బడ్జెట్‌పై వివిధ వర్గాల భారీ ఆశలు
సరుకు రవాణాలో రాయితీల పెంపు కోరుతున్న పారిశ్రామిక వర్గాలు
పరిశ్రమలను అనుసంధానిస్తూ రైలు మార్గాలుండాలని డిమాండ్
వేగం పెంపు.. టికెట్ల రేటు తగ్గింపుపై ప్రయాణికుల ఆశలు
మరిన్ని వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రావొచ్చని అంచనా
బుల్లెట్ రైళ్లను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు ప్రణాళికలు
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ లలో ఒకటైన భారతీయ రైల్వే కొంతకాలంగా వేగంగా ఆధునికతను సంతరించుకుంటోంది. కుంటుతూ గెంటుతూ నడిచే రైళ్ల స్థానంలో అమితవేగంతో దూసుకుపోయే అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. బుల్లెట్ రైళ్లను కూడా వీలైనంత త్వరగా దేశంలో పరుగులు పెట్టించాల ని కేంద్రం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో 2025 - 26 బడ్జెట్‌లో రైల్వేలకు కేంద్రం ఏం ఇస్తుంది? ఎలాంటి మార్పులు ప్రతిపాదిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 1న కేంద్రప్రభు త్వం 2025 -26 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైల్వేల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఏం ఆశిస్తున్నారనేది చూద్దాం..
గత ఐదేళ్లలో రైల్వేలో కొత్తగా వచ్చిన మార్పులు
2019: సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు ప్రవేశం.
2020: రైల్వేల్లో ప్రమాదాలను అరికట్టేందుకు ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీ) ‘కవచ్’ ప్రారంభం.
2022: రాష్ట్రీయ రైల్ సంరక్ష కోశ్ ఫండ్ (ఆర్‌ఆర్‌ఎస్‌కే) ఏర్పాటు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పెంచాలని లక్ష్యం.
2023: ముంబైృ అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టు వేగవంతానికి చర్యలు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ప్రారంభం. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 1,275 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయం.
2024: కవచ్ 4.0 ప్రారంభం. స్టేషన్ల వద్ద ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు. డెడికేటెడ్ సరుకు రవాణా మార్గాల నిర్మాణం పూర్తి.అమృత్ భారత్ 1.0 ప్రారంభం.
2025: అమృత్ భారత్ 2.0 రైళ్లు. జమ్మూకశ్మీర్‌లో కీలకమైన రైల్వేలైన్ల నిర్మాణం పూర్తి.
మరింత వేగంగా ఆధునికత
ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో భారతీయ రైల్వే ఇంకా వెనుకబడే ఉంది. జపాన్, చైనా, యూరప్‌లో బుల్లెట్ ట్రైన్లు ఎప్పటి నుంచో దూసుకుపోతుండగా, మన దేశంలో వాటికి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. అయితే, గత ఐదారేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రైల్వేల ఆధునీకరణను వేగవంతం చేసింది. సాధారణ రైళ్ల స్థానంలో వందేభారత్ వంటి అత్యాధునిక సౌకర్యాలున్న రైళ్లను ప్రవేశపెట్టింది.
2024 డిసెంబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా 136 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. సాధారణ రైళ్లకంటే వీటి వేగం భారీగా ఉండటంతో టికెట్ ధరలు కాస్త ఎక్కువైనా వీటిల్లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మరిన్ని వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా వచ్చే బడ్జెట్‌లో వందే భారత్ రైళ్లకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.
ముంబైృ అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైల్ మార్గాన్ని మరింత వేగంగా పూర్తిచేసేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వొచ్చని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో ప్రయాణికుల రైళ్ల నిర్వహణకు వీలు కల్పించాలని పారిశ్రామికవర్గాలు కోరుతున్నాయి.
రూ.3 లక్షల కోట్లకు రైల్వే బడ్జెట్?
రైల్వే శాఖకు 2024ృ25లో కేంద్రత్వం రూ.2,62,200 కోట్లు కేటాయించింది. 2025ృ26 బడ్జెట్‌లో 15 నుంచి 18 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అంటే మొత్తం బడ్జెట్ దాదాపు రూ.2.9 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. వందేభారత్, బుల్లెట్ రైళ్లకు కేంద్రం ఇచ్చే ప్రాధాన్యాన్ని బట్టి రైల్వే బడ్జెట్‌లో పెంపుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2024 ఏడాదిలోనే కేంద్రం ఏకంగా 62 వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని భారీగా పెంచే అవకాశం ఉందని అంటున్నారు.
- సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment