double decker train
-
పట్టాలు తప్పిన డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
సాక్షి, గుడుపల్లె(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లే డబుల్ డెక్కర్ రైలు గుడుపల్లె మండలం బిసానత్తం రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం పట్టాలు తప్పింది. ఉదయం 11 గంటల సమయంలో చెన్నై నుంచి బెంగళూరుకు బయలు దేరిన ఈ రైలు రెండో కోచ్ చక్రాలు కర్ణాటక సరిహద్దులోని బిసానత్తం వద్ద కిందకు దిగిపోయాయి. దీంతో పైలెట్ గమనించి రైలును ఆపేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పట్టాలు తప్పిన కోచ్‌లో 130 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రైలును క్రమబద్ధీకరించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పడంతో చెన్నై-బెంగళూరు మార్గంలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఐదు గంటలు ఆలస్యంగా నడిచాయి. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. -
రేపు విశాఖ-విజయవాడ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం-విజయవాడ మధ్య ప్రతిష్టాత్మకమైన డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్ర్‌ప్రెస్ సర్వీసులు గురువారం లాంఛనంగా ప్రారంభమవుతాయని, శుక్రవారం నుంచి ఈ సర్వీసులు పూర్తిస్థాయిలో పట్టాలెక్కనున్నాయని భారత రైల్వే శాఖ వెల్లడించింది. విశాఖ-విజయవాడ మధ్య వారంలో ఐదురోజులపాటు డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రీ ఎక్స్‌ప్రెస్(ఉదయ్)ను నడపనున్నట్టు తెలిపింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ చెన్నబసప్ప అంగడి గురువారం లాంఛనంగా ఉదయ్‌ను ప్రారంభిస్తారని తెలిపింది. ప్రారంభోత్సవరం సందర్భంగా 02701 నంబర్ ఉయద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి విజయవాడ బయలుదేరుతుందని, ఈ రైలు కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయని పేర్కొంది. 2701 నంబర్ ఉయద్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11.30లకు విశాఖ నుంచి బయలుదేరి.. సాయంత్రం 4.50 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. రిటర్న్ డైరెక్షన్లో 2207 నంబర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి.. రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 22071 నంబర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి.. ఉదయం 11.15 గంటలకు విజయవాడ చేరుతుంది. రిటర్న్ డైరెక్షన్లో ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 22702 నంబర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి.. రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. -
27 నుంచి డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం
సాక్షి, అమరావతి : దాదాపు మూడున్నరేళ్ల క్రితం రైల్వే మంత్రి ఇచ్చిన హామీకి మోక్షం లభించనుంది. విజయవాడ– విశాఖపట్నం మధ్య డబుల్ డెక్కర్ ఏసీ రైలు ఎట్టకేలకు (నెంబరు 22701/702)తో పట్టాలెక్కనుంది. ఆధునిక సదుపాయాలున్న ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రీ (ఉదయ్) ఎక్స్‌ప్రెస్ రైలు ఈనెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రాజధాని అమరావతికి విశాఖ– విజయవాడల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు నగరాల మధ్య డబుల్ డెక్కర్ రైలును నడపాలన్న డిమాండ్ నాలుగేళ్ల క్రితం నుంచి ఉంది. దీంతో 2016 రైల్వే బడ్జెట్లో అప్పటి రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ఈ ఉదయ్ రైలును ప్రకటించారు. అయితే అప్పట్నుంచి జాప్యం జరుగుతూ వచ్చింది. పంజాబ్‌లోని జలంధర్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ ఉదయ్ రైలు బోగీలు తయారయ్యాయి. అక్కడ నుంచి గత నెల 15న రాయగడ మీదుగా విశాఖ తీసుకొచ్చారు. విశాఖలో ట్రయల్ రన్‌తో పాటు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించారు. అన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో ఈ ఉదయ్ రైలు పట్టాలెక్కించడానికి రైల్వే ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ నెల 26న విశాఖలో ఈ రైలును కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ చెన్నబసప్ప లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తరువాత 27వ తేదీ నుంచి విజయవాడలో ప్రయాణికులను అనుమతిస్తారు. ఈ రైలుకు రిజర్వేషన్ సదుపాయం ఉంది. అతి తక్కువ సమయం.. విజయవాడ–విశాఖపట్నం మధ్య 350 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండు నగరాల మధ్య ఎక్స్‌ప్రెస్ రైళ్లు 6 నుంచి 10 గంటల ప్రయాణ సమయం పడుతోంది. ఈ ఉదయ్ రైలు మాత్రం కేవలం 5.30 గంటల్లోనే గమ్యాన్ని చేరనుంది. విశాఖలో ఉదయం 5.45కి బయల్దేరి మధ్యాహ్నం 11.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అలాగే సాయంత్రం విజయవాడలో 5.30కు బయల్దేరి రాత్రి 10.55కి విశాఖ చేరుతుంది. గురు, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో ఈ రైలు నడుస్తుంది. ఆధునిక సదుపాయాలు.. ఈ ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు (ఎనిమిది) బోగీల్లో ఆధునిక సదుపాయాలున్నాయి. పుష్బ్యాక్ సీట్లు, లగేజి ర్యాక్‌లు, విశాలమైన అద్దాలు, ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లు, భోజనం/అల్పాహారం చేసేందుకు ప్రత్యేక డైనింగ్ హాలు, విశాలమైన అద్దాలు, బయోటాయిలెట్లు వంటివి ఉంటాయి. ఇలాంటి సదుపాయాలు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మాత్రమే ఉన్నాయి. సాధారణ రైళ్ల బోగీల్లో 72 బెర్తులుంటాయి. ఈ ఉదయ్ డబుల్ డెక్కర్‌లో మొత్తం 120 సీట్లు ఉంటాయి. పై డెక్‌లో 50, దిగువన 48, బోగీ చివరలో 22 సీట్లు అమర్చారు. ఆదరణపై అనుమానాలు.. ప్రస్తుతం తిరుపతి– విశాఖల మధ్య డబుల్ డెక్కర్ నడుస్తోంది. దీనికి తిరుపతి– విజయవాడల మధ్య ప్రయాణికుల నుంచి ఆశించిన ఆదరణ లేదు. అయితే విజయవాడ–విశాఖ నుంచి ఒకింత డిమాండ్ ఉంది. అందువల్ల ఈ ఉదయ్ రైలుకూ ఆదరణ ఉంటుందని రైల్వే వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ఈ రెండు నగరాల మధ్య టికెట్టు ధర (చైర్‌కార్‌కు) ప్రస్తుత డబుల్ డెక్కర్ రైలుకు రూ.525 ఉంది. కొత్తగా ప్రారంమయ్యే ఉదయ్ రైలుకు కూడా దాదాపు ఇదే ధర ఉండనుంది. అయితే ఈ ధర ధనికులు, వ్యాపారులు, అధికారులకే తప్ప సామాన్య/మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండదన్న వాదన ఉంది. విజయవాడ– విశాఖల మధ్య ప్రస్తుతం నడుస్తున్న రత్నాచల్, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైళ్ల సెకండ్ సిటింగ్ టికెట్టు ధర రూ.155 ఉంది. దీంతో ఈ రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఉదయం 5.45కి బయల్దేరి మధ్యాహ్నం విజయవాడ చేరుకుని పనులు పూర్తి చేసుకుని తిరిగి 5.30కి బయల్దేరి రాత్రికి విశాఖ చేరుకుంటున్నందున ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రాజధానికి వచ్చే అధికారులు, వ్యాపారులకు ఎంతో అనువుగా ఉంటుందని, అందువల్ల ఆదరణకు ఢోకా ఉండదని రైల్వే వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
ఉదయ్ ముహూర్తం కుదిరింది
సాక్షి, విశాఖపట్నం : ఉదయ్ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సన్నద్ధమైంది. ఈ నెల 27న తొలి సర్వీసు విశాఖపట్నం నుంచి ప్రారంభం కానుంది. ఇటీవలే.. విశాఖలోని మర్రిపాలెం కోచింగ్ కాంప్లెక్స్ నుంచి కోరుకొండ వరకు ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే బయలుదేరే వేళలు ఖరారు చేసిన వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు.. తాజాగా ప్లాట్‌ఫామ్‌లను కూడా కేటాయించారు. 22701/22702 ట్రైన్ నంబర్‌గా విశాఖ నుంచి విజయవాడకు ఉదయ్ నడవనుంది. వారానికి 5 రోజుల పాటు ఈ రైలు పరుగులు తీయనుంది. ఆదివారం, గురువారం మినహాయించి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు ఈ డబుల్ డెక్కర్ రైలు బయలుదేరి 10.50కి విజయవాడ చేరుకోనున్న ఈ రైలు(22701)కు ఆరో నంబర్ ప్లాట్‌ఫామ్ కేటాయించారు. అదేవిధంగా విజయవాడ నుంచి సాయంత్రం 5.45కి బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకోనున్న రైలు(22702)కి ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ కేటాయించారు. ప్రయాణానికి అనుకూలం.. విశాఖపట్నం నుంచి రాష్ట్ర రాజధాని నగరం విజయవాడకు రద్దీ ఎక్కువగా ఉంది. ఉదయ్ పేరుతో కేటాయించిన డబుల్ డెక్కర్ రైలు(ట్రైన్ నం. 22701/22702)ని వాల్తేరు డివిజన్ నుంచి భువనేశ్వర్‌కు తరలించేందుకు ఈస్ట్ కోస్ట్ అధికారులు ప్రయత్నాలు చేశారు. ఈ ట్రైన్ నిర్వహణకు సరైన సిబ్బంది వాల్తేరు డివిజన్లో లేరనే సాకు చూపిస్తూ.. ఉదయ్ రైలుని తరలించేందుకు కుయుక్తులు పన్నారు. కానీ.. జిల్లా వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంతో పోరాడటంతో విశాఖ నుంచే కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ఉదయ్‌ను నడిపేందుకు అవసరమైన సిబ్బందిని ఈస్ట్ కోస్ట్ కేటాయించింది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడవనున్న ఈ రైలుకి అవసరమైన సిబ్బందిని సంసిద్ధుల్ని చేసేందుకు డివిజన్‌కు చెందిన ఏడుగురు సిబ్బందిని పంజాబ్‌లోని కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీలో శిక్షణ అందించారు. వివిధ స్టేషన్ల నుంచి విశాఖ మీదుగా వెళ్తున్న రైళ్లతో పాటు విశాఖ నుంచి బయలుదేరే ట్రైన్లు కలిపి మొత్తం రోజుకు 107 వరకు అందుబాటులో ఉన్నాయి. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉదయ్‌ని కేటాయించారు. ఈ ట్రైన్ సర్వీసు ప్రారంభమైతే, రద్దీ విపరీతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడకు వ్యాపారులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి వారందరి ప్రయాణానికి ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ అనువైందిగా భావిస్తున్నారు. కేంద్ర సహాయమంత్రి చేతుల మీదుగా... ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు ప్రారంభోత్సవానికి రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి హాజరవుతారని రైల్వే వర్గాలు తెలిపాయి. 26వ తేదీన విశాఖకు రానున్న మంత్రి సురేష్, 27 ఉదయం 5.45కి ఉదయ్ తొలి సర్వీసుని ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే ఈ పర్యటన వాయిదా పడే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకలివీ... ఉదయ్ డబుల్ డెక్కర్ ట్రైన్ అయినా అనేక ప్రత్యేకతలతో కూడుకున్నది. 2 పవర్ కార్లు, 8 డబుల్ డెక్కర్ ఛైర్ కార్స్ ఉన్నాయి. అన్ని కోచ్‌లనూ సాన్రాక్ (సెంటర్ బఫర్ కప్లర్స్తో) అనుసంధానం చెయ్యడం వల్ల ప్రయాణ సమయంలో ఎలాంటి జర్క్‌లు ఉండవు అన్ని కోచ్‌ల్లో డిస్క్ బ్రేక్‌లతో పాటు ఫెయిల్యూర్ ఇండికేషన్ బ్రేకింగ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. దీని వల్ల ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సమాచారం అందుతుంది. ప్రతి కోచ్‌లోనూ రెండు బయో టాయిలెట్స్ ఉన్నాయి. సబ్బులు కూడా అందుబాటులో ఉంచనున్నారు. తదుపరి స్టేషన్ వివరాలు, ప్రయాణం వేగం.. ఇతర వివరాలు ప్రయాణికులకు తెలిపేందుకు ప్రతి కోచ్‌లోనూ 6 డిస్ప్లే మానిటర్స్ ఉన్నాయి. చిన్న పొగ వచ్చినా.. వెంటనే సమాచారం అందేలా అన్ని కోచ్‌లలోనూ వెస్‌డా యంత్రాలు అమర్చారు ఇందులో ఏర్పాటు చేసిన సీటింగ్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటివి అమర్చారు. ప్రయాణీకులకు వినోదం కోసం ఎల్సీడీ స్క్రీన్లు, వైఫై సౌకర్యంతో పాటు జీపీఎస్ ఆధారిత పాసింజర్ సమాచార వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రతి మూడో కోచ్ తర్వాత పాంట్రీ, డైనింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ ఫుడ్, టీ, కాఫీ వెండింగ్ మెషీన్లున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారుచేసిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అమర్చారు. 6 కోచ్‌లు 120 సీటింగ్ సామర్థ్యంతోనూ, మిగిలినవి పాంట్రీతో కూడిన కోచ్‌లుగా 104 సీటింగ్ సామర్ధ్యంతో ఉన్నాయి. -
విశాఖ, విజయవాడ మధ్య ‘డబుల్ డెక్కర్’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడల మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ రైలును త్వరలోనే ప్రారంభించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ రైలు వారంలో 5 రోజులు సేవలు అందించనున్నట్టు పేర్కొన్నారు. ఈ రైలు రాకతో రెండు నగరాల మధ్య రవాణా మరింత మెరుగవుతుందని ఆయన ఆకాక్షించారు. విజయవాడ, విశాఖపట్నం మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని కోరుతూ రెండు నెలల క్రితం బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, రైల్వే మంత్రికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన గోయల్ ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని జీవీఎల్ గురువారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి జీవీఎల్ కృతజ్ఞతలు తెలిపారు. -
పూర్తి ఏసీతో డబుల్ డెకర్ రైళ్లు
ఇంతకుముందు ప్రవేశపెట్టిన డబుల్ డెకర్ రైళ్లకు ఆదరణ లభించకపోవడంతో.. భారతీయ రైల్వేలు సరికొత్త ప్రయోగం చేస్తున్నాయి. ఎక్కువ డిమాండ్ ఉండే రూట్లలో పూర్తి ఏసీ, వై-ఫై సదుపాయంతో కొత్తగా ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఏఎక్స్ యారీ (ఉదయ్) రైళ్లను నడిపించనున్నాయి. ఇవి జూలై నుంచిప్రారంభం అవుతాయని రైల్వేశాఖ తెలిపింది. ఒక్కో కోచ్‌లో వెనక్కి వాలగలిగేలా 120 సీట్లు ఉంటాయి. ప్రయాణసమయంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఆటోమేటిక్ టీ/కాఫీ/ కూల్ డ్రింక్ వెండింగ్ మిషన్లు కూడా ప్రతి బోగీలో ఉంటాయి. ఢిల్లీ-లక్నో లాంటి బాగా డిమాండ్ ఉండే మార్గాల్లో ఇవి నడుస్తాయి. మామూలు రైళ్లలో ఉండే థర్డ్ ఏసీ కంటే వీటిలో చార్జి తక్కువగానే ఉంటుందని అంటున్నారు. ప్రతి బోగీలోనూ ఎల్సీడీ స్క్రీన్లు, వై-ఫై స్పీకర్ సిస్టం కూడా ఉంటాయి. మామూలు రైళ్ల కంటే సీట్ల సామర్థ్యం 40 శాతం ఎక్కువగా ఉండటంతో రద్దీని తట్టుకోడానికి ఇవి ఉపయోగపడతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే.. రాత్రిపూట ప్రయాణించే రైళ్లయినా వీటిలో బెర్తులు లేకపోవడం మాత్రం కొంత ఇబ్బందికరమే అంటున్నారు. దాంతో అదనపు సదుపాయాలతో ప్రయాణాన్ని సుఖవంతం చేస్తున్నామని అధికారులు తెలిపారు. రాత్రిపూట వెనక్కి వాలి, కాళ్లు చాపుకునేలా తగినంత లెగ్ స్పేస్ ఉంటుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైళ్ల గురించి 2016-17 రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. -
డబుల్ డెక్కర్ రైలు వచ్చేస్తోంది!
సాక్షి, విజయవాడ: విశాఖపట్నం-తిరుపతి మధ్య విజయవాడ మీదుగా డబుల్ డెక్కర్ రైలు నడిపేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. విశాఖ-తిరుపతి మార్గంలో రద్దీని తగ్గించేందుకు డబుల్ డెక్కర్ రైలును నడపాలని నిర్ణయించారు. దీనికోసం సర్వేలు పూర్తిచేసిన అధికారులు రైల్వే బోర్డుకు నివేదిక పంపారు. ఈ రైలుకోసం కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, విశాఖ ఎంపీ హరిబాబు కృషిచేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే మే 15 నుంచి ఈ రైలు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలులో 18 బోగీలుంటాయి. అన్నీ ఏసీ బోగీలు, చైర్‌కార్ కావడంతో ఈ రైలును విశాఖలో ఉదయం బయలుదేరేలా నడుపుతారు. ఒకవేళ విశాఖ-తిరుపతి మార్గంలో ఆదరణ లేకపోతే దీన్ని విశాఖ-హైదరాబాద్ మధ్య నడిపే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇప్పటికే కాచిగూడ- గుంటూరు, కాచిగూడ-తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో ఒకదాన్నిగానీ, మరో కొత్త రైలునుగానీ విశాఖ-తిరుపతి మధ్య నడిపే అవకాశం ఉంది. ప్రయాణికుల ఆదరణ లభించేనా? ప్రస్తుతం కాచిగూడ- గుంటూరు మధ్య వారానికి రెండుసార్లు నడుస్తున్న డబుల్ డెక్కర్ రైలుకు ప్రయాణికుల నుంచి అంతగా ఆదరణ లేదు. ఇదే తరహాలో విశాఖపట్నం నుంచి తిరుపతికి నడిపే డబుల్ డెక్కర్ రైలుకు ప్రయాణికుల నుంచి ఏమేరకు ఆదరణ లభిస్తుందోనని రైల్వే వినియోగదారుల సంఘాలు అనుమానిస్తున్నాయి. ఈ రైలు విశాఖపట్నంలో మధ్యాహ్నం బయలుదేరి రాత్రికి విజయవాడ చేరుకుని తెల్లవారుజామునకు తిరుపతి చేరితే ప్రయాణికుల ఆదరణ లభించే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. -
నిలిచిన డబుల్ డెక్కర్
బోనకల్: గుంటూరు నుంచి కాచిగూడ వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలు శనివారం ఉదయం ఖమ్మం జిల్లా బోనకల్ రైల్వే స్టేషన్లో నిలిచి పోయింది. రైల్వే ట్రాక్ ఇరుపక్కల ఉన్న కంకరు ట్రైన్ కింది భాగంలోతగులుతుండటంతో.. అప్రమత్తమైన డ్రైవర్ బోనకల్ రైల్వేస్టేషన్లో రైలును నిలిపివేసి సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సిబ్బంది పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
రాత్రి వేళల్లో ‘డబుల్ డెక్కర్’?
సాక్షి, హైదరాబాద్: పగటి వేళల్లో మాత్రమే పరుగులు పెడుతున్న డబుల్ డెక్కర్ రైలును రాత్రివేళ నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేకు మంజూరైన రెండు సర్వీసులు ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాచిగూడ- తిరుపతి డబుల్ డెక్కర్ రైలు ఆక్యుపెన్సీ రేటు సగటున 36 శాతం, కాచిగూడ-విజయవాడ సర్వీసుకు 38 శాతం మాత్రమే. ఇవి పగటివేళ తిరుగుతుండడం, కేవలం కూర్చునే వీలు మాత్రమే ఉండడంతో చాలామంది ప్రయాణికులు డబుల్ డెక్కర్ రైళ్లల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ సర్వీసులను రాత్రి వేళల్లో నడిపితే ఎలా ఉంటుందన్న విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి తీసుకొచ్చారు. తొలుత ప్రయోగాత్మకంగా పరిశీలించి చూసేందుకు ఆయన ఒప్పుకొన్నట్లు సమాచారం. -
బెజవాడకు డబుల్ డెక్కర్ చక్కర్లు
విజయవాడ : విజయవాడకు త్వరలోనే డబుల్ డెక్కర్ రైలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం డబుల్ డెక్కర్ రైలు ట్రైల్ రన్ నిర్వహించడం ఇందుకు బలాన్నిస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో ఉన్న డబుల్ డెక్కర్ రైలు స్టేషన్‌లోని 1, 2, 3, 4, 5 ప్లాట్‌ఫారాలపై మధ్యాహ్నం మూడు నుంచి సాయత్రం ఆరు గంటల వరకు చక్కర్లు కొట్టింది. అనంతరం రైల్వే యార్డుకు చేరుకుంది. బుధవారం ఉదయం 8, 9, 10 ప్లాట్‌ఫారాలపై నడిపి పరిశీలిస్తారు. అనంతరం గుంటూరుకు, అక్కడ నుంచి గురువారం కాచిగూడకు వెళ్తుందని అధికారులు తెలిపారు. డబుల్ డెక్కర్ రైలును విజయవాడ వరకు నడిపితే ఇక్కడ ప్లాట్‌ఫారాలు ఎంతమేరకు అనుకూలంగా ఉంటాయో తెలుసుకునేందుకు ఈ రైలును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ రైలు ప్లాట్ఫారానికి ఎంత దూరంలో ఉంటుందనే విషయాన్ని గుర్తించారు. ఏ ఇబ్బందులు రావని అధికారులు నిర్ధారణకు వస్తే త్వరలోనే విజయవాడకు డబుల్ డెక్కర్ రైలు వస్తుంది. డబుల్ డెక్కర్ రైలును కాచిగూడ-తిరుపతి మార్గంలో వారానికి రెండు రోజులు నడుపుతున్నారు. గుంటూరు-కాచిగూడ మార్గం తొలుత నడిపినా ప్రస్తుతం నిలిపివేశారు. ఈ డబుల్ డెక్కర్ రైలును విజయవాడ నుంచి కాచిగూడకు నడపాలని ఇక్కడి కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు.. రైల్వే బోర్డుకు కొంతకాలంగా ప్రతిపాదనలు పంపుతున్నారు. విజయవాడ-కాజీపేట-సికింద్రాబాద్ మధ్య నడిపితే మేలు కాచిగూడ-గుంటూరు మధ్య నడిపిన డబుల్ డెక్కర్ రైలుకు అధికారులు ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రాలేదు. దీంతో ఆ రైలును విజయవాడ వరకు నడిపితే ఆక్యుపెన్సీ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. విజయవాడ-కాజీపేట-సికింద్రాబాద్ మార్గంలోనూ డబుల్ డెక్కర్ రైలు నడపాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అందువల్లే నగరంలోని అన్ని ప్లాట్‌ఫారాల పైన డబుల్ డెక్కర్ రైలును పరిశీలిస్తున్నారని సమాచారం. ఆకట్టుకున్న డబుల్ డెక్కర్ రైలు.. రెండు ఫ్లోర్లతో ఆకట్టుకునే రంగులు, పూర్తి ఏసీ సదుపాయంతో రూపొందిన ఈ రైలును ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. మొత్తం 17 బోగీలు ఉండగా, రెండు అంతస్తుల్లో కలిపి ఒక్కో బోగీలో 120 సీట్లు చొప్పున ఉన్నాయి. రైలులోని బోగీలు కొద్దిగా వెడల్పుగా ఉండటంతోపాటు సాధారణ బోగీల కన్నా కొంచెం ఎత్తుగా ఉన్నాయి. -
వామ్మో..డబుల్ డెక్కరా !
తిరుపతిఅర్బన్, న్యూస్‌లైన్: దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆర్భాటంగా ప్రారంభించిన డబు ల్ డెక్కర్ రైలు అంటేనే ప్రయాణికులు, టీసీలు జడుసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. రైలు ఈ నెల 14వ తేదీ ప్రారంభమైనప్ప టి నుంచీ రైలులోని అన్ని బోగీల్లో ఏసీలు పనిచేయడం లేదు. దీనిపై ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నా అధికారుల్లో చలనం లేదు. శనివారం ఉదయం 6.45 గంటలకు కాచీగూడ నుంచి తిరుపతికి బయలుదేరింది. రైల్లోని అన్ని బోగీల్లో ఏసీలు పనిచేయలేదు. దీంతో ప్రయాణికులు టీసీలపైకి దాడికి దిగారు. కర్నూలు, కడప రైల్వే స్టేషన్లలో టీసీలపై చేయిచేసుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. అంతేగాక ఈ రైలు నిర్ణీత వేళల ప్రకారం సాయంత్రం 5.15 గంటలకు తిరుపతికి చేరుకోవాల్సి ఉండగా శనివారం రాత్రి 8.40 గంటలకు చేరుకుంది. ప్రయాణికులు తిరుపతి రైల్వే స్టేషన్ మేనేజర్ కార్యాలయంవద్దకు ఆందోళన చేశారు. -
డబుల్ డెక్కర్ రైలులో పనిచేయని ఏసీలు
గంట పాటు డోన్‌లో నిలిపివేత డోన్ రూరల్, న్యూస్‌లైన్: తిరుపతి నుంచి కాచిగూడకు బయలుదేరిన డబుల్ డెక్కర్ రైలులో గురువారం ఏసీలు పనిచేయలేదు. అలాగే నీటి సరఫరా కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డోన్ రైల్వేస్టేషన్‌కి 12 గంటలకు చేరగానే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైలులో అసౌకర్యాలపై డోన్ స్టేషన్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రైల్వే సిబ్బందితో మాట్లాడి.. ఏసీలకు మరమ్మతులు చేయించారు. అలాగే నీటి సరఫరాను పునరుద్ధరించారు. పనులు పూర్తికాగానే ఒంటి గంటకు డబుల్ డెక్కర్ రైలు కాచిగూడకు బయలుదేరి వెళ్లింది. ప్రయాణికులు దాదాపు గంట పాటు డోన్ రైల్వే స్టేషన్లో నిరీక్షించాల్సి వచ్చింది. -
గుత్తిలో డబుల్ డెక్కర్ రైలు కూత
గుత్తి (అనంతపురం), న్యూస్‌లైన్ : దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి సారిగా ప్రవేశ పెట్టిన డబుల్ డెక్కర్ రైలు బుధవారం గుత్తి మీదుగా తిరుపతికి వెళ్లింది. ఉదయం 6.45 గంటలకు డబుల్ డెక్కర్ రైలు కాచిగూడ(హైదరాబాద్)నుంచి బయలు దేరి మధ్యాహ్నం 12.45 గంటలకు గుత్తికి చేరింది. కొత్త రైలు.. అందులోనూ డబుల్ డెక్కర్ కావడంతో దాన్ని చూడటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. డబుల్ డెక్కర్ రైలు చూడముచ్చటగా ఉందని చర్చించుకున్నారు. డబుల్ డెక్కర్ రైలులో సదుపాయాలు బాగున్నాయని ప్రయాణికులు చెప్పారు. రైల్లో కూర్చున్నట్లు లేదని బస్సులోనే కూర్చుని ప్రయాణించిన అనుభూతి కలిగిందని కొందరు వ్యాఖ్యానించారు. కాగా డబుల్ డెక్కర్ రైలు వారంలో ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే కాచిగూడ నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి గురువారం, ఆదివారాల్లో ఉదయం 5.45 గంటలకు తిరుపతిలో బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. చాలా అద్భుతంగా ఉంది: ముందుగా డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అభినందనలు. సాధారణ రైలు కంటే దీంట్లో అన్ని సదుపాయాలున్నాయి. అసలు ప్రయాణం చేసినట్లు కూడా అనిపించదు. చాలా అద్భుతంగా కూడా ఉంది. చూడముచ్చటగా కూడా ఉంది. అయితే వారానికి రెండు సార్లు కాకుండా ప్రతి రోజూ నడపాలి.ఇలాంటి రైళ్లు మరిన్ని ప్రారంభించాలి. - సుబ్రమణ్యం, ప్రయాణికుడు, కడప -
తిరుపతికి డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం
హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్ నుంచి తిరుపతి వెళ్లే డబుల్ డెక్కర్ రైలు బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ రైలు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 6.45 గంటలకు బయల్దేరింది. తిరుపతికి సాయంత్రం 6.15 గంటలకు చేరుకుంటుంది. ప్రతి బుధ, శనివారాల్లో ఈ రైలు కాచిగూడ - తిరుపతి మధ్య తిరుగుతుంది. ఇప్పటికే గుంటూరు - హైదరాబాద్ మధ్య ఒక డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం కాగా, ఇది మన రాష్ట్రానికి సంబంధించి రెండో రైలు అవుతుంది. ఇది పూర్తిగా ఏసీ రైలు. ఈ రైల్లో ఎక్కడా బెర్తులు ఉండవు. చైర్ కార్ మాదిరిగా కూర్చుని మాత్రమే వీటిలో వెళ్లాల్సి వస్తుంది. మొత్తం పది బోగీలు ఉండే ఈ రైల్లో కింద, పైన కూడా సీట్లు ఉండటంతో ఒక్కో బోగీకి 120 మంది వరకు ప్రయాణికులు పడతారు. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉన్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. -
కర్నూల్ రాజధాని కావాలి: కోట్ల
హైదరాబాద్: సీమాంధ్ర కోసం కర్నూలును రాజధానిగా చేయాలని పోరాడనున్నట్లు రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి చెప్పారు. డబుల్ డెక్కర్ రైలును పరిశీలించేందుకు గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన వల్ల తీవ్ర అన్యాయానికి గురైన రాయలసీమకు రాజధాని ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణమధ్య రైల్వే సహా అన్ని అంశాలపై కమిటీలు వే శారని, ఆ కమిటీ నివేదిక మేరకు రైల్వేలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. రాయలసీమకు చెందిన వ్యక్తిగా సీమాంధ్ర రైల్వే ప్రధాన కార్యాలయం కూడా కర్నూల్లోనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. వాల్తేరు డివిజన్ విలీనం పైన కూడా కమిటీ నివేదిక మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన ఇంకా భూమి లభించలేదన్నారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
కనువిందు చేస్తున్న డబుల్ డెక్కర్ రైలు
-
డబుల్ డెక్కర్ రైలు వచ్చేసింది!
త్వరలో కాచిగూడ నుంచి ప్రారంభం ఒకటి తిరుపతికి, మరోటి గుంటూరుకు కాజీపేట, న్యూస్‌లైన్: దక్షిణ మధ్య రైల్వేలో రెండు డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. వీటిలో ఒక రైలు కాచిగూడ నుంచి గుంటూరుకు, మరో దానిని కాచిగూడ నుంచి కాజీపేట మీదుగా తిరుపతికి నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా కాజీపేటకు రంగురంగుల డబుల్ డెక్కర్ ఏసీ రైలు శనివారం సాయంత్రం వ చ్చింది. ఈ రైలు పంజాబ్‌లోని కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపుదిద్దుకుంది. దీనిని కాజీపేట అధికారులు రైల్వే యార్డులో ఉంచారు. కొద్ది రోజుల్లోనే కాచిగూడలో రైల్వే మంత్రి దీనిని ప్రారంభించనున్నారు. కాగా, ఈ డబుల్ డెక్కర్‌ను ప్రయాణికులు, స్థానికులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. రెండంతస్తుల రైలు ప్రత్యేకత లు.. డబుల్ డెక్కర్ రైలులో 16 బోగీలుంటాయి. వీటిలో ఇంజిన్ ముందు, వెనక రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లుండగా 14 బోగీలకు ఏసీ సౌకర్యం ఉంటుంది. రైలు మొత్తంలో 1680 మంది ప్రయాణీకులు కూర్చునే వీలుంటుంది. ఒక డబుల్ డెక్కర్ కోచ్‌లో (కింద, పైన) కలిపి 120 మంది కూర్చుంటారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఉన్న మన రైళ్ల వేగం గంటకు 120 కి.మీ.. బయోమెట్రిక్ టాయ్‌లెట్స్ సౌకర్యం ఇందులో ఉంది.