సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్‌డెక్కర్ రైలు ప్రయాణికుల మనసు దోచుకోలేకపోతోంది. పగటి ప్రయాణం, ఇరుకుసీట్లు, తగినంత ఏసీ లేకపోవడం వంటి అంశాలు ఈ ట్రైన్‌కు ప్రతికూలంగా మారాయి. తిరుపతి రూట్‌లో నడిచే ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రతి రోజూ ప్రయాణికులతో కిటకిటలాడుతుండగా డబుల్‌డెక్కర్‌లో మాత్రం ఆశించిన ఆదరణ కనిపించడం లేదు. ఈ రూట్‌లో ఒకవైపు ఇతర ఎక్స్‌ప్రెస్‌లలో వేలాదిమంది వెయిటింగ్ లిస్టులో పడిగాపులు కాస్తుండగా డబుల్‌డెక్కర్‌లో మాత్రం 200 సీట్లకు పైగా ఖాళీగానే కనిస్తున్నాయి. అలాగే కాచిగూడ నుంచి ఐదు గంటల వ్యవధిలో గుంటూరుకు వెళ్లే డబుల్‌డెక్కర్‌లో సైతం ప్రయాణికుల భర్తీ 30 శాతాన్ని కూడా చేరుకోలేకపోతోంది.
ప్రధాన కారణాలివే...
సాధారణంగా పద్మావతి, వెంకటాద్రి, నారాయణాద్రి వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రాత్రి ప్రయాణం వల్ల ఉదయాన్నే తిరుపతికి చేరుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకొని దర్శనం అనంతరం.. తిరుపతి చుట్టుపక్కల ఉన్న పుణక్షేత్రాలను సందర్శించుకునే సౌకర్యం ఉంటుంది. తిరిగి సాయంత్రం తిరుపతి నుంచి బయలుదేరి ఉదయానికల్లా నగరానికి చేరుకోవచ్చు. రాత్రి పూట ట్రైన్‌లో నిద్రించే సదుపాయం వల్ల ఎలాంటి బడలిక లేకుండా ఉదయాన్నే యధావిధిగా విధులకు హాజరయ్యే అవకాశం ఉంది.
ఇలా తిరుపతి ఒక్కటే కాకుండా ఏ ప్రాంతానికైనా సరే ఎక్కువ మంది రాత్రిపూట ప్రయాణాన్నే కోరుకుంటారు. ప్రయాణికుల సదుపాయాలకు భిన్నంగా పగటి పూట సర్వీసులుగా అందుబాటులోకొచ్చిన డబుల్‌డెక్కర్‌లు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోతున్నాయి. ఈ నెల 13న కాచిగూడ నుంచి గుంటూరుకు, 14న కాచిగూడ నుంచి తిరుపతికి డబుల్‌డెక్కర్ సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. బై వీక్లీ సర్వీసులుగా ఇవి తిరుగుతున్నాయి.
డబుల్‌డెక్కర్ ఆదరణ పూర్..!
Published Wed, May 28 2014 12:05 AM | Last Updated on Tue, Aug 28 2018 7:57 PM
Advertisement