సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
నూతన డిజైన్‌ను ఆమోదించిన ప్రధాని
ఈ ఏడాది చివరకు పట్టాలెక్కించేలా ప్రణాళిక
తద్వారా తగ్గనున్న నిర్వహణ వ్యయం
కార్గోలో రెట్టింపు లక్ష్యం పెట్టుకున్న రైల్వే శాఖ
ఇప్పటి దాకా ప్రయాణికులు, సరకు రవాణాకు వేర్వేరు రైళ్లు
సాక్షి, అమరావతి: కొత్త తరహా డబుల్ డెక్కర్ రైళ్లు త్వరలో పట్టాలు ఎక్కనున్నాయి. ప్రయాణికులు, సరుకు రవాణా ఒకేసారి గమ్యం చేరేలా సరికొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సరికొత్త రైలు డిజైన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
ఈ మోడల్ రైళ్ల డిజైన్‌ను గత ఏడాది చివర్లో రైల్వే శాఖ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించగా, ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సరికొత్త డబుల్ డెక్కర్ రైలు డిజైన్‌ను రైల్వే రీసెర్చ్–డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించింది. పై అంతస్తును ప్రయాణికులకు, కింద అంతస్తును సరుకు రవాణాకు ఉపయోగిస్తారు.
తద్వారా ఒకేసారి ప్రయాణికులు, సరుకు త్వరితగతిన నిర్దేశిత గమ్యస్థానాలను చేరేలా ఈ డబుల్ డెక్కర్ రైళ్లు ఉపకరించడంతో నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ప్రస్తుతం రైలు ప్రయాణికుల కోసం సాధారణ రైళ్లు, సరుకు రవాణా కోసం గూడ్స్ రైళ్లను ఉపయోగిస్తున్నారు.
ఒక్కో కోచ్‌కు రూ.4 కోట్లు
డబుల్ డెక్కర్ రైళ్లలో 18 నుంచి 22 కోచ్‌ల చొప్పున నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో కోచ్‌ను రూ.4 కోట్లతో నిర్మించనున్నారు. ఇప్పటికే కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీలో 10 కోచ్‌లను తయారు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి డబుల్ డెక్కర్ రైళ్లను పట్టాలు ఎక్కించాలని రైల్వే శాఖ భావిస్తోంది. అందుకోసం కోచ్‌ల తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది.
మరోవైపు కార్గో రవాణా ద్వారా మరింత రాబడి సాధించేందుకు ఈ సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్లు దోహదపడతాయని రైల్వే శాఖ ఆశిస్తోంది. 2023–24లో రైల్వే 1,591 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేసింది. 2030 నాటికి 3 వేల మిలియన్ టన్నుల కార్గో రవాణా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అందుకోసం ఏటా 10 శాతం చొప్పున కార్గో రవాణా పెరగాల్సి ఉంది. ఆ లక్ష్య సాధనకు ఈ రైళ్లు దోహదపడతాయని రైల్వే శాఖ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment