కొంకణ్, సెంట్రల్ రైల్వే మార్గంపై డబుల్ డెక్కర్ ఏసీ రైలుకు వారం రోజులుగా ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలు సఫలీకృతమయ్యాయి.
సాక్షి, ముంబై: కొంకణ్, సెంట్రల్ రైల్వే మార్గంపై డబుల్ డెక్కర్ ఏసీ రైలుకు వారం రోజులుగా ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలు సఫలీకృతమయ్యాయి. దీంతో రైల్వే భద్రత కమిషనర్ శాఖ నుంచి త్వరలో గ్రీన్ సిగ్నల్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. పరీక్షలకు సంబంధించిన నివేదికను ఆర్‌డీ ఎస్‌వో వారం రోజుల్లో సెంట్రల్, కొంకణ్ రైల్వే భద్రత శాఖ కమిషనర్ చేతన్ బక్షీకి సమర్పించనుంది.
కొంకణ్, సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగానికి పంపించనుంది.
ఆ తర్వాత ఈ నివేదికను మంజూరు కోసం రైల్వే భద్రత కమిషనర్ వద్దకు పంపిస్తారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ప్రయాణికులకు సేవలందించేందుకు రైలును సిద్ధం చేస్తారు. సెంట్ర ల్ రైల్వే హద్దులోని ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) నుంచి రోహ వరకు, కొంకణ్ రైల్వే హద్దులోని కోలాడ్ నుంచి మడ్‌గావ్ స్టేషన్ల మధ్య ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలుకు పరీక్షలు నిర్వహించారు. ఈ రూట్‌లో ఉన్న ప్రమాదకర మలుపులు, సొరంగాలు, ఎత్తై వంతెనల వల్ల ఈ రైలుకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ప్లాట్‌ఫారాల ఎత్తు సమస్య కూడా ఏర్పడలేదు.
కాగా జూలైలో రైల్వే ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ సమయంలో డబుల్ డెక్కర్ రైలు ప్రకటించే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో దీన్ని ప్రత్యేక రైలుగా నడపనున్నారు. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను బట్టి క్రమబద్ధీకరించనున్నట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) నరేంద్ర పాటిల్ చెప్పారు.