మూణ్నాళ్ల ముచ్చట!
- నేటి నుంచి డబుల్ డెక్కర్ రైళ్లు బంద్
- ఆదరణ లేకపోవడంతో విరమించుకున్న రైల్వే
సాక్షి, హైదరాబాద్: రెండంతస్తుల రైలు కథ కంచికి చేరింది. ఎరుపు, పసుపు రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే డబుల్ డెక్కర్ రైలు సేవలు సోమవారం నుంచి శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. రెండేళ్ల క్రితం నగరవాసులకు అందుబాటులోకి వచ్చిన ఈ రైలు ఆకస్మిక నిష్క్రమణ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. కాచిగూడ నుంచి గుంటూరు, తిరుపతికి దీన్ని నడిపారు. రెండు రూట్లలోనూ ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదు. ఒకదానిపైన ఒకటి చొప్పున ఉన్న రెండు వరుసల సీట్లలో ఇరుక్కొని కూర్చొని ప్రయాణించడం కష్టంగా మారడంతో ఈ రెలైక్కేందుకు నగరవాసులు వెనుకడుగు వేశారు. 1,200 సీట్లు ఉన్న ఈ ట్రైన్ ఏ రోజూ ప్రయాణికులతో కిటకిటలాడింది లేదు. ఒక్కోసారి కాచిగూడ నుంచి గుంటూరుకు 10 నుంచి 15 మంది ప్రయాణికులతోనే బయలుదేరిన రోజులూ ఉన్నాయి.
ఆదాయాన్ని మించిన ఖర్చు...
డబుల్ డెక్కర్ రైలులో ప్రయాణికుల కంటే దానిని నడిపేందుకు పనిచేసే లోకోపైలట్‌లు, సహాయ లోకోపైలట్‌లు. గార్డులు, తదితర సిబ్బంది సంఖ్యే ఎక్కువగా ఉండేది. కాచిగూడ- తిరుపతి మధ్య ఒక్క ట్రిప్పు నడిపేందుకు అయ్యే నిర్వహణ ఖర్చు సుమారు రూ.30 లక్షలు. కానీ ఆ ట్రిప్పులో వచ్చే ఆదాయం కేవలం రూ.25 వేల నుంచి రూ.50 వేలు మాత్రమే. కాచిగూడ-గుంటూరు మార్గంలో అరుుతే రూ.10 వేలు కూడా రాలేదు. రెండేళ్లుగా ఈ తెల్ల ఏనుగును కొనసాగించేందుకు దక్షిణమధ్య రైల్వే పెట్టిన ఖర్చు రూ.వంద కోట్ల పైమాటే.
ఆక్యుపెన్సీ దారుణం...
డబుల్ డెక్కర్ రైలు ఆక్యుపెన్సీ రేషియో 10 నుంచి 25 శాతం మధ్య ఉంది. కాచిగూడ- తిరుపతి రైలుకు గత సెప్టెంబర్‌లో ప్రయాణికుల సంఖ్య 20 నుంచి 40 లోపే. ఆదాయం ఆ నెలలో రూ.60 వేలు దాటలేదు. అక్టోబర్‌లోనూ ఇదే పరిస్థితి. కాచిగూడ- తిరుపతి మార్గంలో మెరుగ్గా కనిపించింది. నెలకు సగటున రూ..2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం లభించింది. ‘‘డబుల్ డెక్కర్‌లో కొన్ని లోపాలున్న మాట నిజమే. పూర్తిగా ఏసీ సదుపాయం ఉన్న ఈ ట్రైన్ పగటి పూట పయనించే వాళ్లను ఆకట్టుకుంటుందని ఆశించాము. కానీ ఫలితం దక్కలేదు సరి కదా... నిర్వహణ వ్యయం తడిసి మోపెడైంది. దీంతో ఈ బండిని ఉపసంహరించుకోవడమే మంచి దని భావించాం’’అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.