డబుల్ డెక్కర్ రైలు రెడీ
* 14 నుంచి రాయలసీమ వాసులకు సేవలు
* వెంకటాద్రి మార్గంలోనే పరుగులు
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్ : ఒకప్పుడు బెంగళూరు, చెన్నై, ముంబైలాంటి నగరాల్లో మాత్రమే మనం డబుల్‌డెక్కర్ బస్సులను చూశాం. ఆ బస్సులను తలపించేలా ఇప్పుడు డబుల్‌డెక్కర్ రైలే మన ప్రాంతానికి వచ్చేస్తోంది. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోనే అత్యాధునిక సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలతో కూడిన డబుల్ డె క్కర్ రైలు మంగళవారం నుంచి పట్టాలపై కూత పెట్టనుంది. ఇది వారంలో రెండు రోజులు గుంటూరు-కాచిగూడ మధ్య, నాలుగు రోజులు తిరుపతి-కాచిగూడ మధ్య నడవనుంది.
ఈ రైలు రాకతో రాయలసీమ వాసులకు పగటిపూటే పూర్తి ఏసీతో కూడిన ప్రయాణం చేసే అదృష్టం దక్కనుంది. ఈ డబుల్‌డెక్కర్ వెంకటాద్రి నడిచే మార్గంలోనే నడిచేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దాంతో వెంకటాద్రి రైలుకు ప్రయాణికుల రద్దీ గురు, ఆదివారాల్లో బాగా తగ్గే అవకాశం ఉంది. ఈ రైలు కాచిగూడ నుంచి అధికారికంగా 14వ తేదీ ఉదయం బయలుదేరి సాయంకాలానికి తిరుపతికి రానుంది. ఇక్కడి నుంచి 15వ తేదీ ఉదయం తిరిగి కాచిగూడకు బయలుదేరుతుంది. ఇందులో తిరుపతి నుంచి కాచిగూడకు పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.395గా చార్జీలు ప్రకటించారు. తత్కాల్‌లో 60 సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటికి అదనంగా రూ.185 చెల్లించాల్సి ఉంటుంది.
ఈరైలు నడిచే మార్గం.. చేరుకునే స్టేషన్.. సమయం
15వ తేదీ ఉదయం 05:45 గంటలకు (ట్రైన్‌నెం:22119) తిరుపతి నుంచి బయలుదేరే డబుల్‌డెక్కర్ రైలు 6:00 గంటలకు రేణిగుంట, 07:13కు రాజంపేట, 08:05కు కడప, 08:43కు ఎర్రగుంట్ల, 09:46కు తాడిపత్రి, 11:00కు గుత్తి చేరుకుంటుంది. మధ్యాహ్నం 12:10కి డోన్(ద్రోణాచలం), ఒంటి గంటకు కర్నూలు, 02:05కు గద్వాల్, 03:05కు మహబూబ్‌నగర్, సాయంత్రం 05:15 గంటలకు కాచిగూడ చేరుకుంటుం ది. ఆ రోజు నుంచి ప్రతి గురు, ఆది వారాల్లో తిరుపతిలో బయల్దేరుతుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లాగా కాకుండా ఈ డబుల్‌డెక్కర్ పరిమిత స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. అలాగే కాచిగూ డ నుంచి ప్రతి బుధ, శనివారాల్లో ఉదయం 06:45 గంటలకు (ట్రైన్ నెం:22120) బయలుదేరి 08:06కు మహబూబ్‌నగర్, 09:26కు గద్వా ల్, 11:00కు కర్నూల్, మధ్యాహ్నం 12:10కి డోన్, ఒంటి గంటకు గుత్తి, 01:47కు తాడిపత్రి, 02:49కి ఎర్రగుంట్ల, 03:20కి కడప, సాయంత్రం 04:20కి రాజంపేట, 05:35కి రేణిగుంట, 06:18కి తిరుపతికి చేరుకుంటుంది.
డబుల్‌డెక్కర్ రైలు ప్రత్యేకతలు
* డబుల్‌డెక్కర్ రైలు గంటకు 160 కిమీ వేగంతో నడుస్తుంది.
* డబుల్‌డెక్కర్‌లో ఒక్కో బోగీకి 120 సీట్లు ఉంటాయి. (లోయర్ డెక్‌లో-48, మిడిల్ డెక్‌లో-22, అప్పర్ డెక్‌లో-50 సీట్లు ఉంటాయి).
* బోగీల్లో ఏదైనా పొగ, ఇతరత్రా అగ్ని సంబంధిత పరిస్థితులు ఎదురైతే బిగ్గరగా మోగే అలారం, ఆటోమేటెడ్ ఓపెన్ డోర్లు
ఉంటాయి.
* డబుల్‌డెక్కర్ రైలు బోగీల పొడవు 24 మీటర్లు, వెడల్పు 3 మీటర్లు, ఎత్తు 4.3 మీటర్లు.
* బోగీల్లో సీట్లు ఎదురెదురుగా ఉండి మధ్యలో భోజనం చేయడానికి వీలుగా చెక్క పలకలు ఏర్పాటు చేశారు.
* 14 బోగీలూ పూర్తి ఏసీ ఉంటాయి.