పట్టాల కంటే ఎత్తులో మెట్రో పిల్లర్స్
- ఆరు ప్రాంతాల్లో డిజైన్లు ఆమోదానికి వినతి
- డబుల్ డెక్కర్ రైలు ప్రయాణించేందుకు వీలుగా నిర్మాణం
- 10 చోట్ల రైల్వే ఆస్తుల స్వాధీనానికి అంగీకారం
- ఎస్సీ రెల్వే జీఎం శ్రీవాత్సవతో హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి భేటీ
సాక్షి, సిటీబ్యూరో: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆరు ప్రాంతాల్లో సాధారణంగా కంటే ఎక్కువ ఎత్తులో ఉండే రైల్వే ట్రాక్‌లు, వంతెల కంటే మెట్రో పిల్లర్లు ఎత్తులో రానున్నాయి. సాధారణ ట్రాక్‌పై డబుల్‌డెక్కర్ రైలు రాకపోకలు సాగించే విధంగా మెట్రో మార్గం నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. భరత్‌నగర్, మలక్‌పేట్, ఆలుగడ్డబావి, చిలకలగూడా, ఒలిఫెంటాబ్రిడ్జి, సికింద్రాబాద్ (బోయిగూడ) ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎదురుకానుంది.
ఇక లక్డీకాపూల్ వద్ద రైల్వే ట్రాక్ కింది నుంచి మెట్రో ట్రాక్, బేగంపేట్‌లో రైల్వే ట్రాక్‌కు సమాంతరంగా మెట్రో మార్గం ఏర్పాటు కానుంది. ఈ విషయంలో తాము రూపొందించిన డిజైన్లను ఆమోదించాలని కోరుతూ హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి సోమవారం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె. శ్రీవాత్సవతో భేటీ అయ్యారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కాగా మెట్రో పనులు చేసుకునేందుకు వీలుగా సికింద్రాబాద్ పరిధిలో పది చోట్ల రైల్వే ఆస్తుల స్వాధీనానికి అనుమతించినందుకు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి రైల్వే జీఎం శ్రీవాత్సవకు కృతజ్ఞతలు తెలిపారు.
రైల్వే ఆస్తుల స్వాధీనం కోసం రూ.69 కోట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని జీఎం దృష్టికి తీసుకొచ్చారు. రైల్వే క్రాసింగ్‌లు ఉన్న ఒలిఫెంటా బ్రిడ్జి, సికింద్రాబాద్ (బోయిగూడ) ప్రాంతాల్లో ఇనుముతో చేసిన వారధులు నిర్మిస్తామని, భరత్‌నగర్,చిలకలగూడ, ఆలుగడ్డబావి, లక్డీకాపూల్, మలక్‌పేట్, బేగంపేట్ ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌ల వద్ద మెట్రో మార్గం కోసం కాంక్రీటు వారధులు నిర్మిస్తామని ఎండీ తెలిపారు.
భరత్‌నగర్ వద్ద మెట్రో రైలు బ్రిడ్జి పనులు చేసుకునేందుకు వీలుగా ఈ రూట్లో రైళ్ల రాకపోకలను నియంత్రించేందుకు రైల్వే జీఎం సూత్రప్రాయంగా అంగీకరించారు. సికింద్రాబాద్ లేఖాభవన్ ప్రాంగణంలోని అర ఎకరం స్థలంలో మెట్రో పనులు చేపడుతున్న యంత్రాలను నిలిపేందుకు జీఎం అనుమతిచ్చారు.