bullet trains
-
రైలు బండి మరింత వేగం..
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్ లలో ఒకటైన భారతీయ రైల్వే కొంతకాలంగా వేగంగా ఆధునికతను సంతరించుకుంటోంది. కుంటుతూ గెంటుతూ నడిచే రైళ్ల స్థానంలో అమితవేగంతో దూసుకుపోయే అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. బుల్లెట్ రైళ్లను కూడా వీలైనంత త్వరగా దేశంలో పరుగులు పెట్టించాల ని కేంద్రం భావిస్తోంది.ఈ నేపథ్యంలో 2025 - 26 బడ్జెట్లో రైల్వేలకు కేంద్రం ఏం ఇస్తుంది? ఎలాంటి మార్పులు ప్రతిపాదిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 1న కేంద్రప్రభు త్వం 2025 -26 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైల్వేల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఏం ఆశిస్తున్నారనేది చూద్దాం..గత ఐదేళ్లలో రైల్వేలో కొత్తగా వచ్చిన మార్పులు2019: సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు ప్రవేశం. 2020: రైల్వేల్లో ప్రమాదాలను అరికట్టేందుకు ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీ) ‘కవచ్’ ప్రారంభం. 2022: రాష్ట్రీయ రైల్ సంరక్ష కోశ్ ఫండ్ (ఆర్ఆర్ఎస్కే) ఏర్పాటు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పెంచాలని లక్ష్యం. 2023: ముంబైృ అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టు వేగవంతానికి చర్యలు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ప్రారంభం. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 1,275 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయం. 2024: కవచ్ 4.0 ప్రారంభం. స్టేషన్ల వద్ద ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు. డెడికేటెడ్ సరుకు రవాణా మార్గాల నిర్మాణం పూర్తి.అమృత్ భారత్ 1.0 ప్రారంభం. 2025: అమృత్ భారత్ 2.0 రైళ్లు. జమ్మూకశ్మీర్‌లో కీలకమైన రైల్వేలైన్ల నిర్మాణం పూర్తి.మరింత వేగంగా ఆధునికత ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో భారతీయ రైల్వే ఇంకా వెనుకబడే ఉంది. జపాన్, చైనా, యూరప్‌లో బుల్లెట్ ట్రైన్లు ఎప్పటి నుంచో దూసుకుపోతుండగా, మన దేశంలో వాటికి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. అయితే, గత ఐదారేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రైల్వేల ఆధునీకరణను వేగవంతం చేసింది. సాధారణ రైళ్ల స్థానంలో వందేభారత్ వంటి అత్యాధునిక సౌకర్యాలున్న రైళ్లను ప్రవేశపెట్టింది. 2024 డిసెంబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా 136 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. సాధారణ రైళ్లకంటే వీటి వేగం భారీగా ఉండటంతో టికెట్ ధరలు కాస్త ఎక్కువైనా వీటిల్లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మరిన్ని వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా వచ్చే బడ్జెట్లో వందే భారత్ రైళ్లకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ముంబైృ అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైల్ మార్గాన్ని మరింత వేగంగా పూర్తిచేసేందుకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వొచ్చని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో ప్రయాణికుల రైళ్ల నిర్వహణకు వీలు కల్పించాలని పారిశ్రామికవర్గాలు కోరుతున్నాయి.రూ.3 లక్షల కోట్లకు రైల్వే బడ్జెట్? రైల్వే శాఖకు 2024ృ25లో కేంద్రత్వం రూ.2,62,200 కోట్లు కేటాయించింది. 2025ృ26 బడ్జెట్లో 15 నుంచి 18 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అంటే మొత్తం బడ్జెట్ దాదాపు రూ.2.9 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. వందేభారత్, బుల్లెట్ రైళ్లకు కేంద్రం ఇచ్చే ప్రాధాన్యాన్ని బట్టి రైల్వే బడ్జెట్లో పెంపుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2024 ఏడాదిలోనే కేంద్రం ఏకంగా 62 వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని భారీగా పెంచే అవకాశం ఉందని అంటున్నారు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ -
త్వరలోనే ఆ జిల్లాలో జెట్ స్పీడ్ బుల్లెట్ రైళ్లు..
అబ్బురపరిచే వేగం.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.. అద్భుతమైన నిర్మాణాలు.. అత్యుత్తమ సౌకర్యాలు.. అలసట తెలియని ప్రయాణం.. అతితక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేర్చేందుకు గంటకు 350 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేకంగా నిర్మించనున్న ట్రాక్‌పై చెన్నై– మైసూరు మధ్య పరుగులు తీయనున్నాయి. జర్మన్ టెక్నాలజీతో దేశంలోనే ఆరో కారిడార్‌గా ఈ మార్గాన్ని అభివృద్ధి పరిచేందుకు సర్వే పనులు సాగుతున్నాయి. ఇందుకోసం వివిధ విభాగాల వారీగా పలు కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి. జిల్లా మీదుగా సాగే ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి బెంచిమార్క్లు నిర్మాణమవుతున్నాయి. పలమనేరు (చిత్తూరు): జపాన్, జర్మనీ దేశాల్లో కనిపించే జెట్ స్పీడ్ బుల్లెట్ రైళ్లను త్వరలోనే జిల్లాలోనూ చూడబోతున్నాం. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకత. ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత వేగంగా నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై నుంచి 320 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరుకు ప్రయాణించాలంటే గంటకు 70 కి.మీ సగటున దాదాపు ఐదు గంటల సమయం పట్టేది. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ద్వారా అయితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం రెండు గంటలే. ఇప్పటికే దేశంలో ముంబై–అహ్మదాబాద్, ఢిల్లీ–వారణాసితో పాటు మరో మూడు మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లున్నాయి. ఆరో మార్గంగా చెన్నై–మైసూర్ కారిడార్‌ను జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2018లోనే జర్మన్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసింది. 2020 జూన్‌లో చెన్నై–మైసూర్ రైల్యే కారిడార్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం నుంచి తమిళనాడు సరిహద్దు వరకు ప్రాథమిక సర్వేతోపాటు బెంచిమార్క్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఖరారైన టెండర్లు కేంద్ర రైల్యేశాఖ ఎన్హెచ్ఆర్ఆర్సీఎల్ (నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్)ద్వారా చెన్నై–మైసూరు బుల్లెట్ ట్రైన్ పనులు చేపడుతోంది. 2019లోనే ఇందుకు సంబందించి డీపీఆర్ (డీటైల్ ప్రాజెక్టు రిపోర్ట్) సిద్ధం చేసింది. ఈ మార్గానికి సంబంధించిన ఇప్పటికే టెండర్ల పక్రియను సైతం పూర్తి చేసింది. అందులో భాగంగా సర్వే పనులను ఇంజినీరింగ్ మాగ్నిట్యూడ్ కంపెనీ దక్కించుకుంది. ట్రాఫిక్‌కు సంబంధించిన పనులను పీకే ఇంజనీర్స్కంపెనీ, జనరల్ అలైన్మెంట్ డ్రాయింగ్స్‌ను ట్రాన్స్‌లింక్ కంపెనీ, ఫైనల్ అలైన్‌మెంట్‌ను ఆర్వీ అసోసియేట్స్, ఓవర్‌హెడ్, అండర్‌గ్రౌండ్ పనులను సుబుది టెక్నాలజీస్ కంపెనీ చేపడుతోంది. ఆర్ఏపీ ( రీసెటిల్మెంట్ యాక్షన్‌ప్లాన్)ని ఓవర్సీస్ మిన్–టెక్ కన్సల్టెంట్స్, ఎన్విరాల్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్‌ను మరో కంపెనీ చేపట్టనున్నట్టు ప్రస్తుతం ఇక్కడ పనులు చేస్తున్న కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. స్టాపింగ్ స్టేషన్లు తొమ్మిదే.. చెన్నై నుంచి మైసూరు మార్గంలో కేవలం తొమ్మిది స్టాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడులో చెన్నై, పూనమలై, అరక్కోణం, కర్ణాటకలో బంగారుపేట, బెంగళూరు, చెన్నపట్న, మండ్య, మైసూరు, జిల్లాలో కేవలం చిత్తూరులో మాత్రమే బుల్లెట్ రైళ్లు ఆగనున్నాయి. కారిడార్‌కు సమీపంలోనే చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌హైవే ఉండేలా మార్గంలో అలైన్మెంట్ చేశారు. ఈ ప్రాజెక్టులో అండర్‌గ్రౌండ్ ( సొరంగమార్గం), ఎలివేషన్ వయాడక్ట్, ఓవర్‌హెడ్, ఫ్లైఓవర్ వంతెనలతో ట్రాక్ నిర్మాణం సాగనుంది. బెంగళూరులో రెండు అండర్‌గ్రౌండ్ రైల్యే స్టేషన్లు సైతం నిర్మించేలా ప్రణాళికలో పొందుపరిచారు. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చెన్నై–మైసూర్ మధ్య 435 కిలోమీటర్ల దూరం ఉంది. బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిలోమీటర్లు ప్రయాణిస్తే దాదాపు ఒకటిన్నర గంటలో చేరుకోవచ్చు. సగటు వేగం గంటకు 320 కిలోమీర్లు అయితే సుమారు రెండు గంటలు పట్టొచ్చు. 9 స్టేషన్లలో ఆపిన సమయాన్ని లెక్కగడితే మరో 45 నిమిషాలు మాత్రమే అదనంగా పరిగణించవచ్చు. ఆ లెక్కన 2.45 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకొనే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రారంభమైన సర్వే కర్ణాటక సరిహద్దుల నుంచి జిల్లాలోని వి.కోట, బైరెడ్డిపల్లె, పలమనేరు మండలాల మీదుగా తమిళనాడు సరిహదులోని గుడిపాల మండలం వరకు ట్రాక్ నిర్మాణం కోసం శరవేగంగా సర్వే సాగుతోంది. ముఖ్యంగా పలమనేరు మండలంలోని సాకేవూరు, బేలపల్లె, కొలమాసనపల్లె, కూర్మాయి. పెంగరగుంట, సముద్రపల్లె సమీపంలో బెంచిమార్కులను ఏర్పాటు చేస్తున్నారు. భూకంపాలను తట్టుకొనే సామర్థ్యం బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌ను అత్యాధుని పరిజ్ఞానంతో భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టం ఉంటుందని సర్వే చేస్తున్న కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బుల్లెట్ ట్రైన్, ట్రాక్ ప్రత్యేకతలు ►రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు ►ఆపరేషన్ స్పీడ్ గంటకు 320 కిలోమీటర్లు ►ట్రాక్గేజ్ : స్టాండర్డ్ (1435 mm) ►డీఎస్– ఏటీజీ సిగ్నలింగ్ ►ట్రైన్ కెపాసిటీ : 750 మంది ప్రయాణికులు ►చెన్నై–మైసూర్ మధ్య దూరం 435 కిలోమీటర్లు ►రైలు స్టాపింగ్ స్టేషన్లు : 9 -
ఉద్యోగుల కోసం క్యాబిన్లు, ఇకపై ట్రైన్లలో ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు
ప్రపంచ దేశాల్లో టెక్నాలజీతో పాటు అన్నీ రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంధన వాహనల నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి హైబ్రిడ్ వర్క్ కల్చర్ మారుతుంది. తాజాగా జపాన్ దేశం మరో అడుగు ముందుకు వేసింది. ఉద్యోగులు ఆఫీస్ వర్క్ చేసేందుకు వీలుగా ఈస్ట్ జపాన్ రైల్వే సంస్థతో కలిసి 'ఆఫీస్ కార్స్'ను లాంఛ్ చేసింది. ఇప్పుడు ఈ బుల్లెట్ రైళ్లు కార్పొరేట్ ఆఫీసుల్ని తలపిస్తున్నాయి. ట్రైన్లలో ఆఫీస్ క్యాబిన్లు జపాన్ ప్రభుత్వం షింకన్సెన్ బుల్లెట్ ట్రైన్ మార్గంలో ఈ ఆఫీస్ కార్లును ప్రారంభించింది. దేశ రాజధాని టోక్యోతో పాటు దేశంలోని నార్తన్, సెంట్రల్ భాగాలను కలుపుతూ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫీస్ కార్స్లో అదనపు ఛార్జీలు లేకుండా ఉద్యోగులు ఆఫీస్ పనులు చేసుకోవచ్చు. ఇందుకోసం ట్రైన్లో ప్రత్యేకంగా ఉద్యోగుల కోసం క్యాబిన్లను ఏర్పాటు చేసింది. ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఆఫీస్‌లో జరిగే వర్చువల్ మీటింగ్స్ సైతం పాల్గొనేలా సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చినట్లు జపాన్ మీడియా 'జిన్హువా' తన కథనంలో పేర్కొంది. ఉద్యోగుల కోసం స్మార్ట్ గ్లాసెస్ ఈ ఆఫీస్ కార్స్లో ఉద్యోగులు తమ ల్యాప్‌టాప్ స్క్రీన్లను దగ్గరగా మరింత ఆసక్తికరంగా చూసేందుకు స్మార్ట్ గ్లాసెస్‌ను వినియోగించుకోవచ్చు. 'తోహోకు' బుల్లెట్ ట్రైన్ మార్గంలో బుల్లెట్ రైళ్లలో సీట్ల చుట్టూ చిన్న డివైడర్లను ఉద్యోగులు ఉచితంగా ఉపయోగించవచ్చు. అయితే జపాన్ తెచ్చిన ఈ ఆఫీస్ కల్చర్‌ను వినియోగించుకునేందుకు ఉద్యోగుల తాకిడి ఎక్కువైంది. వారిని కట్టడి చేసేందుకు వీకెండ్స్ తో పాటు కొన్ని గవర్నమెంట్ హాలిడేస్‌లో వర్క్‌స్పేస్ సేవల్ని నిలిపివేస్తూ జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా తగ్గిన వ్యాపార ప్రకటనల డిమాండ్‌ను పెంచేందుకు ఈ ఆన్లైన్ వర్క్ కల్చర్ తోడ్పడుతుందని ఈస్ట్ జపాన్ రైల్వే భావిస్తున్నాయి. కాగా ,సెంట్రల్ జపాన్ రైల్వే , వెస్ట్ జపాన్ రైల్వే సైతం అక్టోబర్ నుండి ప్రధాన నగరాల గుండా నడిచే రైళ్లలో ఆన్‌బోర్డ్ వర్క్‌స్పేస్‌లను ప్రవేశపెట్టేందుకు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. -
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్!
Bullet Train Project Made In India: ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఇండియన్ రైల్వే మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎక్విప్మెంట్ను దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. అరుదైన సాంకేతిక పరిజ్ఞాన్ని దేశీయంగానే అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల సరసన నిలించేందుకు రెడీ అవుతోంది. వయడక్టు నిర్మాణంలో ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ టట్రైన్ పప్రాజెక్టును ఇండియన్ రైల్వే చేపట్టింది. ముంబై నుంచి ఢిల్లీ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల నిడివితో పూర్తిగా వయడక్టు పద్దతిలో బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన వయడక్టు నిర్మాణంలో భారీ క్రేన్లు, స్ట్రడల్ క్యారియర్లు, గర్డర్ ట్రాన్స్పోర్టర్లు వంటి భారీ ఎక్విప్మెంట్ని ఉపయోగించాల్సి ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణంలో కీలకమైన భారీ ఎక్వీప్మెంట్ని పూర్తి దేశీయంగా తయారు చేస్తున్నారు. తమిళనాడులోని కంచిపురంలో ఉన్న ఎల్ అంట్ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. బుల్లెట్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా 1100 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ యంత్రాల తయారీ పనులు ఇక్కడ వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఇక్కడ తయారైన యంత్రాలను రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. వాటి తర్వాత ఇండియానే బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌కి సంబంధించి వయడక్టు నిర్మాణ టెక్నాలజీ ఇప్పటి వరకు టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న సౌత్ కొరియా, ఇటలీ, నార్వే, చైనా దేశాల్లోనే అందుబాటులో ఉంది. ప్రపంచంలో ఎక్కడ బుల్లెట్ రైలు నిర్మాణం జరిగినా ఈ భారీ యంత్రాలు ఈ దేశాల నుంచి సరఫరా కావాల్సిందే. అయితే ఇండియా ఆ దేశాలపై ఆధారపడకుండా సొంతంగా భారీ యంత్రాలను రూపొందిస్తోంది. భవిష్యత్తులో ఇతర దేశాల్లో నిర్మాణం జరుపుకునే బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో కీలక భూమిక నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. Flagged off Made in India engineering marvel, a reflection of the 21st Century Mindset. #HighSpeedRailonFastTrack pic.twitter.com/7EzkdPaWFI — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 9, 2021 చదవండి: Infosys: ఈ కామర్స్ స్పెషల్.. ఈక్వినాక్స్ సొల్యూషన్స్ -
బుల్లెట్ రైలు.. మరో కొత్త మార్గంలో ?
జాల్నా (మహారాష్ట్ర) : అవసరం అనుకుంటే ముంబై- నాగ్‌పూర్ మార్గంలో బుల్లెట్ రైలు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తామని రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్ దన్వే అన్నారు. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పనులు జరుగుతుండగా దాన్ని నాగ్‌పూర్ వరకు పొడిగించే అంశాన్ని మంత్రి స్వయంగా ప్రస్తావించారు. భారీ నష్టాల్లో రైల్వే కరోనా కారణంగా రూ. 36,000 కోట్ల నష్టం వాటిల్లిందంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే అన్నారు. ముఖ్యంగా ప్యాసింజర్ రైళ్ల నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందంటూ చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలోని జాల్నా స్టేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను రైల్వేశాఖ సహాయ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాసింజర్ రైళ్ల వల్లే తక్కువ టిక్కెట్ చార్జీలతో ప్యాసింజర్ రైళ్లు నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందన్నారు. టిక్కెట్ చార్జీలు పెంచితే ప్రజలపై భారం పడుతుందని ఆ పని చేయడం లేదన్నారు. కేవలం గూడ్సు రవాణా ద్వారానే రైల్వేకా ఆదాయం సమకూరుతోందని మంత్రి అన్నారు. దేశ సరకు రవాణాలో గూడ్సు రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇదేం చోద్యం ప్యాసిజంర్ రైళ్ల వల్లే నష్టాలు అంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్ మాటలపై విస్మయం వ్యక్తం అవుతోంది. కరోనా సంక్షోభం తలెత్తిన తర్వాత రైల్వేశాఖ గూడ్సు రవాణాలో వేగం పెరిగిందని చెబుతూనే మళ్లీ నష్టాలేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కరోనా సమయంలో పట్టాలెక్కిన రైళ్లన్నింటీలో సబ్సీడీలు ఎత్తేయడమే కాకుండా స్పెషల్ పేరుతో అధిక ఛార్జీలు బాదుతున్న విషయం రైల్వే మంత్రి మర్చిపోయారా అంటూ నిలదీస్తున్నారు. వేగం పెంచారనే నెపంతో ఆఖరికి ఆర్డినరీ ప్యాసింజర్ రైళ్లకు కూడా ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తూ ఇప్పుడు నష్టాల పాట పాడటమేంటని రైల్వే ఉద్యోగులు అంటున్నారు. చదవండి : స్థిరాస్తి కొనేటప్పుడు తస్మాత్ జాగ్రత్త.. -
24 వేల కోట్లతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్స్‌కు సంబంధించిన ప్రాజెక్ట్ పై హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఎన్హెచ్ఆర్ఎస్సీఎల్) గురువారం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 24 వేలకోట్లతో ప్రారంభించే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఎల్ అండ్ టీ కంపెనీ ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. మెదటగా ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ఆరు రైళ్లను నడపనున్నారు. గుజరాత్లో ఎన్హెచ్ఆర్ఎస్సీఎల్ 325 కి.మీ. సంబంధించిన భూమి, ప్రాజెక్ట్ వివరాలను ఎల్ అండ్ టీ కి అప్పజెప్పింది. అయితే గుజరాత్ వైపు ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత మహారాష్ష్ర్ట ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు భూమిని సమకూర్చాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం జపాన్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా..అన్ని ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుందని జపాన్ అంబాసిటర్ సంతోష్ సుజుకీ అభిప్రాయపడ్డారు. రైల్వే బోర్డు సీఈఓ, చైర్మన్ వి.కే యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత మరో ఏడు మార్గాలలో ఇలాంటి ప్రాజెక్ట్ ప్రారంభిస్తాం అన్నారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ల వల్ల టెక్నాలజీని అందిపుచ్చుకోవడమే కాకుండా ఉద్యోగ కల్పన జరుగుతుంది అన్నారు. ఇంజనీర్స్, టెక్నీషియనన్స్, డిజైనర్ లాంటి స్కిల్ కలిగిన వారికి మాత్రమే కాక, నిర్మాణ కార్మికులకు, సెమీ స్కిల్ వర్కరర్స్కు పని దొరుకుతుందని పేర్కొన్నారు. -
హైస్పీడ్ ఫ్లయిట్ ట్రైన్
చైనా, జపాన్ వంటి దేశాల్లోని బుల్లెట్ ట్రైన్లు గంటకు 350 కి.మీ. వేగంతో దూసుకుపోతున్నాయంటేనే అబ్బో అని ఆశ్చర్యపోతుంటాం. ఆ వేగాన్ని మనం ఎప్పుడు అందుకుంటామా అని ఆలోచన చేస్తాం. ఇక గంటకు 1000 కి.మీ. వేగంతో గమ్యస్థానాన్ని చేరుకునే కొత్త హైస్పీడ్ ఫ్లయిట్ ట్రైన్ వస్తుందంటే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. 2025 కల్లా ఈ హైస్పీడ్ రైలు వాస్తవరూపం దాల్చనున్నట్లు చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని మీడియా వెల్లడించింది. ప్రస్తుతం చైనాలో గంటకు 350 కి.మీ. వేగంతో వెళ్లే హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్లున్నాయి. ఈ బుల్లెట్ రైళ్ల వేగం మరింత పెంచే దిశగా చర్యలు తీసుకుంటూనే ‘నెక్ట్స్ జనరేషన్ మ్యాగ్నటిక్ లీవియేషన్ ట్రైన్ల’పై పరిశోధనను ఉధృతం చేసింది. గత బుధవారం (అక్టోబర్ 10న) చెంగ్డూ నగరంలో జరిగిన నేషనల్ మాస్ ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెనర్ వీక్’సందర్భంగా ఈ రైలు నమూనాను ప్రదర్శించారు. ప్రభుత్వ సంస్థ ‘చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్’(కాసిక్) ఆధ్వర్యంలో 2015 నుంచే ‘టీ ఫ్లయిట్’పేరిట ఈ రైలు రూపొందించడంలో నిమగ్నమైంది. కాంతిని, వేడిని తట్టుకునేలా ఈ ఫ్లయిట్ కేబిన్‌ను తయారుచేస్తున్నట్లు గ్లోబల్‌టైమ్స్ వెల్లడించింది. అద్భుత సాంకేతికత.... మ్యాగ్నటిక్ లీవియేషన్ టెక్నాలజీ, ఇతర సాంకేతికతలు ఉపయోగించి భూమికి వంద మిల్లీమీటర్ల ఎత్తులో ఈ రైలు తేలుతూ వెళ్లేలా చేస్తారు. ఈ రైలు నెమ్మదిగా వేగం పుంజుకుని గంటకు వెయ్యి కి.మీ. లక్ష్యాన్ని చేరుకుంటుందని, ఈ క్రమంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగదని వాంగ్ యాన్ అనే అధికారి వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాకు చెందిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్, హైపర్‌లూప్ కంపెనీలు గంటకు వెయ్యి కి.మీ.ల కంటే వేగం వెళ్లగలిగే హైస్పీడ్ టెక్నాలజీని పరీక్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాతోపాటు ఫ్లయిట్ ట్రైన్ తయారీలో చైనా కూడా పోటీపడుతోంది. ఏరోస్పేస్ టెక్నాలజీస్ వాడే సాంకేతికత మాదిరిగానే ఫ్లయిట్ ట్రైన్లలోనూ ‘ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ప్రొపల్షన్’టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా 22 వేల కి.మీ. మేర సుదీర్ఘ హైస్పీడ్ రైలు నెట్వర్క్ ఉన్న దేశంగా చైనా ముందుంది. -
18 బుల్లెట్ ట్రైన్లు దూసుకొస్తున్నాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : జపాన్ నుంచి రూ 7000 కోట్లు వెచ్చించి 18 బుల్లెట్ ట్రైన్లను కొనుగోలు చేయాలని మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బుల్లెట్ ట్రైన్ ఒప్పందంలో భాగంగా స్ధానికంగా వాటి తయారీకి అవసరమైన సాంకేతికతను కూడా జపాన్ భారత్‌కు బదలాయిస్తుందని ఎకనమిక్ టైమ్స్ కథనం పేర్కొంది. ప్రతి బుల్లెట్ ట్రైన్లో 10 కోచ్‌లు ఉంటాయని, ఈ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళతదాయని ఓ అధికారి వెల్లడించారు. జపాన్ బుల్లెట్ ట్రైన్లు ప్రపంచంలో అత్యంత సురక్షితమైనవిగా పరిగణిస్తారు. వీటిలో భద్రతకు అనువుగా ఆటోమేటిక్ ప్రొటెక్షన్ వ్యవస్ధ ఉండటం బుల్లెట్ ట్రైన్ల ప్రత్యేకతగా చెబుతారు. ఇక ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో భారత్‌లో బుల్లెట్ ట్రైన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌ను నెలకొల్పాలని భారత రైల్వేలు యోచిస్తున్నాయని కూడా అధికారులు వెల్లడించారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్‌లో బుల్లెట్ ట్రైన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు తాము బిడ్లను ఆహ్వానిస్తామని రైల్వే ఉన్నతాధికారి ఒకరు వెల్లడించినట్టు ఎకనమిక్ టైమ్స్ తెలిపింది. మరోవైపు కవసకి, హిటాచి వంటి జపాన్ ట్రైన్ టెక్నాలజీ కంపెనీలు దేశంలో తమ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. మరోవైపు ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ముందుకు కదిలేందుకు అవరోధాలు వీడలేదు. పాల్ఘర్ వద్ద ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంపై నెలకొన్న వివాదం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు ప్రధాన అవరోధంగా మారింది. -
సైకిళ్ల నుంచి సైకిళ్ల వరకు అద్భుత ప్రయాణం
బీజింగ్ : జపాన్ సినీ తార ర్యోకో నకానో 1979లో చైనా సందర్శనలో భాగంగా బీజింగ్ వెళ్లారు. అప్పటికే ఆమె నటించిన ‘మ్యాన్ హంట్’ సినిమా చైనాలో విడుదలై ఏడాది అయింది. సినిమా హిట్టయిన సందర్భంగానే ఆమె బీజింగ్ వచ్చారు. ఇక్కడి హోటల్లో బస చేసిన ఆమె కిటికీలో నుంచి చూడగా, ఆమెకు ప్రతివీధిలో కనుచూపు మేర సైకిళ్లే కనిపించాయి. ఇదేమి ‘సైకిళ్ల సముద్రమా చైనా’ అని ఆమె సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆమె ఒక్కరేమిటీ? ఆ కాలంలో చైనాకు వెళ్లిన ప్రతి విదేశీయుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం చైనా ప్రజలకు కార్లు కొనే స్థోమత, వాటిల్లో తిరిగే యోగ్యతా లేదు. అందుకని సైకిళ్లనే అత్యంతగా ఆదరించారు. అందుకనే చైనాకు ‘కింగ్డ్‌మ్ ఆఫ్ బైస్కిల్స్’ అని పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత అనతికాలంలోనే చైనా ప్రజల రవాణా వ్యవస్థలోనే అద్భుతమైన మార్పులు వచ్చాయి. అందుకు కారణం చైనా అధ్యక్షుడు డెంగ్జియావోపింగ్ 1978లో చరిత్రాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం. ఆ సంస్కరణల కారణంగా నాలుగు దశాబ్దాల కాలంలోనే చైనా అనూహ్య అభివద్ధిని సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగిన ఈ దేశం ప్రపంచంలోనే రెండవ బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఘనతికెక్కింది. నేడు చైనా అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైళ్లకు నిలయంగా మారింది. 2008లో చైనా మొదటి బుల్లెట్ రైలు నిర్మించింది. బీజింగ్ నుంచి టియాన్జిన్ మున్సిపాలిటీకి మధ్య 120 కిలోమీటర్ల దూరాన్ని ఇది 30 నిమిషాల్లో చేరుకునేది. 2017, చివరి నాటికి రెండున్నర లక్షల కిలోమీటర్ల వరకు బుల్లెట్ ట్రెయిన్ల వ్యవస్థ విస్తరించింది. అంటే ప్రపంచంలో మొత్తం రైల్వే నెట్వర్కుల్లో 66 శాతం నెట్వర్క్ ఒక్క చైనాకే ఉంది. డెంగ్ జియావోపింగ్ 1978లో జపాన్ను సందర్శించినప్పుడు టోక్యో నుంచి క్యోటోకు శింకన్‌సేన్ బుల్లెట్ ట్రెయిన్లో ప్రయాణించి అశ్చర్యపడ్డారు. ఆ రోజే తమ దేశంలో కూడా ఇలాంటి విప్లవాత్మక రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఆధునిక రవాణా వ్యవస్థ కారణంగా మధ్యలో అంతరించి పోయిన సామాన్య మానవుల వాహనం ‘సైకిల్’ ఇప్పుడు చైనా వీధుల్లో మళ్లీ ప్రత్యక్షమయింది. ఏ వీధిలో తిరిగినా అవే దర్శనమిస్తున్నాయి. అందుకు కారణం పర్యావరణం పట్ల అవగాహన కలగడం, ఆరోగ్య రక్షణ పట్ల ఆసక్తి పెరగడం. మెట్రో రైల్వే స్టేషన్ల మధ్య నడిపేందుకు ఇవి మరింతగా ఈ సైకిళ్లు మరింతగా ఉపయోగపడుతున్నాయి. -
గంటకు 600 కి.మీ వేగం..!
బీజింగ్, చైనా : మాగ్నటిక్ లెవిటేషన్ సాంకేతికతతో గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ రైలును చైనా తయారు చేయనుంది. ఈ మేరకు టెక్నికల్ ప్లాన్‌ను శనివారం ఆమోదించింది. ప్రభుత్వ రంగ సంస్థ సీఆర్ఆర్సీ క్వింగ్డా సిఫాంగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును భుజానికెత్తుకుంది. మాగ్నటిక్ లెవిటేషన్ టెక్నికల్ ప్లాన్‌ను 19 మంది అకడమీషియన్స్, నిపుణులు పరిశీలించారు. పలు అనుమానాల నివృత్తి అనంతరం ప్లాన్‌ను ఆమోదించారు. ఈ ప్రాజెక్టు కొరకు 18 దేశాలతో పరిశోధించేందుకు 2016లో చైనా శాస్త్ర సాంకేతిక శాఖ అనుమతి ఇచ్చింది. చైనా 25 వేల కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైలు ట్రాక్‌ను నిర్మించింది. ఈ మార్గాల్లో సరాసరి గంటకు 350 కిలోమీటర్ల వేగాలతో బుల్లెట్ ట్రైన్స్ పరుగులు తీస్తున్నాయి. -
చైనా కీలక అడుగు
-
చైనా కీలక అడుగు
చోంగ్క్వింగ్/గుయాంగ్, ఆగ్నేయ చైనా : ఆగ్నేయ చైనాలోని ముఖ్య ప్రాంతాలైన చోంగ్క్వింగ్, గుజౌ ప్రావిన్సు రాజధాని గుయాంగ్‌ల మధ్య తొలి బుల్లెట్ రైలును చైనా గురువారం ప్రారంభించింది. దీంతో ఆగ్నేయ చైనాలో ఆ దేశం కీలక ముందడుగు వేసినట్లు అయింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ సర్వీసు వల్ల చోంగ్క్వింగ్, గుయాంగ్‌ల మధ్య ప్రయాణ వ్యవధి పది గంటల నుంచి రెండు గంటలకు తగ్గింది. ఆగ్నేయ చైనాలోని మరో కీలక నగరమైన చెంగ్డూ నుంచి గుయాంగ్ మధ్య కూడా హైస్పీడ్ రైలు సర్వీసును చైనా ఆరంభించింది. ఈ మార్గంలో కేవలం మూడున్నర గంటల్లో చెంగ్డూ నుంచి గుయాంగ్ చేరుకోవచ్చు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ చైనా, ఆగ్నేయ చైనాలను రైలు మార్గంతో కలపాలని చైనా నిర్ణయించింది. అందులో భాగంగా దాదాపు 347 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్వే ట్రాక్‌ను నిర్మించింది. దీంతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దక్షిణ చైనా నగరాల్లో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు వీలు కలుగుతుంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు ‘ఫక్సింగ్’ కూడా చైనాదే. -
బుల్లెట్ రైలు కావాలా, భద్రత కావాలా?
న్యూఢిల్లీ: దేశంలోని భారతీయ రైల్వే రోజుకు 19 వేల రైళ్లను నడుపుతున్నాయి. తద్వారా రోజుకు 2.30 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. 13 లక్షల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఎక్కువ మందికి ఉపాధి కల్పించడంలో ప్రపంచంలోనే ఎనిమిదవ అతిపెద్ద సంస్థగా గణతికెక్కింది. ఇది మన రైల్వేకు ఒక పార్శిక భాగం మాత్రమే. రైళ్లు తరచుగా ఆలస్యంగా నడుస్తాయి. ఇరుగ్గా, మురిగ్గా ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యం ప్రయాణికులకు భద్రత తక్కువ. ఈ పార్శిక భాగమే మన ప్రభుత్వాలకు పట్టడం లేదు. దేశంలో ఒక్క 2014 సంవత్సరంలో జరిగిన రైలు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా 27,581 మంది ప్రయాణికులు మరణించారు. మనకు రైళ్లను పరిచయం చేసిన బ్రిటన్ దేశంలో గడచిన దశాబ్ద కాలంలో రైలు ప్రమాదం కారణంగా ఒక్కరంటే ఒక్క ప్రయాణికుడు మరణించలేదు. నిన్నగాక మొన్న సంభవించిన పూరి–హరిద్వార్–కలింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 22 మంది ప్రయాణికులు మరణించారు. మానవ సమన్వయ లోపం కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలగా, రైళ్ల రాకపోకలను మూసివేయకుండా రైల్వే లైను మరమ్మతులు చేపట్టడం వల్ల ప్రమాదం సంభవించినట్లు తాజాగా తేలింది. రైలు పట్టాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, దేశంలోని 40 శాతం ట్రాకులను నూటికి నూరు శాతం ఇప్పటికే ఉపయోగించడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాల్లో 46 శాతం ప్రమాదాలు రైళ్లు పట్టాలు తప్పడం వల్లనే జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎక్కువగా రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు 43 శాతం జరుగుతున్నాయి. అన్ని రైల్వే క్రాసింగ్‌ల వద్ద కాపలా గేట్లు అమర్చడం వల్లనో, వంతెనలను నిర్మించడం వల్లనో వీటిని పూర్తిగా నిర్మూలించవచ్చని రైల్వే భద్రతాచర్యలపై వేసిన కకోద్కర్ కమిటీ 2012లో సిపార్సు చేసింది. ఇలాంటి ఎన్నో కమిటీలు ఎన్నో సిఫార్సులు చేస్తున్నా పట్టించుకుంటున్న ప్రభుత్వాలు లేవు. ప్రజా సంబంధాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వాలు ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నామని, కొత్త లైన్లను వేస్తున్నామని ప్రకటిస్తారే తప్ప, నూటికి నూరు శాతం సర్వీసు ఇచ్చిన పాత లైన్లను తీసేసి కొత్త లైన్లను వేస్తున్నామని చెప్పరు. వేయడానికి ప్రయత్నించరు. ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలును ప్రవేశపెడుతున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడమే కాకుండా నిధులను కూడా విడుదల చేశారు. ఒక్క భారీ ప్రయాణికుల విమానానికయ్యే ఖర్చు ఈ ఒక్క బుల్లెట్ రైలుకు అవుతుంది. కొద్ది మంది ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ రైలు కోసం పెడుతున్న ఖర్చును పాత రైల్వేలైన్ల పునరుద్ధరణకు మళ్లించినట్లయితే 30 శాతం ప్రయాణికుల మతులను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
మనం బుల్లెట్ రైళ్లను నడపడమా?
భారతీయ రైల్వే పట్టాలపై బుల్లెట్ ట్రెయిన్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంటే ‘ఏమీ హాయిలే హలా’ అంటూ పాడుకోవచ్చు. అమెరికా, చైనా, జపాన్‌లే కాదు, భారత్ కూడా గాలిలో తేలిపోయే బుల్లెట్ ట్రెయిన్లను నడుపుతుందోచ్! అంటూ గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు ఉంటుందే తప్ప, వాస్తవానికి దగ్గరగా ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 40 మంది ప్రయాణికులు దుర్మరణం చెందడం మన ప్రభువులు దుర్మార్గాన్ని చెప్పకనే చెబుతోంది. గత రెండున్నర నెలల్లో జరిగిన ఇది మూడో పెద్ద ప్రమాదం. నవంబర్ 10వ తేదీన ఇండోర్-పట్నా రైలు పట్టాలు తప్పడంతో 150 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెల్సిందే. మృతుల రీత్యా ఆ తర్వాత సంభవించిన రెండో పెద్ద ప్రమాదం ఇదే. 2009–10 నుంచి 2015–16 మధ్య దేశంలో సంభవించిన రైలు ప్రమాదాల్లో మొత్తం 620 మంది ప్రయాణికులు మరణించారు. అధికారంలో ఉన్న మన ప్రభువులు బుల్లెట్ రైళ్ల గురించి కలగంటున్నారే తప్ప ప్రస్తుతం నడుపుతున్న రైళ్లకు ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు సరైన చర్యలేవీ తీసుకోవడం లేదు. ముంబై–సూరత్ మధ్య బుల్లెట్ రైలు నడపాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేసింది. అందులో సగం నిధులను వెచ్చించినా రైలు పట్టాలను పటిష్టం చేసుకోవచ్చు. ప్రమాదాలు జరుగకుండా చూసుకోవచ్చు. చైనాలో కిలీమీటరు పట్టాలకు రైల్లో ప్రయాణిస్తున్న ప్రజల సంఖ్యలో మన రైళ్లలో కిలోమీటరుకు ప్రయాణిస్తున్న వారి సంఖ్య 68 శాతమే. అయితే మన దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాల్లో పది శాతం కూడా చైనాలో ఎందుకు జరగడం లేదు? చైనా, జపాన్ దేశాలకు బలమైన రైల్వే నెట్వర్క్ ఉంది. అవి బుల్లెట్ ట్రెయిన్లను నడుపుతాయి, అంతకన్నా వేగంగా దూసుకెళ్లే లేజర్ రైళ్లను కూడా నడుపుతాయి. మనం బ్రిటిష్ కాలంలో వేసిన రైలు పట్టాలను కూడా పూర్తిగా మార్చుకోలేదు. మనం బుల్లెట్ రైళ్లను నడిపితే అవి మృత్యు గుహలోకి దూసుకెళ్లాల్సిందే. -
పాకిస్థాన్‌లో బుల్లెట్ ట్రైన్స్..?
ఇస్లామాబాద్: దేశంలో బుల్లెట్ ట్రైన్ సర్వీసుల ఏర్పాటుపై పాకిస్థాన్ ప్రభుత్వం ఊహించని నిర్ణయాన్ని వెలుబుచ్చింది. ఎన్నికల ప్రచారంలో ‘బుల్లెట్ ట్రైన్ల’పై భారీ హామీలు గుప్పించిన నవాజ్ షరీప్ పార్టీ.. ఇప్పుడు ‘ఆ మాట ఎత్తితేనే ప్రపంచం నవ్వుతోంది’ అంటూ తలదించుకుంది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో బుల్లెట్ రైళ్లపై జరిగిన చర్చకు రైల్వే శాఖ మంత్రి ఖవాజా సాద్ రఫీఖ్ బుధవారం ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘దేశంలో అవసరమైన చోటల్లా బుల్లెట్ రైళ్లు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది నిజమే. ప్రస్తుతం చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) నిర్మాణంలో ఉందికదా, అందులో భాగంగా చైనా మన దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైల్వే ట్రాక్‌లను ఏర్పాటుచేస్తోంది. ‘అదే క్రమంలో బుల్లెట్ రైళ్లు కూడా ప్రారంభిస్తే బాగుంటుంది కదా’ అని మనవాళ్లు చైనీస్‌ను కోరారు. అందుకు ప్రతిగా వారు పగలబడి నవ్వి..‘పాకిస్థాన్‌లో బుల్లెట్ ట్రైనా..’అని అవమానించినత పని చేశారు’ అని రైల్వేమం త్రి రఫీఖ్ సభకు తెలిపారు. ‘వాస్తవ పరిస్థితి ఏంటంటే.. పాకిస్థాన్‌కు బుల్లెట్ ట్రైన్లను భరించే స్తోమత లేదు. ట్రాక్స్ నిర్మించడానికి సరిపడా డబ్బు కూడా లేవు. ఒకవేళ చచ్చీచెడీ నిర్మించినా అందులో ఆ రైళ్లు ఎక్కేదెవరు? మన దేశంలో అత్యథికులు పేదలు, నిరుపేదలే. ఎగువ మధ్యతరగతి ప్రజలు చాలా తక్కువ. అందుకే పాకిస్థాన్‌లో బుల్లెట్ ట్రైన్స్ నిర్మాణం ఆలోచనను ఉపసంహరించుకుంటున్నాం. సమీప భవిష్యత్తులోనూ ఆ ప్రాజెక్టు జోలికి పోబోము’అని మంత్రి ముక్తాయింపునిచ్చారు. వాణిజ్య, రక్షణ అవసరాల నిమిత్తం పాక్, చైనాలు ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇరుదేశాలను కలుపుతూ భారీ హైవేలు, హైస్పీడ్ రైల్వే ట్రాక్స్, పోర్టుల అభివృద్ధి తదితర పనులు ఇప్పటికే మొదలయ్యాయి. -
ఎవరికీ పనికిరాని బడాయికోరు ‘బుల్లెట్’!
అవలోకనం అహ్మదాబాద్–ముంబైల మధ్య లక్ష కోట్ల వ్యయంతో చేపట్టనున్న బుల్లెట్ ట్రైన్ ఉత్త బడాయికోరు ప్రాజెక్టు. ఆరోగ్యం. విద్యల కోసం ఉపయోగపడే డబ్బును అది పీల్చిపారేస్తుంది. దేశ ప్రజలలో అత్యధికులకు దాని వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. చూడబోతే ప్రభుత్వం సంపన్నులకు ప్రయాణ సదుపాయాలను కల్పించడం కోసం డబ్బు ఖర్చు చేయాలని తెగ ఆరాటపడిపోతోందని అనిపిస్తోంది. ఇలాంటి ఖర్చు ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందేట్టు చేస్తుంది, తద్వారా చివరికి దేశానికి మేలు జరుగుతుంది అనే ఊహపై అది ఆధారపడుతున్నట్టుంది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి 200కు పైగా రైళ్లు ఉన్నాయి. వాటిలో మొదటిది అర్ధరాత్రి దాటిన వెంటనే, చివరిది అంతకు కొద్దిగా ముందూ బయల్దేరుతాయి. కాబట్టి, ఆ 524 కిలో మీటర్ల దూరానికి రోజంతా రైళ్లు నడుస్తూనే ఉంటాయి. అహ్మదాబాద్‌లో ఒక ఎయిర్పోర్టుంది. అక్కడి నుంచి ముంబైకి రోజుకు 10 విమాన సర్వీసులున్నాయి. అహ్మదాబాద్, ముంబైలు స్వర్ణ చతుర్భుజి రహదారి వ్యవస్థలో (గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే నెట్వర్క్) భాగం. ఆరు రోడ్ల ఆ రహదారి వ్యవస్థ గుండా రోడ్డు ప్రయాణం దాదాపు రైలంత వేగంగానే సాగుతుంది. బహుశా దేశంలోనే అత్యుత్తమంగా అనుసంధానమై ఉన్న మార్గం ఇదే కావచ్చు. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న మన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని షింజో అబేతో కలసి బుల్లెట్ ట్రైన్ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. అందుకే నేనీ విషయాన్ని రాస్తున్నాను. అహ్మదాబాద్–ముంబైల మధ్య నడిచే ఆ బుల్లెట్ రైలు రూపకల్పన కొద్ది రోజుల్లో మొదలవుతుంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అధికారికంగా వ్యయం రూ. 97,636 కోట్లు. కానీ మరో 10,000 కోట్ల అదనవు వ్యయం కూడా చేయాల్సి రావచ్చని నివేదికలు తెలుపుతున్నాయి. ఈ అంకెలను సరైన దృష్టి కోణం నుంచి చూడాలంటే... ఇది భారత ఆరోగ్య శాఖ బడ్జెట్ అంత మొత్తం. మొత్తం బాలలలో 38 శాతం పోషకాహార లోపంతో బాధపడుతూ, రెండేళ్ల వయసుకే గిడసబారిపోతున్న దేశం మనది. అంటే ఆరోగ్యవంతులైన పిల్లల కంటే వారికి తక్కువ శారీరక, మానసిక శక్తిసామర్థ్యాలే ఉంటాయి. వారెన్నటికీ సంతృప్తికరమైన, సంతోషదాయకమైన జీవితాన్ని గడపలేరు. భారత వార్షిక విద్యా బడ్జెట్ కంటే బుల్లెట్ ట్రైన్‌కు అయ్యే ఖర్చు ఎక్కువ. ఈ విషయంలో చూసినా మన దేశం ప్రపంచంలోనే అతి తక్కువ అక్షరాస్యత ఉన్న దేశాలలో ఒకటిగా ఉంది. మన అక్షరాస్యత నాణ్యత సైతం అధ్వానంగా ఉంది. ఆ విషయం గురించి ఇంతకు ముందు రాశాను. రవాణా పరిశ్రమలో మనం పెట్టే పెట్టుబడులు పేదల పట్ల ఎలాంటి శ్రద్ధా చూపుతున్నవి కాదనేది దీనికి సంబంధించిన మరో అంశం. నిజానికి పేదలకే రవాణా సౌకర్యాలు అత్యంత అవసరం. 2005లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలు ప్రభుత్వ రోడ్డు రవాణా బస్సు సేవల వ్యవస్థను మూసేశాయి. బస్సులు లాభాలను ఆర్జించలేక పోవడమే అందుకు కారణం. కానీ మరి పేదలు ఇక ఎలా ప్రయాణిస్తారని అనుకున్నారు? బుల్లెట్ ట్రైన్ తదితర ప్రాజెక్టులకు మాత్రం ఈ లాభదాయకత వర్తించదనుకోండి. అహ్మదాబాద్, ముంబైలలో వెలవ బోతున్న వల్లభ్‌భాయ్ పటేల్, ఛత్రపతి శివాజీల భారీ విగ్రహాలలాగే ఈ ప్రాజె క్టులు కూడా దేశానికి గర్వ కారణమైనవి. ఈ బుల్లెట్ ట్రైన్ మరో రెండు గుజరాతీ నగరాలకు కూడా సేవలను అంది స్తుండటాన్ని కూడా ఈ ప్రాజెక్టు సమంజసమైనదనడానికి కారణంగా చూపు తున్నారు. వాటిలో వడోదర అహ్మదాబాద్‌కు 110 కిలోమీటర్ల దూరంలో ఉంటే, సూరత్ 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. వడోదర నుంచి ముంబైకి పలు విమాన సర్వీసులు కూడా ఉన్నాయి. సూరత్‌లోని నా తల్లిదండ్రులను చూడటానికి నేను వారానికి ఒక్కసారే వెళ్లగలిగేవాడిని. బెంగళూరు నుంచి అక్కడికి వారానికి ఒక్క విమాన సర్వీసే ఉండేది. మరి ఇప్పుడు అదీ లేదనుకోండి. 2014 నవంబర్ 6న సూరత్ విమానాశ్రయంలో ఒక స్పైస్‌జెట్ విమానానికి ప్రమాదం జరిగింది. ‘‘విమా నాశ్రయం ప్రహారీ గోడకు ఒక చోట కన్నం ఉండటంతో గేదె ఒకటి రన్ వే మీదకు దూసుకు వచ్చింది. ఆ జెట్ విమానం దాన్ని ఢీకొంది. బోయింగ్ 737 విమానం ఇంజను తీవ్రంగా దెబ్బతింది, విమానం ఆగిపోయింది. గేదె చచ్చి పోయింది’’ అని వార్తా కథనం. పౌర విమానయాన శాఖ ఈ ప్రమాదంపై‘‘పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ చేత, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేత రెండు విచారణలకు ఆదేశించింది, దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల పరిధి భద్రతపై సమీక్షకు ఆదేశించింది. మంత్రి అశోక గజపతిరాజు ఈ ఉదయం రెండు గంటలపాటు సమావేశం జరిపి, అన్ని విమానాశ్రయాలకు హద్దులకు ముళ్ల కంచెలు లేదా ఇటుక గోడలకు బదులు కాంక్రీటు గోడలను నిర్మించాలని ఆదేశించారు’’ అని కూడా ఆ కథనం తెలిపింది. చూడబోతే ప్రభుత్వం సంపన్నుల ప్రయాణాల కోసం డబ్బు ఖర్చు చేయాలని తెగ ఆరాటపడిపోతోందని అనిపిస్తోంది. ఇలాంటి ఖర్చు ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందేట్టు చేస్తుంది, తద్వారా చివరికి దేశానికి మేలు జరుగుతుంది అనే ఊహపై అది ఆధారపడుతున్నట్టుంది. అలాగే అనుకున్నా సూరత్ నుంచి ముంబైకి మాత్రమే అటూ ఇటూ చేరవేసే బుల్లెట్ ట్రైన్ కంటే సూరత్ విమా నాశ్రయాన్ని పనిచేయగల స్థితిలో, సురక్షితమైనదిగా ఉంచడం మేలవుతుంది. దాని వల్ల సూరత్ దేశంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానమవుతుంది. గేదె ఉదంతం ప్రజోపయోగ స్థలాలను సురక్షితంగా, శుభ్రంగా ఉంచడంలో భారత దేశపు అశక్తతను ఎత్తి చూపుతుంది. ఇంతకు ముందు చెప్పిన రూ. 10,000 కోట్ల వ్యయం పైన ఎత్తున ఉండే రైలు మార్గం కోసం ఉద్దేశించినది. అంటే భార తదేశపు గందరగోళానికి ఎగువ నుంచి బుల్లెట్ ట్రైన్ నడుస్తుందని అర్థం. ఇది బడాయికోరు ప్రాజెక్టు. ఆరోగ్యం. విద్యల కోసం ఉపయోగపడే డబ్బును ఇది పీల్చిపారేసేది. అత్యధిక భారతీయులకు ఏ మాత్రం ఉపయోగపడనిది. పైగా అహ్మదాబాద్, ముంబైలలో నివసించేవారికి, ఆ రెండు నగరాల మధ్య తిరిగే వారికి సైతం దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ రెండు నగరాల మధ్య మంచి రవాణా సదుపాయాలున్నాయి. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత: ఆకార్ పటేల్ ఈ–మెయిల్ : aakar.patel@icloud.com -
'బుల్లెట్' కన్నా వేగంగా మ్యాగ్లెవ్ రైళ్లు
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికుల రవాణా వ్యవస్థ స్వరూపమే సమీప భవిష్యత్తులో మారిపోనుంది. అయస్కాంత క్షేత్ర వ్యవస్థ (మ్యాగ్లెవ్) ద్వారా గరిష్టంగా గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైళ్లను నడపాలని ఆ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అంతర్జాతీయ ప్రైవేటు పార్టీల బిడ్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ ఆరో తేదీలోగా బిడ్లను దాఖలు చేయాల్సిందిగా నోటిఫికేషన్లో కోరినట్లు విశ్వసనీయ రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలుకన్నా ఈ మ్యాగ్లెవ్ రైళ్లు అతివేగంగా నడుస్తాయి. బుల్లెట్ రైలు వేగం గంటకు 300 నుంచి 350 కిలోమీటర్లుకాగా, మ్యాగ్లెవ్ రైళ్లు కనిష్టంగా గంటకు 350, గరిష్టంగా గంటకు 500 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న హైదరాబాద్-చెన్నై, బెంగళూరు-చెన్నై, న్యూఢిల్లీ-చండీగఢ్, నాగపూర్-ముంబై రూట్లలో ఈ రైళ్లను ముందుగా ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే ప్రదిపాదించింది. ప్రపంచంలో ప్రస్తుతం ఈ తరహా రైళ్లు అమెరికా, జర్మనీ, జపాన్, చైనా, దక్షిణ కొరియా దేశాల్లో మాత్రమే నడుస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ మ్యాగ్లెవ్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే స్టేషన్లు, రైలు మార్గాలను నిర్మించేందుకు స్థలాన్ని మాత్రమే రైల్వే శాఖ సేకరించి ఇస్తుంది. రైళ్లతోపాటు రైలు మార్గాలను, స్టేషన్లను నిర్మించడం, రైళ్లను నడపడం ప్రైవేటు పార్టీల బాధ్యతే. రెవెన్యూ పంపకాల పద్ధతిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కొనసాగుతుందని రైల్వే వర్గాలు తెలిపాయి. అతివేగవంతమైన రైళ్లు, బుల్లెట్ రైళ్లు, వేగవంతమైన రైళ్లను నడపాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృక్పథంలో భాగంగానే మ్యాగ్లెవ్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు ఆ వర్గాలు వివరించాయి. రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపడుతుండడం వల్ల క్రమంగా రైళ్ల రెవెన్యూ పడిపోతూ వస్తోందని, ఇలాంటి అతివేగం రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త రైళ్లలో వైఫై, టీవీ స్క్రీన్లు, ఆన్లైన్ సినిమాలు, క్యాంటీన్లు లాంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉంటాయని తెలిపాయి. -
సామాన్యులకు నరక యాతన...
న్యూఢిల్లీ: బుల్లెట్ రైళ్లను సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించడం ప్రతి భారతీయుడి కళ అని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంట్లో అప్పుడెప్పుడో ప్రకటించారు. ఆ అందమైన కళ డబ్బున్న కొందరికి మాత్రమే. టిక్కెట్ కొనే దగ్గరి నుంచి గమ్యస్థానం చేరుకునేవరకు నరక యాతన అనుభవిస్తున్న సామాన్య ప్రయాణికుల కళ ఎంతమాత్రం కాదు. పొడవాటి క్యూలో నిలబడడం, కచ్చితంగా ఎప్పుడొస్తుందో తెలియని రైలు కోసం గంటల తరబడి నిరీక్షించడం, రైలు ఆగి, ఆగకుండానే జనరల్ బోగీలోకి పశువులవలే తోసుకుంటూ వెళ్లడం, అప్పటికే కిక్కిర్సిన బోగీల్లోకి వెళ్లేందుకు కుస్తీ పట్టడం ఆమ్ ఆద్మీకి నిత్యకృత్య అనుభవమే. రెండు దళాబ్దాల క్రితం రాజ్ధాని, శతాబ్ది, దురొంతోస్, యువాస్ లాంటి ప్రీమియర్ రైళ్లు లేనప్పుడే సామాన్య రైలు ప్రయాణికుల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేది. ఫ్లాట్‌ఫామ్‌కు వెళితే టిక్కెట్ కౌంటర్లు ఎక్కువగా ఉండేవి. ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు అంతగా ఆలస్యం అయ్యేవి కావు. ఏ రైలు ఎప్పుడెస్తుందో నల్ల బోర్డుపై ప్రయాణికులకు అర్థమయ్యేలా చాక్‌పీస్‌తో చక్కగా రాసేవారు. ఫ్టాట్ఫామ్పై స్వచ్ఛమైన జామకాయలు, దోసకాయలు, మామాడి పండ్లు, పనస, అల్లనేరేడు, రేగు లాంటి రకరకాల పండ్లను స్థానిక వ్యాపారులు విక్రయించేవారు. వాటిని ఆరగించి ప్రయాణికులను తమ ఆకలిని తీర్చుకునేవారు. ఆదునికత పేరుతో స్థానిక వెండర్లను ఫ్లాట్‌ఫామ్‌ల మీది నుంచి తరిమేశారు. బ్రాండెడ్ ఆహార పదార్థాలు వచ్చి చేరాయి. అవి ఖరీదైనవే కాకుండా ఆరోగ్యానికి కూడా అంత మేలైనవేమి కాదు. ఎక్స్‌ప్రెస్, సూపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రవేశంతో సాధారణ రైళ్ల రాకపోకలు మందగించాయి. వాటికి దారి ఇవ్వడం కోసం వీటిని జంక్షన్లలో నిలిపేస్తుండడంతో గంటల తరబడి ఆలస్యం అవుతున్నాయి. ఇప్పుడు శతాబ్ది, రాజధాని, దురొంతోస్ రైళ్లకు క్లియరెన్స్ ఇవ్వడం కోసం ఎక్క్‌ప్రెస్ రైళ్లను ఎక్కడికక్కడా నిలిపేస్తున్నారు. మధ్య తరగతి నుంచి ఆ పై వర్గాల ప్రయాణికుల కోసం కంప్యూటర్, మోబైల్ నెట్వర్క్ బుకింగ్, తత్కాల్ సేవలు అందుబాటులోకి రావడంతో ఆమ్ ఆద్మీ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. చాలా రైల్వే స్టేషన్లలో ఇప్పటికీ టిక్కెట్ కొనేందుకు ఒకే కౌంటర్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఎప్పుడు చూసి అక్కడ చాంతాడంగా పొడవాటి క్యూలు కనిపిస్తుంటాయి. విమానాశ్రయాల్లాగా మల్టిపుల్ కౌంటర్ వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చు. క్యూలు చెదిరి పోకుండా కౌంటర్‌కు కౌంటర్‌కు మధ్య డివిజన్ ఏర్పాటు చేయవచ్చు. గత రెండు శతాబ్దాలుగా ప్రయాణికులకు అనుగుణంగా త్రీటైర్, ఏసీ టైర్లను పెంచుతున్నారే తప్ప, సామాన్యులను దృష్టిలో పెట్టుకొని జనరల్ బోగీలను పెంచడం లేదు. అందుకనే ఇప్పుడవి పశువుల కొట్టాలను తలపిస్తున్నాయి. రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేసేందుకు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన డిజిటల్ చార్ట్‌లు ఎప్పుడు సవ్యంగా పనిచేయవు. ఢిల్లీ రైల్లే స్టేషన్‌లోని డిజిటల్ బోర్డులనే తీసుకుంటే ఫలానా రైలు బయల్దేరడానికి సిద్ధంగా ఉందని వస్తుంది. అప్పటికే ఆ రైలు వెళ్లిపోయి ఉంటుంది. చాలా సార్తు అక్షరాలు చుక్కల్లా విడిపోయి ఏమీ అర్థం కాదు. సామాన్యుల పరిస్థితి ఇలా ఉన్నప్పుడు జాతి ప్రతిష్ట కోసం బుల్లెట్ రైలు గురించి మాట్లాడటం అర్థరహితం. ఒక్క బుల్లెట్ రైలుకు 60 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆ డబ్బును మరిన్ని అదనపు రైళ్లు, ఇతర ప్రయాణికుల సదుపాయాల కోసం ఖర్చు పెట్టడం సముచితం అవుతుంది. ఇప్పటికే దక్షిణ, పశ్చిమ, ఉత్తర రైలు సర్వీసుల అభివృద్ధి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాలను తొలగించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. భారత్ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టే స్థాయికి ఎదగకూడదన్నది వాదన కాదు, ముందు అత్యావసరాలను గుర్తించాలన్నది ఇక్కడ వాదన. రేపటి రైల్వే బడ్జెట్లో సురేశ్ ప్రభు దృక్పథం ఎలా ఉంటుందో చూడాలి. -
'బుల్లెట్ ట్రైన్స్ కాదు.. బెటర్ ట్రాక్స్ కావాలి'
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో రెండు రైళ్లు నదిలోకి పడిన దుర్ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతుండగానే రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. రైల్వే శాఖ మాజీ మంత్రి, తృణమాల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేది.. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశానికి బుల్లెట్ రైళ్ల కంటే నాణ్యమైన ట్రాక్‌లు అవసరమని త్రివేది వ్యాఖ్యానించారు. రైల్వే ప్రమాద సంఘటనలు జరగకుండా ప్రయాణికులను కాపాడాలంటే నాణ్యమైన ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ధనవంతులు ప్రయాణించే రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని, మిగిలిన రైళ్ల భద్రత చర్యలను గాలికి వదిలేస్తారమని త్రివేది విమర్శించారు. ఈ దుర్ఘటన గురించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. రైల్వే మంత్రి సురేష్ ప్రభు నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఇంకా రైలెక్కలేదు..
న్యూఢిల్లీ: జపాన్, చైనాల్లో విమానాలతో పోటీ పడుతూ బుల్లెట్ రైళ్లు దూసుకెళుతున్నాయి.. భారత్ వంటి దేశాల్లో లోపలా, బయటా కిక్కిరిసిన జనాలతో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.. మరోవైపు ఇప్పటికీ ప్రపంచంలోని చాలా దేశాల్లో రైళ్లే లేవు. ప్రత్యక్షంగా రైలును చూడని, ఎక్కని జనం కోట్లలో ఉన్నారు మరి. ప్రస్తుతం దాదాపు 25 దేశాల్లో అసలు రైళ్లే లేవు. మన పొరుగునే ఉన్న భూటాన్ నుంచి సైప్రస్, ఉత్తర తిమోర్, కువైట్, లిబియా, మకావూ, మాల్టా, నైగర్, ఓమన్, పపువా న్యూగినియా, ఖతార్, రువాండా, సాన్ మారినో, సోలోమన్ ఐలాండ్స్, సోమాలియా, టోంగా, ట్రినిడాడ్, యెమెన్, బహమాస్, బురుండి, బహ్రెయిన్ వంటి దేశాల్లో రైళ్లే లేవు. వీటిలో కొన్నింటిలో బ్రిటిష్ పాలనా కాలంలో రైళ్లు తిరిగినా.. ఇప్పుడు మూలనపడ్డాయి. మరి కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే రైలు మార్గాలను నిర్మించుకుంటున్నాయి. ఇక ప్రపంచంలోనే అతి తక్కువగా మొనాకోలో కేవలం 1.7 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం ఉంది. అలాగే లావోస్‌లో 3.5 కిలోమీటర్లు, నౌరూలో 3.9, లీచెన్‌స్టైన్‌లో 9.5, బ్రూనైలో 13, పరాగ్వేలో 38, సెయింట్ కిట్స్‌లో 58, మన పొరుగునే ఉన్న నేపాల్‌లో 59 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,000 కిలోమీటర్లకన్నా తక్కువగా రైలు మార్గాలున్న దేశాల సంఖ్య ఏకంగా 64 కావడం కొసమెరుపు. రైల్వే ట్రాక్నూ ఎత్తాల్సిందే.. అంతటా రైలొస్తే గేట్లు వేస్తారు... ఇక్కడ మాత్రం పడవలొస్తే రైలు పట్టాలనే ఎత్తేస్తారు.. వెళ్లిపోయాక మళ్లీ దించేస్తారు.. ఆశ్చర్యపోతున్నారా? మన దేశ దక్షిణ దిశన చిట్టచివర ఉన్న రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతూ సముద్రంపై ఈ రైల్వే వంతెన ఉంది. రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జికి ఎటు చూసినా సముద్రం.. మధ్యలో మన రైలు.. కిటికీలోంచి చూద్దామన్నా గుండెలు గుభేలుమనడం ఖాయం. 1902లో రూ. 70 లక్షలతో 600 మందితో ఈ వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. మధ్యలో పాక్ జలసంధిపై రెండు వైపులా ఎత్తగలిగే 65.2 మీటర్ల పొడవున ‘కాంటిలివర్’ బ్రిడ్జినీ నిర్మించారు. ఎప్పుడో వందేళ్ల కింద 1914లో రైళ్లు నడవడం మొదలుపెట్టినా... ఇప్పటికీ వంతెన దృఢంగా ఉంది. 1964లో వచ్చిన భారీ తుపానును ఇది తట్టుకుని నిలవడం అప్పటి ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. -
బుల్లెట్ రైళ్ల యుగంలోనూ డీజిల్ ఇంజిన్ రైళ్లేనా?
దేశ వ్యాపార రాజధాని అయిన ముంబై, దేశంలో 5వ పెద్ద నగరమైన హైదరాబాద్ మధ్య ఇప్పటికీ డీజిల్ ఇంజిన్లతో రైళ్లు నడుస్తున్నాయంటే, ప్రజల అవసరా లు, రైల్వేల అభివృద్ధి పట్ల ప్రభుత్వాలకు ఏపాటి శ్రద్ధ ఉందో అర్థం కాగలదు. గత రెండు దశాబ్దాలుగా భారత రైల్వేల పరిస్థితి అధ్వా నంగా మారుతోంది. రైలు మార్గాల విస్తరణ, ఉన్న మార్గా ల పటిష్టత, ప్రయాణికుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన లాంటి అనేక ముఖ్య అంశాలను, భారత ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగుపర్చడంలో భారత ప్రభుత్వాలు, రైల్వే శాఖ పూర్తిగా విఫలమయ్యాయి. భారత రైల్వేలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని 2.5 కోట్ల రైలు ప్రయాణికులను నిత్యం అవస్థలపాలు చేస్తున్నాయి. కేంద్రంలో చాలా కాలం తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడినందున ఏడు దశాబ్దాల తిరోగమన స్థితికి చరమగీతం పాడి భారత రైల్వేలను ప్రగతి వైపు నడిపించటంలో, ఈ నెల 26న ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ దోహదపడగలదని ఆశిద్దాం. భారత రైల్వేల వైఫల్యాలు: మనకు స్వాతంత్య్రానం తరం, దేశ జనాభా 85 కోట్ల్లు పెరిగి, మొత్తం జనాభా 120 కోట్లకు చేరింది. అయితే మన పాలకులు పెరిగిన 85 కోట్ల జనాభా అవసరాలకు, కేవలం 12వేల కి.మీ రైలు మార్గాన్ని నిర్మించారు. ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్లో కొత్త రైళ్లను అవే మార్గాలలో ప్రవేశపెట్టడం వలన ట్రాక్‌పై ఒత్తిడి పెరిగి, తరచూ ప్రమాదాలు, ప్రాణనష్టం సంభవిస్తున్నాయి. మొత్తం 65 వేల కి.మీ రైలు మార్గం లో 20,884 కి.మీ (31.9 శాతం) విద్యుదీకరణ జరిగినా, ఇంకా 70 శాతం మార్గాన్ని విద్యుదీకరించవలసి ఉంది. దేశ వ్యాపార రాజధాని అయిన ముంబై, దేశంలో 5వ పెద్ద నగరమైన హైదరాబాద్ మధ్య ఇప్పటికీ డీజిల్ ఇంజిన్లతో రైళ్లు నడుస్తున్నాయంటే, ప్రజల అవసరాల పట్ల ఏపాటి శ్రద్ధ ఉందో అర్థం కాగలదు. రైల్వేల అవసరాలకు సరిపడా రైలు ఇంజిన్లు, రైలు పెట్టెల నిర్మాణం, రైలు బోగీల మరమ్మతులు, గూడ్స్ వ్యాగన్ల నిర్మాణం జరగడంలేదు. మనిషి కాపలాలేని వేల లెవెల్ క్రాసింగ్‌లు ఇంకా నడుస్తూ, ప్రతి ఏడాది అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పైగా ఒక్కో రైలు లో ఒక్కో ధరకు ఆహార పదార్థాలను విక్రయిస్తూ రోజూ లక్షలాది ప్రయాణికులను దోచుకుంటున్నారు. దేశంలో 12,500 ైరె ళ్లల్లో అత్యధిక శాతాన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లుగా పేరు మార్చి సర్‌చార్జి మొత్తం బెర్త్‌లలో 30 శాతం తత్కాల్ పేరుతో 100-200 ఎక్కువ వసూలు, ఇవి చాలక తత్కాల్‌కు కేటాయించిన బెర్త్‌లలో 50 శాతం ప్రీమియం తత్కాల్ పేరుతో టికెట్ ధరపై రెట్టింపు చార్జిని వసూలును 2014 అక్టోబర్ 1 నుండి అమలు చేస్తున్నారు. అధిక చార్జీల భారాన్ని మోయలేక సకు టుంబ సమేతంగా వెయ్యి కి.మీ లోపు దూర ప్రయా ణానికి కూడా స్వంత కార్లలో ప్రయాణాలు సాగిస్తుం డగా, కొందరు అదే ఖర్చుతో విమాన యానాన్ని ఆశ్రయిస్తున్నారు. పైగా, ఇప్పుడిస్తున్న అరకొర నిధులు ఇలానే ఇస్తే నిర్మాణ వ్యయం పెరగటమేగాక, కొత్త మార్గాలు పూర్తికాక, రైల్వేలకు అవి గుదిబండలుగా తయారవుతాయి. తెలంగాణలో కొత్త ప్రాజెక్టుల ఆవశ్యకత : పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ మార్గం నిర్మాణం గత 2 దశాబ్దాలుగా నడుస్తోంది. అలానే బీబీనగర్- సికిందరాబాద్ మధ్య 3వ లైన్ నిర్మాణ పనులు జరుగు తున్నా, సరిపడా నిధులు కేటాయించడం లేదు. బీబీనగర్-నడికుడి రెండవ లైన్‌కు, సికింద్రాబాద్- జహీరాబాద్‌కు, కాచిగూడ-చిట్యాలకు, జగ్గయ్యపేట- మిర్యాలగూడకు, డోర్నకల్-మణుగూరు, ఆర్మూరు- ఆదిలాబాద్, పటాన్చెరు-పెద్దపల్లి, సికిందరాబాద్- కరీంనగర్ల మధ్య కొత్త లైన్ల నిర్మాణానికి, మనోహ రాబాద్-గద్వాల నిర్మాణానికి సర్వేలు జరిగి అరకొర నిధులు కొన్ని, అసలు నిధులు కేటాయించక మరికొన్ని నిద్రావస్థలో ఉన్నాయి. ఖాజీపేటలో వ్యాగన్ల ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతి ఇచ్చినా పనులు ప్రారంభిం చలేదు. సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్ ఫారంల సంఖ్య పెంచి, రైళ్ల ఆలస్యాన్ని తగ్గించాలి. నడికుడి- బీబీనగర్ మార్గాన్ని విద్యుదీకరించాలి. హైదరాబాద్ ఎంఎంటిఎస్ 2వ దశ పనులను వేగవంతం చేయాలి. సికింద్రాబాద్ స్టేషన్లో సాధారణ టికెట్ కౌంటర్లను పెంచాలి. ఎస్కలేటర్ సౌకర్యాన్ని అన్ని ప్లాట్ఫారంలలో నిర్మిం చాలి. సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లు సకాలంలో గమ్య స్థానం చేరే చర్యలు చేపట్టాలి. రైల్వేల అభివృద్ధి కొరకు స్వదేశీ లేదా విదేశీ నిధులను కంట్రాక్టర్లు లేదా సంపన్న వర్గాలకు లబ్ది చేకూర్చేదిగా ఉండకూడదు. ప్రయాణ చార్జీలు పెంచితే 6 శాతం ప్రయాణికులు రైల్వేకు దూరమైన స్థితిలో, బుల్లెట్ రైళ్లను ప్రయాణికులు ఆదరిస్తారా? కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉన్న భారత రైల్వేలు, ప్రజాసౌకర్యాల కోసం లక్షల కోట్ల భారాన్ని మోయగలవా? ప్రీమియం తత్కాల్ పేరుతో రెట్టింపు చార్జీలను పెంచటం దారుణం. ఈ చర్య రైల్వేలను ప్రయాణికులకు దూరం చేయడం కాదా? వీటన్నింటినీ గుర్తించి, ప్రయాణ చార్జీలు పెంచకుండా, ప్రీమియం తత్కాల్ విధానాన్ని రద్దు చేసి, తెలుగు రాష్ట్రాలలోని 2 లేదా 3 కొత్త లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చి, సత్వరం వాటికి పూర్తి స్థాయి నిధులు కేటాయించాలి. ఉన్న మార్గాలను పటిష్టపరచే చర్యలు చేపట్టాలి. రైళ్లలో దేశవ్యాపితంగా ఆహార పానీయాలను ఒకే ధరకు అమ్మేలా చర్యలు తీసుకోవాలి. రైళ్లలో సరిపడ నీటిలభ్యత, పరిశుభ్రతలకు చర్యలు చేపట్టాలి. అన్ని ప్రధాన స్టేషన్లలో ఫార్మసీ షాపులు ప్రారంభించి లక్షలాది ప్రయాణికుల అనారోగ్య సమస్యలను పార దోలాలి. భద్రతా చర్యలు మెరుగుపరచి, దొంగతనాలు, దోపిడీలను నివారించాలి. అన్ని కొత్త మార్గాల నిర్మాణా నికి రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వేలు 50:50 నిధులు కేటాయించడం ద్వారా కొత్త లైన్ల నిర్మాణం పూర్తి చేయాలి.ఈ చర్యలతోనే రైల్వేల అభివృద్ధి సాధ్యం. ఎం రోజా లక్ష్మీ (ఈ నెల 26న రైల్వే బడ్జెట్ సమర్పణ సందర్భంగా...) వ్యాసకర్త సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ కార్యకర్త మొబైల్ : 9441048958 -
బుల్లెట్ రైళ్లకు సహకారమందిస్తాం: జపాన్
టోక్యో: భారత దేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని జపాన్ దేశం స్పష్టం చేసింది. జపాన్ పర్యటనలో భాగంగా నరేంద్రమోడీ ఆదేశ ప్రధాని షియిజో అబేల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్ధిక, సాంకేతిక రంగాల్లో సహకారమందిస్తామని జపాన్ హామీ ఇచ్చింది. ఈ చర్చల్లో బుల్లెట్ రైళ్ల ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. ఇన్ ఫ్రా, రైల్వే, పౌర విమానం, ఎనర్జీ రంగాల్లో సహకారమందించుకోవడానికి ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. -
స్కై కార్.. సూపర్..
చూశారా.. గాల్లో ఎలా వెళ్లిపోతున్నాయో.. ప్రస్తుతానికి ఇది డిజైనే అయినా.. 2016లో ఇది మన కళ్ల ముందు సాక్షాత్కరించనుంది. వచ్చే ఏడాది ఇజ్రాయెల్‌లోని ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ క్యాంపస్‌లో ఈ మాగ్నటిక్ స్కైకార్ల వ్యవస్థను నిర్మించనున్నారు. ప్రజారవాణా వ్యవస్థలో మరో ముందడుగుగా భావిస్తున్న ఈ స్కై కార్ల సృష్టికర్త కాలిఫోర్నియా కంపెనీ స్కైట్రాన్. ఒక్కో స్కైకారులో ఇద్దరు కూర్చునే వీలుం టుంది. డ్రైవర్లు ఎవరూ ఉండరు. అంతా కంప్యూటర్ నడిపిస్తుంటుంది. మాగ్నటిక్ ట్రాక్స్ ఆధారంగా ఇవి వెళ్తుంటాయి. మాగ్నటిక్ లెవిటేషన్ అనే టెక్నాలజీని ఉపయోగించి.. ఈ వ్యవస్థను రూపొందించారు. ప్రస్తుతం జపాన్‌లో బుల్లెట్ రైళ్లకు ఇదే పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. స్కైకార్లు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. భవిష్యత్తులో వీటి వేగాన్ని గంటకు 240 కిలోమీటర్లకు పెంచుతామని స్కైట్రాన్ కంపెనీ చెబుతోంది. ట్రాఫిక్ సమస్యలకు ఇది చక్కని పరిష్కారమంటోంది. స్కైకార్లు విజయవంతమైతే.. ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ నగరమంతా వీటిని ఏర్పాటు చేయనున్నారు. టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.300 వరకూ ఉండవచ్చు. -
బెంగళూరులో బుల్లెట్ రైళ్లు!
కర్ణాటకలో బుల్లెట్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. బెంగళూరు నుంచి మైసూర్, చెన్నైలకు వీటిని నడపాలని భావిస్తోంది. జపాన్ సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సహాయంతో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ప్రగతి పథంలో దూసుకుపోతున్న బెంగళూరులో వేగంగా పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చేందుకు బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. వారం రోజుల పాటు చైనాలో పర్యటించిన ఆయన రెండు రోజుల క్రితం సొంత రాష్ట్రానికి తిరిగొచ్చారు. తమ రాష్ట్రంలో బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టాలని జపాన్ నిపుణులను ఆహ్వానించానని సిద్ధరామయ్య తెలిపారు. ఇందులో భాగంగా రైల్వే శాఖ, తమ రాష్ట్ర అధికారులతో చర్చలు జరపాలని సూచించినట్టు చెప్పారు. ముందుగా బెంగళూరు- మైసూర్-చెన్నై మధ్య బుల్లెట్ రైళ్లు నడపాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రపంచంలో మొట్టమొదటగా బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టి, విజయవంతంగా నడుపుతున్న ఘనత జపాన్‌కు చెందుతుందని చెప్పారు. తమ రాష్ట్రంలో హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు జపాన్ సాంకేతిక సహాయం బాగా ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.