బీమాకు ధీమా ఇవ్వని సవరణలు | Sakshi Guest Column About Under Section 4 Of The Act Lic Act 1956 | Sakshi
Sakshi News home page

బీమాకు ధీమా ఇవ్వని సవరణలు

Published Sat, Jul 10 2021 12:54 AM | Last Updated on Sat, Jul 10 2021 12:54 AM

Sakshi Guest Column About Under Section 4 Of The Act Lic Act 1956

జీవిత బీమా సంస్థ చట్టంలో లాభదాయకత అనే మాట వినబడదు. సర్‌ప్లస్‌ అనే ఉంటుంది. అంటే మిగులు. లాభాలే పరమావధిగా ఆ సంస్థను నెలకొల్పలేదు. అయినప్పటికీ సంస్థ ఏనాడూ నష్టాల్లో లేదు. జమాఖర్చులను పార్లమెంట్‌ ముందు విధిగా ఉంచుతోంది. ఏడాదిలో సుమారు పది లక్షల డెత్‌ క్లెయిమ్‌లు పరిష్కరించి రికార్డులు సృష్టించింది. ప్రైవేట్‌ బీమా కంపెనీల్లా కోవిడ్‌ నేపథ్యంలో ప్రీమియంలు పెంచలేదు. ఇలాంటి సంస్థలో 49 శాతం వాటాలు అమ్మడానికి కేంద్రం మార్గం సుగమం చేసి, ఇది ప్రైవేటీకరణ కాదని చెబుతోంది. విదేశాల్లో ఎన్నో బీమా కంపెనీలు లాభాల కోసం విచక్షణారహితంగా పెట్టుబడులు పెట్టి, పాలసీదారులకు నష్టాలే మిగిల్చాయి. ఈ పాఠాలు మనం నేర్చుకోవాల్సి ఉంది.

ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాల్లో ఆమోదించిన ఎల్‌ఐసీ చట్ట సవరణ బిల్లుపై గెజిట్‌ విడుదల చేసింది. ఈ అంశంపై అనేక పత్రికలలో వార్తలు వస్తున్నాయి. 1956లో పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థగా ఆవిర్భవించిన జీవిత బీమా సంస్థ– లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) ఇప్పటిదాకా 100 శాతం ప్రభుత్వ సంస్థగానే ఉంది. ప్రభుత్వం ఎల్‌ఐసీ చట్టానికి ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాల్లో)) ఆమోదించిన 27 సవరణల కారణంగా ఎల్‌ఐసీ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అవడానికీ, సంస్థలో ప్రభుత్వ వాటాలు అమ్మడానికీ వీలు కలిగింది. అలాగే ఎల్‌ఐసీ సెబీ పరిధిలోకి రావడానికి ఈ సవరణలు వీలు కల్పించాయి. భవిష్యత్‌లో 3 నెలలకు ఒకసారి లాభ, నష్టాలకు సంబంధించిన త్రైమాసిక నివే దికలు విడుదల చేయాల్సి వుంటుంది. ఇప్పటికే తన పనితీరు గురించిన నివేదికలను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ (ఇన్సూ రెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)కి క్రమం తప్ప కుండా పంపుతోంది. పార్లమెంట్‌ ముందు జమాఖర్చులను ప్రతీ ఏడాది ప్రవేశపెడుతోంది. కనుక, ఈ సవరణల మూలంగా కొత్తగా జరిగేదేమీ లేదు.

కేంద్రప్రభుత్వం ఎల్‌ఐసీని దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోనే గాక, విదేశీ స్టాక్‌ ఎక్సే్చంజీలలో కూడా లిస్టింగ్‌ చేసే ప్రక్రియలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న దీపంకు సలహా దారులుగా డెలాయిట్‌ కంపెనీ, ఎస్బీఐ కాప్స్‌ కంపెనీలను గతేడాది నియమించింది. సెబీ మార్గదర్శకాల ప్రకారం ఏ సంస్థను స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ చేయాలన్నా, దానిలో ఉన్న వాటాలలో కనీసం 25 శాతం పబ్లిక్‌ ఇష్యూ రూపేణా విడుదల చేయాలి. ఎల్‌ఐసీ ఐపీఓ సందర్భంగా ఈ నిబంధనకూ మినహాయింపు ఇచ్చారు. పెట్టుబడులు ఉపసంహరించాలంటే ముందుగా ఆస్తుల మూల్యాం కనం చేపట్టాలి. ప్రభుత్వం మూల్యాంకనం జరపడానికి మిల్లిమాన్‌ సంస్థను నియ మించింది. ఎస్బీఐ పూర్వ ఎండీ, ఎస్బీఐ లైఫ్‌ పూర్వ సీఈఓ–ఎండీ అయిన ఆర్జిత్‌ బసును ఐపీఓకు సహకరించేందుకు కన్సల్టెంట్‌గా తాజాగా ఎల్‌ఐసీ నియమించుకుంది.

ఎల్‌ఐసీ చట్టానికి చేసిన 27 సవరణల ప్రకారం, ప్రస్తుతం సంస్థకు ఉన్న రూ. 100 కోట్ల మూలధనాన్ని రూ. 25 వేల కోట్ల ఆథరైజ్డ్‌ కాపిటల్‌ (అనగా 2500 కోట్ల షేర్లు, షేర్‌ ముఖవిలువ 10 రూపాయల చొప్పున) కింద పెంచుతారు. సంస్థలో ప్రభుత్వ వాటా రాబోయే ఐదేళ్లలో 75 శాతం మేరకు ఉంచుకోవాలనీ, ఆ తర్వాత 51 శాతం వాటాకు పరిమితం కావాలనీ సవరణలలో ప్రస్తావించారు. అంటే, చాలా స్పష్టంగా 5 ఏళ్ళకాలంలో 49 శాతం వరకు ప్రభుత్వ పెట్టుబడులు అమ్మి వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఐపీఓ చేపట్టడం, ప్రైవేటీకరణ కాదని, కేవలం వాటాలు అమ్మడం మాత్రమే అని ప్రభుత్వం పదే పదే చెప్తోంది. ఒక పక్క ఐదేళ్లలో 49 శాతం వాటాలు అమ్మడానికి మార్గం సుగమం చేసి, ఇది ప్రైవేటీకరణ కాదని చెప్పడం సమంజసమా? ఇది సంస్థ ప్రైవేటీకరణ దిశగా పడిన తొలి అడుగుగా భావించాలి.

ఎల్‌ఐసీ చట్టం–1956ను పరిశీలిస్తే ఎక్కడా లాభదాయకత అనే మాట కనపడదు. కేవలం సర్‌ప్లస్‌ అనే మాట కనపడుతుంది. ఇప్పటిదాకా వచ్చిన సర్‌ప్లస్‌లో పాలసీదారులకు 95 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 5 శాతం డివిడెండుగా చెల్లిస్తున్నారు. తాజా చట్ట సవ రణల మూలంగా మిగులుపంపిణీ విధానం వలన పాలసీదారులకు  సర్‌ప్లస్‌లో 90 శాతం వాటా (లేదా బోర్డ్‌ నిర్దేశించిన అధిక మొత్తం) ఉంటుంది. మిగిలిన 10 శాతం లోంచి కేంద్రానికి, షేర్‌హోల్డర్స్‌కు చెల్లిస్తారు. పాలసీదారులకు బోనస్‌లు తగ్గకుండా ఎల్‌ఐసీ బోర్డు నూతన మార్గాలు అన్వేషిస్తుందని ప్రభుత్వ సమర్థకులు సర్ది చెప్తు న్నారు. అయితే, లాభాల బాటలో సంస్థను నడిపించడం కోసం సంస్థ కున్న సామాజిక బీమా లక్ష్యాలను నిర్వీర్యం చేస్తారేమో అనే అను మానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా చట్ట సవరణలలో పాలసీదారులకు ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌) రూపేణా 10 శాతం షేర్లు ఇస్తామని ప్రకటించారు. ఆథరైజ్డ్‌ క్యాపిటల్‌ రూ. 25,000 కోట్లకు పెంచుతారు గనుక, పది శాతం షేర్లు విక్రయించినా, రూ. 2,500 కోట్ల విలువైన షేర్లు అమ్ము తారు. అంటే 10 రూపాయల ముఖవిలువ కలిగిన, 250 కోట్ల షేర్లను ఐపీఓ రూపేణా మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. వీటిలో 10 శాతం అంటే 25 కోట్ల షేర్లు పాలసీదారులకు ఇస్తామని ఆశ పెడుతున్నారు. 40 కోట్ల పాలసీదారులలో ఎంతమందికి ఐపీఓ లాటరీలో షేర్లు దక్కుతాయో తెలియని పరిస్థితి. నేతి బీరకాయలో నెయ్యి లేదనేది ఎంత నిజమో, లిస్టింగ్‌ వలన పాలసీదారులకు లాభం లేదనేది అంతే నిజం.

ఎల్‌ఐసీ బోర్డును పునర్‌ వ్యవస్థీకరించారు. బోర్డులో ఒక మహిళా డైరెక్టర్‌తో సహా, 15 మంది డైరెక్టర్‌లకు స్థానం కల్పించారు. ఇద్దరు కేంద్రప్రభుత్వ సహాయ కార్యదర్శి ర్యాంక్‌ అధికారులు ఉంటారు. వీరిని గాక ఇద్దరిని కేంద్రప్రభుత్వం నియమిస్తుంది. ఈ చర్యలన్నీ పాలసీదారులకు, షేర్‌హోల్డర్‌లకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి అని చెప్తున్నారు. కార్పొరేట్‌ నిర్వహణలో ఎల్‌ఐసీ ఇప్పటికే లిస్టెడ్‌ కంపెనీలను తోసిరాజని రికార్డులు, కితాబులు సాధించింది. కాబట్టి, బోర్డ్‌ పునర్‌ వ్యవస్థీకరణ వల్ల కొత్తగా ఒరిగేదేమీ లేదు.

కోవిడ్‌ నేప«థ్యంలో క్లెయిమ్‌లు పెరుగుతున్నాయని ఈ మధ్య కాలంలో ప్రైవేటు బీమా కంపెనీలు ప్రీమియంలను భారీగా పెంచాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 8 లక్షల డెత్‌ క్లెయిమ్‌లను ఎల్‌ఐసీ పరిష్కరించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 9.56 లక్షల డెత్‌ క్లెయిములను (రూ. 2.19 కోట్ల మొత్తం) పరిష్కరించి తన రికార్డులను తానే బద్దలు కొట్టి, ప్రపంచ రికార్డులను సృష్టించింది. సగటున ఏడాదికి  20,000 లోపు క్లెయిములు చెల్లించే ప్రైవేటు బీమా కంపెనీలు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలను  25 నుండి 40 శాతానికి పెంచినా, దాదాపు 10 లక్షల డెత్‌ క్లెయిమ్‌లను చెల్లించే ఎల్‌ఐసీ మాత్రం ప్రీమియంలను పెంచకపోవడం గమనార్హం. సంస్థకు సామా జిక దృక్పథం ఉండడం వల్లే, ప్రజలకు ఈవిధంగా సేవలు అంది స్తోంది.

ఎల్‌ఐసీలో వాటాలను కొనే మదుపుదారులు లాభాలను ఆర్జించి కొంటారు తప్ప, దేశ ప్రయోజనాల కోసం కొనరని ప్రా«థమిక పరి జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. సంస్థలో పెట్టుబడులు ఉపసంహరించే చర్య భారత ఆర్థిక వ్యవస్థకు భంగకరమే గాక, షేర్‌హోల్డర్స్‌కు అధిక లాభాలను అందించడం కోసం దృష్టి పెట్ట వలసి వస్తుంది. దీనివల్ల బలహీన వర్గాలకు బీమా సౌకర్యాన్ని అందించే సామాజిక లక్ష్యం కుంటుపడుతుంది. దీంతో జాతీయ ఆర్థిక వ్యవస్థకూ, దేశ జనాభాలో పేద వర్గాల ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలుగుతుంది. అమెరికా, అనేక యూరోపియన్‌ దేశాల్లో ప్రైవేటు బీమా కంపెనీలు విచక్షణారహితంగా పెట్టుబడులు పెట్టడం వల్లనే, ఆయా దేశాల్లో బీమా కంపెనీలు మునిగిపోయి, పాలసీదారులు నష్టపోయారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇటువంటి పరిణా మాలు చూసైనా ఎల్‌ఐసీని లిస్టింగ్‌ చేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలి.ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం లిస్టింగ్‌ ప్రతి పాదన విడనాడి, బీమా ప్రీమియంపై భారంగా మారిన జీఎస్టీని తొల గించి, ఎల్‌ఐసీ బలోపేతానికి చర్యలు చేపడితే అది పాలసీదారులకు శ్రేయస్కరం.


వ్యాసకర్త ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘ నాయకులు
మొబైల్‌ : 94417 97900

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement