భారీ మొత్తంలో నిధులు సమీకరించేందుకు ప్రముఖ సంస్థలు ఐపీఓకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే చాలా ప్రైవేటు సంస్థలు ఐపీఓలో బహిరంగ మార్కెట్‌కు వెళ్లాయి. ఇటీవలే జొమాటో కూడా ఈ జాబితాలో చేరింది. భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సైతం ఐపీఓకు వెళ్లనుంది. ఎల్ఐసీలో తన వాటాను విక్రయించి రూ.80 వేల నుంచి రూ.90 వేల కోట్లు సమీకరించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఐపీఓ దేశం ఇంతకు ముందెన్నడూ చూడని అతిపెద్ద పెద్ద పబ్లిక్ ఇష్యూ కానుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(మార్చి 2022) ముగిసేనాటికి ఈ ప్రైవేటీకరణ కార్యక్రమం ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ ఐపీఓకు వెళ్లనున్న లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్ప్(ఎల్ఐసీ)లో చైనా పెట్టుబడిదారులు వాటాలను కొనుగోలు చేయకుండా నిరోధించాలని భారత్ చూస్తున్నట్లు నలుగురు సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఒక బ్యాంక్ అధికారి రాయిటర్స్ తో పేర్కొన్నారు. 12.2 బిలియన్ డాలర్ల విలువైన దేశంలో అతిపెద్ద ఐపీఓలో విదేశీ పెట్టుబడిదారులు పాల్గొనేందుకు అనుమతించాలని ప్రభుత్వం యోచిస్తున్నప్పటికీ చైనా పెట్టుబడిదారుల పట్ల కేంద్రం జాగ్రత్తగా ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. (చదవండి: కానిస్టేబుల్ ధైర్యానికి ఆనంద్ మహీంద్రా ఫిదా !)
ఇప్పటికే ఐపీఓకు వెళ్లిన చాలా ప్రైవేటు సంస్థలలో చైనాకు చెందిన పెట్టుబదుదారులు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఐపీఓలో కూడా పెట్టుబడులు పెట్టె అవకాశం ఉంది. అందుకే, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎల్ఐసీ ఐపీఓలో చైనాకు చెందిన పెట్టుబడులను అనుమతించాలా? వద్దా? అనే విషయంలో కేంద్రం ఆలోచిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రాజకీయ ఉద్రిక్తతలు
గాల్వాన్ లోయలో సైనికులు ఘర్షణ తరువాత గత సంవత్సరం దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటి నుంచి చైనా పెట్టుబడి కంపెనీలు విషయంలో భారతదేశం ఆచితూచి వ్యవహరిస్తుంది. కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. చైనా మొబైల్ యాప్స్ నిషేధించింది. చైనా నుంచే దిగుమతి అయ్యే వస్తువులను అదనపు పరిశీలనకు గురిచేసింది. ఎల్ఐసీ వంటి సంస్థలలో చైనా పెట్టుబడులు ప్రమాదాలను కలిగిస్తాయని తెలిపారు. చైనా పెట్టుబడులను ఎలా నిరోధించవచ్చనే దానిపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.
బడ్జెట్ లోటు అడ్డంకులను పరిష్కరించాలనే లక్ష్యంతో మార్చితో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీలో 5 శాతం నుంచి 10 శాతం వరకు వాటా విక్రయించడం ద్వారా ₹90,000 కోట్లు సేకరించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత చట్టం ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు ఎవరూ ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టలేరు, కానీ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎల్ఐసీ విక్రయించే వాటాలో 20 శాతం వరకు కొనుగోలు చేయడానికి అనుమతించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎల్ఐసీ ఐపీఓను నిర్వహించడానికి గోల్డ్ మాన్ సాక్స్, సిటీ గ్రూప్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ సహా దాదాపు 10 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను కేంద్రం ఎంపిక చేసింది.
Comments
Please login to add a commentAdd a comment