క్యాష్‌లెస్ దిశగా ఎల్‌ఐసీ
జోనల్ మేనేజర్ సుశీల్ కుమార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగదు లావాదేవీలను తగ్గించే దిశగా బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) కసరత్తు ప్రారంభించింది. మెట్రోల్లోని పలు కార్యాలయాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్లను ఏర్పాటు చేసింది. కస్టమర్లు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీమియం సులభంగా చెల్లించే వీలుగా దశలవారీగా ఇతర కార్యాలయాల్లో ఈ మెషీన్లను అందుబాటులోకి తేనున్నట్టు ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ మేనేజర్ టి.సి.సుశీల్ కుమార్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు.
ఏడాదిలోగా అన్ని కార్యాలయాలకు ఈ సౌకర్యాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్‌ఫోన్ నుంచే చెల్లింపులు పూర్తి అయ్యేలా టెక్నాలజీని అందిపుచ్చుకుంటామని అన్నారు. ‘జోన్ పరిధిలో 1.5 లక్షలపైచిలుకు ఏజెంట్లు ఉన్నారు. మార్చి నాటికి ఈ సంఖ్యను 2 లక్షలకు చేర్చనున్నాం. 36 లక్షల కొత్త పాలసీలను జారీ చేయాలని లక్ష్యం విధించుకున్నాం. కొత్త ప్రీమియం రూ.5,100 కోట్లకు చేరుకుంటాం’ అని వివరించారు.
గతేడాది క్లెయిమ్‌ల చెల్లింపులు రూ. లక్ష కోట్లపైనే
సంస్థ వయసు 61 ఏళ్లు; మార్కెట్ వాటా 71 శాతం
ముంబై: దేశీ బీమా రంగంలో 71 శాతం వాటా తనదేనని ఎల్‌ఐసీ ప్రకటించింది. శుక్రవారంతో 61 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఒక ప్రకటన చేస్తూ... 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా విలువైన క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు తెలిపింది. 2.15 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించగా, వీటి విలువ రూ.1,12,700 కోట్లని తెలిపింది.
కాల వ్యవధి తీరిన పాలసీలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో 98.34 శాతం, మరణానికి సంబంధించి వచ్చిన క్లెయిమ్‌లలో 99.63 శాతం దరఖాస్తులను పరిష్కరించినట్లు సంస్థ తెలియజేసింది. సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.25 లక్షల కోట్లు కాగా ఉద్యోగుల సంఖ్య 1.15 లక్షలు. 11.31 లక్షల మంది ఏజెంట్ల సాయంతో ఇప్పటి వరకూ 29 కోట్ల పాలసీలను విక్రయించినట్లు సంస్థ పేర్కొంది. 2016–17లో కొత్త పాలసీల ప్రీమియం రూపంలో 27.22 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆధార్ స్తంభ్, ఆధార్ శీల, జీవన్ ఉమంగ్, ప్రధాన మంత్రి వయ వందన యోజన పేరిట నాలుగు పాలసీలను సంస్థ ప్రవేశపెట్టింది.