
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడల మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ రైలును త్వరలోనే ప్రారంభించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ రైలు వారంలో 5 రోజులు సేవలు అందించనున్నట్టు పేర్కొన్నారు. ఈ రైలు రాకతో రెండు నగరాల మధ్య రవాణా మరింత మెరుగవుతుందని ఆయన ఆకాక్షించారు.
విజయవాడ, విశాఖపట్నం మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని కోరుతూ రెండు నెలల క్రితం బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, రైల్వే మంత్రికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన గోయల్ ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని జీవీఎల్ గురువారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి జీవీఎల్ కృతజ్ఞతలు తెలిపారు.