రైల్వేకు ‘ఎల్‌ఐసీ’ దన్ను
ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడికి బీమా దిగ్గజం సై
⇒ భారతీయ రైల్వేల చరిత్రలో అత్యంత భారీ ఇన్వెస్ట్‌మెంట్
⇒ ఇరు సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం
⇒ పెట్టుబడి నిధులపై ఐదేళ్లపాటు వడ్డీ, రుణ చెల్లింపులు ఉండవు
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలకు నిధుల పంట పండనుంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను వెచ్చించేందుకు ముందుకొచ్చింది.
ఇప్పటిదాకా రైల్వేల చరిత్రలో ఇదే అత్యంత భారీ పెట్టుబడి. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుల సమక్షంలో ఇరు సంస్థలూ ఈ పెట్టుబడి నిధులకు సంబంధించి బుధవారం ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. భారతీయ రైల్వేలకు చెందిన ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) తదితర సంస్థలు జారీచేసే బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ఎల్‌ఐసీ ఈ ప్రతిపాదిత పెట్టుబడి నిధులను వెచ్చిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) నుంచి ప్రారంభమయ్యే పెట్టుబడులపై రైల్వే శాఖ ఐదేళ్లపాటు వడ్డీ, రుణాలు తిరిగి చెల్లింపులు జరపకుండా మారటోరియం కూడా అమలు కానుంది.
రైల్వేల పనితీరు మెరుగుపడాలి: జైట్లీ
‘ఇది పూర్తిగా వాణిజ్య నిర్ణయం. ఎల్‌ఐసీ పదేళ్లపాటు రూ.1.5 లక్షల కోట్లను రైల్వేల్లో పెట్టుబడి పెడుతుంది’ అని ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ వ్యాఖ్యానించారు. భారతీయ రైల్వేల పనితీరు చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఎంతో చరిత్ర కలిగిన మన రైల్వేలు మరింత వృద్ధి పథంలో దూసుకెళ్లాలి. ఈ సంస్థను అత్యంత నైపుణ్యంతో ప్రొఫెషనల్‌గా నడిపించాలి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఆనందదాయకమైన ప్రయాణ అనుభూతిని కల్పించగలగాలి. అంతేకానీ, అరకొర సదుపాయాలతో నిర్బంధంగా నడిపిస్తామంటే కుదరదు. ఇవన్నీ చేయాలంటే సేవల్లో నాణ్యత భారీగా పెరగాల్సిందే’ అని జైట్లీ పేర్కొన్నారు.
ఇక ఎల్‌ఐసీ విషయానికొస్తే.. అద్భుతమైన వ్యాపార దిగ్గజంగా ఇది ఎదిగిందన్నారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రొఫెషనల్ దృక్పథంతో ఎంత భారీగా ఎదగవచ్చో.. దేశానికి ఎంతగా సేవలందించవచ్చో తెలియజేసేందుకు ఎల్‌ఐసీయే ప్రత్యక్ష ఉదాహరణ అని జైట్లీ కొనియాడారు. ప్రస్తుతం ఎల్‌ఐసీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.15 లక్షల కోట్ల పైమాటే. స్టాక్ మార్కెట్లో వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు పలు సంస్థలకు దీర్ఘకాలిక రుణాలను కూడా ఇది అందిస్తోంది.
ఏటా రూ.30 వేల కోట్లు...
వచ్చే ఐదేళ్లలో ఏటా సగటున రూ.30 వేల కోట్ల విలువైన రైల్వేలు జారీ చేసే బాండ్‌లను కొనుగోలు చేస్తామని ఎంఓయూపై సంతకాల అనంతరం ఎల్‌ఐసీ చైర్మన్ ఎస్‌కే రాయ్ చెప్పారు. అయితే, ఎల్‌ఐసీ ఈ పెట్టుబడులపై ఏ స్థాయిలో రాబడులను అందుకోనుందన్న ప్రశ్నకు.. వడ్డీ రేటు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. తాము కొనుగోలు చేసే బాండ్లకు కాలపరిమితి 30 ఏళ్లు ఉంటుందని.. ఐదేళ్ల వ్యవధిలో నిధులిస్తామని రాయ్ తెలిపారు.
ఇది వివాహ బంధంలాంటిది..: ప్రభు
రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలోని రెండు అతిపెద్ద సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని వివాహ బంధంగా అభివర్ణించారు. ఇరు సంస్థలకూ ఇది మేలు చేకూర్చే ఒప్పందమని పేర్కొన్నారు. రైల్వే మౌలిక రంగ ప్రాజెక్టులకు అవసరమైన భారీ నిధుల సమీకరణ దిశగా కీలకమైన చర్యగా ఈ ఎంఓయూ నిలుస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రాజెక్టులకు డబ్బులెక్కడ ఉన్నాయి? అని అందరూ అడుగుతుంటారు. ఇదిగో డబ్బు.
దీనికి తేనె కూడా పూసి ఉంది (దేర్ ఈజ్ మనీ, విత్ హనీ). ఎందుకంటే ఈ నిధులపై వడ్డీరేటు అటు ఎల్‌ఐసీ, ఇటు రైల్వేలకు కూడా ఎంతో లాభదాయకమైన రీతిలో ఉంటుంది’ అంటూ కొంత సరదా ధోరణిలో రైల్వే మంత్రి మాట్లాడారు. నిధుల కొరతను ఎదుర్కొంటున్న రైల్వే మౌలిక ప్రాజెక్టులను ఇక వేగంగా పూర్తిచేసేలా ఎల్‌ఐసీ పెట్టుబడులు ఉపయోగపడతాయని కూడా ప్రభు తెలియజేశారు. రైల్వేలను లాభాల్లోకి తీసుకురావడంలో ఇది తొలి అడుగుగా పేర్కొన్నారు. రైల్వేల అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో రూ.8.5 లక్షల కోట్ల నిధులను ఖర్చుచేయనున్నట్లు 2015-16 బడ్జెట్ ప్రసంగంలో సురేశ్ ప్రభు ప్రకటించిన సంగతి తెలిసిందే.