double-decker train
-
పైన ప్రయాణికులు.. కింద సరుకు
సాక్షి, అమరావతి: కొత్త తరహా డబుల్ డెక్కర్ రైళ్లు త్వరలో పట్టాలు ఎక్కనున్నాయి. ప్రయాణికులు, సరుకు రవాణా ఒకేసారి గమ్యం చేరేలా సరికొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సరికొత్త రైలు డిజైన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మోడల్ రైళ్ల డిజైన్‌ను గత ఏడాది చివర్లో రైల్వే శాఖ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించగా, ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సరికొత్త డబుల్ డెక్కర్ రైలు డిజైన్‌ను రైల్వే రీసెర్చ్–డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది. పై అంతస్తును ప్రయాణికులకు, కింద అంతస్తును సరుకు రవాణాకు ఉపయోగిస్తారు. తద్వారా ఒకేసారి ప్రయాణికులు, సరుకు త్వరితగతిన నిర్దేశిత గమ్యస్థానాలను చేరేలా ఈ డబుల్ డెక్కర్ రైళ్లు ఉపకరించడంతో నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ప్రస్తుతం రైలు ప్రయాణికుల కోసం సాధారణ రైళ్లు, సరుకు రవాణా కోసం గూడ్స్ రైళ్లను ఉపయోగిస్తున్నారు.ఒక్కో కోచ్‌కు రూ.4 కోట్లు డబుల్ డెక్కర్ రైళ్లలో 18 నుంచి 22 కోచ్‌ల చొప్పున నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో కోచ్‌ను రూ.4 కోట్లతో నిర్మించనున్నారు. ఇప్పటికే కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీలో 10 కోచ్‌లను తయారు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి డబుల్ డెక్కర్ రైళ్లను పట్టాలు ఎక్కించాలని రైల్వే శాఖ భావిస్తోంది. అందుకోసం కోచ్‌ల తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. మరోవైపు కార్గో రవాణా ద్వారా మరింత రాబడి సాధించేందుకు ఈ సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్లు దోహదపడతాయని రైల్వే శాఖ ఆశిస్తోంది. 2023–24లో రైల్వే 1,591 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేసింది. 2030 నాటికి 3 వేల మిలియన్ టన్నుల కార్గో రవాణా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఏటా 10 శాతం చొప్పున కార్గో రవాణా పెరగాల్సి ఉంది. ఆ లక్ష్య సాధనకు ఈ రైళ్లు దోహదపడతాయని రైల్వే శాఖ భావిస్తోంది. -
మూణ్నాళ్ల ముచ్చట!
- నేటి నుంచి డబుల్ డెక్కర్ రైళ్లు బంద్ - ఆదరణ లేకపోవడంతో విరమించుకున్న రైల్వే సాక్షి, హైదరాబాద్: రెండంతస్తుల రైలు కథ కంచికి చేరింది. ఎరుపు, పసుపు రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే డబుల్ డెక్కర్ రైలు సేవలు సోమవారం నుంచి శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. రెండేళ్ల క్రితం నగరవాసులకు అందుబాటులోకి వచ్చిన ఈ రైలు ఆకస్మిక నిష్క్రమణ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. కాచిగూడ నుంచి గుంటూరు, తిరుపతికి దీన్ని నడిపారు. రెండు రూట్లలోనూ ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదు. ఒకదానిపైన ఒకటి చొప్పున ఉన్న రెండు వరుసల సీట్లలో ఇరుక్కొని కూర్చొని ప్రయాణించడం కష్టంగా మారడంతో ఈ రెలైక్కేందుకు నగరవాసులు వెనుకడుగు వేశారు. 1,200 సీట్లు ఉన్న ఈ ట్రైన్ ఏ రోజూ ప్రయాణికులతో కిటకిటలాడింది లేదు. ఒక్కోసారి కాచిగూడ నుంచి గుంటూరుకు 10 నుంచి 15 మంది ప్రయాణికులతోనే బయలుదేరిన రోజులూ ఉన్నాయి. ఆదాయాన్ని మించిన ఖర్చు... డబుల్ డెక్కర్ రైలులో ప్రయాణికుల కంటే దానిని నడిపేందుకు పనిచేసే లోకోపైలట్లు, సహాయ లోకోపైలట్లు. గార్డులు, తదితర సిబ్బంది సంఖ్యే ఎక్కువగా ఉండేది. కాచిగూడ- తిరుపతి మధ్య ఒక్క ట్రిప్పు నడిపేందుకు అయ్యే నిర్వహణ ఖర్చు సుమారు రూ.30 లక్షలు. కానీ ఆ ట్రిప్పులో వచ్చే ఆదాయం కేవలం రూ.25 వేల నుంచి రూ.50 వేలు మాత్రమే. కాచిగూడ-గుంటూరు మార్గంలో అరుుతే రూ.10 వేలు కూడా రాలేదు. రెండేళ్లుగా ఈ తెల్ల ఏనుగును కొనసాగించేందుకు దక్షిణమధ్య రైల్వే పెట్టిన ఖర్చు రూ.వంద కోట్ల పైమాటే. ఆక్యుపెన్సీ దారుణం... డబుల్ డెక్కర్ రైలు ఆక్యుపెన్సీ రేషియో 10 నుంచి 25 శాతం మధ్య ఉంది. కాచిగూడ- తిరుపతి రైలుకు గత సెప్టెంబర్‌లో ప్రయాణికుల సంఖ్య 20 నుంచి 40 లోపే. ఆదాయం ఆ నెలలో రూ.60 వేలు దాటలేదు. అక్టోబర్‌లోనూ ఇదే పరిస్థితి. కాచిగూడ- తిరుపతి మార్గంలో మెరుగ్గా కనిపించింది. నెలకు సగటున రూ..2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం లభించింది. ‘‘డబుల్ డెక్కర్‌లో కొన్ని లోపాలున్న మాట నిజమే. పూర్తిగా ఏసీ సదుపాయం ఉన్న ఈ ట్రైన్ పగటి పూట పయనించే వాళ్లను ఆకట్టుకుంటుందని ఆశించాము. కానీ ఫలితం దక్కలేదు సరి కదా... నిర్వహణ వ్యయం తడిసి మోపెడైంది. దీంతో ఈ బండిని ఉపసంహరించుకోవడమే మంచి దని భావించాం’’అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
డబుల్ డెక్కర్ రైలు ఔట్!
- భాగ్యనగరం నుంచి తిరుపతి, గుంటూరు సర్వీసుల ఉపసంహరణ - హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు తరలించాలని రైల్వే బోర్డు నిర్ణయం - జూన్ 30 వరకు విశాఖ-తిరుపతి మధ్య ట్రయల్ రన్ - ఆక్యుపెన్సీ రేషియో లేదని ఈ నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డబుల్ డెక్కర్ రైలు దారిమళ్లింది. దానిని విశాఖపట్నానికి తరలించాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. వేరే రాష్ట్రాల లాబీయింగ్‌ను అధిగమించి సాధించుకున్న ఈ సూపర్‌ఫాస్ట్ రైలుకు రైల్వే యంత్రాంగం ప్రణాళికాలోపం కారణంగా ఆదరణ కరువైంది. హైదరాబాద్ (కాచిగూడ) నుంచి వారంలో రెండు రోజులు తిరుపతి, మరో రెండు రోజులు గుంటూరుకు తిరుగుతున్న ఈ రైలు ఆక్యుపెన్సీ రేషియో అతి తక్కువగా నమోదవుతోంది. దీంతో హైదరాబాద్ నుంచి శాశ్వతంగా దాన్ని రద్దు చేసి విశాఖపట్నం నుంచి తిరుపతికి నడపాలని తాజాగా నిర్ణయించింది. దీంతో ఈ నెల 12 నుంచి 30 వరకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయాన్ని వెల్లడించకుండా సాంకేతిక కారణాల రీత్యా 12 నుంచి 30 వరకు తాత్కాలికంగా హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-గుంటూరు మధ్య సర్వీసులు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దీలేని మార్గంలో నడపడం వల్లే.. హైదరాబాద్-విజయవాడ, విశాఖపట్నం మధ్య నిత్యం విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు చాలకపోవడంతో నెలరోజుల ముందే వెయిటింగ్ జాబితా సిద్ధమవుతుంది. దీంతో ఈ మార్గంలో అదనంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో డబుల్‌డెక్కర్ రైలును ఈ రద్దీ మార్గంలో నడపాలి. కానీ అధికారులు ముందస్తు సర్వే నిర్వహించకుండా కాచిగూడ-గుంటూరు మార్గంలో దానిని నడిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా విజయవాడ, ఆ తర్వాత గుంటూరుకు నడిపినామెరుగ్గా ఉండేది. కానీ నడికుడి మీదుగా గుంటూరు వరకే నడపడంతో ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉంది. తిరుపతి వంటి దూరప్రాంతానికి రాత్రిపూట ఎక్కువగా ప్రయాణిస్తారు. కానీ, సీటింగ్ వసతి మాత్రమే ఉన్న డబుల్ డెక్కర్ రైళ్లనేమో పగటివేళ నడుపుతారు. దీంతో ఈ మార్గంలో ఆక్యుపెన్సీ 30 శాతం నమోదవుతోంది. మార్గం, సమయాల్లో మార్పులు చేయకుండా ఏకంగా హైదరాబాద్ నుంచి సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించడం గమనార్హం. తరలిన డబుల్ డెక్కర్ రైలును తొలుత విశాఖపట్టణం, దువ్వాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుపతి వరకు నడపనున్నారు. రూట్ సర్వే నిర్వహించిన తర్వాత దాన్ని రోజూ నడపాలా... లేదా.. వారంలో రెండు పర్యాయాలు నడిపి మరో రెండు రోజులు వేరే రూట్లో నడపాలా అనే దానిని నిర్ణయిస్తారు. -
డబుల్ డెక్కర్‌కు ఆదరణ కరువు
► కనీసం 10 శాతం కూడా నిండని రైలు ► రూటు, వారాలే కారణమంటున్న ప్రయాణికులు నగరంపాలెం : గుంటూరు రైల్వే డివిజనులో ఖాజీపేట నుంచి గుంటూరు వరకు నడుపుతున్న డబుల్ డెక్కర్ రైలుకు ప్రయాణికుల ఆదరణ కరువైంది. సికింద్రాబాద్ వైపునకు మరిన్ని రైళ్లు నడపాలని డివిజను ప్రజల విన్నపాలకు ప్రతిఫలంగా రెండేళ్ల కిందట రైల్వే ఉన్నతాధికారులు డివిజనుకు డబుల్ డెక్కర్ బైవీక్లీ రైలును ఏర్పాటు చేశారు. అయితే.. ఇది సికింద్రాబాద్ నుంచి కాకుండా ఖాజీపేట- గుంటూరు- ఖాజీపేటకు మంగళవారం, శుక్రవారాల్లో నడుస్తోంది. పూర్తి ఏయిర్ కండీషన్డ్‌తో 1200 మంది సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ రైలు ప్రారంభించినప్పటి నుంచి పండుగల రద్దీ సమయంలో మినహా మిగతా సమయాల్లో 10 శాతానికి మంచి ప్రయాణీకులు ప్రయాణించడం లేదు. సమస్య ఎక్కడుందంటే.. ఇది వారం మధ్యలోని మంగళ, శుక్రవారాల్లో ఉండటం ఒక సమస్య అయితే.. గుంటూరు నుంచి ఖాజీపేట మాత్రమే వెళ్లటం మరో సమస్యగా మారింది. టిక్కెట్టు ధరలు ఎక్కువగా ఉండటం, ఖాజీపేటకు పిడుగురాళ్ల వైపు నుంచి రైలు ఉండటంతో ప్రయాణికులు ఎక్కువ ధర వెచ్చించి దీనిలో ప్రయాణించలేకపోతున్నారు. దీన్ని గుంటూరు నుంచి విజయవాడ వైపు ఖమ్మం మీదుగా సికింద్రాబాద్‌కు నడిపితే అనుకూలంగా ఉంటుందని ప్రయాణీకులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా నడిపే రోజులైనా వారంతం లేదా వారం మొదటి రోజుల్లో (ఆదివారం లేదా సోమవారం) నడిపితే ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. వేసవి కావటంతో ప్రజలకు అనువైన రూట్లో డబుల్ డెక్కర్ నడిపితే ప్రయాణీకులకు సౌకర్యవంతగా ఉంటుందని, రైల్వేకూ లాభాదాయకంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘డబుల్’.. ట్రబుల్
తెనాలి : కాచిగూడ-గుంటూరు మధ్య గతేడాది ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ రైలు రద్దుకానుంది. ఆశించనంత ఆ క్యుపెన్సీ లేకపోవడంతో దీన్ని రద్దు చేయాలని దక్షిణమధ్య రైల్వే ప్రతిపాదించింది. దీనిపై రైల్వేబోర్డు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఏడాదిలోనే... గుంటూరు జిల్లాకు రైల్వేబోర్డు గత ఏడాది మేలో డబుల్ డెక్కర్ రైలు సౌకర్యాన్ని కల్పిం చింది. పూర్తి ఏసీ సౌకర్యంతో కొత్త బోగీలతో రైలు ముస్తాబై వచ్చింది. వారంలో మంగళ, శుక్రవారాల్లో నడుపుతున్నారు. కాచిగూడలో ఉదయం 5.30గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 10.45 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 12:45 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి సా యంత్రం 5 గంటలకు కాచిగూడ చేరుతుంది. అయితే ఆరంభం నుంచే ఈ రైలుకు ఆక్యుపెన్సీ సమస్య వెంటాడుతోంది. మొత్తం 1,200 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ రైలు లో 10శాతం సీట్లు కూడా నిండటం లేదు. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైలు నడపడం వృథా ప్రయాస అంటూ రైల్వే బోర్డుకు లేఖ రాశారు. ఈ మార్గంలో తగిన ఆక్యుపెన్సీ లేనందున చెన్నై- విశాఖపట్టణం మధ్య నడపాలని లేదా సరెండర్ చేసుకోవాలని అందులో పేర్కొన్నట్టు తెలిసింది. మార్పుతో మంచి ఫలితాలు .. అయితే ఈ రైలు ప్రయాణ వేళలపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాచిపూడి నుంచి రైలు బయలుదేరే ఉదయం 5.30 గంటల సమ యం అనువైంది కాదని అందరికీ తె లిసిందే. దీంతో ఉదయం 7.15 గంట లకు సికింద్రాబాద్ నుంచి వచ్చే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను ఎంచుకుంటున్నా రు. దీనికి తోడు కాచిగూడ నుంచి బ యలుదేరాక సికింద్రాబాద్‌కు రాకుం డా మల్కాజిగిరి మీదుగా బీబీనగర్, నల్గొండ మార్గంలో గుంటూరుకు వ స్తుంది. అలాగే గుంటూరు నుంచి బ యలుదేరే మధ్యాహ్నం 12.45 గంట ల సమయంలో ‘జన్మభూమి’అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు ఆ రైలుకే మొగ్గుచూపుతున్నారు. ఇలా చేస్తే... తెనాలి రైల్వే జంక్షన్ నుంచి గతంలో నడిచిన నాగార్జున ఎక్స్‌ప్రెస్‌ను రద్దుచేసి, విశాఖపట్నం నుంచి విజయవాడకు వస్తున్న జన్మభూమి రైలును తెనాలికి పొడిగించారు. అప్పట్నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు మొదలయ్యాయి. జన్మభూమిలో విజయవాడకు చేరుకోకముందే సీట్లు నిండిపోతున్నాయి. పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను తెనాలికి పొడిగించాలన్న డిమాండ్ కూడా ప్రజాప్రతినిధుల వాగ్ధానం నెరవేరలేదు. ప్రస్తుతం గుంటూరు వరకు వస్తున్న డబుల్ డెక్కర్‌ను, గతంలో రద్దయిన ‘నాగార్జున’ స్థానం లో తెనాలికి పొడిగించడం, నాన్ ఏసీ బోగీలను చేర్చి, రెగ్యులర్ చేయాలి. కాచిగూడ కాకుండా సికింద్రాబాద్ నుంచి నడపటం, ప్రయాణ సమయాలను కొంత సవరిస్తే ఆక్యుపెన్సీ పెరుగుతుందని తెనాలి రైల్వే ప్రయాణికు ల సంఘం అధ్యక్షుడు కోపల్లె రామనరసింహారావు చెప్పారు. ఈ విషయం లో జిల్లా ఎంపీలు జోక్యం చేసుకోవా ల్సి ఉంది. రద్దు తప్పని పరిస్థితుల్లో కనీసం చెన్నై-విశాఖపట్టణం మధ్య వయా న్యూ గుంటూరు మీదుగా నడిపినా ప్రయోజనం ఉంటుందన్నారు. -
డబుల్ డెక్కర్ రైలు సందడి
కాజీపేటరూరల్/మహబూబాబాద్/డోర్నకల్ : విజయవాడ-కాచిగూడ స్టేషన్ల మధ్య డబుల్ డెక్కర్ రైలు సోమవారం సందడి చేసింది. ఉదయం 11 గంటల సమయంలో విజయవాడ వైపు, సాయింత్రం 3.40 ప్రాంతంలో కాచిగూడ వైపు వెళ్తూ జిల్లాలోని ప్రధాన స్టేషన్లలో కొద్దిసేపు ఆగింది. ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రయాణికులెవరూ ఈ రైలుకు టికెట్ తీసుకోలేదు. డోర్నకల్‌లో మిగతా రైళ్లకు టికెట్ తీసుకున్న ప్రయాణికులు రైల్లోకి ఎక్కగా టీసీలు ప్రయాణికులను దించేశారు. కాజీపేటలో మాత్రం టిక్కెట్ తీసుకుని ప్రయాణికులు డబుల్ డెక్కర్ రైలు ఎక్కారు. ఆర్టీసీ సమ్మె బంద్ అయ్యేంత వరకు ఈ రైలును నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. రైలు పూర్తిగా ఏసీ చైర్ కార్లతో ఉంది. కురవికి చెందిన ఎర్ర నాగేశ్వర్రావు అనే కాంట్రాక్టర్ రూ.250 వెచ్చించి వరంగల్ నుంచి మానుకోటకు వచ్చానని తెలిపారు. డబుల్ డెక్కర్ రైలు హాల్టింగ్ స్టేషన్లు కాచిగుడ-విజయవాడ మధ్య నడిచే డబల్ డెక్కర్ రైలుకు మల్కాజిగిరి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర రైల్వే స్టేషన్లలో హా ల్టింగ్ ఇచ్చారు. 10 ఏసీ బోగిలు, 950 సీట్లతో ఈ డబుల్ డెక్కర్ రైలు నడుస్తుంది. కాగా డబు ల్ డెక్కర్ రైలును తిలకించి అందులో ప్ర యాణించి ప్రయాణికులు, పిల్లలు అబ్బురపడ్డారు. -
పలాస రైల్వే స్టేషన్లో సమస్యల కూత
రైల్వే అధికారుల అలక్ష్యం, పాలకులు పట్టించుకోకపోవడం ప్రయాణికులకు శాపంగా మారింది. జీడి ఎగుమతుల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన పలాస రైల్వేస్టేషన్లో నిత్యం సమస్యల కూత వినిపిస్తోంది. సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం, టిక్కెట్ కౌంటర్లు ప్లాట్‌ఫాంకు దూరంగా ఉండడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. సౌకర్యాలు కల్పించకుంటే డబుల్‌డెక్కర్ రైలు సదుపాయం ఎండమావిగానే మిగులుతుందన్న అభిప్రాయం ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది. పలాస: ఈస్టుకోస్టు రైల్వే, కుర్ధా డివిజన్లోని చిట్టచివరిదైన పలాస రైల్వేస్టేషన్లో సమస్యల కూత వినిపిస్తోంది. అభివృద్ధిపై అధికారులు అలక్ష్యం చేస్తున్నారు. స్టేషన్ మీదుగా సుమారు 30 ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నా, ప్రయాణికులకు కనీస సదుపాయాలు కల్పించడం లేదు. ఫలితం నిత్యం కష్టాలు తప్పడం లేదు. తాజాగా పలాస నుంచి విజయవాడకు డబుల్ డెక్కర్ రైలు సదుపాయం కల్పిస్తున్నట్టు ైరె ల్వే అధికారులు ప్రకటించారు. అయితే, అందుకు తగ్గట్టుగా ఈ స్టేషన్లో తగిన సదుపాయాలు మాత్రం కల్పించలేదు. ప్రధానంగా రైల్వే వాషింగ్ యార్డు లేదు. గత ంలో ఉన్న లోకోషెడ్ కూడా మూలకు చేరింది. పలాస స్టేషన్లో రైలును నిలపాలంటే రైళ్లు కడగడం నుంచి కండిషన్ వరకు సరిచూడడం, రైలు పెట్టెల్లో నీటిని నింపడం తదితర నిర్వహణ పనులు చేయాలి. ఇవి నెరవేరాలంటే ముందుగా పలాసలో వాషింగ్ యార్డుతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించాలి. రైలు తనిఖీ కోసం రిపేర్ లైన్ (ఫిట్నె స్ గేజ్) వంటివి విధిగా ఏర్పాటు చేయాలి. లేకుంటే పూర్తిస్థాయిలో రైళ్ల నిర్వహణ, మరమ్మతుల పనులకు అంతరాయం తప్పదు. పలాస స్టేషన్లో ఇప్పటికే సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతోపాటు రిపేర్‌లైన్, వాషింగ్ యార్డు లేదు. ఈ పరిస్థితుల్లో డబుల్ డెక్కర్ రైలు పలాస వరకు ముందుగా నడిపించి ఆ తరువాత భువనేశ్వర్‌కు తరలిస్తారన్న అనుమానం ప్రయాణికుల్లో తలెత్తుతోంది. డబుల్ డెక్కర్ ఆశ చిగురించేనా...! స్టేషన్లో ప్లాట్‌ఫారాలు మూడే ఉన్నాయి. అవి కూడా రైల్వే టికె ట్ బుకింగ్ కౌంటర్‌కు ఆనించి లేవు. షెల్టర్ కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఎండలోనే నిరీక్షించాల్సి వస్తోంది. ఇన్ని సమస్యల నడుమ పలాస రైల్వే స్టేషన్ నుంచి విశాఖ మీదుగా విజయవాడకు డబుల్ డెక్కర సదుపాయం కల్పిస్తామన్న అధికారుల ప్రకటనలతో ప్రయాణికుల్లో ఆశలు చిగురిస్తున్నా... సమస్యల నడుమ ఇది సాధ్యమేనా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. గతంలో కూడా విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను పలాస వరకు ముందుగా పొడిగించి ఆ తర్వాత అంచెలంచెలుగా భువనేశ్వర్ వరకు పొడిగించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఏటా రైల్వే బడ్జెట్లో ప్రతిపాదనల కూత వినిపిస్తున్నా చివరికి మొండిచేయి చూపిస్తున్న రైల్వేశాఖ ఈ సారైనా కొత్త రైలు మంజూరు చేస్తే జిల్లా వాసులకు ప్రయోజనం చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రద్దీగా ఉన్న రైళ్లే గతి... శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, తిలారు (కోటబొమ్మాళి), ఆమదాలవలస, పొందూరు వంటి ప్రధాన స్టేషన్ల నుంచి వేలాది మంది సికింద్రాబాద్, చెన్నై, అహ్మదాబాద్, బెంగుళూరు వంటి ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఒడిశా నుంచి రైళ్లు నడుస్తుండడంతో జిల్లాకు వచ్చేసరికి నిండిపోతున్నాయి. నిత్యం రద్దీతోనే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి వస్తోంది. గతంలో సికింద్రాబాదు నుంచి పలాస వరకు నడిచిన ‘విశాఖ’ ఎక్స్‌ప్రెస్ జిల్లా వాసులకు అనువుగా ఉండేది. దాన్ని ఒడిశాలోని భువనేశ్వర్‌కు తరలించడం తో యథావిధిగా కష్టాలు ప్రారంభంమయ్యా యి. గత ఏడాది రైల్వేబడ్జెట్‌లో పలాస నుంచి విజయవాడకు పాస్ట్ పాసిం జర్ రైలు ప్రస్తావన వచ్చినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. విశాఖపట్నం నుంచి పలాస వరకు నడుస్తున్న ఈఎంయూను ఇచ్ఛాపురం వరకు పొడిగించాలన్న ప్రతిపాదనదీ అదే పరిస్థితి. తాజాగా ఈస్ట్‌కోస్ట్ డివిజన్ ఐఆర్‌టీటీసీకి కొత్త రైళ్ల ప్రతిపాదన నివేదించడంతో ఆశలు రేకెత్తుతున్నాయి. భువనేశ్వర్ నుంచి యశ్వంత్‌పూర్ రైళ్లను సైతం పలాస, విశాఖపట్నం మీదుగా వారానికి రెండు రోజులు నడిపించి, రిజర్వేషన్ కోటా పెంచి తేనే ప్రయోజనం చేకూరుతుందన్న వాదన వినిపిస్తోంది. ముం దుగా ప్రయాణికులకు కావలసిన సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. -
డబుల్ డెక్కర్ పట్టాలెక్కేనా
రైల్వే బడ్జెట్‌పైనే అన్ని ఆశలు పరిశీలనలో రెండు కీలక ప్రతిపాదనలు పలాస నుంచి విజయవాడకు డబుల్ డెక్కర్ నడిపే ప్రతిపాదనపై సర్వత్రా హర్షం రైల్వేస్టేషన్ : ఈసారి కేంద్ర రైల్వే బడ్జెట్లో అరుునా విజయవాడ డబుల్ డెక్కర్ రైలు ప్రతిపాదన పట్టాలెక్కనుందా.. ప్రాజెక్టుల కేటారుుంపులో నవ్యాంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యం ఇస్తారా? అంటే.. తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దీనిపై ప్రజాప్రతినిధులతో పాటు రైల్వే అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవతో రాష్ట్ర ఎంపీలు సమావేశమై అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యలపై జీఎం కొంతవరకు సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు పలు ప్రతిపాదనలను రైల్వేబోర్డుకు పంపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, పలువురు ఎంపీలు ఇండియన్ రైల్వే టైమ్‌టేబుల్ కమిటీ (ఐఆర్టీటీసీ)కి కొన్ని ప్రతిపాదనలు అందజేశారు. దీనిపై ఆ కమిటీ స్పందించి దక్షిణ మధ్య రైల్వేజోన్, ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్లలో రాష్ట్రానికి కావాల్సిన ప్రతిపాదనలు తయూరుచేసింది. డబుల్ డెక్కర్పైనే అన్ని ఆశలు సికింద్రాబాద్ నుంచి తిరుపతి వయా నడికుడి, గుంటూరు మీదుగా వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలును విజయవాడ మీదుగా నడపాలనేది ప్రయూణికుల కోరిక. దీనిపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించి విజయవాడ మీదుగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అలాగే, పలాస నుంచి విజయనగరం, విశాఖపట్నం మీదుగా విజయవాడకు డబుల్ డెక్కర్ రైలు నడపాలన్న ప్రతిపాదన కూడా ఉంది. దీనిపై పరిశీలనలు జరుపుతున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ రాజీవ్ విష్ణోయ్ విశాఖపట్నం ఎంపీ హరిబాబుకు లేఖ కూడా రాశారు. దీంతో రెండు జోన్ల జీఎంల చొరవతో విజయవాడ మీదుగా రెండు డబుల్ డెక్కర్ రైళ్లు నడుస్తాయని నగర ప్రజలు ఆశిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా అన్యాయమే.. రెండు దశాబ్దాలుగా రైల్వే బడ్జెట్లో మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రతి బడ్జెట్లోనూ వందలకొద్దీ ప్రతిపాదనలు వెళ్తున్నా.. ఫలితం మాత్రం దక్కట్లేదు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో పార్లమెంట్లో రైల్వేమంత్రి సురేష్‌ప్రభు ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇస్తారని అంతా భావిస్తున్నారు. అలాగే, పార్లమెంట్లో మన ప్రజాప్రతినిధులు గళం విప్పాల్సిన అవసరం కూడా ఉంది. -
పట్టాల కంటే ఎత్తులో మెట్రో పిల్లర్స్
ఆరు ప్రాంతాల్లో డిజైన్లు ఆమోదానికి వినతి డబుల్ డెక్కర్ రైలు ప్రయాణించేందుకు వీలుగా నిర్మాణం 10 చోట్ల రైల్వే ఆస్తుల స్వాధీనానికి అంగీకారం ఎస్సీ రెల్వే జీఎం శ్రీవాత్సవతో హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి భేటీ సాక్షి, సిటీబ్యూరో: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆరు ప్రాంతాల్లో సాధారణంగా కంటే ఎక్కువ ఎత్తులో ఉండే రైల్వే ట్రాక్‌లు, వంతెల కంటే మెట్రో పిల్లర్లు ఎత్తులో రానున్నాయి. సాధారణ ట్రాక్‌పై డబుల్‌డెక్కర్ రైలు రాకపోకలు సాగించే విధంగా మెట్రో మార్గం నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. భరత్‌నగర్, మలక్‌పేట్, ఆలుగడ్డబావి, చిలకలగూడా, ఒలిఫెంటాబ్రిడ్జి, సికింద్రాబాద్ (బోయిగూడ) ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎదురుకానుంది. ఇక లక్డీకాపూల్ వద్ద రైల్వే ట్రాక్ కింది నుంచి మెట్రో ట్రాక్, బేగంపేట్‌లో రైల్వే ట్రాక్‌కు సమాంతరంగా మెట్రో మార్గం ఏర్పాటు కానుంది. ఈ విషయంలో తాము రూపొందించిన డిజైన్లను ఆమోదించాలని కోరుతూ హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి సోమవారం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె. శ్రీవాత్సవతో భేటీ అయ్యారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కాగా మెట్రో పనులు చేసుకునేందుకు వీలుగా సికింద్రాబాద్ పరిధిలో పది చోట్ల రైల్వే ఆస్తుల స్వాధీనానికి అనుమతించినందుకు ఎండీ ఎన్వీఎస్రెడ్డి రైల్వే జీఎం శ్రీవాత్సవకు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే ఆస్తుల స్వాధీనం కోసం రూ.69 కోట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని జీఎం దృష్టికి తీసుకొచ్చారు. రైల్వే క్రాసింగ్‌లు ఉన్న ఒలిఫెంటా బ్రిడ్జి, సికింద్రాబాద్ (బోయిగూడ) ప్రాంతాల్లో ఇనుముతో చేసిన వారధులు నిర్మిస్తామని, భరత్‌నగర్,చిలకలగూడ, ఆలుగడ్డబావి, లక్డీకాపూల్, మలక్‌పేట్, బేగంపేట్ ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌ల వద్ద మెట్రో మార్గం కోసం కాంక్రీటు వారధులు నిర్మిస్తామని ఎండీ తెలిపారు. భరత్‌నగర్ వద్ద మెట్రో రైలు బ్రిడ్జి పనులు చేసుకునేందుకు వీలుగా ఈ రూట్లో రైళ్ల రాకపోకలను నియంత్రించేందుకు రైల్వే జీఎం సూత్రప్రాయంగా అంగీకరించారు. సికింద్రాబాద్ లేఖాభవన్ ప్రాంగణంలోని అర ఎకరం స్థలంలో మెట్రో పనులు చేపడుతున్న యంత్రాలను నిలిపేందుకు జీఎం అనుమతిచ్చారు. -
కొంకణ్‌కు డబుల్ డెక్కర్ పరుగులు
సాక్షి, ముంబై: గణేష్ ఉత్తవాలను పురస్కరించుకుని కొంకణ్‌కు డబుల్ డెక్కర్ ఏసీ రైలు పరుగులు తీసింది. అయితే రైల్వే అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల మొదటి రోజు ఆ రైలు గంటా 15 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచింది. వివరాలిలా ఉన్నాయి. గణేష్ ఉత్సవాల కారణంగా రెగ్యూలర్‌తోపాటు ప్రత్యేకంగా నడిపే రైళ్లలో రిజర్వేషన్ ఫుల్ అయ్యాయి. దీంతో కొంక ణ్ దిశగా వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మినస్ (ఎల్టీటీ) నుంచి కర్మాలి (గోవా) వరకు డబుల్ డెక్కర్ ఏసీ రైలు నడుపుతున్నట్లు ఇదివరకే రైల్వే పరిపాలన విభాగం ప్రకటించింది. అందులో భాగంగా శుక్రవారం తెల్లవారు జాము 5.30 గంటలకు కుర్లా టర్మినస్ నుంచి బయలుదేరిన రైలు ఉదయం 8.40 గంటలకు రోహా స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గార్డు మారుతారు. కాని సెంట్రల్, కొంకణ్ రైల్వేల మధ్య సమన్వయం లేకపోవడంతో రోహా స్టేషన్లో కేవలం గార్డు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో కుర్లా నుంచి రైలును తీసుకెళ్లిన సెంట్రల్ రైల్వే డ్రైవర్ తాను రైలును ముందుకు తీసుకెళ్లలేనని మొండికేశాడు. దీంతో 75 నిమిషాలు రైలు అక్కడే నిలిచిపోయింది. అప్పటికే ఆ రైలు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. ఏం జరిగిందో ప్రయాణికులకు తెలియదు. ఎనౌన్స్మెంట్ కూడా చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. చివరకు సెంట్రల్ రైల్వే అధికారులతో చర్చలు జరిపి ఆ డ్రైవర్‌కు నచ్చజెప్పడంతో 9.55 గంటలకు రైలు ముందుకు కదలింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
22 నుంచి డబుల్ డెక్కర్
సాక్షి, ముంబై: డబుల్ డెక్కర్ రైలు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొంకణ్ వాసుల కల ఈ నెల 22 నుంచి సాకారం కానుంది. గణేష్ ఉత్సవాలకు కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికులకు ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలు ఎంతో దోహదపడనుంది. రైలు రిజర్వేషన్ టికెట్లు కేవలం ఇంటర్నెట్ ద్వారా బుకింగ్ చేసుకునే సౌకర్యం రైల్వే యాజమాన్యం కల్పించింది. కొంకణ్ రైల్వే అధికారులు ఈ రైలుకు 02005 నంబర్ కేటాయించారు. ఈ నెల 22,24,26,28,30, సెప్టెంబర్‌లో 1,3,5,7,9 తేదీల్లో ముంబైలోని లోకమాన్య తిలక్ (కుర్లా) టెర్మినస్ -కొంకణ్‌లోని కర్మాలి స్టేషన్ల మధ్య ఈ హాలిడే స్పెషల్ ట్రెయిన్‌ను నడపనున్నారు. కుర్లా టెర్మినస్ నుంచి ఈ రైలు ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతుంది. సాయంత్రం 4.30 గంటలకు కర్మాలి చేరుకుంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో 02006 నంబర్ కేటాయించారు. ఈ నెల 23,25, 27,29,31 తేదీల్లో, సెప్టెంబర్‌లో 2,4,6,8,10 తేదీల్లో కర్మాలి నుంచి ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది. సాయంత్రం 5.30 గంటలకు కుర్లా టెర్మినస్‌కు చేరుకుంటుంది. ఇందులో ఒక ఏసీ క్యాంటిన్ బోగీ ఉండగా ఎనిమిది ఏసీ డబుల్ డెక్కర్ చెయిర్ కార్లు, రెండు జనరేటర్ బోగీలు, ఒక గార్డు బోగీ ఉంటుంది. డబుల్ డెక్కర్ రైలు అందుబాటులోకి రావడంవల్ల ఈ ఉత్సవాల్లో ముంబై నుంచి స్వగ్రామాలకు వెళ్లే కొంకణ్ వాసులకు కొంతమేర ఊరట లభించినట్లయిందని రైల్వే సేఫ్టీ కమిషనర్ చేతన్ బక్షి అన్నారు. -
బెజవాడకు డబుల్ డెక్కర్ చక్కర్లు
విజయవాడ : విజయవాడకు త్వరలోనే డబుల్ డెక్కర్ రైలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం డబుల్ డెక్కర్ రైలు ట్రైల్ రన్ నిర్వహించడం ఇందుకు బలాన్నిస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో ఉన్న డబుల్ డెక్కర్ రైలు స్టేషన్‌లోని 1, 2, 3, 4, 5 ప్లాట్‌ఫారాలపై మధ్యాహ్నం మూడు నుంచి సాయత్రం ఆరు గంటల వరకు చక్కర్లు కొట్టింది. అనంతరం రైల్వే యార్డుకు చేరుకుంది. బుధవారం ఉదయం 8, 9, 10 ప్లాట్‌ఫారాలపై నడిపి పరిశీలిస్తారు. అనంతరం గుంటూరుకు, అక్కడ నుంచి గురువారం కాచిగూడకు వెళ్తుందని అధికారులు తెలిపారు. డబుల్ డెక్కర్ రైలును విజయవాడ వరకు నడిపితే ఇక్కడ ప్లాట్‌ఫారాలు ఎంతమేరకు అనుకూలంగా ఉంటాయో తెలుసుకునేందుకు ఈ రైలును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ రైలు ప్లాట్ఫారానికి ఎంత దూరంలో ఉంటుందనే విషయాన్ని గుర్తించారు. ఏ ఇబ్బందులు రావని అధికారులు నిర్ధారణకు వస్తే త్వరలోనే విజయవాడకు డబుల్ డెక్కర్ రైలు వస్తుంది. డబుల్ డెక్కర్ రైలును కాచిగూడ-తిరుపతి మార్గంలో వారానికి రెండు రోజులు నడుపుతున్నారు. గుంటూరు-కాచిగూడ మార్గం తొలుత నడిపినా ప్రస్తుతం నిలిపివేశారు. ఈ డబుల్ డెక్కర్ రైలును విజయవాడ నుంచి కాచిగూడకు నడపాలని ఇక్కడి కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు.. రైల్వే బోర్డుకు కొంతకాలంగా ప్రతిపాదనలు పంపుతున్నారు. విజయవాడ-కాజీపేట-సికింద్రాబాద్ మధ్య నడిపితే మేలు కాచిగూడ-గుంటూరు మధ్య నడిపిన డబుల్ డెక్కర్ రైలుకు అధికారులు ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రాలేదు. దీంతో ఆ రైలును విజయవాడ వరకు నడిపితే ఆక్యుపెన్సీ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. విజయవాడ-కాజీపేట-సికింద్రాబాద్ మార్గంలోనూ డబుల్ డెక్కర్ రైలు నడపాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అందువల్లే నగరంలోని అన్ని ప్లాట్‌ఫారాల పైన డబుల్ డెక్కర్ రైలును పరిశీలిస్తున్నారని సమాచారం. ఆకట్టుకున్న డబుల్ డెక్కర్ రైలు.. రెండు ఫ్లోర్లతో ఆకట్టుకునే రంగులు, పూర్తి ఏసీ సదుపాయంతో రూపొందిన ఈ రైలును ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. మొత్తం 17 బోగీలు ఉండగా, రెండు అంతస్తుల్లో కలిపి ఒక్కో బోగీలో 120 సీట్లు చొప్పున ఉన్నాయి. రైలులోని బోగీలు కొద్దిగా వెడల్పుగా ఉండటంతోపాటు సాధారణ బోగీల కన్నా కొంచెం ఎత్తుగా ఉన్నాయి. -
ఖమ్మంలో డబుల్ డెక్కర్ రైలు
ఖమ్మం మామిళ్లగూడెం: నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ రైలును ట్రయల్ రన్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఖమ్మం రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చారు. సికింద్రాబాద్ నుంచి ఖమ్మం మీదుగా విజయవాడ వరకు ఈ రైలును నడిపేందుకు అధికారులు ట్రయల్ రన్ చేపట్టారు. 17 బోగీలు ఉన్న ఈ ట్రైన్లో సుమారు 2040 మంది ప్రయాణికులు కూర్చునే వీలుంది. ఒక్కో బోగీలో కింది భాగంలో 60, పై భాగంలో 60 డీలక్స్ సీట్లు ఉన్నాయి. ప్రతీ బోగీలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు అగ్నిప్రమాదాల నివారణకు గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. ఖమ్మంలో జెండాఊపి ప్రారంభించిన ఎస్ఎం సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వచ్చిన ఈ డబుల్ డెక్కర్ రైలుకు ఖమ్మం స్టేషన్లో స్టేషన్ మేనేజర్ పాలపాటి వినోద్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కాచిగూడ నుంచి గుంటూరు మధ్య మూడు రోజుల పాటు నడిచే ఈ రైలును మరో మూడు రోజులు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నడిపేందుకు ట్రయల్ రన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ఈ ట్రైన్ షెడ్యూల్ ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎస్ఎంవీ వీఎస్డీ వరప్రసాద్, టీఐ ఎంఎస్ఆర్ ప్రసాద్, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ సురేందర్, సీజీఎస్ఆర్ ప్రసన్నకుమార్, సీబీఎస్ఆర్ఎం పద్మారావు, బీఎస్ఆర్ఏ చంద్రశేఖర్, ఎండీ జావిద్, ఆలం చౌదరి, ఎండీ ఫయాజ్, శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు. మధిరలో... మధిర : సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిపేందుకు ట్రయల్న్‌ల్రో భాగంగా డబుల్ డెక్క ర్ రైలు మంగళవారం మధిర రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. రైల్వేశాఖకు చెందిన లక్నోలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అధికారుల సమక్షంలో డబుల్ డక్కర్ రైలును డోర్నకల్ జంక్షన్‌నుంచి విజయవాడ వరకు ట్రయల్న్ ్రనిర్వహించారు. సికింద్రాబాద్‌లో సోమవారం బయలుదేరిన ఈ రైలు అదేరోజు రాత్రికి డోర్నకల్ చేరుకుంది. అక్కడినుంచి మంగళవారం ఉదయం ఖమ్మం, మధిర రైల్వేస్టేషన్ మీదుగా విజయవాడ వరకు ట్రయల్న్ ్రనిర్వహిస్తున్న క్రమంలో మధిర రైల్వేస్టేషన్లో సుమారు అరగంట పాటు ఆగింది. మధిర సబ్ డివిజన్ సీనియర్ ఏడీఎన్ సౌరబ్కుమార్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఆశిష్ చక్రపాణి, డబుల్ డెక్కర్ రైలులో వచ్చిన ఉన్నతాధికారులకు స్వాగతం పలికారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు ఈ రైలును నడిపేందుకు ట్రయల్ రన్ నిర్వహించారు. ముఖ్యంగా అన్ని రైల్వేస్టేషన్ల లో ప్లాట్‌ఫాం, ప్రయాణికుల కోసం వేసిన షెడ్లు ఈ రైలుకు తగులుతాయా అని పరిశీలించారు. ఈ రూట్లో అడ్డుగా ఉన్న కొన్ని షెడ్లను తొలగించారు. స్టేషన్లో ఆగిన ఈ రైలును స్థానికులు పరిశీలించారు. -
డబుల్ డెక్కర్ రైలు ట్రయల్ రన్
కాజీపేటరూరల్/డోర్నకల్/కేసముద్రం/నెక్కొండ/మహబూబాబాద్ : ఇప్పటివరకు మనమంతా డబుల్ డెక్కర్ బ స్సు, డబుల్ డెక్కర్ విమానం గురించి విన్నాం. కానీ.. ప్రస్తుతం మన ముందుకు డబుల్ డెక్కర్ రైలు కూడా వచ్చిం ది. వివరాల్లోకి వెళితే.. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 2012 రైల్వేబడ్జెట్‌లో సికింద్రాబాద్ డివిజ న్కు ప్రభుత్వం రెండు డబుల్ డెక్కర్ రైళ్లు మంజూరు చేసింది. ఇందులో కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-గుంటూరు వరకు వయా నడికుడి మీదుగా నడిపించేందుకు అధి కారు లు నిర్ణయించారు. వీటిలో ప్రస్తుతం కాచిగూడ నుంచి తిరుపతి వరకు మాత్రమే ఒక డబుల్ డెక్కర్‌ను నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, రైల్వే శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన డబుల్‌డెక్కర్ రైలు సోమవారం కాజీపేట, డోర్నకల్ జంక్షన్ పరిధిలోని రైలు పట్టాలపై పరుగులు తీయడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు. గుంటూరు నుంచి కాచిగూడ మీదుగా తిరుపతికి నడిపిస్తున్న డబుల్‌డెక్కర్ రైలు జిల్లాలోని వివిధ స్టేషన్లలో ఆగి ఉండడంతో దానిని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇదిలా ఉండగా, రైలులోని బోగీలు వెడల్పుగా ఉండడంతోపాటు సాధారణ బోగీల కంటే ఎత్తు కొద్దిగా ఎక్కువ ఉంది. అలాగే రైలులో మొత్తం 17 బోగీలు ఉండగా, ఒక్కో బోగీలో రెండు అంతస్తులు కలిపి 120 సీట్లు ఉన్నాయి. కాగా, ఈ డబుల్‌డెక్కర్ రైలును త్వరలో సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు, కాజీపేట నుంచి విజయవాడకు నడిపించే అవకాశం ఉండడంతో ముందస్తుగా అధికారులు ట్రయల్న్ర్ నిర్వహించి నట్టు సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా, రైలును కాజీపే ట, డోర్నకల్ జంక్షన్లలో ప్రతి స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాల మీదుగా నడిపించి పరీక్షించారు. బోగీలకు కెమెరాలను అమర్చి ప్లాట్ఫారం, బోగీల మధ్య ఉన్న ప్రదేశాన్ని పరి శీలించారు. -
లక్నో-న్యూఢిల్లీ మధ్య త్వరలో డబుల్ డెకర్
లక్నోతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు సెప్టెంబర్ నెల నుంచి దేశరాజధాని నగరం ఢిల్లీకి డబుల్ డెకర్ రైలులో వెళ్లే అవకాశముంది. ఈ నెలలో ఈ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. లక్నో: లక్నో వాసులకు శుభవార్త. ఇక్కడి నుంచి దేశ రాజధాని నగరానికి త్వరలో డబుల్ డెకర్ రైలు నడపనుంది. ఇందుకోసం ఈ నెలలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ రైలు ప్రస్తుతం స్థానిక గోమతినగర్ స్టేషన్లో ఉం ది. దీనిని నడిపేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ అనుమతి ఇచ్చారు. రైలు వేగపరిమితికి సంబంధించి రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ (ఆర్డీఎస్ఓ) కూడా అనుమతి లభిం చింది. ఈ విషయమై డివి జనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రయోగాత్మక పరుగు నిర్వహించేందుకు అనుమతించాలంటూ ఉత్తర రైల్వే విభాగానికి విన్నవించాం. ఆలమ్‌నగర్ సెక్షన్... ఢిల్లీ-లక్నో సెక్షన్ పరిధిలో ఉంది. అందువల్ల ఉత్తర రైల్వే విభాగం అనుమతి తప్పనిసరి. అందువల్ల అనుమతి లభించగానే ప్రయోగాత్మక పరుగు నిర్వహిస్తాం. ప్రయోగాత్మక పరుగును ఆగస్టులో ముగించి సెప్టెంబర్‌లో దీనిని పట్టాలు ఎక్కించాలని భావిస్తున్నాం’ అని అన్నారు. కాగా ఉదయం ఐదు గంటలకు లక్నోలో బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. -
డబుల్ డెక్కర్ ‘పరుగు’ విజయవంతం
సాక్షి, ముంబై: కొంకణ్, సెంట్రల్ రైల్వే మార్గంపై డబుల్ డెక్కర్ ఏసీ రైలుకు వారం రోజులుగా ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలు సఫలీకృతమయ్యాయి. దీంతో రైల్వే భద్రత కమిషనర్ శాఖ నుంచి త్వరలో గ్రీన్ సిగ్నల్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. పరీక్షలకు సంబంధించిన నివేదికను ఆర్డీ ఎస్వో వారం రోజుల్లో సెంట్రల్, కొంకణ్ రైల్వే భద్రత శాఖ కమిషనర్ చేతన్ బక్షీకి సమర్పించనుంది. కొంకణ్, సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగానికి పంపించనుంది. ఆ తర్వాత ఈ నివేదికను మంజూరు కోసం రైల్వే భద్రత కమిషనర్ వద్దకు పంపిస్తారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ప్రయాణికులకు సేవలందించేందుకు రైలును సిద్ధం చేస్తారు. సెంట్ర ల్ రైల్వే హద్దులోని ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) నుంచి రోహ వరకు, కొంకణ్ రైల్వే హద్దులోని కోలాడ్ నుంచి మడ్గావ్ స్టేషన్ల మధ్య ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలుకు పరీక్షలు నిర్వహించారు. ఈ రూట్లో ఉన్న ప్రమాదకర మలుపులు, సొరంగాలు, ఎత్తై వంతెనల వల్ల ఈ రైలుకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ప్లాట్‌ఫారాల ఎత్తు సమస్య కూడా ఏర్పడలేదు. కాగా జూలైలో రైల్వే ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ సమయంలో డబుల్ డెక్కర్ రైలు ప్రకటించే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో దీన్ని ప్రత్యేక రైలుగా నడపనున్నారు. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను బట్టి క్రమబద్ధీకరించనున్నట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) నరేంద్ర పాటిల్ చెప్పారు. -
డబుల్‌డెక్కర్ ఆదరణ పూర్..!
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్‌డెక్కర్ రైలు ప్రయాణికుల మనసు దోచుకోలేకపోతోంది. పగటి ప్రయాణం, ఇరుకుసీట్లు, తగినంత ఏసీ లేకపోవడం వంటి అంశాలు ఈ ట్రైన్‌కు ప్రతికూలంగా మారాయి. తిరుపతి రూట్లో నడిచే ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రతి రోజూ ప్రయాణికులతో కిటకిటలాడుతుండగా డబుల్‌డెక్కర్‌లో మాత్రం ఆశించిన ఆదరణ కనిపించడం లేదు. ఈ రూట్లో ఒకవైపు ఇతర ఎక్స్‌ప్రెస్‌లలో వేలాదిమంది వెయిటింగ్ లిస్టులో పడిగాపులు కాస్తుండగా డబుల్‌డెక్కర్‌లో మాత్రం 200 సీట్లకు పైగా ఖాళీగానే కనిస్తున్నాయి. అలాగే కాచిగూడ నుంచి ఐదు గంటల వ్యవధిలో గుంటూరుకు వెళ్లే డబుల్‌డెక్కర్‌లో సైతం ప్రయాణికుల భర్తీ 30 శాతాన్ని కూడా చేరుకోలేకపోతోంది. ప్రధాన కారణాలివే... సాధారణంగా పద్మావతి, వెంకటాద్రి, నారాయణాద్రి వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రాత్రి ప్రయాణం వల్ల ఉదయాన్నే తిరుపతికి చేరుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకొని దర్శనం అనంతరం.. తిరుపతి చుట్టుపక్కల ఉన్న పుణక్షేత్రాలను సందర్శించుకునే సౌకర్యం ఉంటుంది. తిరిగి సాయంత్రం తిరుపతి నుంచి బయలుదేరి ఉదయానికల్లా నగరానికి చేరుకోవచ్చు. రాత్రి పూట ట్రైన్లో నిద్రించే సదుపాయం వల్ల ఎలాంటి బడలిక లేకుండా ఉదయాన్నే యధావిధిగా విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇలా తిరుపతి ఒక్కటే కాకుండా ఏ ప్రాంతానికైనా సరే ఎక్కువ మంది రాత్రిపూట ప్రయాణాన్నే కోరుకుంటారు. ప్రయాణికుల సదుపాయాలకు భిన్నంగా పగటి పూట సర్వీసులుగా అందుబాటులోకొచ్చిన డబుల్డెక్కర్లు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోతున్నాయి. ఈ నెల 13న కాచిగూడ నుంచి గుంటూరుకు, 14న కాచిగూడ నుంచి తిరుపతికి డబుల్‌డెక్కర్ సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. బై వీక్లీ సర్వీసులుగా ఇవి తిరుగుతున్నాయి. -
డబుల్ డెక్కర్ రైలు...వచ్చేస్తోంది!
ప్రస్తుతం కాచిగూడ-గుంటూరు మధ్య నడుస్తున్న రైలు విజయవాడ వరకు పొడిగించాలని నిర్ణయం జిల్లా వాసులకు డబుల్ డెక్కర్ రైలు కల సాకారం కానుంది. ప్రస్తుతం కాచిగూడ-గుంటూరు మధ్య నడుస్తున్న ఈ రైలును విజయవాడ వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో త్వరలో డబుల్ డెక్కర్ ప్రయాణం అవకాశం జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానుంది. సాక్షి, విజయవాడ : రెండంతస్తుల రైలు విజయవాడ రానుంది. ప్రస్తుతం కాచిగూడ నుంచి గుంటూరు మధ్య వారానికి రెండు రోజులు నడుస్తున్న ఈ రైలును విజయవాడ వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ రైలు కాచిగూడ -గుంటూరు, కాచిగూడ-తిరుపతి మధ్య వారానికి రెండు రోజులు నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ రైలును విజయవాడ - హైదరాబాద్ మధ్య తిప్పాలని నిర్ణయించినప్పటికీ రాజకీయ కారణాల వల్ల అది రూట్ మారింది. విజయవాడ నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని పొడిగించాలని తాజాగా నిర్ణయించారు. ఎప్పటి నుంచి ఈ పొడిగింపు అమలులోకి వస్తుందన్న విషయంపై అధికారులకు స్పష్టమైన సమాచారం రాలేదు. గురువారం జిల్లా పర్యటనకు వస్తున్న రైల్వే జీఎం శ్రీవాస్తవ దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ రైలు మంగళవారం, శుక్రవారం ఉదయం కాచిగూడలో 5.30 గంటలకు బయలుదేరి ఉదయం 10.40కి గుంటూరు చేరుకుంటుంది. మళ్లీ 12.45కు గుంటూరులో బయలుదేరి 5.55 గంటలకు కాచిగూడ చేరుతుంది. దీన్ని విజయవాడకు పొడిగిస్తే తిరుగు ప్రయాణ వేళల్లో కొద్దిగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. పూర్తిగా ఎయిర్‌కండీషన్డ్ రైలులో ప్రయాణించే అనుభూతి త్వరలోనే విజయవాడ వాసులకు సొంతం కానుంది. -
డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్ : తిరుపతి-కాచిగూడ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ రైలును గురువారం ఉదయం ప్రారంభించారు. ఈనెల చివరలో రిటైర్డ్ అవుతున్న రైల్వే సిబ్బంది చేత ఉదయం 5:45 గంటలకు రైలును ప్రారంభించారు. అనంతరం స్థానిక లైజాన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ 2014 రైల్వే బడ్జెట్లో ప్రకటించిన డబుల్ డెక్కర్ రైలును తిరుపతి నుంచి నడపడం జిల్లా వాసులకే కాకుండా రాయలసీమ జిల్లాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతం అన్నారు. ఈ రైలులో మూడు అంచెల కుషన్ సీట్లు, ఫుల్ ఏసీ సౌకర్యం ఉంటుందన్నారు. ఈ రైలు ప్రతి గురు, ఆదివారాల్లో తిరుపతి నుంచి కాచిగూడ వెళ్తుందని లైజాన్ ఆఫీసర్ తెలిపారు. కాగా గురువారం తొలిరోజు ఈ రైలులో గుంతకల్ సీనియర్ డీసీఎం స్వామినాయక్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఈనెల చివరలో రిటైర్డ్ అవుతున్న రైల్వే టీటీఐలు మోహన్‌రావు, మహబూబ్ బాషా, సిరాజ్, గార్డు వరప్రసాద్, కలాసీ చిన్నబ్బ, టెక్నీషియన్ అంజనయ్యతో పాటు చీఫ్ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ దాసరి రాధాకృష్ణ, స్టేషన్ మేనేజర్ మాదిన గంగులప్ప, సీడీవో రామ్మోహన్, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ప్రభాకర్‌రావు, ఏఈ కృపానంద్, స్క్వాడ్ ఇన్స్పెక్టర్లు టీవీ రావు, వేణుమాధవ్, రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సెక్రటరీ కుప్పాల గిరిధర్‌కుమార్ పాల్గొన్నారు. -
పట్టాలెక్కిన డబుల్‌డెక్కర్
హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేలో మొట్టమొదటి డబుల్ డెక్కర్ రైలు మంగళవారం పట్టాలెక్కింది. కాచిగూడ-గుంటూరు మధ్య వారానికి రెండు రోజులు నడవనున్న ఈ బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌ను ఉదయం 5.30 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్లో సీనియర్ ఉద్యోగి అబ్దుల్ రహమాన్ జెండా ఊపి ప్రారంభించారు. మొదటి రోజు సుమారు 500 మంది ప్రయాణికులతో ఇది కాచిగూడ నుంచి గుంటూరుకు బయలుదేరింది. ఇది కాచిగూడ-గుంటూరు మధ్య ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 5.30కు బయలుదేరి ఉదయం 10.40కి గుంటూరు చేరుకుంటుంది. తిరిగి అక్కడ మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.55కు కాచిగూడ చేరుకుంటుంది. నేడు తిరుపతికి: 14వ తేదీ (బుధవారం) ఉదయం కాచిగూడ-తిరుపతి డబు ల్‌డెక్కర్ సర్వీసు ప్రారంభం కానుంది. ప్రతి బుధ, శనివారాల్లో ఉదయం 6.45 గంటలకు ఇది కాచిగూడ నుంచి బయలుదేరి సాయంత్రం 6.15కు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి గురు, ఆది వారాల్లో ఉదయం 5.45 కు తిరుపతిలో బయలుదేరి సాయంత్రం 5.15కు కాచిగూడ చేరుకుంటుంది -
డబుల్ డెక్కర్ రైలు రెడీ
* 14 నుంచి రాయలసీమ వాసులకు సేవలు * వెంకటాద్రి మార్గంలోనే పరుగులు తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్ : ఒకప్పుడు బెంగళూరు, చెన్నై, ముంబైలాంటి నగరాల్లో మాత్రమే మనం డబుల్‌డెక్కర్ బస్సులను చూశాం. ఆ బస్సులను తలపించేలా ఇప్పుడు డబుల్‌డెక్కర్ రైలే మన ప్రాంతానికి వచ్చేస్తోంది. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోనే అత్యాధునిక సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలతో కూడిన డబుల్ డె క్కర్ రైలు మంగళవారం నుంచి పట్టాలపై కూత పెట్టనుంది. ఇది వారంలో రెండు రోజులు గుంటూరు-కాచిగూడ మధ్య, నాలుగు రోజులు తిరుపతి-కాచిగూడ మధ్య నడవనుంది. ఈ రైలు రాకతో రాయలసీమ వాసులకు పగటిపూటే పూర్తి ఏసీతో కూడిన ప్రయాణం చేసే అదృష్టం దక్కనుంది. ఈ డబుల్‌డెక్కర్ వెంకటాద్రి నడిచే మార్గంలోనే నడిచేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దాంతో వెంకటాద్రి రైలుకు ప్రయాణికుల రద్దీ గురు, ఆదివారాల్లో బాగా తగ్గే అవకాశం ఉంది. ఈ రైలు కాచిగూడ నుంచి అధికారికంగా 14వ తేదీ ఉదయం బయలుదేరి సాయంకాలానికి తిరుపతికి రానుంది. ఇక్కడి నుంచి 15వ తేదీ ఉదయం తిరిగి కాచిగూడకు బయలుదేరుతుంది. ఇందులో తిరుపతి నుంచి కాచిగూడకు పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.395గా చార్జీలు ప్రకటించారు. తత్కాల్లో 60 సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటికి అదనంగా రూ.185 చెల్లించాల్సి ఉంటుంది. ఈరైలు నడిచే మార్గం.. చేరుకునే స్టేషన్.. సమయం 15వ తేదీ ఉదయం 05:45 గంటలకు (ట్రైన్‌నెం:22119) తిరుపతి నుంచి బయలుదేరే డబుల్‌డెక్కర్ రైలు 6:00 గంటలకు రేణిగుంట, 07:13కు రాజంపేట, 08:05కు కడప, 08:43కు ఎర్రగుంట్ల, 09:46కు తాడిపత్రి, 11:00కు గుత్తి చేరుకుంటుంది. మధ్యాహ్నం 12:10కి డోన్(ద్రోణాచలం), ఒంటి గంటకు కర్నూలు, 02:05కు గద్వాల్, 03:05కు మహబూబ్‌నగర్, సాయంత్రం 05:15 గంటలకు కాచిగూడ చేరుకుంటుం ది. ఆ రోజు నుంచి ప్రతి గురు, ఆది వారాల్లో తిరుపతిలో బయల్దేరుతుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లాగా కాకుండా ఈ డబుల్‌డెక్కర్ పరిమిత స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. అలాగే కాచిగూ డ నుంచి ప్రతి బుధ, శనివారాల్లో ఉదయం 06:45 గంటలకు (ట్రైన్ నెం:22120) బయలుదేరి 08:06కు మహబూబ్‌నగర్, 09:26కు గద్వా ల్, 11:00కు కర్నూల్, మధ్యాహ్నం 12:10కి డోన్, ఒంటి గంటకు గుత్తి, 01:47కు తాడిపత్రి, 02:49కి ఎర్రగుంట్ల, 03:20కి కడప, సాయంత్రం 04:20కి రాజంపేట, 05:35కి రేణిగుంట, 06:18కి తిరుపతికి చేరుకుంటుంది. డబుల్‌డెక్కర్ రైలు ప్రత్యేకతలు * డబుల్‌డెక్కర్ రైలు గంటకు 160 కిమీ వేగంతో నడుస్తుంది. * డబుల్‌డెక్కర్‌లో ఒక్కో బోగీకి 120 సీట్లు ఉంటాయి. (లోయర్ డెక్‌లో-48, మిడిల్ డెక్‌లో-22, అప్పర్ డెక్‌లో-50 సీట్లు ఉంటాయి). * బోగీల్లో ఏదైనా పొగ, ఇతరత్రా అగ్ని సంబంధిత పరిస్థితులు ఎదురైతే బిగ్గరగా మోగే అలారం, ఆటోమేటెడ్ ఓపెన్ డోర్లు ఉంటాయి. * డబుల్‌డెక్కర్ రైలు బోగీల పొడవు 24 మీటర్లు, వెడల్పు 3 మీటర్లు, ఎత్తు 4.3 మీటర్లు. * బోగీల్లో సీట్లు ఎదురెదురుగా ఉండి మధ్యలో భోజనం చేయడానికి వీలుగా చెక్క పలకలు ఏర్పాటు చేశారు. * 14 బోగీలూ పూర్తి ఏసీ ఉంటాయి. -
డబుల్ డెక్కర్ రెడీ
13 నుంచి అందుబాటులోకి.. కాచిగూడ నుంచి గుంటూరు, తిరుపతిలకు బైవీక్లీ సర్వీసులు రెండంతస్తుల రైలు పట్టాలపెకైక్కనుంది. ఒకప్పటి డబుల్ డెక్కర్ బస్సును గుర్తుకు తెచ్చే ఈ ట్రైన్ కాచిగూడ నుంచి వారానికి రెండుసార్లు గుంటూరు, తిరుపతి పట్టణాలకు పరుగులు తీయనుంది. రైల్వే భద్రతా కమిషన్ అనుమతితో కూత పెట్టేందుకు సిద్ధమైన ఈ ట్రైన్.. తొలిసర్వీసు 13వ తేదీన కాచిగూడ నుంచి గుంటూరుకు, 14వ తేదీన కాచిగూడ నుంచి తిరుపతికి బయలు దేరనుంది. రెండు మార్గాల్లో ప్రయాణికులకు ఊరట.. జంటనగరాల నుంచి ప్రతిరోజూ 80కి పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 220 ప్యాసింజర్, లోకల్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ప్రతి రోజు 2.5 లక్షల మంది సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరుతారు. కానీ నగరం నుంచి తిరుపతి, గుంటూరు పట్టణాలకు మాత్రం విపరీతమైన రద్దీ ఉంటుంది. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు తిరుపతి పుణ్యక్షేత్రానికి బయలుదేరుతారు. ప్రస్తుతం నగరం నుంచి వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి, కృష్ణా ఎక్స్‌ప్రెస్, రాయలసీమ, సెవెన్‌హిల్స్, మద్రాస్ ఎక్స్‌ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు, మరో రెండు పాసింగ్ త్రూ రైళ్లు తిరుపతికి రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే గుంటూరు పట్టణానికి నగరం నుంచి జన్మభూమి, ఇంటర్ సిటీ, శబరి, ఫలక్‌నుమా, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్, నారాయణాద్రి, నర్సాపూర్, రేపల్లె ప్యాసింజర్, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ వేలాదిమంది ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు. డబుల్‌డెక్కర్ వల్ల ఈ రెండు మార్గాల్లోను ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. పైగా ఈ సర్వీసులు పూర్తిగా పగటిపూట మాత్రమే నడుస్తాయి. ఉదయం బయలుదేరి సాయంత్రం తిరుపతికి చేరుకొనే విధంగా, మధ్యాహ్నం గుంటూరుకు చేరుకొనే విధంగా అందుబాటులో ఉంటాయి. గుం‘టూరు’ వివరాలివీ... కాచిగూడ-గుంటూరు (22118) ఏసీ డబుల్‌డెక్కర్ బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి ఉదయం 5.46 గంటలకు మల్కాజిగిరి స్టేషన్‌కు, 7.21 గంటలకు నల్గొండకు, 7.51 గంటలకు మిర్యాలగూడకు, 8.36 గంటలకు పిడుగురాళ్లకు, ఉదయం 10.40 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గుంటూరు-కాచిగూడ (22117) ఏసీ బై వీక్లీ డబుల్ డెక్కర్ ప్రతి మంగళ, శుక్ర వారాల్లో మధ్యాహ్నం 12.45 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.36 గంటలకు పిడుగురాళ్ల, 2.36లకు మిర్యాలగూడ, 3.01లకు నల్లగొండ, సాయంత్రం 5.41 గంటలకు మల్కాజిగిరి చేరుకుంటుంది. సాయంత్రం 5.55 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుపతి ప్రయాణం ఇలా.. కాచిగూడ-తిరుపతి (22120) ఏసీ డబుల్‌డెక్కర్ ప్రతి బుధ, శని వారాలలో ఉదయం 6.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి ఉదయం 8.06 గంటలకు మహబూబ్‌నగర్, 9.26కు గద్వాల్, 11కు కర్నూల్, మధ్యాహ్నం 12.10కి డోన్, ఒంటిగంటకు గుత్తి, 1.47కు తాడిపత్రి, 2.49కు ఎర్రగుంట్ల, 3.20కు కడప, సాయంత్రం 4.20కి రాజంపేట్, 5.35 గంటలకు రేణిగుంట, సాయంత్రం 6.18 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-కాచిగూడ (22119) డబుల్ డెక్కర్ ప్రతి గురు, ఆది వారాల్లో ఉదయం 5.45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి ఉదయం 6 గంటలకు రేణిగుంట, 7.13కు రాజంపేట్, 8.05కు కడప, 8.43కి ఎర్రగుంట్ల, 9.46కు తాడిపత్రి, 11కు గుత్తి, మధ్యాహ్నం 12.10కి డోన్, ఒంటిగంటకు కర్నూల్, 2.05కు గద్వాల్, 3.05కు మహబూబ్‌నగర్ స్టేషన్, సాయంత్రం 5.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ప్రత్యేకతలివీ.. ఈ ట్రైన్ లోయర్ డెక్‌లో 48 సీట్లు, అప్పర్ డెక్‌లో 50 సీట్లు ఉంటాయి. మిడిల్ డెక్‌లో 22 సీట్లు ఉంటాయి. ఒక బోగీలో 120 సీట్ల చొప్పున మొత్తం 14 బోగీలలో 1680 సీట్లు ఉంటాయి. కాచిగూడ నుంచి తిరుపతికి 10 గంటల్లో, గుంటూరుకు 5 గంటల్లో చేరుకుంటుంది. డబుల్ డెక్కర్ ట్రైన్ చార్జీలు : నగరం నుంచి గుంటూరుకు రూ. 415, కర్నూలుకు రూ. 335, తిరుపతికి రూ. 720 -
14 నుంచి డబుల్ డెక్కర్ రైలు
నేటి నుంచి రిజర్వేషన్ సౌకర్యం తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్ : రాయలసీమవాసులు హైదరాబాద్ వెళ్లడానికి అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ రైలు 14వ తేదీ నుంచి రాకపోకలు సాగించనుంది. అందుకోసం దక్షిణమధ్య రైల్వే అధికారులు అన్ని చర్యలు పూర్తిచేశారు. ప్రస్తుతం ఉన్న రైల్వేట్రాక్, ప్లాట్‌ఫాం ర్యాక్ పరిస్థితిని డబుల్ డెక్కర్ రైల్‌కు అనుగుణంగా అధికారులు ఇటీవలే మార్పు చేశారు. అనంతరం ఈ రైలును కాచిగూడ నుంచి తిరుపతి వరకు ట్రయల్న్ ్రచేశారు. పూర్తిస్థాయి ట్రాక్ అనుకూలం కావడంతో న్యూ ఢిల్లీలోని రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 14న కాచిగూడలో ప్రారంభించనున్నారు. ఈ రైలు గంటకు 160 కి.మీ వేగంతో నడిచే సామర్థ్యం ఉన్నప్పటికీ కాచిగూడ నుంచి తిరుపతికి నడిచే మార్గంలో రైల్వే ట్రాక్ పరిస్థితి, ఈ ప్రాంత భూపరిస్థితులను బట్టి గంటకు 100 కి.మీలకు మించి పోయే అవకాశం ఉండదని రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు. కాగా ఈ రైలు ఈనెల 14వ తేదీ ఉదయం 6.45 గంటలకు కాచిగూడలో బయలుదేరి మధ్యాహ్నం తర్వాత తిరుపతికి చేరుకుంటుంది. అనంతరం 15వ తేదీ ఉదయం 5.45 గంటలకు తిరుపతిలో బయలుదేరి కాచిగూడ వెళుతుంది. ఈ రైలు ప్రతి బుధ, శని వారాల్లో కాచిగూడలోనూ, ప్రతి గురు, ఆదివారాల్లో తిరుపతిలోనూ బయలుదేరే విధంగా రైల్వే అధికారులు చార్ట్‌ను నిర్ణయించారు. ఈ రైలులో ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు శుక్రవారం(నేడు) ఉద యం 8.00 గంటల నుంచి రిజర్వేషన్లు అం దుబాటులోకి వస్తాయి. అయితే డబుల్ డెక్కర్ పూర్తిగా ఏసీ రైలు కావడంతో తిరుపతి నుంచి కాచిగూడకు రూ.700 చార్జీగా అధికారులు నిర్ణయించారు. -
పట్టాలెక్కని డబుల్‌డెక్కర్
నాలుగు నెలలు గడిచినా ఊసే లేని వైనం సాక్షి, సిటీబ్యూరో: నెల రోజుల్లోనే అందుబాటులోకొస్తుందన్నారు. ఎంతో ఆర్భాటంగా పరిచయం చేశారు. కానీ ఇప్పటి వరకు డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కలేదు. నగరం నుంచి తిరుపతి, గుంటూరు స్టేషన్లకు న డిపేందుకు ఇటీవల డబుల్ డెక్కర్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసింది. భద్రతాపరమైన పరీక్షలు, ట్రయల్ రన్ అనంతరం ఇది పట్టాలెక్కేస్తుందని అప్పట్లో రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ నెలలు గడుస్తున్నా డబుల్ డెక్కర్‌లో కదలిక లేదు. ఇప్పటి వరకు ఎలాంటి భద్రతా పరీక్షలు నిర్వహించలేదు. గతేడాది నుంచి ఊరిస్తున్న డబుల్‌డెక్కర్ రైలు... కనీసం ట్రయల్న్‌క్రు కూడా నోచుకోకపోవడం నిజంగా విస్మయం కలిగించే విషయమే. భద్రతా కమిషన్ నివేదిక అందితే గానీ రైలు అందుబాటులోకి రావడం అసాధ్యమని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఈ రైలు ఉండీ లేనట్లే అయింది. దేశంలో ప్రస్తుతం నడిచే డబుల్ డెక్కర్ రైళ్లన్నింటి కంటే మరింత అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు కాచిగూడ నుంచి తిరుపతికి, కాచిగూడ నుంచి గుంటూరుకు నడపాలని ప్రతిపాదించారు. దక్షిణమధ్య రైల్వేలో మొట్టమొదటిసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రైలు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇతర రద్దీ మార్గాల్లో కూడా వీటిని అందుబాటులోకి తేనున్నట్లు అప్పట్లో అధికారులు పేర్కొన్నారు. సీటింగ్ సదుపాయం మాత్రమే ఉన్న ఈ రైలు అన్నివిధాలుగా సురక్షితమైంది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేసే అలారమ్ వ్యవస్థను మొట్టమొదటిసారి ఇందులో ప్రవేశపెట్టారు. దేశంలో ఆరోది... ప్రస్తుతం దేశంలో ఐదు డబుల్‌డెక్కర్ రైళ్లు నడుస్తున్నాయి. నగరానికి ప్రకటించింది ఆరోది. ఇందులో 14 ఏసీ చైర్కార్లు, 3 పవర్ బోగీలు ఉంటాయి. పూర్తిగా ఏసీ. ఈ ట్రైన్ లోయర్ డెక్‌లో 48, అప్పర్ డెక్‌లో 50, మిడిల్ డెక్‌లో 22 సీట్లు ఉంటాయి బోగీకి 120 సీట్ల చొప్పున మొత్తం 14 బోగీలలో 1680 సీట్లు ఉంటాయి భద్రతా ప్రమాణాల పరిశీలన అనంతరం ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న ఈ ట్రైన్ కాచిగూడ-గుంటూరు బై వీక్లీ, కాచిగూడ -తిరుపతి బై వీక్లీగా నడువనుంది. కాచిగూడ నుంచి తిరుపతికి 10 గంటల్లో, గుంటూరుకు 5 గంటల్లో చేరుకుంటుంది. ఈ ట్రైన్ పగటి పూట మాత్రమే నడుస్తుంది. -
హైదరాబాద్‌కు రెండంతస్తుల రైలు
మరో నెలలో సేవలు ప్రారంభం సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన డబుల్ డెక్కర్ రైలు వచ్చేసింది. ఎరుపు, పసుపు రంగుల్లో అందంగా ముస్తాబైన డబుల్ డెక్కర్ రైలు గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చేసింది. దేశంలో ప్రస్తుతం నడుస్తున్న డబుల్ డెక్కర్ రైళ్లన్నింటికంటే మరింత అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు త్వరలోనే అందుబాటులోకి రానుంది. రైల్వే భద్రతా కమిషన్ నివేదిక అనంతరం మరో నెల రోజుల్లో ఈ ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. కాచిగూడ నుంచి తిరుపతి, కాచిగూడ నుంచి గుంటూరు మార్గాల్లో ఈ డబుల్ డెక్కర్ రైలు నడవనుంది. గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డబుల్ డెక్కర్ ట్రైన్‌ను రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేసే అలార్మ్ వ్యవస్థ ఈ ట్రైన్ ప్రత్యేకత అని, ఇప్పటి వరకు మరే డబుల్ డెక్కర్ ట్రైన్‌కు ఈ సదుపాయం లేదని మంత్రి వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సునీల్‌కుమార్ అగర్వాల్, సీపీఆర్వో కె.సాంబశివరావు, తదితరులు మంత్రి వెంట ఉన్నారు. దేశంలో ఇది ఆరో డబుల్ డెక్కర్.. ఇది దేశంలో 6వ డబుల్ డెక్కర్ రైలు. ఇప్పటి వరకు ధన్‌బాద్-హౌరా (12385/86), అహ్మదాబాద్-ముంబై (12932/31), ఢిల్లీ-జైపూర్ (12986/85), ఇండోర్ నుంచి హజారీబాగ్, భోపాల్ (2216/ 185), బెంగళూర్-చెన్నై (22626/625) మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ఈ కొత్త రైలుకు 14 ఏసీ చైర్‌కార్స్, 3 పవర్ బోగీలు ఉంటాయి. పూర్తి ఏసీ సదుపాయంతో నడిచే ఈ ట్రైన్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వంటివి చోటు చేసుకున్నప్పుడు ప్రాథమిక స్థాయిలోనే పొగ, మంటలను గుర్తించి ప్రయాణికులను అప్రమత్తం చేసే వెస్‌డా (వెరీ ఎర్లీ స్మోక్/ఫైర్ డిటెక్షన్ విత్ అలార్మ్) టెక్నాలజీని ఏర్పాటు చేశారు. *ఈ ట్రైన్ లోయర్ డెక్‌లో 48 సీట్లు, అప్పర్ డెక్‌లో 50 సీట్లు ఉంటాయి. మిడిల్ డెక్‌లో 22 సీట్లు ఉంటాయి. * ఒక బోగీలో 120 సీట్ల చొప్పున మొత్తం 14 బోగీల్లో 1,680 సీట్లు ఉంటాయి. * భద్రతా ప్రమాణాల పరిశీలన తర్వాత ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న ఈ ట్రైన్ కాచిగూడ-గుంటూరు బై వీక్లీ, కాచిగూడ -తిరుపతి బై వీక్లీగా నడవనుంది. *కాచిగూడ నుంచి తిరుపతికి 10 గంటల్లో, గుంటూరుకు 5 గంటల్లో చేరుకుంటుంది. ఈ ట్రైన్ పగటిపూట మాత్రమే నడుస్తుంది. ప్రయాణికులు కూర్చొని వెళ్లవలసి ఉంటుంది.