9 వేల కిలోమీటర్ల మేర 10 వేల రైళ్లలో ఏర్పాటు
ఏడు రకాల ప్రమాదాల నుంచి రక్షణ
ఏపీలో ఇప్పటికే 120 కి.మీ. మేర కవచ్
ఈ ఏడాది మరో 550 కి.మీ ఏర్పాటు
2030 నాటికి మరో 600 కి.మీ కవచ్ రక్షణ.. రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ కార్యాచరణ
సాక్షి, అమరావతి: దేశంలో రైలు ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటుకు రైల్వే శాఖ కార్యాచరణ వేగవంతం చేసింది. ఒకే ట్రాక్‌పై పొరపాటున రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొనకుండా అడ్డుకునేందుకు ‘రీసెర్చ్ డిజైన్స్– స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌వో) 2022లో రూపొందించిన ఈ కవచ్ వ్యవస్థను 2030 నాటికి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని ప్రణాళిక సిద్ధం చేసింది.
గత ఐదేళ్లలో సగటున ఏడాదికి 43 రైలు ప్రమాదాల్లో 56 మంది చొప్పున దుర్మరణం చెందారు. దాంతో రైలు ప్రమాదాల నివారణకు కవచ్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయోగాత్మకంగా మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసిన రైల్వే శాఖ, రెండో దశ కింద దేశంలో 10 వేల రైళ్లలో 9 వేల కిలోమీటర్ల మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
అందుకోసం సర్వే పూర్తి చేసి, టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఏపీలో ఇప్పటికే 120 కి.మీ.మేర కవచ్ రక్షణ అందుబాటులో ఉండగా, వచ్చే ఏడాది మరో 550 కి.మీ.మేర ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఇంకో 600 కి.మీ.మేర అందుబాటులోకి తేనుంది. మొత్తం ఏడు రకాల రైలు ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన కవచ్ ప్రాజెక్ట్ రైల్వే భద్రతలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుంది.
రెండో దశలో 10 వేల రైళ్లు.. 9 వేల కి.మీ..
కవచ్ రెండో దశ ప్రాజెక్ట్ కోసం దశల వారీగా టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మొత్తం 10 వేల రైళ్లలో 9వేల కి.మీ.మేర కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోసహా 12 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ కోసం 18 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది. కిలోమీటరుకు రూ.50 లక్షల చొప్పున, ఒక్కో లోకో(రైలు)కు రూ.70 లక్షల చొప్పున వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది.
2025 ఏప్రిల్‌లో ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 10 వేల రైళ్లు, 9 వేల కి.మీ.లలో కవచ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. అనంతరం మూడో దశ కింద మరో 10 వేల రైళ్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. దాంతో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థకు 100 శాతం కవచ్ రక్షణ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.
కర్నూలు– గుంతకల్లు మధ్య కవచ్
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 122 కిలోమీటర్ల మేర కవచ్ రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కవచ్ ఏర్పాటులో భాగంగానే కర్నూలు– గుంతకల్లు మధ్య కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కాగా తూర్పు కోస్తా రైల్వే ఒడిశాలోని భద్రక్ నుంచి విశాఖపట్నం శివారులోని దువ్వాడ వరకు 550 కి.మీ. మేర రూ.280 కోట్లతో ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది.
2025 చివరి నాటికి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. చెన్నై –కోల్‌కతా కారిడార్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 600 కి.మీ.మేర ఈ వ్యవస్థను 2030 నాటికి అందుబాటులోకి తేనుంది. అందుకోసం టెండర్ల ప్రక్రియను ఈ జనవరిలో పూర్తి చేయనుంది.
‘కవచ్’తో ఏడు రకాల ప్రమాదాల నివారణ
» రెడ్ సిగ్నల్ పడితే రైలు డ్రైవర్‌తో నిమిత్తం లేకుండానే కనీసం 50 మీటర్ల ముందు రైలు ఆటోమేటిగ్గా నిలిచిపోతుంది. హఠాత్తుగా ఏదైనా తీవ్ర అనారోగ్యంగానీ ఇతరత్రా కారణాలతో బ్రేక్ వేయలేని స్థితిలో డ్రైవర్ ఉన్నా సరే రైలు ప్రమాదం సంభవించకుండా అడ్డుకుంటుంది.
» 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్న రైలును కాషన్ జోన్లు (వేగం తగ్గించాల్సిన ప్రదేశాలు) రాగానే కనీసం 10 కి.మీ. వేగం ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. కాషన్ జోన్ దాటిన తర్వాత మళ్లీ వేగం పుంజుకుంటుంది.
» లూప్‌లైన్లలో రైలు వేగం ఆటోమేటిగ్గా గంటకు 30 కి.మీ. వేగానికి తగ్గిపోతుంది.
» స్టేషన్ మాస్టర్ ఎర్ర జెండా ఊపగానే రైలు ఆటోమేటిగ్గా వేగం తగ్గి నిలిచిపోతుంది.
» లెవల్ క్రాసింగ్ సమీపించగానే ఆటోమేటిగ్గా రైలు హార్న్ గట్టిగా మోగుతుంది. దాంతో లెవల్ క్రాసింగ్ వద్ద ఉన్న వారు అప్రమత్తమవుతారు.
» రైలు ప్రయాణంలో ఉన్నంత సేపు ఆ పరిధిలోని క్యాబ్ సిగ్నల్ పని చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత వచ్చే సిగ్నల్ ఎప్పుడన్నది లోకో (రైలు ఇంజిన్)లో డిస్ ప్లే అవుతూనే ఉంటుంది.
» రెడ్ హోమ్ సిగ్నల్ కనిపించగానే (అంటే రైలు అత్యవసరంగా నిలపాలనే సిగ్నల్) రైలు ఆటోమేటిక్‌గానిలిచిపోతుంది. అదే ట్రాక్‌పై ఎదురుగా 15 కి.మీ. దూరంలో మరో రైలు ఉందని తెలిసినా, ట్రాక్‌పై అవాంఛనీయ వస్తువులు లేదా ఇతరత్రా ఏమైనా ఉన్నట్టు గుర్తించినా వెంటనే రెడ్‌హోమ్ సిగ్నల్ పడుతుంది. దాంతో రైలు ఆటోమేటిగ్గా నిలిచిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment