మనం బుల్లెట్ రైళ్లను నడపడమా?
మనం బుల్లెట్ రైళ్లను నడపడమా?
Published Mon, Jan 23 2017 6:41 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM
భారతీయ రైల్వే పట్టాలపై బుల్లెట్ ట్రెయిన్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంటే ‘ఏమీ హాయిలే హలా’ అంటూ పాడుకోవచ్చు. అమెరికా, చైనా, జపాన్‌లే కాదు, భారత్ కూడా గాలిలో తేలిపోయే బుల్లెట్ ట్రెయిన్లను నడుపుతుందోచ్! అంటూ గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు ఉంటుందే తప్ప, వాస్తవానికి దగ్గరగా ఉండదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 40 మంది ప్రయాణికులు దుర్మరణం చెందడం మన ప్రభువులు దుర్మార్గాన్ని చెప్పకనే చెబుతోంది. గత రెండున్నర నెలల్లో జరిగిన ఇది మూడో పెద్ద ప్రమాదం. నవంబర్ 10వ తేదీన ఇండోర్-పట్నా రైలు పట్టాలు తప్పడంతో 150 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెల్సిందే. మృతుల రీత్యా ఆ తర్వాత సంభవించిన రెండో పెద్ద ప్రమాదం ఇదే. 2009–10 నుంచి 2015–16 మధ్య దేశంలో సంభవించిన రైలు ప్రమాదాల్లో మొత్తం 620 మంది ప్రయాణికులు మరణించారు.
అధికారంలో ఉన్న మన ప్రభువులు బుల్లెట్ రైళ్ల గురించి కలగంటున్నారే తప్ప ప్రస్తుతం నడుపుతున్న రైళ్లకు ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు సరైన చర్యలేవీ తీసుకోవడం లేదు. ముంబై–సూరత్ మధ్య బుల్లెట్ రైలు నడపాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేసింది. అందులో సగం నిధులను వెచ్చించినా రైలు పట్టాలను పటిష్టం చేసుకోవచ్చు. ప్రమాదాలు జరుగకుండా చూసుకోవచ్చు. చైనాలో కిలీమీటరు పట్టాలకు రైల్లో ప్రయాణిస్తున్న ప్రజల సంఖ్యలో మన రైళ్లలో కిలోమీటరుకు ప్రయాణిస్తున్న వారి సంఖ్య 68 శాతమే. అయితే మన దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాల్లో పది శాతం కూడా చైనాలో ఎందుకు జరగడం లేదు?
చైనా, జపాన్ దేశాలకు బలమైన రైల్వే నెట్‌వర్క్ ఉంది. అవి బుల్లెట్ ట్రెయిన్లను నడుపుతాయి, అంతకన్నా వేగంగా దూసుకెళ్లే లేజర్ రైళ్లను కూడా నడుపుతాయి. మనం బ్రిటిష్ కాలంలో వేసిన రైలు పట్టాలను కూడా పూర్తిగా మార్చుకోలేదు. మనం బుల్లెట్ రైళ్లను నడిపితే అవి మృత్యు గుహలోకి దూసుకెళ్లాల్సిందే.
Advertisement
Advertisement