పూర్తి ఏసీతో డబుల్ డెకర్ రైళ్లు
ఇంతకుముందు ప్రవేశపెట్టిన డబుల్ డెకర్ రైళ్లకు ఆదరణ లభించకపోవడంతో.. భారతీయ రైల్వేలు సరికొత్త ప్రయోగం చేస్తున్నాయి. ఎక్కువ డిమాండ్ ఉండే రూట్లలో పూర్తి ఏసీ, వై-ఫై సదుపాయంతో కొత్తగా ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఏఎక్స్ యారీ (ఉదయ్) రైళ్లను నడిపించనున్నాయి. ఇవి జూలై నుంచిప్రారంభం అవుతాయని రైల్వేశాఖ తెలిపింది. ఒక్కో కోచ్‌లో వెనక్కి వాలగలిగేలా 120 సీట్లు ఉంటాయి. ప్రయాణసమయంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఆటోమేటిక్ టీ/కాఫీ/ కూల్ డ్రింక్ వెండింగ్ మిషన్లు కూడా ప్రతి బోగీలో ఉంటాయి. ఢిల్లీ-లక్నో లాంటి బాగా డిమాండ్ ఉండే మార్గాల్లో ఇవి నడుస్తాయి. మామూలు రైళ్లలో ఉండే థర్డ్ ఏసీ కంటే వీటిలో చార్జి తక్కువగానే ఉంటుందని అంటున్నారు.
ప్రతి బోగీలోనూ ఎల్‌సీడీ స్క్రీన్లు, వై-ఫై స్పీకర్ సిస్టం కూడా ఉంటాయి. మామూలు రైళ్ల కంటే సీట్ల సామర్థ్యం 40 శాతం ఎక్కువగా ఉండటంతో రద్దీని తట్టుకోడానికి ఇవి ఉపయోగపడతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే.. రాత్రిపూట ప్రయాణించే రైళ్లయినా వీటిలో బెర్తులు లేకపోవడం మాత్రం కొంత ఇబ్బందికరమే అంటున్నారు. దాంతో అదనపు సదుపాయాలతో ప్రయాణాన్ని సుఖవంతం చేస్తున్నామని అధికారులు తెలిపారు. రాత్రిపూట వెనక్కి వాలి, కాళ్లు చాపుకునేలా తగినంత లెగ్ స్పేస్ ఉంటుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైళ్ల గురించి 2016-17 రైల్వే బడ్జెట్‌లో ప్రకటించారు.