సాక్షి, ముంబై: గణేష్ ఉత్తవాలను పురస్కరించుకుని కొంకణ్‌కు డబుల్ డెక్కర్ ఏసీ రైలు పరుగులు తీసింది. అయితే రైల్వే అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల మొదటి రోజు ఆ రైలు గంటా 15 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచింది. వివరాలిలా ఉన్నాయి. గణేష్ ఉత్సవాల కారణంగా రెగ్యూలర్‌తోపాటు ప్రత్యేకంగా నడిపే రైళ్లలో రిజర్వేషన్ ఫుల్ అయ్యాయి.
దీంతో కొంక ణ్ దిశగా వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మినస్ (ఎల్టీటీ) నుంచి కర్మాలి (గోవా) వరకు డబుల్ డెక్కర్ ఏసీ రైలు నడుపుతున్నట్లు ఇదివరకే రైల్వే పరిపాలన విభాగం ప్రకటించింది. అందులో భాగంగా శుక్రవారం తెల్లవారు జాము 5.30 గంటలకు కుర్లా టర్మినస్ నుంచి బయలుదేరిన రైలు ఉదయం 8.40 గంటలకు రోహా స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గార్డు మారుతారు. కాని సెంట్రల్, కొంకణ్ రైల్వేల మధ్య సమన్వయం లేకపోవడంతో రోహా స్టేషన్‌లో కేవలం గార్డు మాత్రమే అందుబాటులో ఉన్నారు.
దీంతో కుర్లా నుంచి రైలును తీసుకెళ్లిన సెంట్రల్ రైల్వే డ్రైవర్ తాను రైలును ముందుకు తీసుకెళ్లలేనని మొండికేశాడు. దీంతో 75 నిమిషాలు రైలు అక్కడే నిలిచిపోయింది. అప్పటికే ఆ రైలు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. ఏం జరిగిందో ప్రయాణికులకు తెలియదు. ఎనౌన్స్‌మెంట్ కూడా చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. చివరకు సెంట్రల్ రైల్వే అధికారులతో చర్చలు జరిపి ఆ డ్రైవర్‌కు నచ్చజెప్పడంతో 9.55 గంటలకు రైలు ముందుకు కదలింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
కొంకణ్‌కు డబుల్ డెక్కర్ పరుగులు
Published Fri, Aug 22 2014 10:21 PM | Last Updated on Wed, Oct 17 2018 4:53 PM
Advertisement
Advertisement