
డబుల్ డెక్కర్ రైలు వచ్చేస్తోంది!
సాక్షి, విజయవాడ: విశాఖపట్నం-తిరుపతి మధ్య విజయవాడ మీదుగా డబుల్ డెక్కర్ రైలు నడిపేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. విశాఖ-తిరుపతి మార్గంలో రద్దీని తగ్గించేందుకు డబుల్ డెక్కర్ రైలును నడపాలని నిర్ణయించారు. దీనికోసం సర్వేలు పూర్తిచేసిన అధికారులు రైల్వే బోర్డుకు నివేదిక పంపారు. ఈ రైలుకోసం కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, విశాఖ ఎంపీ హరిబాబు కృషిచేస్తున్నారు.
అన్నీ అనుకూలిస్తే మే 15 నుంచి ఈ రైలు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలులో 18 బోగీలుంటాయి. అన్నీ ఏసీ బోగీలు, చైర్‌కార్ కావడంతో ఈ రైలును విశాఖలో ఉదయం బయలుదేరేలా నడుపుతారు. ఒకవేళ విశాఖ-తిరుపతి మార్గంలో ఆదరణ లేకపోతే దీన్ని విశాఖ-హైదరాబాద్ మధ్య నడిపే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇప్పటికే కాచిగూడ- గుంటూరు, కాచిగూడ-తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో ఒకదాన్నిగానీ, మరో కొత్త రైలునుగానీ విశాఖ-తిరుపతి మధ్య నడిపే అవకాశం ఉంది.
ప్రయాణికుల ఆదరణ లభించేనా?
ప్రస్తుతం కాచిగూడ- గుంటూరు మధ్య వారానికి రెండుసార్లు నడుస్తున్న డబుల్ డెక్కర్ రైలుకు ప్రయాణికుల నుంచి అంతగా ఆదరణ లేదు. ఇదే తరహాలో విశాఖపట్నం నుంచి తిరుపతికి నడిపే డబుల్ డెక్కర్ రైలుకు ప్రయాణికుల నుంచి ఏమేరకు ఆదరణ లభిస్తుందోనని రైల్వే వినియోగదారుల సంఘాలు అనుమానిస్తున్నాయి. ఈ రైలు విశాఖపట్నంలో మధ్యాహ్నం బయలుదేరి రాత్రికి విజయవాడ చేరుకుని తెల్లవారుజామునకు తిరుపతి చేరితే ప్రయాణికుల ఆదరణ లభించే అవకాశాలుంటాయని భావిస్తున్నారు.