Life Insurance Corporation of India
-
కేంద్రానికి ఎల్ఐసీ రూ.1,831 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) గురువారం రూ. 1,831.09 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్రానికి అందజేసింది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి ఈ డివిడెండ్ చెక్కును అందజేశారు. ఆర్థిక సేవల శాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల తదితర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 22న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో డివిడెండ్‌ను షేర్హోల్డర్లు ఆమోదించినట్లు ఒక ప్రకటనలో ఎల్ఐసీ పేర్కొంది. రూ.5 కోట్ల తొలి మూలధన పెట్టుబడితో 1956లో ఎల్ఐసీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరచి రెండు దశాబ్దాలు గడిచినప్పటికీ, భారత్ జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసీ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోందని ఎల్ఐసీ ప్రకటన పేర్కొంది. -
పాలసీదారులకు ఎల్ఐసీ బంపరాఫర్!
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగంలోని దిగ్గజ సంస్థ ఎల్ఐసీ రద్దయిన పాలసీల (ల్యాప్స్డ్) పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆగస్ట్ 17న ఇది మొదలవుతుందని.. అక్టోబర్ 21 వరకు కొనసాగుతుందని తెలిపింది. యూలిప్ పాలసీలు కాకుండా, ఇతర అన్ని జీవిత బీమా పాలసీల పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని.. ఆలస్యపు రుసుంలో ఆకర్షణీయ తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. చివరిగా ప్రీమియం చెల్లించి మానేసిన నాటి నుంచి ఐదేళ్లు దాటకపోతే వాటిని పునరుద్ధరించుకోవచ్చని తెలిపింది. సూక్ష్మ బీమా పాలసీల పునరుద్ధరణపై ఆలస్యపు రుసుంను నూరు శాతం మాఫీ చేస్తున్నట్టు పేర్కొంది. ఊహించని పరిస్థితుల వల్ల పాలసీల ప్రీమియం చెల్లించలేకపోయిన వారి కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఎల్ఐసీ తెలిపింది. -
చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...!
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విద్యా, ఆరోగ్య, ప్రమాద బీమా పాలసీలను మనలో చాలా మంది తీసుకుంటుంటాం. సమయానికి ఆయా పాలసీ ప్రీమియం చెల్లిస్తే ఫైన్ల నుంచీ తప్పించుకొనే అవకాశం ఉంది. ఒక వేళ సదరు పాలసీ ప్రీమియంను చేతిలో డబ్బులు లేక చెల్లించకపోతే ఆ పాలసీకి కాస్త బ్రేక్స్ పడే అకాశాలున్నాయి. ఐతే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) పాలసీని కలిగి ఉన్న ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సభ్యులు తమ జీవిత బీమా పాలసీ ప్రీమియంను చెల్లించడానికి తమ ఈపీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవడానికి అర్హులు. ఈ సౌకర్యాన్ని ఈపీఎఫ్ఓ కల్పిస్తోంది. టాక్స్, పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం...ఈపీఎఫ్ఓ సభ్యుడు కనీసం రెండు సంవత్సరాల LIC పాలసీ ప్రీమియం వరకు ఈపీఎఫ్ బ్యాలెన్స్ కలిగి ఉంటే, LIC ప్రీమియం చెల్లింపు కోసం ఈపీఎఫ్ ఖాతాలోని తన డబ్బును ఉపయోగించవచ్చు. ఉద్యోగం కోల్పోవడం లేదా మరేదైనా కారణాల వల్ల ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ఈపీఎఫ్ఓ చందాదారులు ఈపీఎఫ్ ఖాతా నుంచి పాలసీ పునరుద్ధరణ చెల్లింపుతో వారి LIC పాలసీని కొనసాగించవచ్చును. ఈపీఎఫ్ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించడానికి, సదరు ఉద్యోగి ఈపీఎఫ్ఓ వద్ద ఫారమ్ 14ను సమర్పించాలి. అయితే, దీన్ని సమర్పించేటప్పుడు ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఫారమ్ 14, సమర్పణ సమయంలో ఈపీఎఫ్ బ్యాలెన్స్ కనీసం రెండు సంవత్సరాల LIC ప్రీమియం మొత్తంలో ఉండేలా చూసుకోవాలి ఎల్ఐసీ ప్రీమియం పునరుద్ధరణ నిబంధనల ప్రకారం, ప్రీమియం ఆలస్యంగా చెల్లించిన కూడా ఆయా పాలసీని పునరుద్ధరించడానికి LIC అనుమతిస్తుంది. పాలసీ పునరుద్ధరణ తేదీ నుంచి 6 నెలల తర్వాత పాలసీ పునరుద్ధరణపై ఎటువంటి ఆలస్య రుసుము విధించబడదు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల పాలసీ పునరుద్ధరణ తేదీ తర్వాత LIC పాలసీని పునరుద్ధరించినప్పుడు, పాలసీ ప్రీమియంతో పాటు కొంత ఆలస్య రుసుమును చెల్లించవలసి ఉంటుంది. కాగా ప్రీమియం చెల్లింపు కోసం ఈపీఎఫ్ డబ్బును కేవలం చివరి ప్రయత్నంగా మాత్రమే ఉపయోగించాలి. -
ఎల్ఐసీ ఆనంద మొబైల్ యాప్ ఆవిష్కరణ
ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ ఏంజెట్లు, మధ్యవర్తుల కోసం ఆత్మ నిర్భర్ ఏజెంట్ న్యూ బిజినెస్ డిజిటల్ అప్లికేషన్ (ఆనంద) పేరుతో మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. కంపెనీ చైర్పర్సన్ ఎంఆర్ కుమార్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు. అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్న ఈ యాప్ ద్వారా ద్వారా డిజిటల్‌గా కేవైసీ పక్రియను పూర్తి చేయవచ్చు. కాగితం అవసరం లేకుండా పాలసీలను డిజిటల్ రూపంలో మంజూరు చేయవచ్చు. ఏజెంట్ ఇంటికి రావల్సిన పనిలేకుండానే కస్టమర్లు కొత్తగా ఎల్ఐసీ పాలసీ తీసుకోవచ్చని ఎంఆర్ కుమార్ తెలిపారు. -
బీమాకు ధీమా ఇవ్వని సవరణలు
జీవిత బీమా సంస్థ చట్టంలో లాభదాయకత అనే మాట వినబడదు. సర్ప్లస్ అనే ఉంటుంది. అంటే మిగులు. లాభాలే పరమావధిగా ఆ సంస్థను నెలకొల్పలేదు. అయినప్పటికీ సంస్థ ఏనాడూ నష్టాల్లో లేదు. జమాఖర్చులను పార్లమెంట్ ముందు విధిగా ఉంచుతోంది. ఏడాదిలో సుమారు పది లక్షల డెత్ క్లెయిమ్‌లు పరిష్కరించి రికార్డులు సృష్టించింది. ప్రైవేట్ బీమా కంపెనీల్లా కోవిడ్ నేపథ్యంలో ప్రీమియంలు పెంచలేదు. ఇలాంటి సంస్థలో 49 శాతం వాటాలు అమ్మడానికి కేంద్రం మార్గం సుగమం చేసి, ఇది ప్రైవేటీకరణ కాదని చెబుతోంది. విదేశాల్లో ఎన్నో బీమా కంపెనీలు లాభాల కోసం విచక్షణారహితంగా పెట్టుబడులు పెట్టి, పాలసీదారులకు నష్టాలే మిగిల్చాయి. ఈ పాఠాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన ఎల్ఐసీ చట్ట సవరణ బిల్లుపై గెజిట్ విడుదల చేసింది. ఈ అంశంపై అనేక పత్రికలలో వార్తలు వస్తున్నాయి. 1956లో పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థగా ఆవిర్భవించిన జీవిత బీమా సంస్థ– లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఇప్పటిదాకా 100 శాతం ప్రభుత్వ సంస్థగానే ఉంది. ప్రభుత్వం ఎల్ఐసీ చట్టానికి ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో)) ఆమోదించిన 27 సవరణల కారణంగా ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవడానికీ, సంస్థలో ప్రభుత్వ వాటాలు అమ్మడానికీ వీలు కలిగింది. అలాగే ఎల్ఐసీ సెబీ పరిధిలోకి రావడానికి ఈ సవరణలు వీలు కల్పించాయి. భవిష్యత్‌లో 3 నెలలకు ఒకసారి లాభ, నష్టాలకు సంబంధించిన త్రైమాసిక నివే దికలు విడుదల చేయాల్సి వుంటుంది. ఇప్పటికే తన పనితీరు గురించిన నివేదికలను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ (ఇన్సూ రెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ)కి క్రమం తప్ప కుండా పంపుతోంది. పార్లమెంట్ ముందు జమాఖర్చులను ప్రతీ ఏడాది ప్రవేశపెడుతోంది. కనుక, ఈ సవరణల మూలంగా కొత్తగా జరిగేదేమీ లేదు. కేంద్రప్రభుత్వం ఎల్ఐసీని దేశీయ స్టాక్ మార్కెట్లోనే గాక, విదేశీ స్టాక్ ఎక్సే్చంజీలలో కూడా లిస్టింగ్ చేసే ప్రక్రియలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న దీపంకు సలహా దారులుగా డెలాయిట్ కంపెనీ, ఎస్బీఐ కాప్స్ కంపెనీలను గతేడాది నియమించింది. సెబీ మార్గదర్శకాల ప్రకారం ఏ సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలన్నా, దానిలో ఉన్న వాటాలలో కనీసం 25 శాతం పబ్లిక్ ఇష్యూ రూపేణా విడుదల చేయాలి. ఎల్ఐసీ ఐపీఓ సందర్భంగా ఈ నిబంధనకూ మినహాయింపు ఇచ్చారు. పెట్టుబడులు ఉపసంహరించాలంటే ముందుగా ఆస్తుల మూల్యాం కనం చేపట్టాలి. ప్రభుత్వం మూల్యాంకనం జరపడానికి మిల్లిమాన్ సంస్థను నియ మించింది. ఎస్బీఐ పూర్వ ఎండీ, ఎస్బీఐ లైఫ్ పూర్వ సీఈఓ–ఎండీ అయిన ఆర్జిత్ బసును ఐపీఓకు సహకరించేందుకు కన్సల్టెంట్‌గా తాజాగా ఎల్ఐసీ నియమించుకుంది. ఎల్ఐసీ చట్టానికి చేసిన 27 సవరణల ప్రకారం, ప్రస్తుతం సంస్థకు ఉన్న రూ. 100 కోట్ల మూలధనాన్ని రూ. 25 వేల కోట్ల ఆథరైజ్డ్ కాపిటల్ (అనగా 2500 కోట్ల షేర్లు, షేర్ ముఖవిలువ 10 రూపాయల చొప్పున) కింద పెంచుతారు. సంస్థలో ప్రభుత్వ వాటా రాబోయే ఐదేళ్లలో 75 శాతం మేరకు ఉంచుకోవాలనీ, ఆ తర్వాత 51 శాతం వాటాకు పరిమితం కావాలనీ సవరణలలో ప్రస్తావించారు. అంటే, చాలా స్పష్టంగా 5 ఏళ్ళకాలంలో 49 శాతం వరకు ప్రభుత్వ పెట్టుబడులు అమ్మి వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఐపీఓ చేపట్టడం, ప్రైవేటీకరణ కాదని, కేవలం వాటాలు అమ్మడం మాత్రమే అని ప్రభుత్వం పదే పదే చెప్తోంది. ఒక పక్క ఐదేళ్లలో 49 శాతం వాటాలు అమ్మడానికి మార్గం సుగమం చేసి, ఇది ప్రైవేటీకరణ కాదని చెప్పడం సమంజసమా? ఇది సంస్థ ప్రైవేటీకరణ దిశగా పడిన తొలి అడుగుగా భావించాలి. ఎల్ఐసీ చట్టం–1956ను పరిశీలిస్తే ఎక్కడా లాభదాయకత అనే మాట కనపడదు. కేవలం సర్ప్లస్ అనే మాట కనపడుతుంది. ఇప్పటిదాకా వచ్చిన సర్‌ప్లస్‌లో పాలసీదారులకు 95 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 5 శాతం డివిడెండుగా చెల్లిస్తున్నారు. తాజా చట్ట సవ రణల మూలంగా మిగులుపంపిణీ విధానం వలన పాలసీదారులకు సర్‌ప్లస్‌లో 90 శాతం వాటా (లేదా బోర్డ్ నిర్దేశించిన అధిక మొత్తం) ఉంటుంది. మిగిలిన 10 శాతం లోంచి కేంద్రానికి, షేర్హోల్డర్స్కు చెల్లిస్తారు. పాలసీదారులకు బోనస్‌లు తగ్గకుండా ఎల్ఐసీ బోర్డు నూతన మార్గాలు అన్వేషిస్తుందని ప్రభుత్వ సమర్థకులు సర్ది చెప్తు న్నారు. అయితే, లాభాల బాటలో సంస్థను నడిపించడం కోసం సంస్థ కున్న సామాజిక బీమా లక్ష్యాలను నిర్వీర్యం చేస్తారేమో అనే అను మానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా చట్ట సవరణలలో పాలసీదారులకు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) రూపేణా 10 శాతం షేర్లు ఇస్తామని ప్రకటించారు. ఆథరైజ్డ్ క్యాపిటల్ రూ. 25,000 కోట్లకు పెంచుతారు గనుక, పది శాతం షేర్లు విక్రయించినా, రూ. 2,500 కోట్ల విలువైన షేర్లు అమ్ము తారు. అంటే 10 రూపాయల ముఖవిలువ కలిగిన, 250 కోట్ల షేర్లను ఐపీఓ రూపేణా మార్కెట్లోకి విడుదల చేస్తారు. వీటిలో 10 శాతం అంటే 25 కోట్ల షేర్లు పాలసీదారులకు ఇస్తామని ఆశ పెడుతున్నారు. 40 కోట్ల పాలసీదారులలో ఎంతమందికి ఐపీఓ లాటరీలో షేర్లు దక్కుతాయో తెలియని పరిస్థితి. నేతి బీరకాయలో నెయ్యి లేదనేది ఎంత నిజమో, లిస్టింగ్ వలన పాలసీదారులకు లాభం లేదనేది అంతే నిజం. ఎల్ఐసీ బోర్డును పునర్ వ్యవస్థీకరించారు. బోర్డులో ఒక మహిళా డైరెక్టర్‌తో సహా, 15 మంది డైరెక్టర్లకు స్థానం కల్పించారు. ఇద్దరు కేంద్రప్రభుత్వ సహాయ కార్యదర్శి ర్యాంక్ అధికారులు ఉంటారు. వీరిని గాక ఇద్దరిని కేంద్రప్రభుత్వం నియమిస్తుంది. ఈ చర్యలన్నీ పాలసీదారులకు, షేర్హోల్డర్లకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి అని చెప్తున్నారు. కార్పొరేట్ నిర్వహణలో ఎల్ఐసీ ఇప్పటికే లిస్టెడ్ కంపెనీలను తోసిరాజని రికార్డులు, కితాబులు సాధించింది. కాబట్టి, బోర్డ్ పునర్ వ్యవస్థీకరణ వల్ల కొత్తగా ఒరిగేదేమీ లేదు. కోవిడ్ నేప«థ్యంలో క్లెయిమ్‌లు పెరుగుతున్నాయని ఈ మధ్య కాలంలో ప్రైవేటు బీమా కంపెనీలు ప్రీమియంలను భారీగా పెంచాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 8 లక్షల డెత్ క్లెయిమ్‌లను ఎల్ఐసీ పరిష్కరించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 9.56 లక్షల డెత్ క్లెయిములను (రూ. 2.19 కోట్ల మొత్తం) పరిష్కరించి తన రికార్డులను తానే బద్దలు కొట్టి, ప్రపంచ రికార్డులను సృష్టించింది. సగటున ఏడాదికి 20,000 లోపు క్లెయిములు చెల్లించే ప్రైవేటు బీమా కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను 25 నుండి 40 శాతానికి పెంచినా, దాదాపు 10 లక్షల డెత్ క్లెయిమ్‌లను చెల్లించే ఎల్ఐసీ మాత్రం ప్రీమియంలను పెంచకపోవడం గమనార్హం. సంస్థకు సామా జిక దృక్పథం ఉండడం వల్లే, ప్రజలకు ఈవిధంగా సేవలు అంది స్తోంది. ఎల్ఐసీలో వాటాలను కొనే మదుపుదారులు లాభాలను ఆర్జించి కొంటారు తప్ప, దేశ ప్రయోజనాల కోసం కొనరని ప్రా«థమిక పరి జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. సంస్థలో పెట్టుబడులు ఉపసంహరించే చర్య భారత ఆర్థిక వ్యవస్థకు భంగకరమే గాక, షేర్హోల్డర్స్కు అధిక లాభాలను అందించడం కోసం దృష్టి పెట్ట వలసి వస్తుంది. దీనివల్ల బలహీన వర్గాలకు బీమా సౌకర్యాన్ని అందించే సామాజిక లక్ష్యం కుంటుపడుతుంది. దీంతో జాతీయ ఆర్థిక వ్యవస్థకూ, దేశ జనాభాలో పేద వర్గాల ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలుగుతుంది. అమెరికా, అనేక యూరోపియన్ దేశాల్లో ప్రైవేటు బీమా కంపెనీలు విచక్షణారహితంగా పెట్టుబడులు పెట్టడం వల్లనే, ఆయా దేశాల్లో బీమా కంపెనీలు మునిగిపోయి, పాలసీదారులు నష్టపోయారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇటువంటి పరిణా మాలు చూసైనా ఎల్ఐసీని లిస్టింగ్ చేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలి.ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం లిస్టింగ్ ప్రతి పాదన విడనాడి, బీమా ప్రీమియంపై భారంగా మారిన జీఎస్టీని తొల గించి, ఎల్ఐసీ బలోపేతానికి చర్యలు చేపడితే అది పాలసీదారులకు శ్రేయస్కరం. వ్యాసకర్త ఎల్ఐసీ ఉద్యోగుల సంఘ నాయకులు మొబైల్ : 94417 97900 -
మరోమైలు రాయిని చేరిన ఎల్ఐసీ
హైదరాబాద్: బీమా రంగ దిగ్గజ సంస్థ ఎల్ఐసీ మరో మైలురాయిని చేరుకుంది. నూతనంగా రూపొందించిన కేంద్రీకృత ఐటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ–పీజీఎస్ ప్రాజెక్ట్‌ను ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ ముంబైలోని కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఎండీ విపిన్ ఆనంద్ తదితర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ప్లాట్‌ఫామ్ నుంచి జారీ అయిన మొదటి రసీదును ఐడీబీఐ బ్యాంకు ఎండీ, సీఈవో రాకేవశ్ శర్మకు ఎల్ఐసీ చైర్మన్ కుమార్ అందించారు. కేంద్రకృత వసూళ్లు, చెల్లింపుల కోసం ఈ నూతన ప్లాట్‌ఫామ్‌ను ఎల్ఐసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. చదవండి: ఇండియన్ బ్యాంక్ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం -
మార్కెట్లోకి ‘బిగ్‌బాస్’?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజ సంస్థ ఎల్ఐసీ షేర్లను కొనుగోలు చేసే రోజు భవిష్యత్తులో చూసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పెట్టుబడుల ఉపసంహరణ/వాటాల అమ్మకాల ద్వారా కేంద్రంలోని మోదీ సర్కారు పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు ప్రాధా న్యం ఇస్తుండడంతో, ఎల్ఐసీ లిస్టింగ్ కూడా ప్రభుత్వ అజెండాలో భాగంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఐపీవో ద్వారా స్వల్ప మొత్తంలో వాటాలను ప్రభుత్వం విక్రయించే చాన్స్ ఉందని సమాచారం. ఎల్ఐసీ తొలిదశ ఐపీవోకు అధిక ప్రీమి యం ఉంటుందని అంచనా. ఈక్విటీ చిన్నది కావడమే దీనికి కారణం. ఎల్ఐసీలో వాటాల అమ్మకం ఆరంభ దశలో ఉందని, ఈ విషయమై ప్రాథమికంగా చర్చలు జరిగినట్టు సంబంధిత వర్గాల సమాచారం. విలువ అధికం... ఎల్ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా, ఆర్థిక సేవల కంపెనీగా ఉంది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో ఎల్ఐసీ గనుక లిస్ట్ అయితే మార్కెట్ విలువ పరంగా టాప్ కంపెనీగా నిలుస్తుందని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ను దాటిపోతుందని అంచనా. రూ.5 కోట్ల ఈక్విటీ ఆధారంగా వేసిన అంచనా ఇది. లిస్ట్ చేయడం వల్ల ఖాతాలు మరింత పారదర్శకంగా నిర్వహించడంతోపాటు, పెట్టుబడులు, రుణాల పోర్ట్‌ఫోలియో వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాల్సి వస్తుంది. ఇది మరింత మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్‌కు దారితీస్తుందని భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర సర్కారు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలను లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎల్ఐసీలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలంటే అందుకు ఎల్ఐసీ చట్టం 1956లో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసీ చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం... ఎల్ఐసీ పాలసీలు అన్నింటికీ వాటి సమ్ అష్యూర్డ్, బోనస్‌లు చెల్లించే విషయంలో ప్రభుత్వం హామీదారుగా ఉంటోంది. పెట్టుబడుల కొండ ఎల్ఐసీ 2017–18 వార్షిక నివేదిక ప్రకారం చూస్తే... డిబెంచర్లు, బాండ్లలో రూ.4,34,959 కోట్ల పెట్టుబడులు కలిగి ఉండగా, ఎన్నో మౌలిక రంగ ప్రాజెక్టులకు రూ.3,76,097 కోట్లను రుణాలుగా సమకూర్చింది. అదే ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ పెట్టుబడులపై రూ.23,621 కోట్ల లాభాన్ని ఆర్జించగా, ఈక్విటీలలో ఆ ఏడాది రూ.68,621 కోట్లు పెట్టుబడులు పెట్టింది. రూ.5 కోట్ల మూలధనంతో ఎల్ఐసీ సంస్థ ఏర్పాటు కాగా, ఐఆర్డీఏఐ నిబంధనల మేరకు బీమా సంస్థల కనీస ఈక్విటీ రూ.100 కోట్లుగా ఉండాలి. ఈక్విటీ చిన్నదే అయినప్పటికీ, ఇతర కంపెనీలతో పోలిస్తే ఎల్ఐసీ నిర్వహణలో భారీ ఆస్తులు ఉన్నాయి. 2018–19లో ఎల్ఐసీ పెట్టుబడుల మార్కెట్ విలువ వార్షికంగా 8.61 శాతం పెరిగి రూ.28.74 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.26.46 లక్షల కోట్లుగా ఉంది. కార్పొరేషన్ మొత్తం ఆస్తులు రూ.31.11 లక్షల కోట్లకు చేరాయన్నది అంచనా. ‘‘అధికారికంగా ప్రకటించినా, ప్రకటించకపోయినా కానీ ఎల్ఐసీ వ్యవస్థాపరంగా చాలా ముఖ్యమైన బీమా సంస్థ. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తదితర వెంచర్ల బెయిలవుట్ విషయంలో ఎల్ఐసీ పెట్టుబడులు ఇప్పటికే పెద్ద చర్చకు దారితీసింది. మిలియన్ల పాలసీదారుల సొమ్ములు ఇవి. ఎల్ఐసీలో వాటాల అమ్మకానికి ముందు ఎల్ఐసీ చట్టంలో సవరణ చేయాల్సి ఉంటుంది’’అని ఐఆర్డీఏఐ సభ్యుడు కేకే శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఎల్ఐసీని తన పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఓ సాధనంగా వాడుకుంటున్న పరిస్థితి ఇన్వెస్టర్లకు అవగతమే. ఓఎన్జీసీ తదితర ఎఫ్‌పీవోలకు, ఐడీబీఐ బెయిలవుట్‌కు ప్రభుత్వ ఆదేశాలతో ఎల్ఐసీయే భారీగా నిధులు సమకూర్చింది. ఏటా ప్రభుత్వ సెక్యూరిటీల్లో అతిపెద్ద పెట్టుబడిదారు కూడా ఎల్ఐసీయే. ఏటా రూ.55,000–65,000 కోట్ల మేర స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తోంది. 2018–19లో ఎల్ఐసీ నూతన పాలసీలు, రెన్యువల్ పాలసీల ప్రీమియం రూపంలో రూ.3,37,185 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. పాలసీదారులకు చెల్లించిన మొత్తం ప్రయోజనం రూ.2,50,936 కోట్లు కావడం గమనార్హం. -
బీమాకు కొర్రీ.. రైతుకు వర్రీ!
సాక్షి, హైదరాబాద్: రైతుబీమా అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోయిన మూడు నుంచి పది రోజుల్లోగా ఆయా కుటుంబాలకు బీమా కింద రూ.5 లక్షలు ఎల్ఐసీ నుంచి ఇప్పించాలి. కానీ, జిల్లా వ్యవసాయాధికారులు, ఎల్ఐసీ, బ్యాంకు వర్గాల కారణంగా కొన్నిచోట్ల జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని గతేడాది ఆగస్టు 14వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏ కారణంతోనైనా 58 ఏళ్ల లోపు రైతులు చనిపోతే వారి కుటుంబాలను తక్షణమే ఆదుకునేందుకు రూ. 5 లక్షల బీమా పరిహారం చేతికందేలా ఈ పథకానికి రూపకల్పన చేసింది. అందుకోసం 28 లక్షలమంది రైతుల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం రూ.636 కోట్లను ఎల్ఐసీకి ప్రీమియం కింద చెల్లించింది. అంటే.. ఒక్కో రైతుకు రూ.2,271 ప్రీమి యం చెల్లించింది. బీమా పరిహారాన్ని రైతులకు సకాలంలో అందించేలా ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ఎల్ఐసీ కాకుండా వ్యవసాయశాఖ తీసుకుంది. రైతు చనిపోతే మరణ ధ్రువీకరణపత్రం, ఇతర డాక్యుమెంట్లను తీసుకోవడం, పరిశీలించడం, అప్లోడ్ చేయడం వంటి పనులను కిందిస్థాయి వ్యవసాయాధికారులే చేస్తున్నారు. గతేడాది ఆగస్టు 14 నుంచి ఇప్పటివరకు 7,486 మంది రైతులకు రైతుబీమా కింద పరిహారం అందింది. ఇంకా 300 మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం వివిధ దశల్లో పెండింగ్‌లో ఉంది. అందులో 192 దరఖాస్తులు జిల్లా వ్యవసాయాధికారుల వద్ద ఉండిపోయాయి. వాటికి ఆమోదం తెలపడంలో జాప్యం జరుగుతోందని నల్లగొండ జిల్లాకు చెందిన బాధిత రైతు కుటుంబసభ్యుడు ఎం.వీరేశం ఆరోపిస్తున్నారు. నల్లగొండ, మెదక్ జిల్లాల్లో 18 దరఖాస్తుల చొప్పున ఆయా జిల్లా వ్యవసాయాధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 15, నిజామాబాద్ జిల్లాలో 13 పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే చనిపోయిన 55 మంది రైతుల బీమా దరఖాస్తులను ఇప్పటికీ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 11 రైతు బీమా దరఖాస్తులను అప్లోడ్ చేయలేదు. ఎల్ఐసీ ఎందుకు తిరస్కరించినట్లు? రైతుబీమా ప్రక్రియలో అన్నీ సక్రమంగా ఉన్నా కొన్ని దరఖాస్తులు ఎల్ఐసీ వద్ద తిరస్కరణకు గురికావడంపై విమర్శలున్నాయి. మొత్తం 43 మంది రైతుల పరిహారాన్ని ఎల్ఐసీ తిరస్కరించిందని వ్యవసాయశాఖ తెలిపింది. అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించినా ఎందుకు తిరస్కరణకు గురయ్యాయో తెలియదని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబసభ్యుడు లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జిల్లాలో 8 మంది రైతుల బీమాను ఎల్ఐసీ తిరస్కరించింది. ఎల్ఐసీ ఆమోదించి డబ్బు పంపినా బ్యాంకులు సొమ్ము ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నాయి. ఈవిధంగా రాష్ట్రంలో 10 మంది రైతు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. -
క్యాష్‌లెస్ దిశగా ఎల్ఐసీ
జోనల్ మేనేజర్ సుశీల్ కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగదు లావాదేవీలను తగ్గించే దిశగా బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కసరత్తు ప్రారంభించింది. మెట్రోల్లోని పలు కార్యాలయాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్లను ఏర్పాటు చేసింది. కస్టమర్లు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీమియం సులభంగా చెల్లించే వీలుగా దశలవారీగా ఇతర కార్యాలయాల్లో ఈ మెషీన్లను అందుబాటులోకి తేనున్నట్టు ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ మేనేజర్ టి.సి.సుశీల్ కుమార్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఏడాదిలోగా అన్ని కార్యాలయాలకు ఈ సౌకర్యాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్‌ఫోన్ నుంచే చెల్లింపులు పూర్తి అయ్యేలా టెక్నాలజీని అందిపుచ్చుకుంటామని అన్నారు. ‘జోన్ పరిధిలో 1.5 లక్షలపైచిలుకు ఏజెంట్లు ఉన్నారు. మార్చి నాటికి ఈ సంఖ్యను 2 లక్షలకు చేర్చనున్నాం. 36 లక్షల కొత్త పాలసీలను జారీ చేయాలని లక్ష్యం విధించుకున్నాం. కొత్త ప్రీమియం రూ.5,100 కోట్లకు చేరుకుంటాం’ అని వివరించారు. గతేడాది క్లెయిమ్‌ల చెల్లింపులు రూ. లక్ష కోట్లపైనే సంస్థ వయసు 61 ఏళ్లు; మార్కెట్ వాటా 71 శాతం ముంబై: దేశీ బీమా రంగంలో 71 శాతం వాటా తనదేనని ఎల్ఐసీ ప్రకటించింది. శుక్రవారంతో 61 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఒక ప్రకటన చేస్తూ... 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా విలువైన క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు తెలిపింది. 2.15 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించగా, వీటి విలువ రూ.1,12,700 కోట్లని తెలిపింది. కాల వ్యవధి తీరిన పాలసీలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో 98.34 శాతం, మరణానికి సంబంధించి వచ్చిన క్లెయిమ్‌లలో 99.63 శాతం దరఖాస్తులను పరిష్కరించినట్లు సంస్థ తెలియజేసింది. సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.25 లక్షల కోట్లు కాగా ఉద్యోగుల సంఖ్య 1.15 లక్షలు. 11.31 లక్షల మంది ఏజెంట్ల సాయంతో ఇప్పటి వరకూ 29 కోట్ల పాలసీలను విక్రయించినట్లు సంస్థ పేర్కొంది. 2016–17లో కొత్త పాలసీల ప్రీమియం రూపంలో 27.22 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆధార్ స్తంభ్, ఆధార్ శీల, జీవన్ ఉమంగ్, ప్రధాన మంత్రి వయ వందన యోజన పేరిట నాలుగు పాలసీలను సంస్థ ప్రవేశపెట్టింది. -
రైల్వేకు ‘ఎల్ఐసీ’ దన్ను
ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడికి బీమా దిగ్గజం సై ⇒ భారతీయ రైల్వేల చరిత్రలో అత్యంత భారీ ఇన్వెస్ట్మెంట్ ⇒ ఇరు సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ⇒ పెట్టుబడి నిధులపై ఐదేళ్లపాటు వడ్డీ, రుణ చెల్లింపులు ఉండవు న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలకు నిధుల పంట పండనుంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను వెచ్చించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటిదాకా రైల్వేల చరిత్రలో ఇదే అత్యంత భారీ పెట్టుబడి. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుల సమక్షంలో ఇరు సంస్థలూ ఈ పెట్టుబడి నిధులకు సంబంధించి బుధవారం ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. భారతీయ రైల్వేలకు చెందిన ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) తదితర సంస్థలు జారీచేసే బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ఎల్ఐసీ ఈ ప్రతిపాదిత పెట్టుబడి నిధులను వెచ్చిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) నుంచి ప్రారంభమయ్యే పెట్టుబడులపై రైల్వే శాఖ ఐదేళ్లపాటు వడ్డీ, రుణాలు తిరిగి చెల్లింపులు జరపకుండా మారటోరియం కూడా అమలు కానుంది. రైల్వేల పనితీరు మెరుగుపడాలి: జైట్లీ ‘ఇది పూర్తిగా వాణిజ్య నిర్ణయం. ఎల్ఐసీ పదేళ్లపాటు రూ.1.5 లక్షల కోట్లను రైల్వేల్లో పెట్టుబడి పెడుతుంది’ అని ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ వ్యాఖ్యానించారు. భారతీయ రైల్వేల పనితీరు చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఎంతో చరిత్ర కలిగిన మన రైల్వేలు మరింత వృద్ధి పథంలో దూసుకెళ్లాలి. ఈ సంస్థను అత్యంత నైపుణ్యంతో ప్రొఫెషనల్‌గా నడిపించాలి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఆనందదాయకమైన ప్రయాణ అనుభూతిని కల్పించగలగాలి. అంతేకానీ, అరకొర సదుపాయాలతో నిర్బంధంగా నడిపిస్తామంటే కుదరదు. ఇవన్నీ చేయాలంటే సేవల్లో నాణ్యత భారీగా పెరగాల్సిందే’ అని జైట్లీ పేర్కొన్నారు. ఇక ఎల్ఐసీ విషయానికొస్తే.. అద్భుతమైన వ్యాపార దిగ్గజంగా ఇది ఎదిగిందన్నారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రొఫెషనల్ దృక్పథంతో ఎంత భారీగా ఎదగవచ్చో.. దేశానికి ఎంతగా సేవలందించవచ్చో తెలియజేసేందుకు ఎల్ఐసీయే ప్రత్యక్ష ఉదాహరణ అని జైట్లీ కొనియాడారు. ప్రస్తుతం ఎల్ఐసీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.15 లక్షల కోట్ల పైమాటే. స్టాక్ మార్కెట్లో వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు పలు సంస్థలకు దీర్ఘకాలిక రుణాలను కూడా ఇది అందిస్తోంది. ఏటా రూ.30 వేల కోట్లు... వచ్చే ఐదేళ్లలో ఏటా సగటున రూ.30 వేల కోట్ల విలువైన రైల్వేలు జారీ చేసే బాండ్లను కొనుగోలు చేస్తామని ఎంఓయూపై సంతకాల అనంతరం ఎల్ఐసీ చైర్మన్ ఎస్కే రాయ్ చెప్పారు. అయితే, ఎల్ఐసీ ఈ పెట్టుబడులపై ఏ స్థాయిలో రాబడులను అందుకోనుందన్న ప్రశ్నకు.. వడ్డీ రేటు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. తాము కొనుగోలు చేసే బాండ్లకు కాలపరిమితి 30 ఏళ్లు ఉంటుందని.. ఐదేళ్ల వ్యవధిలో నిధులిస్తామని రాయ్ తెలిపారు. ఇది వివాహ బంధంలాంటిది..: ప్రభు రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలోని రెండు అతిపెద్ద సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని వివాహ బంధంగా అభివర్ణించారు. ఇరు సంస్థలకూ ఇది మేలు చేకూర్చే ఒప్పందమని పేర్కొన్నారు. రైల్వే మౌలిక రంగ ప్రాజెక్టులకు అవసరమైన భారీ నిధుల సమీకరణ దిశగా కీలకమైన చర్యగా ఈ ఎంఓయూ నిలుస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రాజెక్టులకు డబ్బులెక్కడ ఉన్నాయి? అని అందరూ అడుగుతుంటారు. ఇదిగో డబ్బు. దీనికి తేనె కూడా పూసి ఉంది (దేర్ ఈజ్ మనీ, విత్ హనీ). ఎందుకంటే ఈ నిధులపై వడ్డీరేటు అటు ఎల్ఐసీ, ఇటు రైల్వేలకు కూడా ఎంతో లాభదాయకమైన రీతిలో ఉంటుంది’ అంటూ కొంత సరదా ధోరణిలో రైల్వే మంత్రి మాట్లాడారు. నిధుల కొరతను ఎదుర్కొంటున్న రైల్వే మౌలిక ప్రాజెక్టులను ఇక వేగంగా పూర్తిచేసేలా ఎల్ఐసీ పెట్టుబడులు ఉపయోగపడతాయని కూడా ప్రభు తెలియజేశారు. రైల్వేలను లాభాల్లోకి తీసుకురావడంలో ఇది తొలి అడుగుగా పేర్కొన్నారు. రైల్వేల అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో రూ.8.5 లక్షల కోట్ల నిధులను ఖర్చుచేయనున్నట్లు 2015-16 బడ్జెట్ ప్రసంగంలో సురేశ్ ప్రభు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
క్లెయిమ్‌ల పరిష్కారంలో ఎల్ఐసీ భేష్: ఐఆర్డీఏ
న్యూఢిల్లీ: ప్రైవేటు బీమా కంపెనీలతో పోల్చితే ‘డెత్ క్లెయిమ్’ల విషయంలో జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) పనితీరు అత్యుత్తమంగా ఉందని ఈ రంగ నియంత్రణ సంస్థ- ఐఆర్డీఏ తన వార్షిక నివేదికలో పేర్కొంది. గణాంకాల ప్రకారం ముఖ్యాంశాలు... గతేడాది (2012-13)లో ఎల్ఐసీ క్లెయిమ్‌ల పరిష్కార నిష్పత్తి 97.73%. 2011-12లో ఈ నిష్పత్తి 97.42%. అయితే ప్రైవేటు బీమా సంస్థల విషయంలో ఈ రేట్లు వరుసగా 88.65%, 89.34%గా ఉన్నాయి. ఏడాది ముగింపునాటికి ప్రైవేటు బీమా కంపెనీల వద్ద పెండింగులో ఉన్న (పరిష్కరించాల్సిన) క్లెయిమ్‌లు 3.47శాతం. ఎల్ఐసీ విషయంలో ఈ రేటు 1.04 శాతం. 2012-13లో జీవిత బీమా పరిశ్రమల ప్రీమియం ఆదాయం రూ.2.87 లక్షల కోట్లు. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 0.05% అధికం. ప్రీమియం వసూళ్ల విషయంలో ప్రైవేటు రంగంలో 2012-13లో (2011-12తో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా 6.87% క్షీణత నమోదయ్యింది. అయితే ఈ విషయంలో ఎల్ఐసీ 2.92% వృద్ధిని సాధించింది.