డబుల్ డెక్కర్ రైలు ఔట్!
- భాగ్యనగరం నుంచి తిరుపతి, గుంటూరు సర్వీసుల ఉపసంహరణ
- హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు తరలించాలని రైల్వే బోర్డు నిర్ణయం
- జూన్ 30 వరకు విశాఖ-తిరుపతి మధ్య ట్రయల్ రన్
- ఆక్యుపెన్సీ రేషియో లేదని ఈ నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డబుల్ డెక్కర్ రైలు దారిమళ్లింది. దానిని విశాఖపట్నానికి తరలించాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. వేరే రాష్ట్రాల లాబీయింగ్‌ను అధిగమించి సాధించుకున్న ఈ సూపర్‌ఫాస్ట్ రైలుకు రైల్వే యంత్రాంగం ప్రణాళికాలోపం కారణంగా ఆదరణ కరువైంది. హైదరాబాద్ (కాచిగూడ) నుంచి వారంలో రెండు రోజులు తిరుపతి, మరో రెండు రోజులు గుంటూరుకు తిరుగుతున్న ఈ రైలు ఆక్యుపెన్సీ రేషియో అతి తక్కువగా నమోదవుతోంది. దీంతో హైదరాబాద్ నుంచి శాశ్వతంగా దాన్ని రద్దు చేసి విశాఖపట్నం నుంచి తిరుపతికి నడపాలని తాజాగా నిర్ణయించింది. దీంతో ఈ నెల 12 నుంచి 30 వరకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయాన్ని వెల్లడించకుండా సాంకేతిక కారణాల రీత్యా 12 నుంచి 30 వరకు తాత్కాలికంగా హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-గుంటూరు మధ్య సర్వీసులు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
రద్దీలేని మార్గంలో నడపడం వల్లే..
హైదరాబాద్-విజయవాడ, విశాఖపట్నం మధ్య నిత్యం విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు చాలకపోవడంతో నెలరోజుల ముందే వెయిటింగ్ జాబితా సిద్ధమవుతుంది. దీంతో ఈ మార్గంలో అదనంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో డబుల్‌డెక్కర్ రైలును ఈ రద్దీ మార్గంలో నడపాలి. కానీ అధికారులు ముందస్తు సర్వే నిర్వహించకుండా కాచిగూడ-గుంటూరు మార్గంలో దానిని నడిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా విజయవాడ, ఆ తర్వాత గుంటూరుకు నడిపినామెరుగ్గా ఉండేది.
కానీ నడికుడి మీదుగా గుంటూరు వరకే నడపడంతో ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉంది. తిరుపతి వంటి దూరప్రాంతానికి రాత్రిపూట ఎక్కువగా ప్రయాణిస్తారు. కానీ, సీటింగ్ వసతి మాత్రమే ఉన్న డబుల్ డెక్కర్ రైళ్లనేమో పగటివేళ నడుపుతారు. దీంతో ఈ మార్గంలో ఆక్యుపెన్సీ 30 శాతం నమోదవుతోంది. మార్గం, సమయాల్లో మార్పులు చేయకుండా ఏకంగా హైదరాబాద్ నుంచి సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించడం గమనార్హం. తరలిన డబుల్ డెక్కర్ రైలును తొలుత విశాఖపట్టణం, దువ్వాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుపతి వరకు నడపనున్నారు. రూట్ సర్వే నిర్వహించిన తర్వాత దాన్ని రోజూ నడపాలా... లేదా.. వారంలో రెండు పర్యాయాలు నడిపి మరో రెండు రోజులు వేరే రూట్లో నడపాలా అనే దానిని నిర్ణయిస్తారు.