బెజవాడకు డబుల్ డెక్కర్ చక్కర్లు
విజయవాడ : విజయవాడకు త్వరలోనే డబుల్ డెక్కర్ రైలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం డబుల్ డెక్కర్ రైలు ట్రైల్ రన్ నిర్వహించడం ఇందుకు బలాన్నిస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో ఉన్న డబుల్ డెక్కర్ రైలు స్టేషన్‌లోని 1, 2, 3, 4, 5 ప్లాట్‌ఫారాలపై మధ్యాహ్నం మూడు నుంచి సాయత్రం ఆరు గంటల వరకు చక్కర్లు కొట్టింది. అనంతరం రైల్వే యార్డుకు చేరుకుంది. బుధవారం ఉదయం 8, 9, 10 ప్లాట్‌ఫారాలపై నడిపి పరిశీలిస్తారు. అనంతరం గుంటూరుకు, అక్కడ నుంచి గురువారం కాచిగూడకు వెళ్తుందని అధికారులు తెలిపారు.
డబుల్ డెక్కర్ రైలును విజయవాడ వరకు నడిపితే ఇక్కడ ప్లాట్‌ఫారాలు ఎంతమేరకు అనుకూలంగా ఉంటాయో తెలుసుకునేందుకు ఈ రైలును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ రైలు ప్లాట్‌ఫారానికి ఎంత దూరంలో ఉంటుందనే విషయాన్ని గుర్తించారు. ఏ ఇబ్బందులు రావని అధికారులు నిర్ధారణకు వస్తే త్వరలోనే విజయవాడకు డబుల్ డెక్కర్ రైలు వస్తుంది. డబుల్ డెక్కర్ రైలును కాచిగూడ-తిరుపతి మార్గంలో వారానికి రెండు రోజులు నడుపుతున్నారు. గుంటూరు-కాచిగూడ మార్గం తొలుత నడిపినా ప్రస్తుతం నిలిపివేశారు. ఈ డబుల్ డెక్కర్ రైలును విజయవాడ నుంచి కాచిగూడకు నడపాలని ఇక్కడి కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు.. రైల్వే బోర్డుకు కొంతకాలంగా ప్రతిపాదనలు పంపుతున్నారు.
విజయవాడ-కాజీపేట-సికింద్రాబాద్ మధ్య నడిపితే మేలు
కాచిగూడ-గుంటూరు మధ్య నడిపిన డబుల్ డెక్కర్ రైలుకు అధికారులు ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రాలేదు. దీంతో ఆ రైలును విజయవాడ వరకు నడిపితే ఆక్యుపెన్సీ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. విజయవాడ-కాజీపేట-సికింద్రాబాద్ మార్గంలోనూ డబుల్ డెక్కర్ రైలు నడపాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అందువల్లే నగరంలోని అన్ని ప్లాట్‌ఫారాల పైన డబుల్ డెక్కర్ రైలును పరిశీలిస్తున్నారని సమాచారం.
ఆకట్టుకున్న డబుల్ డెక్కర్ రైలు..
రెండు ఫ్లోర్‌లతో ఆకట్టుకునే రంగులు, పూర్తి ఏసీ సదుపాయంతో రూపొందిన ఈ రైలును ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. మొత్తం 17 బోగీలు ఉండగా, రెండు అంతస్తుల్లో కలిపి ఒక్కో బోగీలో 120 సీట్లు చొప్పున ఉన్నాయి. రైలులోని బోగీలు కొద్దిగా వెడల్పుగా ఉండటంతోపాటు సాధారణ బోగీల కన్నా కొంచెం ఎత్తుగా ఉన్నాయి.