గుత్తిలో డబుల్ డెక్కర్ రైలు కూత
గుత్తి (అనంతపురం), న్యూస్‌లైన్ : దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి సారిగా ప్రవేశ పెట్టిన డబుల్ డెక్కర్ రైలు బుధవారం గుత్తి మీదుగా తిరుపతికి వెళ్లింది. ఉదయం 6.45 గంటలకు డబుల్ డెక్కర్ రైలు కాచిగూడ(హైదరాబాద్)నుంచి బయలు దేరి మధ్యాహ్నం 12.45 గంటలకు గుత్తికి చేరింది. కొత్త రైలు.. అందులోనూ డబుల్ డెక్కర్ కావడంతో దాన్ని చూడటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. డబుల్ డెక్కర్ రైలు చూడముచ్చటగా ఉందని చర్చించుకున్నారు. డబుల్ డెక్కర్ రైలులో సదుపాయాలు బాగున్నాయని ప్రయాణికులు చెప్పారు.
రైల్లో కూర్చున్నట్లు లేదని బస్సులోనే కూర్చుని ప్రయాణించిన అనుభూతి కలిగిందని కొందరు వ్యాఖ్యానించారు. కాగా డబుల్ డెక్కర్ రైలు వారంలో ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే కాచిగూడ నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి గురువారం, ఆదివారాల్లో ఉదయం 5.45 గంటలకు తిరుపతిలో బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
చాలా అద్భుతంగా ఉంది:
ముందుగా డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అభినందనలు. సాధారణ రైలు కంటే దీంట్లో అన్ని సదుపాయాలున్నాయి. అసలు ప్రయాణం చేసినట్లు కూడా అనిపించదు. చాలా అద్భుతంగా కూడా ఉంది. చూడముచ్చటగా కూడా ఉంది. అయితే వారానికి రెండు సార్లు కాకుండా ప్రతి రోజూ నడపాలి.ఇలాంటి రైళ్లు మరిన్ని ప్రారంభించాలి.
- సుబ్రమణ్యం, ప్రయాణికుడు, కడప