న్యూఢిల్లీ: దేశంలోని భారతీయ రైల్వే రోజుకు 19 వేల రైళ్లను నడుపుతున్నాయి. తద్వారా రోజుకు 2.30 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. 13 లక్షల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఎక్కువ మందికి ఉపాధి కల్పించడంలో ప్రపంచంలోనే ఎనిమిదవ అతిపెద్ద సంస్థగా గణతికెక్కింది. ఇది మన రైల్వేకు ఒక పార్శిక భాగం మాత్రమే. రైళ్లు తరచుగా ఆలస్యంగా నడుస్తాయి. ఇరుగ్గా, మురిగ్గా ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యం ప్రయాణికులకు భద్రత తక్కువ. ఈ పార్శిక భాగమే మన ప్రభుత్వాలకు పట్టడం లేదు.
దేశంలో ఒక్క 2014 సంవత్సరంలో జరిగిన రైలు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా 27,581 మంది ప్రయాణికులు మరణించారు. మనకు రైళ్లను పరిచయం చేసిన బ్రిటన్ దేశంలో గడచిన దశాబ్ద కాలంలో రైలు ప్రమాదం కారణంగా ఒక్కరంటే ఒక్క ప్రయాణికుడు మరణించలేదు. నిన్నగాక మొన్న సంభవించిన పూరి–హరిద్వార్–కలింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 22 మంది ప్రయాణికులు మరణించారు. మానవ సమన్వయ లోపం కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలగా, రైళ్ల రాకపోకలను మూసివేయకుండా రైల్వే లైను మరమ్మతులు చేపట్టడం వల్ల ప్రమాదం సంభవించినట్లు తాజాగా తేలింది. రైలు పట్టాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, దేశంలోని 40 శాతం ట్రాకులను నూటికి నూరు శాతం ఇప్పటికే ఉపయోగించడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాల్లో 46 శాతం ప్రమాదాలు రైళ్లు పట్టాలు తప్పడం వల్లనే జరుగుతున్నాయి.
ఆ తర్వాత ఎక్కువగా రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు 43 శాతం జరుగుతున్నాయి. అన్ని రైల్వే క్రాసింగ్‌ల వద్ద కాపలా గేట్లు అమర్చడం వల్లనో, వంతెనలను నిర్మించడం వల్లనో వీటిని పూర్తిగా నిర్మూలించవచ్చని రైల్వే భద్రతాచర్యలపై వేసిన కకోద్కర్ కమిటీ 2012లో సిపార్సు చేసింది. ఇలాంటి ఎన్నో కమిటీలు ఎన్నో సిఫార్సులు చేస్తున్నా పట్టించుకుంటున్న ప్రభుత్వాలు లేవు. ప్రజా సంబంధాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వాలు ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నామని, కొత్త లైన్లను వేస్తున్నామని ప్రకటిస్తారే తప్ప, నూటికి నూరు శాతం సర్వీసు ఇచ్చిన పాత లైన్లను తీసేసి కొత్త లైన్లను వేస్తున్నామని చెప్పరు. వేయడానికి ప్రయత్నించరు. ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలును ప్రవేశపెడుతున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడమే కాకుండా నిధులను కూడా విడుదల చేశారు. ఒక్క భారీ ప్రయాణికుల విమానానికయ్యే ఖర్చు ఈ ఒక్క బుల్లెట్ రైలుకు అవుతుంది. కొద్ది మంది ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ రైలు కోసం పెడుతున్న ఖర్చును పాత రైల్వేలైన్ల పునరుద్ధరణకు మళ్లించినట్లయితే 30 శాతం ప్రయాణికుల మతులను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
బుల్లెట్ రైలు కావాలా, భద్రత కావాలా?
Published Mon, Aug 21 2017 4:39 PM | Last Updated on Tue, Sep 12 2017 12:41 AM
Advertisement