ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు ఇది చాలా ఆశాజనకమైన వార్త. ఏపీలో ఐటీ రంగం వ్యాప్తికి అనువైన వాతావరణం ఏర్పడుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలు టైర్-2 అంటే.. ద్వితీయ శ్రేణి నగరాలుగా ఈ రంగంలో అభివృద్ది చెందబోతున్నాయని డెలాయిట్, నాస్కామ్ నివేదిక వెల్లడించింది. తెలంగాణలో వరంగల్ నగరం కూడా ఈ జాబితాలో ఉంది. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగూ ఐటీ ప్రముఖ కేంద్రంగా ఉంది కనుక ఇక్కడ అభివృద్ది పుంతలు తొక్కడంలో ఇబ్బంది ఉండదు. హైదరాబాద్‌తో పాటు, దక్షిణాదిలో చెన్నై,బెంగుళూరులు కూడా ఐటీ కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి.
కాని ఆయా నగరాలలో భూమి ధరలు బాగా పెరిగిపోవడం ఒక ఇబ్బందిగా ఉంది. అద్దెలు అధికంగా ఉంటున్నాయి. ఉద్యోగులకు నివాసాలు ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. అయినా ఇక్కడి వాతావరణం, వివిధ కంపెనీలు ఇక్కడే స్థాపితం అవడం వల్ల ఐటి రంగం ఈ నగరాలలోనే కేంద్రీకృతం అయింది.ఈ నేపధ్యంలో ఖర్చులు తగ్గించుకోవడానికి కూడా ఆయా సంస్థలు ఆలోచన సాగిస్తున్నాయి.ఆ క్రమంలో దేశంలోని రెండో శ్రేణి నగరాల వైపు ఈ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అది ఏపీకి పెద్ద అవకాశంగా మారవచ్చు.
✍️ డెలాయిట్ నివేదిక శుభవార్తను అందించింది. దాని ప్రకారం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో ఐటీ సంస్థలు తమ శాఖలను విస్తరించవచ్చని, అలాగే కొత్త సంస్థలు ఏర్పాటు చేసే అవకాశాలు పెరుగుతున్నాయని నివేదిక అభిప్రాయపడింది. విశాఖలో ఇప్పటికే 250 టెక్ సంస్థలు ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో నెలకొల్పబోతున్న అదానీ డేటా సెంటర్ కనుక ఒక రూపానికి వచ్చిందంటే.. ఐటీ రంగంలో విశాఖ దశ మారినట్లే అవుతుందని భావించవచ్చు. ఎందుకంటే ఈ సెంటర్ ఒక్కదానిలోనే సుమారు 15 వేల మందికి ఉద్యోగావకాశాలు రావచ్చు. విశాఖలో ఐటీ సంస్థల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. స్టార్టప్స్ కూడా అధిక సంఖ్యలోనే ఉన్నాయి. సుమారు 1,100 స్టార్టప్స్ ఉన్నాయని అంచనా. ఎనిమిది ఇంక్యుబేటర్లు ఏర్పాటయ్యాయి. విశాఖ నగరానికి మల్టీకల్చరల్, కాస్మోపాలిటన్ సిటీగా పేరొంది.
ముఖ్యమంత్రి జగన్ ఆశిస్తున్నట్లు కార్యనిర్వాహక రాజధాని మొదలైతే.. ఇంకా వేగంగా అభివృద్ది చెందుతుంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు, అలాగే విశాఖ నుంచి అనకాపల్లి, పాయకరావు పేట వరకు విస్తరణకు అవకాశం ఉంది. విశాఖకు సముద్ర తీరం ఉండడం కలిసి వచ్చే పాయింట్. టూరిజం రంగంలో కూడా విశాఖకు మంచి గుర్తింపే ఉంది. భవిష్యత్తులో విశాఖ ఐటి రంగంలో మరింత ప్రగతి సాధించవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: అభివృద్ధిలో హవా.. ఏపీ నుంచి మూడు
✍️ ఇక విజయవాడ ప్రాంతంలో ఓ మోస్తరుగా ఐటీ సంస్థలు ఉన్నాయి. విజయవాడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం వద్ద ఇప్పటికే ఒక ఐటీ భవనం ఉంది. అందులో కొన్ని సంస్థలు నడుస్తున్నాయి. ఏలూరు వరకు దీనిని విస్తరించడానికి అవకాశం ఉంది. గన్నవరం పక్కనుంచే విజయవాడకు బైపాస్ రోడ్డు వెళుతుంది. హైదరాబాద్, చెన్నై నగరాలకు వెళ్లడానికి ఇది అనువుగా ఉంటుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్లో ఐటీ భవనాన్ని నిర్మించారు. ఇక్కడకు సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం.. ఐటీ రంగ నిపుణులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మరో నగరం తిరుపతిలో వేగంగా ఐటీ అభివృద్ది చెందుతోందని ఈ నివేదిక తెలిపింది. చెన్నైకి దగ్గరగా ఉండడం, భూమి అందుబాటులో ఉండడం,ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతుండడం వంటి కారణాల వల్ల ఐటి సంస్థలు కూడా ఆకర్షితం అవుతాయని అంచనా వేస్తున్నారు.
విశాఖలో ఆంధ్రా యూనివర్శిటీ. ఐఐఎం. పెట్రో యూనివర్శిటీ తదితర విద్యా సంస్థలు, విజయవాడకు సమీపంలోనే నాగార్జున యూనివర్శిటీ, తిరుపతిలో ఐఐటీ, ఎస్వీ యూనివర్శిటీ ఉన్నాయి. అలాగే ప్రైవేటు రంగంలో పలు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు రాణిస్తున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు,చెన్నైలలో పనిచేసే ఐటీ సంస్థ లకు ఎపి కాలేజీల నుంచి అనేక మంది రిక్రూట్ అవుతుంటారు.రెండో శ్రేణి నగరాలలో ఐటీని విస్తరించడం వల్ల కనీసం 25 శాతం వ్యయం తగ్గుతుందని అంటున్నారు. అలాగే కేంద్రీకృత అభివృద్ధి కాకుండా వికేంద్రీకరణకు కూడా అవకాశం ఉంటుంది.
ఏపీ ప్రభుత్వం విద్యా రంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తోంది. ఆంగ్ల మీడియంతో పాటు, అంతర్జాతీయ సిలబస్‌ను కూడా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తోంది. అవన్నీ సత్ఫలితాలు ఇస్తే.. అక్కడ మరింతగా మెరికల్లాంటి నిపుణులు తయారవుతారు. అది కూడా ఈ నగరాలలో ఐటీ విస్తరణకు ఉపయోగపడవచ్చు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్, ఓడరేవు ఆధారిత పరిశ్రమలు, కొత్త పారిశ్రామిక క్లస్టర్‌లపై దృష్టి సారించింది. ఫార్మా రంగంలో ఏపీకి మంచి స్థానం ఉంది. కొత్తగా వస్తున్న నాలుగు ఓడరేవులు కూడా అభివృద్దికి దోహదపడతాయి. ఈ రంగాలన్నీ ఒకదానికి ఒకటి సహకరించుకునేలా సమన్వయం చేసుకోగలిగితే చాలా మేలు కలుగుతుంది. ఏది ఏమైనా ద్వితీయ శ్రేణి నగరాలైన విశాఖ, విజయవాడ, తిరుపతిలలో కొత్త అభివృద్దికి ఐటీ రంగం దోహదపడితే అంతకన్నా కావల్సి ఏముంటుంది?.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment