విజయవాడ నుంచి బయల్దేరిన రైల్లో భౌతిక దూరం పాటించి కూర్చున్న కూలీలు
సాక్షి, ముంబై/సాక్షి, విజయవాడ/కొలిమిగుండ్ల: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి మంగళవారం వలస కూలీల రైళ్లు మొదలయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా ముంబైలోచిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను తీసుకుని కళ్యాణ్ జంక్షన్ నుంచి మంగళవారం రాత్రి శ్రామిక్ ప్రత్యేక రైలు గుంతకల్‌కు బయల్దేరింది. ఈ రైల్లో అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు సమీప ప్రాంతాలకు చెందిన సుమారు 1200 మంది తమ స్వస్థలాలకు బయల్దేరారు. బుధవారం రాత్రికి వీరు గుంతకల్ చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన మత్స్యకారులు ముంబైలో పనిచేస్తుంటారు. ముంబైలోని బందర్, దానా బందర్ తదితర ప్రాంతాల్లోని మురికి వాడల్లో వీరు నివసిస్తుంటారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వీరికి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి లభించడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. తమ ఇబ్బందులు వెలుగులోకి తీసుకువచ్చిన సాక్షికి మత్స్యకారులు ధన్యవాదాలు తెలిపారు.
ముంబై సమీపంలోని కళ్యాణ్ జంక్షన్ నుంచి మత్స్యకారులతో బయల్దేరిన రైలు
స్వస్థలాలకు మహారాష్ట్ర వలస కూలీలు
జీవనోపాధి కోసం కృష్ణా జిల్లాకు వచ్చిన మహారాష్ట్రలోని చంద్రాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 1,212 మంది వలస కూలీలను రాష్ట్ర ప్రభుత్వం వారి స్వస్థలాలకు పంపించింది. కలెక్టర్ ఎ.ఎండీ ఇంతియాజ్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత పర్యవేక్షణలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రత్యేక రైల్లో కూలీలు వారి ప్రాంతానికి తరలివెళ్లారు. జిల్లాలోని గంపలగూడెం పరిసర ప్రాంతాలకు ఏటా మార్చి నెలలో మిర్చి కోతల కోసం మహారాష ్టనుంచి కూలీలు వస్తారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా వీరంతా ఇక్కడే ఇరుక్కుపోయారు. కూలీలను 48 బస్సుల్లో గంపలగూడెం నుంచి విజయవాడ తరలించిన అధికారులు భోజనాల అనంతరం రాయనపాడు రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఒక్కో బోగీలో 50 మంది చొప్పున 24 బోగీల్లోకి కూలీలను ఎక్కించారు. కాగా కర్నూలు జిల్లా కల్వటాల–కొలిమిగుండ్ల మధ్య నిర్మిస్తున్న రామ్‌కో సిమెంట్ కంపెనీ పనులు చేసేందుకు వచ్చిన పలు రాష్ట్రాల వలస కూలీలను స్వస్థలాలకు పంపిస్తున్నారు. బిహార్‌కు చెందిన 480 మందిని మంగళవారం బస్సుల్లో కర్నూలు రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక రైల్లో బిహార్‌కు పంపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment