస్‌లో క్యూ3 ఫలితాలు అప్డేట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తాజా క్యూ3 ఫలితాలతో అప్డేట్ చేసింది. సదరు పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. సెబీ నిబంధనల ప్రకారం డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలతో అప్డేట్ చేసిన ప్రాస్పెక్టస్‌ను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఎల్ఐసీ నికర లాభం రూ. 235 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో నమోదైన రూ. 7.08 కోట్లతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో లాభం రూ. 1,672 కోట్లకు పెరిగింది. ప్రతిపాదిత ఐపీవో కింద 5 శాతం వాటాల (31.6 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా సుమారు రూ. 60,000 కోట్లు సమీకరించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ. 78,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటిదాకా కేవలం రూ. 12,423 కోట్లు మాత్రమే సేకరించగలిగింది. మిగతా మొత్తాన్ని ఎల్ఐసీ ఐపీవో ద్వారా భర్తీ చేసుకోవచ్చని భావించింది. ఇందుకోసం మార్చిలోనే పబ్లిక్ ఇష్యూ కోసం సన్నాహాలు చేసుకున్నప్పటికీ రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సెబీకి కొత్తగా మరోసారి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం తీసుకున్న అనుమతులతో పబ్లిక్ ఇష్యూకి వెళ్లేందుకు ప్రభుత్వానికి మే 12 వరకూ గడువు ఉంది. అతి పెద్ద ఐపీవో..: అంతా సజావుగా జరిగితే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతి పెద్ద ఐపీవో కానుంది. ఒక్కసారి లిస్టయ్యిందంటే ఎల్ఐసీ మార్కెట్ విలువ.. రిలయన్స్, టీసీఎస్ వంటి దిగ్గజాలను కూడా మించిపోనుంది. ఇప్పటిదాకా అత్యంత భారీ ఐపీవో రికార్డు.. పేటీఎం పేరిట ఉంది. 2021లో పేటీఎం రూ. 18,300 కోట్లు సమీకరించింది. ఆ తర్వాత స్థానాల్లో కోల్ ఇండియా (2010లో రూ. 15,500 కోట్లు), రిలయన్స్ పవర్ (2008లో రూ. 11,700 కోట్లు) ఉన్నాయి. -
ఎల్ఐసీ ఐపీవోపై ప్రభుత్వం దృష్టి
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టే బాటలో ప్రభుత్వం ప్రణాళికలకు తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూకి ధరల శ్రేణితోపాటు.. పాలసీదారులు, రిటైలర్లకు డిస్కౌంట్, రిజర్వ్ చేయనున్న షేర్ల సంఖ్య తదితరాలపై కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాలను త్వరలోనే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేయనున్నట్లు తెలియజేశాయి. అయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తుండటంతో ప్రస్తుతం ప్రభుత్వం వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు తెలియజేశాయి. ముసాయిదా పత్రాలకు సెబీ నుంచి ఆమోదముద్ర పడటంతో తుది పత్రాల(ఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేయవలసి ఉన్నట్లు పేర్కొన్నాయి. 5 శాతం వాటా: పబ్లిక్ ఇష్యూలో భాగంగా బీమా దిగ్గజం ఎల్ఐసీలో ప్రభుత్వం 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను విక్రయించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా ఫిబ్రవరి 13న ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేయగా.. ఈ వారం మొదట్లో సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో ఆర్హెచ్పీను సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. 5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించాలని భావిస్తోంది. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి సవరించిన రూ. 78,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని అందుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. -
ఐడీబీఐ బ్యాంక్‌లో కొనసాగుతాం
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ తాజాగా అనుబంధ సంస్థ ఐడీబీఐ బ్యాంకులో పూర్తి వాటాను విక్రయించబోమంటూ స్పష్టం చేసింది. బ్యాంక్‌ఎస్యూరెన్స్ చానల్ ద్వారా లబ్ది పొందేందుకు వీలుగా కొంతమేర వాటాతో కొనసాగనున్నట్లు తెలియజేసింది. అదనపు వాటాను కొనుగోలు చేయడంతో ఎల్ఐసీకి 2019 జనవరి 21 నుంచి ఐడీబీఐ బ్యాంకు అనుబంధ సంస్థగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. క్విప్ ద్వారా ఎల్ఐసీ 49.24 శాతం వాటాను సొంతం చేసుకోవడంతో 2020 డిసెంబర్ 19న బ్యాంకు సహచర సంస్థగా వ్యవహరిస్తోంది. కాగా.. బ్యాంక్‌ఎస్యూరెన్స్‌లో భాగంగా ఎల్ఐసీ బ్యాంకు కస్టమర్లకు సంస్థ బ్రాంచీల ద్వారా బీమా ప్రొడక్టులను విక్రయించగలుగుతోంది. ఇది కంపెనీకి దన్నునిస్తుండటంతో ఐపీవో తదుపరి కూడా బ్యాంకులో కొంతమేర వాటాను కొనసాగించే యోచనలో ఉన్నట్లు ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు. నిజానికి వ్యూహాత్మకంగానే బ్యాంకులో వాటాను చేజిక్కించుకున్నట్లు పేర్కొన్నారు. ఇది రెండు సంస్థలకూ ప్రయోజనకరమేనని వ్యాఖ్యానించారు. బ్యాంక్‌ఎస్యూరెన్స్‌లో భాగంగా కంపెనీ విభిన్న బ్యాంకులకు చెందిన 58,000 బ్రాంచీలతో పంపిణీ ఒప్పందాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఈ దారిలో మరింత భారీ వృద్ధికి అవకాశమున్నట్లు వివరించారు. ఎన్ఎస్ఈలో ఐడీబీఐ బ్యాంకు షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ. 46 వద్ద ముగిసింది. -
కేవలం రూ. 262 పెట్టుబడితో రూ. 20 లక్షలకు పైగా పొందండి ఇలా..!
ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) భారత్‌లో అతిపెద్ద బీమా కంపెనీలలో ఒకటి. సామాన్యులకు విభిన్నమైన పాలసీలను అందిస్తూ వారికి పెద్ద మొత్తంలో లాభాలను అందిస్తోంది ఎల్ఐసీ. పెట్టుబడి దారులకు సురక్షితమైన, రిస్క్ లేని పాలసీలను ఎల్ఐసీ అందిస్తోంది. పిల్లల చదువులు, పదవీ విరమణ వంటి వాటికి ఆర్థిక భద్రతను ఎల్ఐసీ తన పాలసీదారులకు ఇస్తోంది. పాలసీలను ఎలాంటి అవాంతరాలు లేకుండా కట్టినట్లఐతే భారీ మొత్తంలో లాభాలను పొందవచ్చును. రోజుకు రూ. 262తో రూ. 20 లక్షలు ఎల్ఐసీ అందిస్తోన్న పాలసీల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాలసీ జీవన్ లాభ్. ఈ పాలసీను 2020 ఫిబ్రవరి 1న ఎల్ఐసీ ప్రారంభించింది. ఈ పాలసీ ద్వారా.. దురదృష్టవశాత్తూ పాలసీదారుడు మరణించినా, నామినీకి ఈ పాలసీ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న వారు కొంతకాలం తర్వాత రుణాలు కూడా తీసుకునే అవకాశాన్ని కల్పించింది. డెత్ బెనిఫిట్, పాలసీ మెచ్యూరిటీ బెనిఫిట్స్ సహా వంటి వాటిని కూడా ఈ పాలసీ ద్వారా పొందవచ్చును. ఎల్ఐసీ తీసుకొచ్చిన జీవన్ లాభ్ పాలసీలో ఇన్వెస్ట్ చేయడంతో మెచ్యూరిటీ సమయానికి లక్షల రూపాయలను పొందవచ్చును. ఈ పాలసీలో భాగంగా రోజుకు రూ.262(నెలకు రూ. 7, 916) చొప్పున నిర్ణిత గడుపులోపు కట్టినట్లయితే.. దాదాపుగా రూ.20 లక్షల వరకు తిరిగి పొందే అవకాశం ఉంది. జీవన్ లాభ్ పాలసీ మరిన్ని వివరాలు ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ కనీస బీమా మొత్తం రూ.2 లక్షల నుంచి మొదలుకానుంది. ఈ పాలసీ బీమాపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. బీమా పరిమితిని ఎంత పెంచితే నెలవారీ ప్రీమియం కూడా పెరిగిపోతుంది. ఈ పాలసీకి కనీసం 8 ఏళ్ల మెచ్యురిటీ ఉంది. అయితే ఈ పాలసీ టైం పీరియడ్‌ను 16, 21, 25 ఏళ్లకు పెంచుకోవచ్చును. 8 నుంచి 59 ఏళ్ల వారు ఈ పాలసీలో జాయిన్ అవ్వడానికి అర్హులు. ఈ పాలసీలను నెలవారీగా లేదా 3,6 నెలల వారిగా, ఏడాదికి ఒకసారి ప్రీమియంను చెల్లించే వెసులుబాటును ఎల్ఐసీ కల్పిస్తోంది. ఇక నెలవారీ చెల్లింపులపై 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. చదవండి: వెయిట్ చేసినందుకు...ఎలాంటి కష్టం లేకుండా రూ. 1.35 కోట్ల జాక్‌పాట్ కొట్టేశారు..! -
మెగా ఐపీవోకి ఎల్ఐసీ రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రతిపాదిత మెగా పబ్లిక్ ఇష్యూ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇందుకు సంబంధించి.. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే .. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఈ విషయం తెలిపారు. దాదాపు 5% వాటాకి సరిసమానమైన 31.63 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నట్లు వివరించారు. ఈ ఇష్యూ ద్వారా ప్రభుత్వం దాదాపు రూ. 63,000 కోట్లు సమీకరించవచ్చని మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ..ఐపీవోలో కొంత భాగాన్ని అర్హత కలిగిన ఉద్యోగులు, పాలసీదారులకు కేటాయించనున్నారు. పబ్లిక్ ఇష్యూలో ఉద్యోగులకు కేటాయించే వాటా గరిష్టంగా 5%, పాలసీదారులకు 10%గా ఉంటుంది. నిర్దిష్ట మదింపు విధానం కింద 2021 సెప్టెంబర్ 30 ఆఖరు నాటికి ఎల్ఐసీ విలువ సుమారు రూ. 5.4 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంతర్జాతీయ యాక్చువేరియల్ సంస్థ మిల్లిమన్ అడ్వైజర్స్ లెక్క వేసింది. ఐపీవో ద్వారా వచ్చే నిధులు మొత్తం ప్రభుత్వానికే వెడతాయి. పూర్తిగా ప్రభుత్వ షేర్లనే విక్రయిస్తుండటంతో ఈ ఐపీవో 100% ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపం లో ఉండనుంది. ఎల్ఐసీ కొత్తగా షేర్లను జారీ చేయదు. ‘2021 మార్చి ఆఖరు నాటి గణాంకాల ప్రకారం కొత్త ప్రీమియంల విషయంలో ఎల్ఐసీకి 66% మార్కెట్ వాటా ఉంది. అలాగే 28.3 కోట్ల పాలసీలు, 13.5 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు‘ అని పాండే పేర్కొన్నారు. అయితే, ఎల్ఐసీ మార్కె ట్ వేల్యుయేషన్ గురించి గానీ పాలసీదారులు లేదా ఎల్ఐసీ ఉద్యోగులకు గానీ ఎంత డిస్కౌంట్ ఇచ్చేదీ ప్రాస్పెక్టస్‌లో వెల్లడించలేదు. భారీ మార్కెట్ వాటా .. ప్రస్తుతం దేశీయంగా 24 జీవిత బీమా కంపెనీలు ఉండగా ప్రభుత్వ రంగంలో ఎల్ఐసీ ఒక్కటే ఉంది. అదే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక్కసారి లిస్టయ్యిందంటే, మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా ఎల్ఐసీ దేశంలోనే అతి పెద్ద కంపెనీగా ఆవిర్భవిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఎల్ఐసీ లాభం రూ. 1,437 కోట్లుగా నమోదైంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనాల ప్రకారం.. 2020 గణాంకాలు బట్టి దేశీయంగా మొత్తం స్థూల ప్రీమియంలలో 64.1 శాతం వాటాతో ఎల్ఐసీ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఉంది. ఈ వాటాల విలువ 56.405 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. తద్వారా ప్రీమియంలపరంగా ఎల్ఐసీ .. అంతర్జాతీయంగా టాప్ జీవిత బీమా సంస్థల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో ఉన్న ఎస్బీఐ లైఫ్‌కి 8 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇలా మొదటి, రెండో స్థానాల్లోని కంపెనీల మార్కెట్ వాటాల్లో ఇంత భారీ వ్యత్యాసం ప్రపంచంలో ఎక్కడా లేదని క్రిసిల్ తెలిపింది. చైనా మార్కెట్‌కు సంబంధించి పింగ్ యాన్ ఇన్సూరెన్స్‌కు అక్కడ అత్యధికంగా 21 శాతం, రెండో స్థానంలోని చైనా లైఫ్ ఇన్సూరెన్స్‌కు 20 శాతం వాటా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం ప్రాతిపదికన భారత జీవిత బీమా పరిశ్రమ విలువ రూ. 5.7 లక్షల కోట్ల నుంచి రూ. 6.2 లక్షల కోట్లకు చేరింది. మార్చిలో ఇష్యూకి అవకాశం .. ఎల్ఐసీ ఐపీవోకు గతేడాది జూలైలోనే ఆమోదముద్ర వేసింది. షేర్ క్యాపిటల్‌ను రూ. 100 కోట్ల నుంచి రూ. 6,325 కోట్లకు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీవోని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూ మార్చిలో ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 78,000 కోట్ల నిధులు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటిదాకా ఎయిరిండియాలో విక్రయం, ఇతర ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 12,030 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎల్ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం వాటాలు (632,49,97,701 షేర్లు) ఉన్నాయి. -
ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణ ఆఫర్
హైదరాబాద్: వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని ఎల్ఐసీ మరో విడత కల్పించింది. కరోనాతో జీవిత బీమా కవరేజీకి ప్రాధాన్యం పెరిగిన క్రమంలో పాలసీదారుల ప్రయోజనాల కోణంలో ఎల్ఐసీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ నెల 7 నుంచి మార్చి 25 వరకు పాలసీ పునరుద్ధరణ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది. లేట్ఫీజులో తగ్గింపును ఇస్తున్నట్టు తెలిపింది. వైద్య పరీక్షలకు సంబంధించి ఎటువంటి రాయితీలు ఉండవు. హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపైనా లేట్ ఫీజులో రాయితీ ఇస్తోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పాలసీదారులు చివరిగా ప్రీమియం కట్టిన తేదీ నుంచి ఐదేళ్లకు మించకుండా ఉంటే పునరుద్ధరించుకునేందుకు అర్హత ఉంటుంది. రూ.లక్ష వరకు బీమాతో కూడిన ప్లాన్ల పునరుద్ధరణపై ఆలస్యపు రుసుంలో 20 శాతం (గరిష్టంగా రూ.2,000) తగ్గింపు పొందొచ్చు. రూ.1– 3 లక్షల మధ్య పాలసీలకు ఆలస్యపు రుసుంలో 25 శాతం (గరిష్టంగా రూ.2,500), రూ.3లక్షలకు పైన రిస్క్ కవర్‌తో కూడిన పాలసీలకు ఆలస్యపు రుసుంలో 30 శాతం (గరిష్టంగా రూ.3,000) తగ్గింపునిస్తోంది. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలకు అయితే ఆలస్యపు రుసుంలో పూర్తి రాయితీ ఇస్తోంది. అధిక రిస్క్ కవర్‌తో ఉంటే టర్మ్ ప్లాన ఆలస్యపు రుసుంలో తగ్గింపు ఉండదు. -
మార్చిలో ఎల్ఐసీ ఐపీవో
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ మార్చిలో వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను వచ్చే వారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించనుంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఈ విషయాలు వెల్లడించారు. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నుంచి అనుమతుల కోసం వేచిచూస్తున్నారని, అవి వచ్చాక షేర్ల విక్రయం తదితర అంశాలతో కూడిన ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేస్తారని పేర్కొన్నారు. సెబీ అనుమతులు కూడా వచ్చాక మార్చిలో లిస్టింగ్ ఇష్యూకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పాండే వివరించారు. ‘ఐఆ ర్డీఏఐ అనుమతులు వచ్చిన 7–10 రోజుల్లోగా ఎల్ఐసీ ఐపీవోకి సంబంధించి ప్రాస్పెక్టస్ దాఖలు అవుతుంది. సెబీతో ఇప్పటికే వివిధ అంశాలపై చర్చిస్తున్నాం. ఇష్యూ పరిమాణం తదితర అంశాలన్నీ డీఆర్‌హెచ్‌పీలో ఉంటాయి. ఐఆర్ఎఫ్సీ, రైల్‌టెల్ తరహాలోనే ఐపీవోలో కొంత భాగం యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు‘ అని ఆయన పేర్కొన్నారు. ఇష్యూలో సుమారు 10 శాతాన్ని పాలసీదారుల కోసం కేటాయించనున్నారు. ఎల్ఐసీ మెగా ఐపీవో నిర్వహణ కోసం గోల్డ్‌మన్ శాక్స్ (ఇండియా) సెక్యూరిటీస్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా తదితర 10 మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు ఎంపికయ్యాయి. ఎల్ఐసీ ఇష్యూ ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గతేడాది జూలైలో ఆమోదముద్ర వేసింది. ఎఫ్‌డీఐ పాలసీకి మార్పులు..: ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి సంబంధించి ఆర్థిక శాఖ అభిప్రాయాల మేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానానికి తగు మార్పులు చేస్తున్నట్లు పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు. సవరణలకు కేంద్ర కేబినెట్ త్వరలో ఆమోదముద్ర వేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సెబీ నిబంధనల ప్రకారం సాధారణంగా కంపెనీల పబ్లిక్ ఇష్యూల్లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) షేర్లను కొనుగోలు చేయవచ్చు. కాకపోతే ఎల్ఐసీది కార్పొరేషన్ హోదా కావడంతో ఎఫ్‌పీఐలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు షేర్లను కొనుగోలు చేసేందుకు ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించాల్సి ఉంటుందని జైన్ వివరించారు. టాప్ 3 బీమా బ్రాండ్‌గా ఎల్ఐసీ ఎల్ఐసీ గతేడాది దాదాపు 8.656 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 64,722 కోట్లు) బ్రాండ్ వేల్యుయేషన్‌తో పటిష్టమైన బీమా బ్రాండ్ల కేటగిరీలో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిల్చింది. అలాగే బీమా రంగానికి సంబంధించి అన్ని కేటగిరీలు కలిపి.. అత్యంత విలువైన బ్రాండ్లలో 10వ స్థానం దక్కించుకుంది. లండన్‌కి చెందిన బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం 2021లో అంతర్జాతీయంగా టాప్ 100 బీమా సంస్థల విలువ 6% క్షీణించింది. అయితే, ఎల్ఐసీ బ్రాండ్ విలువ మాత్రం 2020తో పోలిస్తే 6.8% పెరిగి, దేశంలోనే అత్యంత పటిష్టమైన, అతి పెద్ద బ్రాండ్‌గా మారింది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో 238వ స్థానం నుంచి 32 స్థానాలు ఎగబాకి 206వ ర్యాంకుకు చేరింది. బ్రాండ్ ఫైనాన్స్ ప్రకారం 2022లో ఎల్ఐసీ మార్కెట్ విలువ 2022లో 59.21 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 43.40 లక్షల కోట్లు), 2027 నాటికి 78.63 బిలియన్ డాలర్లకు (రూ. 58.9 లక్షల కోట్లు) చేరవచ్చని అంచనా. బీమా బ్రాండ్లలో చైనాకు చెందిన పింగ్ యాన్ టాప్‌లో ఉంది. -
ఐపీఓకి ముందు ఎల్ఐసీ కీలక నిర్ణయం..!
న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ భీమా రంగ సంస్థ ఎల్ఐసీ త్వరలో ఐపీఓకి వచ్చేందుకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి కీలక సమయంలో సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) చైర్మన్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ కుమార్ పదవీకాలాన్ని కూడా ప్రభుత్వం ఒక సంవత్సరం పొడిగించింది. ఈ పొడిగింపుతో ఎం.ఆర్. కుమార్ 2023 మార్చి వరకు ఛైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. ఎల్ఐసీ వైర్మన్ పదవీకాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి. గత ఏడాది జూన్‌లోనూ ఎం.ఆర్.కుమార్‌కు 9 నెలల పొడిగింపునిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఐపీఓకి వచ్చేందుకు ఎల్ఐసీ సిద్దం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రక్రియ సాఫీగా సాగాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎల్ఐసీ ఐపీఓకి వీలుగా లైఫ్ ఇన్ఫూరెన్స్ కార్పొరేషన్ చట్టానికి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్పులు చేసింది. అవన్నీ గత ఏడాది జూన్ 30 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎల్ఐసీ ఐపీఓలో జాబితా చేసిన తర్వాత రూ.8-10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువతో దేశంలో అతిపెద్ద సంస్థగా మారే అవకాశం ఉంది. (చదవండి: వామ్మో! సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మార్కెట్ విలువ ఇన్ని కోట్లా..!) -
మార్చికల్లా ఎల్ఐసీ ఐపీవో
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూని మార్చికల్లా చేపట్టే వీలున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇందుకు వీలుగా ఈ నెలాఖరుకల్లా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం సంబంధిత మంత్రివర్గంలోని అత్యున్నత అధికారులతో సమీక్ష నిర్వహించడం గమనార్హం! 2021 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలకు తుదిరూపునిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఫండ్ విభజన అంశం సైతం తుది దశకు చేరుకుంటున్నట్లు వెల్లడించాయి. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదట్లో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసే వీలున్నట్లు ఒక అధికారి తెలియజేశారు. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ముగిసేలోగా ఐపీవోను చేపట్టనున్నట్లు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా.. మార్చితో ముగియనున్న ఈ ఏడాదిలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 1.75 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఎల్ఐసీ ఐపీవో కీలకంగా నిలవనున్నట్లు పరిశ్రమ వర్గాలు వివరించాయి. -
యూజర్లకు ఎల్ఐసీ హెచ్చరిక!
న్యూఢిల్లీ: ఎల్ఐసీ Life Insurance Corporation పేరుతో వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ బీమా దిగ్గజం హెచ్చరించింది. ఎల్ఐసీ లోగోను చూపిస్తూ, ఆకర్షణీయమైన రాబడుల ప్రతిపాదనలతో వల వేసే విశ్వసనీయం కాని సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని యూజర్లను ఎల్ఐసీ కోరింది. విశ్వసనీయం కాని సంస్థలు ఎల్ఐసీ లోగోను సోషల్ మీడియాలో దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఒక నోటీసును జారీ చేసింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఎల్ఐసీ లోగోను చూపిస్తూ విశ్వసనీయం కాని సంస్థలు ఇచ్చే ప్రకటనలు, ప్రతిపాదనలకు ఆకర్షితులు కావద్దని కోరింది. ‘‘కొన్ని గుర్తు తెలియని సేవల సంస్థలు, ఏజెంట్లు.. వెబ్సైట్లు, యాప్‌లు సృష్టించి, బీమా, బీమా సలహా సేవలను ఎల్ఐసీ ట్రేడ్‌మార్క్ పేరుతో ఆఫర్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది’’ అని నోటీసులో పేర్కొంది. డేటాను చోరీ చేసే ఉద్దేశ్యంతో సాఫ్ట్వేర్, యాప్‌ల సాయంతో అనధికారికంగా ఎల్ఐసీ పోర్టల్‌కు అనుసంధానాన్ని కల్పిస్తున్నట్టు గుర్తించామని తెలిపింది. ఎల్ఐసీ ఉద్యోగులకు, పెన్షన్ పాలసీదారులకు గుడ్‌న్యూస్..! అలర్ట్: ఫేస్బుక్లో వీడియో లింక్‌తో గాలం, ఆపై.. -
ఎల్ఐసీ ఉద్యోగులకు, పెన్షన్ పాలసీదారులకు గుడ్‌న్యూస్..!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. వ్యక్తిగత పెన్షన్ ప్లాన్(ఐపీపీ) యాన్యుటర్లు, ఎల్ఐసీ సిబ్బంది పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను ఇక నుంచి ఆన్లైన్లోనే పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయడం కోసం ఎల్ఐసీ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎల్ఐసీ జీవన్ సాక్ష్య అనే మొబైల్ యాప్‌ని డౌన్లోడ్ చేయడం ద్వారా తేలికగా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయవచ్చు అని తెలిపింది. సకాలంలో పెన్షన్ పొందడానికి పెన్షనర్లు ప్రతి ఏటా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇక నుంచి సులభంగా ఈ యాప్ ద్వారా సులభంగా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయవచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని వినివగించడం కోసం పెన్షన్ పాలసీదారులు మీ ఆధార్ ఆధార్ నెంబరుని మొబైల్ నెంబరుకు లింక్ చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్‌ని ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. జీవన్ సాక్ష్య యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఇలా పొందండి: మొదట ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆన్లైన్లో మీ ఆధార్ కార్డు, పాలసీ వివరాలను నమోదు చేయండి. ఇప్పుడు మీరు మీ మొబైల్ ద్వారా ఒక సెల్ఫీ దిగి సబ్మిట్ చేయండి. వెంటనే మీ ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయండి. ఆ తర్వాత మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను డౌన్లోడ్ చేసుకోండి. "ఫెసిలిటేటర్" ఆప్షన్ ద్వారా కూడా మీ లైఫ్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. యాన్యుయిటెంట్లు/స్టాఫ్ పెన్షనర్లు కాకుండా వారి కుటుంబ సభ్యులు ఈ ఆప్షన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఫెసిలిటేటర్ ద్వారా మీ లైఫ్ సర్టిఫికెట్ ఇలా పొందండి: ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్‌లో ఫెసిలిటేటర్ సమాచారాన్ని నమోదు చేయండి. ఆ తర్వాత యాన్యుటెంట్/పెన్షనర్ ఆధార్ కార్డు, పాలసీ వివరాలను నమోదు చేయండి. ఇప్పుడు యాన్యుటెంట్/పెన్షనర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటిపిని వెరిఫై చేయండి. యాన్యుటెంట్/పెన్షనర్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ తీసి సబ్మిట్ చేయండి. ఇటీవల ఒక ప్రకటనలో, కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి గడువును పొడిగించింది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి గడువును ఇప్పుడు డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించారు. (చదవండి: 5జీ మొబైల్స్.. ఈ ఫీచర్స్‌తో ఈ మోడలే చాలా చీప్ అంట!) -
జీవిత బీమా ప్రీమియం ఆదాయంలో వృద్ధి
ముంబై: జీవిత బీమా కంపెనీలు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో మంచి పనితీరు చూపించాయి. మొదటి ఏడాది పాలసీల ప్రీమియం ఆదాయం 22.2 శాతం వృద్ధిని చూపించింది. రూ.31,001 కోట్ల ఆదాయం సమకూరింది. 2020 సెపె్టంబర్లో ఈ రూపంలో కంపెనీలకు వచ్చిన ఆదాయం రూ.25,336 కోట్లుగానే ఉంది. బీమా రంగంలోనే దిగ్గజ కంపెనీ ఎల్ఐసీ మొదటి ఏడాది ప్రీమియం సెప్టెంబర్ నెలలో 11.5 శాతం పెరిగింది. కానీ 2020 సెప్టెంబర్‌లో వృద్ధి 30 శాతంతో పోలిస్తే తగ్గినట్టు స్పష్టమవుతోంది. ఏప్రిల్–సెప్టెంబర్‌లోనూ మంచిపనితీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) జీవిత బీమా కంపెనీల తొలి ఏడాది ప్రీమియం (కొత్త పాలసీలకు సంబంధించి) 5.8 శాతం వృద్ధి చెంది రూ.1,31,982 కోట్లుగా నమోదైంది. కానీ అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో తొలి ఏడాది ప్రీమియం ఆదాయం 0.8 శాతం పడిపోవడం గమనార్హం. ఎల్ఐసీ తొలి ఏడాది ప్రీమియం ఆదాయం 3.3 శాతం తగ్గి రూ.85,113 కోట్లుగా ఉంది. అదే మిగిలిన ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీల తొలి పాలసీ ప్రీమియం ఆదాయం 27.7 శాతం వృద్ధి చెంది రూ.46,869 కోట్లకు చేరింది. -
చైనాకు కేంద్రం మరో షాక్ ఇవ్వనుందా..?
భారీ మొత్తంలో నిధులు సమీకరించేందుకు ప్రముఖ సంస్థలు ఐపీఓకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే చాలా ప్రైవేటు సంస్థలు ఐపీఓలో బహిరంగ మార్కెట్‌కు వెళ్లాయి. ఇటీవలే జొమాటో కూడా ఈ జాబితాలో చేరింది. భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సైతం ఐపీఓకు వెళ్లనుంది. ఎల్ఐసీలో తన వాటాను విక్రయించి రూ.80 వేల నుంచి రూ.90 వేల కోట్లు సమీకరించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఐపీఓ దేశం ఇంతకు ముందెన్నడూ చూడని అతిపెద్ద పెద్ద పబ్లిక్ ఇష్యూ కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(మార్చి 2022) ముగిసేనాటికి ఈ ప్రైవేటీకరణ కార్యక్రమం ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ ఐపీఓకు వెళ్లనున్న లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్ప్(ఎల్ఐసీ)లో చైనా పెట్టుబడిదారులు వాటాలను కొనుగోలు చేయకుండా నిరోధించాలని భారత్ చూస్తున్నట్లు నలుగురు సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఒక బ్యాంక్ అధికారి రాయిటర్స్ తో పేర్కొన్నారు. 12.2 బిలియన్ డాలర్ల విలువైన దేశంలో అతిపెద్ద ఐపీఓలో విదేశీ పెట్టుబడిదారులు పాల్గొనేందుకు అనుమతించాలని ప్రభుత్వం యోచిస్తున్నప్పటికీ చైనా పెట్టుబడిదారుల పట్ల కేంద్రం జాగ్రత్తగా ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. (చదవండి: కానిస్టేబుల్ ధైర్యానికి ఆనంద్ మహీంద్రా ఫిదా !) ఇప్పటికే ఐపీఓకు వెళ్లిన చాలా ప్రైవేటు సంస్థలలో చైనాకు చెందిన పెట్టుబదుదారులు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఐపీఓలో కూడా పెట్టుబడులు పెట్టె అవకాశం ఉంది. అందుకే, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎల్ఐసీ ఐపీఓలో చైనాకు చెందిన పెట్టుబడులను అనుమతించాలా? వద్దా? అనే విషయంలో కేంద్రం ఆలోచిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాజకీయ ఉద్రిక్తతలు గాల్వాన్ లోయలో సైనికులు ఘర్షణ తరువాత గత సంవత్సరం దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటి నుంచి చైనా పెట్టుబడి కంపెనీలు విషయంలో భారతదేశం ఆచితూచి వ్యవహరిస్తుంది. కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. చైనా మొబైల్ యాప్స్ నిషేధించింది. చైనా నుంచే దిగుమతి అయ్యే వస్తువులను అదనపు పరిశీలనకు గురిచేసింది. ఎల్ఐసీ వంటి సంస్థలలో చైనా పెట్టుబడులు ప్రమాదాలను కలిగిస్తాయని తెలిపారు. చైనా పెట్టుబడులను ఎలా నిరోధించవచ్చనే దానిపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ లోటు అడ్డంకులను పరిష్కరించాలనే లక్ష్యంతో మార్చితో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీలో 5 శాతం నుంచి 10 శాతం వరకు వాటా విక్రయించడం ద్వారా ₹90,000 కోట్లు సేకరించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత చట్టం ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు ఎవరూ ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టలేరు, కానీ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎల్ఐసీ విక్రయించే వాటాలో 20 శాతం వరకు కొనుగోలు చేయడానికి అనుమతించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎల్ఐసీ ఐపీఓను నిర్వహించడానికి గోల్డ్ మాన్ సాక్స్, సిటీ గ్రూప్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ సహా దాదాపు 10 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను కేంద్రం ఎంపిక చేసింది. -
ప్రతి రోజు రూ.200 పొదుపు చేస్తే రూ.28 లక్షలు మీ సొంతం
సురక్షితమైన రాబడిని అందించే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న పెట్టుబడిదారులకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అనేక కొత్త పాలసీలను తీసుకువస్తుంది. అందులో జీవన్ ప్రగతి పాలసీ ఒకటి. పెట్టుబడిదారులు తమ రిటైర్ మెంట్ లేదా వృద్ధాప్యం కొరకు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇది ఉతమమైన పాలసీ. ఎల్ఐసీ జీవన్ ప్రగతి పాలసీలో పెట్టుబడిదారులు ప్రతి నెలా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత పెద్ద మొత్తంలో రిటర్న్స్ అందించడంతో పాటు పెట్టుబడిదారులకు డెత్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పాలసీని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఎఐ) ఆమోదించింది. సేవింగ్స్ కమ్ ప్రొటెక్షన్ ఎండోమెంట్ ప్లాన్ అయిన ఈ పాలసీలో మెచ్యూరిటీ సమయంలో రూ.28 లక్షలు పొందాలంటే పెట్టుబడిదారులు ప్రతి నెలా సుమారు రూ.6000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే మీరు రోజుకు కనీసం రూ.200 ఆదా చేయాల్సి ఉంటుంది. ఒకవేల పెట్టుబడిదారుడు మరణించినట్లయితే ఆ మొత్తంను నామినీ ఖాతాకు క్రెడిట్ చేస్తారు. పాలసీ తీసుకున్న తర్వాత ఐదు సంవత్సరాల్లోపు పెట్టుబడిదారుడు మరణించినట్లయితే నామినీ ప్రాథమిక మొత్తంలో 100% బీమా పొందుతారు.(చదవండి: థర్మామీటర్ గడియారాలొస్తున్నాయ్!) రిస్క్ కవర్ ఈ పాలసీలో రిస్క్ కవర్ ప్రతి ఐదేళ్లకోసారి పెరుగుతుంది. మొదటి ఐదేళ్ల పెట్టుబడికి రిస్క్ కవర్ అదే ఉంటుంది. 6 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు ఇన్సూరెన్స్ రిస్క్ కవర్ 25 శాతం నుంచి 125 శాతానికి, 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు రిస్క్ కవర్ 150 శాతానికి, మీరు 20 ఏళ్ల వరకూ చెల్లిస్తూ మధ్యలో మనీ తీసుకోకపోతే మీకు రిస్క్ కవర్ 200 శాతానికి పెరుగుతుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి రూ.14 లక్షలకు పాలసీ తీసుకుంటే.. మొదటి ఐదేళ్ల వరకూ బీమా కవరేజీ అంతే ఉంటుంది. ఆ తర్వాత 6-10 మధ్య అది రూ.17.5 లక్షలు ఉంటుంది. అలాగే 11-15 ఏళ్ల మధ్య అది రూ.21 లక్షలు ఉంటుంది. 16-20 ఏళ్ల మధ్య బీమా కవరేజీ రూ.28 లక్షలు ఉంటుంది.(చదవండి: రూ.16వేల కోట్ల ఐపీఓ,పేటీఎం కొత్త స్ట్రాటజీ!) గరిష్ట వయోపరిమితి ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టాలంటే గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు వరకు ఉంది. ఈ పాలసీ కింద గరిష్ట ప్రయోజనాలను పొందడానికి పెట్టుబడిదారులు కనీసం 12 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మంచిది. ఎల్ఐసీ జీవన్ ప్రగతి పాలసీలో పెట్టుబడిదారులు గరిష్టంగా 20 ఏళ్ల పాటు పెట్టుబడులు పెట్టవచ్చు. మీరు 20 ఏళ్ల తర్వాత రూ.28 లక్షలు పొందాలంటే రూ.14 లక్షలకు పాలసీ తీసుకుంటే మంచిది. ఈ పాలసీ కింద ప్రతి రోజు రూ.200 జమ చేయాల్సి ఉంటుంది. -
ఎల్ఐసీ ఐపీవో నిర్వహణకు క్యూ
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ నిర్వహణకు మర్చంట్ బ్యాంకర్ సంస్థలు క్యూ కడుతున్నాయి. సుమారు 16 సంస్థలు ఇందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) వద్ద మంగళ, బుధవారాల్లో ఈ కంపెనీలు ప్రెజంటేషన్ ఇవ్వనున్నాయి. 23న ఐపీవో నిర్వహణ వివరాలు ఇవ్వనున్న విదేశీ బ్యాంకర్ల జాబితాలో బీఎన్పీ పరిబాస్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, డీఎస్పీ మెరిల్ లించ్, గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా, నోమురా ఫైనాన్షియల్ అడ్వయిజర్స్ ఉన్నాయి. ఈ బాటలో 24న యాక్సిస్ క్యాపిటల్, డీఏఎం క్యాపిటల్ అడ్వయిజర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్, కొటక్ మహీంద్రా క్యాపిటల్, ఎస్బీఐ క్యాపిటల్ ప్రెజంటేషన్‌ను ఇవ్వనున్నాయి. -
ఎల్ఐసీ నుంచి కొత్త హెల్త్ ఇన్ఫూరెన్స్ ప్లాన్
హైదరాబాద్: ఎల్ఐసీ "అరోగ్య రక్షక్" పేరుతో ఒక హెల్త్ ఇన్ఫూరెన్స్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ ఎం.జగన్నాథ్ బెంగళూరులో ఈ పాలసీని ప్రారంభించారు. నిర్దేశిత ఆరోగ్య సమస్యలకు ఈ ప్లాన్ స్థిరమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. ఒకే ప్లాన్‌లో కుటుంబ సభ్యులందరూ భాగం కావచ్చు. ఒక్కరే విడిగానూ తీసుకోవచ్చు. 18-45 ఏళ్ల వయసులోని వారు ఎవరైనా ప్లాన్‌ను ప్రాథమిక పాలసీదారుగా తీసుకోవచ్చు. ఇందులో 91 రోజుల నుంచి 20 ఏళ్ల వయసు పిల్లలకూ కవరేజీ ఉంటుంది. పిల్లలకు అయితే 25 ఏళ్లు వచ్చే వరకు, ఇతర కుటుంబ సభ్యులకు 80 ఏళ్లు వచ్చే వరకు రెన్యువల్ చేసుకోవచ్చు. తమకు అనుకూలమైన స్థిర ప్రయోజనాన్ని ఇందులో ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులోనూ పలు అష్టన్లు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరితే వైద్య ఖర్చులతో సంబంధం లేకుండా పాలసీదారు ఎంపిక చేసుకున్న మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఆటో స్టెపప్, నో శ్లేయమ్ బెనిఫిట్ రూపంలో కవరేజీ పెంచుకునేందుకు అవకాశం ఉంది. పాలసీదారు తనతో పాటు తన కుటుంబం అంతటికీ ప్లాన్‌ను తీసుకున్న తర్వాత.. ఏదేనీ కారణంతో ప్రాధమిక పాలసీదారు మరణించినట్టయితే, ఆ తర్వాత నుంచి ప్రీమియం చెల్లింపు రద్దయ్యే అప్షన్ కూడా ఉంది. రైడర్లు కూడా ఉన్నట్టు ఎల్ఐసీ తెలిపింది. -
బీమాకు ధీమా ఇవ్వని సవరణలు
జీవిత బీమా సంస్థ చట్టంలో లాభదాయకత అనే మాట వినబడదు. సర్ప్లస్ అనే ఉంటుంది. అంటే మిగులు. లాభాలే పరమావధిగా ఆ సంస్థను నెలకొల్పలేదు. అయినప్పటికీ సంస్థ ఏనాడూ నష్టాల్లో లేదు. జమాఖర్చులను పార్లమెంట్ ముందు విధిగా ఉంచుతోంది. ఏడాదిలో సుమారు పది లక్షల డెత్ క్లెయిమ్‌లు పరిష్కరించి రికార్డులు సృష్టించింది. ప్రైవేట్ బీమా కంపెనీల్లా కోవిడ్ నేపథ్యంలో ప్రీమియంలు పెంచలేదు. ఇలాంటి సంస్థలో 49 శాతం వాటాలు అమ్మడానికి కేంద్రం మార్గం సుగమం చేసి, ఇది ప్రైవేటీకరణ కాదని చెబుతోంది. విదేశాల్లో ఎన్నో బీమా కంపెనీలు లాభాల కోసం విచక్షణారహితంగా పెట్టుబడులు పెట్టి, పాలసీదారులకు నష్టాలే మిగిల్చాయి. ఈ పాఠాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన ఎల్ఐసీ చట్ట సవరణ బిల్లుపై గెజిట్ విడుదల చేసింది. ఈ అంశంపై అనేక పత్రికలలో వార్తలు వస్తున్నాయి. 1956లో పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థగా ఆవిర్భవించిన జీవిత బీమా సంస్థ– లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఇప్పటిదాకా 100 శాతం ప్రభుత్వ సంస్థగానే ఉంది. ప్రభుత్వం ఎల్ఐసీ చట్టానికి ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో)) ఆమోదించిన 27 సవరణల కారణంగా ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవడానికీ, సంస్థలో ప్రభుత్వ వాటాలు అమ్మడానికీ వీలు కలిగింది. అలాగే ఎల్ఐసీ సెబీ పరిధిలోకి రావడానికి ఈ సవరణలు వీలు కల్పించాయి. భవిష్యత్‌లో 3 నెలలకు ఒకసారి లాభ, నష్టాలకు సంబంధించిన త్రైమాసిక నివే దికలు విడుదల చేయాల్సి వుంటుంది. ఇప్పటికే తన పనితీరు గురించిన నివేదికలను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ (ఇన్సూ రెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ)కి క్రమం తప్ప కుండా పంపుతోంది. పార్లమెంట్ ముందు జమాఖర్చులను ప్రతీ ఏడాది ప్రవేశపెడుతోంది. కనుక, ఈ సవరణల మూలంగా కొత్తగా జరిగేదేమీ లేదు. కేంద్రప్రభుత్వం ఎల్ఐసీని దేశీయ స్టాక్ మార్కెట్లోనే గాక, విదేశీ స్టాక్ ఎక్సే్చంజీలలో కూడా లిస్టింగ్ చేసే ప్రక్రియలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న దీపంకు సలహా దారులుగా డెలాయిట్ కంపెనీ, ఎస్బీఐ కాప్స్ కంపెనీలను గతేడాది నియమించింది. సెబీ మార్గదర్శకాల ప్రకారం ఏ సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలన్నా, దానిలో ఉన్న వాటాలలో కనీసం 25 శాతం పబ్లిక్ ఇష్యూ రూపేణా విడుదల చేయాలి. ఎల్ఐసీ ఐపీఓ సందర్భంగా ఈ నిబంధనకూ మినహాయింపు ఇచ్చారు. పెట్టుబడులు ఉపసంహరించాలంటే ముందుగా ఆస్తుల మూల్యాం కనం చేపట్టాలి. ప్రభుత్వం మూల్యాంకనం జరపడానికి మిల్లిమాన్ సంస్థను నియ మించింది. ఎస్బీఐ పూర్వ ఎండీ, ఎస్బీఐ లైఫ్ పూర్వ సీఈఓ–ఎండీ అయిన ఆర్జిత్ బసును ఐపీఓకు సహకరించేందుకు కన్సల్టెంట్‌గా తాజాగా ఎల్ఐసీ నియమించుకుంది. ఎల్ఐసీ చట్టానికి చేసిన 27 సవరణల ప్రకారం, ప్రస్తుతం సంస్థకు ఉన్న రూ. 100 కోట్ల మూలధనాన్ని రూ. 25 వేల కోట్ల ఆథరైజ్డ్ కాపిటల్ (అనగా 2500 కోట్ల షేర్లు, షేర్ ముఖవిలువ 10 రూపాయల చొప్పున) కింద పెంచుతారు. సంస్థలో ప్రభుత్వ వాటా రాబోయే ఐదేళ్లలో 75 శాతం మేరకు ఉంచుకోవాలనీ, ఆ తర్వాత 51 శాతం వాటాకు పరిమితం కావాలనీ సవరణలలో ప్రస్తావించారు. అంటే, చాలా స్పష్టంగా 5 ఏళ్ళకాలంలో 49 శాతం వరకు ప్రభుత్వ పెట్టుబడులు అమ్మి వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఐపీఓ చేపట్టడం, ప్రైవేటీకరణ కాదని, కేవలం వాటాలు అమ్మడం మాత్రమే అని ప్రభుత్వం పదే పదే చెప్తోంది. ఒక పక్క ఐదేళ్లలో 49 శాతం వాటాలు అమ్మడానికి మార్గం సుగమం చేసి, ఇది ప్రైవేటీకరణ కాదని చెప్పడం సమంజసమా? ఇది సంస్థ ప్రైవేటీకరణ దిశగా పడిన తొలి అడుగుగా భావించాలి. ఎల్ఐసీ చట్టం–1956ను పరిశీలిస్తే ఎక్కడా లాభదాయకత అనే మాట కనపడదు. కేవలం సర్ప్లస్ అనే మాట కనపడుతుంది. ఇప్పటిదాకా వచ్చిన సర్‌ప్లస్‌లో పాలసీదారులకు 95 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 5 శాతం డివిడెండుగా చెల్లిస్తున్నారు. తాజా చట్ట సవ రణల మూలంగా మిగులుపంపిణీ విధానం వలన పాలసీదారులకు సర్‌ప్లస్‌లో 90 శాతం వాటా (లేదా బోర్డ్ నిర్దేశించిన అధిక మొత్తం) ఉంటుంది. మిగిలిన 10 శాతం లోంచి కేంద్రానికి, షేర్హోల్డర్స్కు చెల్లిస్తారు. పాలసీదారులకు బోనస్‌లు తగ్గకుండా ఎల్ఐసీ బోర్డు నూతన మార్గాలు అన్వేషిస్తుందని ప్రభుత్వ సమర్థకులు సర్ది చెప్తు న్నారు. అయితే, లాభాల బాటలో సంస్థను నడిపించడం కోసం సంస్థ కున్న సామాజిక బీమా లక్ష్యాలను నిర్వీర్యం చేస్తారేమో అనే అను మానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా చట్ట సవరణలలో పాలసీదారులకు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) రూపేణా 10 శాతం షేర్లు ఇస్తామని ప్రకటించారు. ఆథరైజ్డ్ క్యాపిటల్ రూ. 25,000 కోట్లకు పెంచుతారు గనుక, పది శాతం షేర్లు విక్రయించినా, రూ. 2,500 కోట్ల విలువైన షేర్లు అమ్ము తారు. అంటే 10 రూపాయల ముఖవిలువ కలిగిన, 250 కోట్ల షేర్లను ఐపీఓ రూపేణా మార్కెట్లోకి విడుదల చేస్తారు. వీటిలో 10 శాతం అంటే 25 కోట్ల షేర్లు పాలసీదారులకు ఇస్తామని ఆశ పెడుతున్నారు. 40 కోట్ల పాలసీదారులలో ఎంతమందికి ఐపీఓ లాటరీలో షేర్లు దక్కుతాయో తెలియని పరిస్థితి. నేతి బీరకాయలో నెయ్యి లేదనేది ఎంత నిజమో, లిస్టింగ్ వలన పాలసీదారులకు లాభం లేదనేది అంతే నిజం. ఎల్ఐసీ బోర్డును పునర్ వ్యవస్థీకరించారు. బోర్డులో ఒక మహిళా డైరెక్టర్‌తో సహా, 15 మంది డైరెక్టర్లకు స్థానం కల్పించారు. ఇద్దరు కేంద్రప్రభుత్వ సహాయ కార్యదర్శి ర్యాంక్ అధికారులు ఉంటారు. వీరిని గాక ఇద్దరిని కేంద్రప్రభుత్వం నియమిస్తుంది. ఈ చర్యలన్నీ పాలసీదారులకు, షేర్హోల్డర్లకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి అని చెప్తున్నారు. కార్పొరేట్ నిర్వహణలో ఎల్ఐసీ ఇప్పటికే లిస్టెడ్ కంపెనీలను తోసిరాజని రికార్డులు, కితాబులు సాధించింది. కాబట్టి, బోర్డ్ పునర్ వ్యవస్థీకరణ వల్ల కొత్తగా ఒరిగేదేమీ లేదు. కోవిడ్ నేప«థ్యంలో క్లెయిమ్‌లు పెరుగుతున్నాయని ఈ మధ్య కాలంలో ప్రైవేటు బీమా కంపెనీలు ప్రీమియంలను భారీగా పెంచాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 8 లక్షల డెత్ క్లెయిమ్‌లను ఎల్ఐసీ పరిష్కరించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 9.56 లక్షల డెత్ క్లెయిములను (రూ. 2.19 కోట్ల మొత్తం) పరిష్కరించి తన రికార్డులను తానే బద్దలు కొట్టి, ప్రపంచ రికార్డులను సృష్టించింది. సగటున ఏడాదికి 20,000 లోపు క్లెయిములు చెల్లించే ప్రైవేటు బీమా కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను 25 నుండి 40 శాతానికి పెంచినా, దాదాపు 10 లక్షల డెత్ క్లెయిమ్‌లను చెల్లించే ఎల్ఐసీ మాత్రం ప్రీమియంలను పెంచకపోవడం గమనార్హం. సంస్థకు సామా జిక దృక్పథం ఉండడం వల్లే, ప్రజలకు ఈవిధంగా సేవలు అంది స్తోంది. ఎల్ఐసీలో వాటాలను కొనే మదుపుదారులు లాభాలను ఆర్జించి కొంటారు తప్ప, దేశ ప్రయోజనాల కోసం కొనరని ప్రా«థమిక పరి జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. సంస్థలో పెట్టుబడులు ఉపసంహరించే చర్య భారత ఆర్థిక వ్యవస్థకు భంగకరమే గాక, షేర్హోల్డర్స్కు అధిక లాభాలను అందించడం కోసం దృష్టి పెట్ట వలసి వస్తుంది. దీనివల్ల బలహీన వర్గాలకు బీమా సౌకర్యాన్ని అందించే సామాజిక లక్ష్యం కుంటుపడుతుంది. దీంతో జాతీయ ఆర్థిక వ్యవస్థకూ, దేశ జనాభాలో పేద వర్గాల ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలుగుతుంది. అమెరికా, అనేక యూరోపియన్ దేశాల్లో ప్రైవేటు బీమా కంపెనీలు విచక్షణారహితంగా పెట్టుబడులు పెట్టడం వల్లనే, ఆయా దేశాల్లో బీమా కంపెనీలు మునిగిపోయి, పాలసీదారులు నష్టపోయారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇటువంటి పరిణా మాలు చూసైనా ఎల్ఐసీని లిస్టింగ్ చేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలి.ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం లిస్టింగ్ ప్రతి పాదన విడనాడి, బీమా ప్రీమియంపై భారంగా మారిన జీఎస్టీని తొల గించి, ఎల్ఐసీ బలోపేతానికి చర్యలు చేపడితే అది పాలసీదారులకు శ్రేయస్కరం. వ్యాసకర్త ఎల్ఐసీ ఉద్యోగుల సంఘ నాయకులు మొబైల్ : 94417 97900 -
ఎల్ఐసీలో కొత్తగా సీఈవో పోస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూకి సంబంధించి కేంద్రం చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలో చైర్మన్ పోస్టును చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా మారుస్తూ సంబంధిత నిబంధనలకు మార్పులు చేసింది. దీని ప్రకారం ఇకపై ఎల్ఐసీకి సీఈవో, ఎండీ మాత్రమే ఉండనున్నారు. జూలై 7న ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత విధానం ప్రకారం ఎల్ఐసీలో ఒక చైర్మన్, నలుగురు ఎండీల విధానం అమల్లో ఉంది. ఎల్ఐసీ లిస్టింగ్‌కు మార్గం సుగమం చేసే దిశగా కంపెనీ అధీకృత షేర్ క్యాపిటల్‌ను రూ. 25,000 కోట్లకు పెంచే ప్రతిపాదనకు కూడా కేంద్రం ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. -
ప్రీమియం వసూళ్లలో ఎల్ఐసీ రికార్డు
ముంబై: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. మధ్యతరగతి కుటుంబాల్లో ఎల్ఐసీ పాలసీ తీసుకొని ఫ్యామిలీ ఉండదంటే అతిశయోక్తి కాదు. మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు ప్రతీ చిన్న పల్లెకు ఎల్ఐసీ విస్తరించింది. తాజాగా ఎల్ఐసీ మరో రికార్డు సృష్టించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ పాలసీల ద్వారా కలెక్ట్ చేసిన ప్రీమియం విలువ ఒక లక్షా 84 వేల కోట్ల రూపాయలపైనే ఉంటుంది. అలాగే, ప్రభుత్వ బీమా సంస్థ పాలసీదారులకు రూ.1.34 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌లను ఈ సంవత్సరంలో చెల్లించింది. ఎల్ఐసీ స్థాపించిననాటి నుంచి ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రికార్డు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు అమ్మిన పాలసీల్లో ఎల్ఐసీ వాటా 74.58 శాతం. 2021 మార్చిలో ఎల్ఐసీ పాలసీల మార్కెట్ షేర్ 81.04 శాతం. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం, లాక్డౌన్ కాలంలో కూడా ఎల్ఐసీ కొత్త ప్రీమియం కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించడం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలో 10.11 శాతం వృద్ధితో ఎల్ఐసి వ్యక్తిగత హామీ వ్యాపారం కింద మొదటి సంవత్సరం ప్రీమియం ఆదాయాన్ని 56,406 కోట్ల రూపాయలుగా ఆర్జించింది. పెన్షన్, గ్రూప్ స్కీమ్స్‌లో కూడా రికార్డులు సృష్టించినట్టు ఎల్ఐసీ ప్రకటించింది. కొత్త బిజినెస్ ప్రీమియం రూ.1,27,768 కోట్లు సేకరించినట్టు తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రీమియం రూ.1,26,749 కోట్లు. యూనిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ బిజినెస్‌లో ఎల్ఐసీ ఎస్ఐఐపీ, నివేష్ ప్లస్ పాలసీలను పరిచయం చేసింది. చదవండి: యూఏఎన్ నంబర్ లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా? -
ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణకు అవకాశం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలోనూ పాలసీదారులు తమ రిస్క్ కవర్‌ను కొనసాగించుకునేందుకు వీలుగా ఎల్ఐసీ మరోసారి పెద్ద మనసు చేసుకుంది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవచ్చంటూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. మార్చి 6 వరకు ఇది కొనసాగనుంది. కొన్ని షరతుల మేరకు పాలసీదారులు తమ ల్యాప్స్ అయిన పాలసీలను మార్చి 6 వరకు పునరుద్ధరించుకోవచ్చు. పాలసీదారులు నిర్దేశిత గడువులోపు పాలసీ ప్రీమియం చెల్లించకపోతే అవి ల్యాప్స్ (రద్దు) అవుతాయి. ఇలా ల్యాప్స్ అయిన పాలసీలను ఇప్పుడు పునరుద్ధరించుకోవడం ద్వారా బీమా కవరేజీ కొనసాగేలా చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎల్ఐసీకి చెందిన 1,526 శాటిలైట్ కార్యాలయాల నుంచి సైతం పాలసీదారులు తమ ల్యాప్స్డ్ పాలసీలను పునరుద్ధరించుకోవచ్చని ఎల్ఐసీ తెలిపింది. ప్రీమియం చెల్లించని ఏడాది నుంచి గరిష్టంగా ఐదేళ్లలోపు ల్యాప్స్ అయిన వాటికి ఈ అవకాశం ఉంటుందని ఎల్ఐసీ స్పష్టం చేసింది. కోవిడ్–19 ప్రశ్నావళికితోడు, తమ ఆరోగ్య స్థితి మంచిగానే ఉందన్న స్వీయ ధ్రువీకరణ తీసుకోవడం ద్వారా పాలసీలను పునరుద్ధరించనున్నట్టు తెలిపింది. ఆలస్యపు ఫీజులో 20 శాతం రాయితీ ఇస్తున్నట్టు.. లేదా పునరుద్ధరణకు రూ.2,000 చార్జీ తీసుకోనున్నట్టు పేర్కొంది. -
ఎల్ఐసీ.. షంషేర్!
కరోనా కల్లోలం ఆర్థిక స్థితిగతులను అతలాకుతలం చేసింది. కానీ ఎల్ఐసీకి మాత్రం స్టాక్ మార్కెట్లో లాభాల పంట పండించింది. మార్చిలో కనిష్ట స్థాయికి పడిపోయిన స్టాక్ మార్కెట్ మెల్లమెల్లగా రికవరీ అయి ప్రస్తుతం జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్‌లు సృష్టిస్తోంది. మార్కెట్ పతన సమయంలో కొని, పెరుగుతున్నప్పుడు విక్రయించే ‘కాంట్రా’ వ్యూహాన్ని అమలు చేసే ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ కూడా జీవిత కాల గరిష్ట స్థాయికి చేరాయి. కల్లోల కంపెనీల నుంచి వైదొలగడం, వృద్ధి బాటన ఉన్న కంపెనీల్లో వాటాలను పెంచుకోవడం ద్వారా ఎల్ఐసీ మంచి లాభాలు కళ్లజూస్తోంది. ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్‌కు సంబంధించి సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... భారత్‌లో అతి పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ ఎల్ఐసీనే. ఈ జీవిత బీమా దిగ్గజం ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఈ ఆర్థిక సంవత్సరంలో జోరుగా పెరిగి రికార్డ్ స్థాయికి చేరింది. భారత్‌లోని టాప్ 200 కంపెనీల్లో ఎల్‌ఐసీకున్న వాటాల విలువ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 7,700 కోట్ల డాలర్లకు ఎగసిందని అంచనా. సెప్టెంబర్ నుంచి చూస్తే, మార్కెట్ 12 శాతం మేర పెరిగింది. దీంతో ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ కూడా ఆ రేంజ్‌లోనే పెరిగాయి. వీటి విలువ ప్రస్తుతం 8,600 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.6.45 లక్షల కోట్లు) పెరిగి ఉండొచ్చని అంచనా. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. దీంతో 2018 మార్చినాటి 8,400 కోట్ల డా లర్ల అత్యధిక ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ రికార్డ్ బ్రేక్ అయినట్లే. ఆర్నెల్లలో 40 శాతం అప్... కరోనా కల్లోలం కారణంగా ఈ ఏడాది మార్చిలో స్టాక్ మార్కెట్ బాగా నష్టపోయింది. దీంతో ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ 5,500 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఆశాజనక వార్తలు రావడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటుండటంతో స్టాక్ మార్కెట్ రికవరీ బాట పట్టింది. ప్రస్తుతం స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ హైల వద్ద ట్రేడవుతున్నాయి. స్టాక్ మార్కెట్ రికవరీ కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌నాటికి ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ 40 శాతం (2,200 కోట్ల డాలర్లు–లక్షన్నర కోట్లకు మించి)ఎగసి 7,700 కోట్ల డాలర్లకు(రూ.5.7 లక్షల కోట్లకు )చేరింది. కంపెనీల్లో ఎల్ఐసీ వాటా పెరగడం, కంపెనీల్లో ఉన్న ఎల్ఐసీ వాటాల విలువ కూడా పెరగడం దీనికి ప్రధాన కారణాలు. జూన్ 30 నాటికి ఎల్ఐసీకి దాదాపు 329 కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ఎల్ఐసీ ఇన్వెస్ట్ చేసిన మొత్తం షేర్లలో 96 శాతం సానుకూల రాబడులనిచ్చాయి. ఎల్ఐసీ...మంచి కాంట్రా ప్లేయర్! ఈ ఏడాది ఏప్రిల్ నుంచి షేర్లలో ఇప్పటివరకూ రూ.55,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని ఎల్ఐసీ ఉన్నతాధికారొకరు చెప్పారు. గత ఏడాది ఇదే కాలానికి రూ. 32,800 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఎల్ఐసీకి మంచి కాంట్రా ప్లేయర్ అనే పేరు ఉంది. అంటే మార్కెట్ పతనసమయంలో ఇన్వెస్ట్ చేసి మార్కెట్ పెరుగుతున్న సమయంలో అమ్మేసి లాభాలు చేసుకుంటుంది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్ 40% పతనం కావడం, వెంటనే రికవరీ కావడం కూడా ఎల్ఐసీకి కలసివచ్చింది. ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి చూస్తే రూ.10,000 కోట్ల లాభం ఆర్జించామని ఎల్ఐసీ చైర్మన్ ఎమ్ఆర్ కుమార్ ఈ ఏడాది ఆగస్టులోనే వెల్లడించారు. ఇక ఇప్పుడు స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ హైల వద్ద ట్రేడవుతుండటంతో ఎల్ఐసీకి భారీ లాభాలు వచ్చి ఉంటాయని నిపుణుల అంచనా. బీమా కంపెనీలకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కీలకమని నిపుణుల అభిప్రాయం. అందుకే నాణ్యత గల షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎల్ఐసీ మంచి లాభాలు కళ్లజూస్తోందని వారంటున్నారు. తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల నుంచి ఎల్ఐసీ తన వాటాలను తగ్గించుకుంటోంది. అధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతోంది. 1 శాతం కంటే తక్కువ వాటా ఉన్న 33 కంపెనీల నుంచి వైదొలగింది. గతంలో యస్‌బ్యాంక్‌లో ఎల్ఐసీ వాటా 8 శాతంగా ఉంది. ఎప్పుడైతే ఈ బ్యాంక్‌కు సంబంధించిన సమస్యలు వెలుగులోకి రావడం ఆరంభమైందో, ఆ బ్యాంక్‌లో తన వాటాను ఎల్ఐసీ 1.64%కి తగ్గించుకుంది. యస్‌బ్యాంక్‌లో ఎస్బీఐతో సహా మరిన్ని ప్రభుత్వ బ్యాంక్‌లు పెట్టుబడులు పెట్టడంతో మళ్లీ యస్‌బ్యాంక్‌లో వాటాను 4.99%కి పెంచుకుంది. మరోవైపు మంచి ఫలితాలు సాధిస్తున్న కంపెనీల్లో తన వాటాలను పెంచుకుంటోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్సూమర్, శ్రీ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్‌ల్లో తన వాటాను మరింతగా పెంచుకుంది. మెగా ఐపీఓకు రంగం సిద్ధం... భారత జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసీ వాటా దాదాపు 76%. త్వరలో ఎల్ఐసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌లో ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. ఎల్ఐసీ ఐపీఓ సైజు రూ.80,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఎల్ఐసీ విలువ రూ.10 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్ల రేంజ్లో ఉం డొచ్చని భావిస్తున్నారు. -
ఎల్ఐసీ ప్రీమియం గడువు పొడిగింపు
ముంబై: కోవిడ్–19 కారణంగా వాయిదాల చెల్లింపు గడువును 30 రోజుల పాటు పెంచుతున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా పాలసీదారులు సమస్యలు ఎదుర్కొంటున్నందున మార్చి, ఏప్రిల్ గడువుల చెల్లింపులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. గ్రేస్ పీరియడ్ మార్చి 22తో ముగిసినా ఏప్రిల్ 15వరకూ అనుమతిస్తున్నట్లు తెలిపింది. సర్వీసు చార్జీలు లేకుండా ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించవచ్చని పేర్కొంది. మొబైల్ యాప్ ఎల్ఐసీ పే డైరెక్ట్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, భీమ్, యూపీఐల ద్వారా చెల్లించవ్చని తెలిపింది. ఐడీబీఐ, యాక్సిస్ బ్యాంకుల వద్ద, కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్సీ)ల ద్వారా ప్రీమియం చెల్లించవచ్చని పేర్కొంది. కోవిడ్ –19తో మరణించిన 16 మంది పాలసీదారుల సంబంధీకులకు డబ్బులు చెల్లించినట్లు స్పష్టం చేసింది. అదేవిధంగా, మార్చి, ఏప్రిల్, మే నెలలకు చెల్లించాల్సిన బీమా ప్రీమియంను జూన్ 30 వరకూ పెనాల్టీ లేకుండానే చెల్లించవచ్చని తపాశాల శాఖ ప్రకటించింది. వీటిలో పోస్టల్ లైఫ్ న్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలున్నాయి. రిజిస్టర్డ్ పోర్టల్ ద్వారా వినియోగదారులు ప్రీమియం చెల్లించవచ్చని పేర్కొంది. -
ప్రీమియంల చెల్లింపునకు మరో 30 రోజుల వ్యవధి
న్యూఢిల్లీ: కరోనావైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జీవిత బీమా పాలసీదారులకు ప్రీమియంల చెల్లింపు విషయంలో వెసులుబాటునిస్తూ బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిర్ణయం తీసుకుంది. మార్చి, ఏప్రిల్‌లో కట్టాల్సిన రెన్యువల్ ప్రీమియంలకు సంబంధించి పాలసీదారులకు మరో 30 రోజుల వ్యవధి ఉంటుందని వెల్లడించింది. జీవిత బీమా సంస్థలు, లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ విజ్ఞప్తుల మేరకు తాజా నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య బీమా, వాహన థర్డ్ పార్టీ బీమా పాలసీలకు ఐఆర్డీఏఐ ఇప్పటికే ఈ వెసులుబాటు ప్రకటించింది. మార్చి 25 – ఏప్రిల్ 14 మధ్య కట్టాల్సిన మోటార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఏప్రిల్ 21లోగా చెల్లించవచ్చని వెసులుబాటు ఇచ్చింది. ఈ వ్యవధిలో రిస్క్ కవర్ కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు, నియంత్రణ సంస్థకు బీమా రంగ సంస్థలు సమర్పించాల్సిన రిటర్న్స్ విషయంలోనూ మరికాస్త వ్యవధినిచ్చింది. నెలవారీ రిటర్న్‌లకు అదనంగా 15 రోజులు, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక రిటర్నులు సమర్పించేందుకు 30 రోజుల వ్యవధి లభిస్తుంది. -
పాలసీదారులకు ఎల్ఐసీ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ తాజాగా రెండేళ్ల పైబడి ల్యాప్స్ అయిన పాలసీలను కూడా పునరుద్ధరించుకునే వెసులుబాటు ప్రకటించింది. 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం సాధారణంగా ప్రీమియం చెల్లింపులు ఆపేసిన నాటి నుంచి రెండేళ్ల లోపు మాత్రమే రివైవల్‌కి అవకాశం ఉంది. 2014 జనవరి 1 తర్వాత తీసుకున్న పాలసీలు ల్యాప్స్ అయి రెండేళ్లు దాటిపోతే.. పునరుద్ధరణకు వెసులుబాటు లేదు. అయితే, పాలసీదారులకు జీవిత బీమా కవరేజీ ప్రయోజనాలు లభించేలా వీటిని కూడా రివైవ్ చేసే అవకాశం కల్పించాలంటూ ఐఆర్‌డీఏఐని ఎల్ఐసీ కోరింది. దానికి అనుగుణంగానే తాజా మార్పులు చేసింది. వీటి ప్రకారం.. 2014 జనవరి 1 తర్వాత పాలసీలు తీసుకున్న వారు నాన్–లింక్డ్ పాలసీలను అయిదేళ్ల లోపు, యూనిట్ లింక్డ్ పాలసీలను మూడేళ్ల లోపు పునరుద్ధరించుకోవచ్చు. -
బతికున్నవారిని చనిపోయినట్లుగా చూపి..
సాక్షి, హైదరాబాద్: బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపి, బీమా డబ్బును జేబులో వేసుకున్నారు సూర్యాపేట జిల్లా కోదాడ ఎల్.ఐ.సి సిబ్బంది. ఏజెంట్లతోపాటు అధికారులు కుమ్మక్కయిన ఈ కుంభకోణంలో మొత్తం రూ.3.13 కోట్ల ఎల్.ఐ.సి. డబ్బును అక్రమంగా తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. వివరాలు.. కోదాడ ఎల్.ఐ.సి కార్యాల యంలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసే బానోత్ బీకూనాయక్, హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్ గులోతు హర్యా (ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు) మరో ఉద్యోగి పి.రఘుచారి 8 మంది ఎల్.ఐ.సి. ఏజెంట్లతో కుమ్మక్కు అయ్యారు. నకిలీ మరణ ధ్రువీకరణపత్రాలు సృష్టించి వాటి ఆధారంగా ఎల్.ఐ.సి.కి చెందిన రూ.3,13,78,733 డ్రా చేసుకున్నారు. పత్రా ల్లో పేర్కొన్న నామినీల బ్యాంకు ఖాతాల్లో కాకుండా సొంత ఖాతాల్లోకి డబ్బును మళ్లించుకున్నారు. సొంత తండ్రినీ వదల్లేదు.. 2006 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు 190 నకిలీ పాలసీలు సృష్టించి రూ.3 కోట్లకుపైగా తమ జేబులో వేసుకున్నారు. ప్రధాన నిందితుడు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బీకూ నాయక్ తన తం డ్రి బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించడం గమనార్హం. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన కోదాడ ఎల్.ఐ.సి. చీఫ్ మేనేజర్ ఎడ్ల వెంకటేశ్వర్రావు విచారణ జరిపారు. అంతర్గత విచారణంలో వీరి భాగోతాలు వెలుగుచూశాయి. దీంతో ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించాలని సీబీఐకి ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో బీకూనాయక్, గుగులోత్ హర్యా, ఏజెంట్లు పి.రఘుచారి, ఎ.కొండయ్య, పి.సురేశ్, ఎం.దానమూర్తి, టి.సరేందర్రెడ్డి, బి.విజయ్‌కుమార్, వి.సైదాచారి, భూక్యా రవి, కల్వకుంట్ల వెంకన్నలపై ఐపీసీ 120(బి), 409, 420, 465, 467, 468, 471, 477(ఎ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
‘బీమా’లో ఎఫ్‌డీఐ పరిమితి పెంపునకు ఎల్ఐసీ ఓకే!
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వ దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తన మద్దతును తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పరిమితి 26 శాతంగా ఉంది. ఇటీవల జరిగిన సెలక్ట్ కమిటీ సమావేశాల్లో ఎల్ఐసీ చైర్మన్ ఎస్కే రాయ్ పరిమితి పెంపునకు సానుకూలంగా తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే 15 మంది సభ్యుల సెలక్ట్ కమిటీలోని ఒక వర్గం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇంతక్రితం ఎఫ్‌డీఐ పరిమితి పెంపును వ్యతిరేకించిన ఎల్ఐసీ తాజాగా తన ధోరణిని ఎందుకు మార్చుకుందన్న అంశంపై సమావేశంలో వాడివేడి చర్చ జరిగినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీనికి రాజకీయ పరమైన ఒత్తిడులూ కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న బీమా బిల్లుపై నవంబర్ చివరి వారంలో తమ నివేదిక సమర్పించడానికి కమిటీ ప్రయత్నిస్తుందని సమావేశం అనంతరం చైర్మన్ చందన్ మిశ్రా అన్నారు.