ఆయనో సీనియర్ ఎంపీ. పార్టీ అధినేత దగ్గర్నుంచి.. ముఖ్యనేతల వరకూ అందరికీ కొరకరాని కొయ్యగా మారారు. దీంతో నిన్నా.. మొన్నటి వరకూ అందరూ కలిసి ఆయన్ను టార్గెట్ చేశారు. ఎంపీకి తెలియకుండానే ఆయనకు ఎర్త్ పెట్టే ప్లాన్‌లు అమలుచేస్తున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయనే రివర్స్ ఎటాక్ చేస్తుండటంతో పచ్చ పార్టీలో కలవరం మొదలైందట. ఇంతకీ సైకిల్ పార్టీ అధినేతని.. ఆ పార్టీ నేతలను కంగారు పెడుతున్న ఆ ఎంపీ ఎవరు?
బెజవాడ రాజకీయాల్లో తనకు తాను ఓ బ్రాండ్ గా చెప్పుకునే వ్యక్తి ఎంపీ కేశినేని నాని. రెండోసారి ఎంపీగా గెలిచినప్పటినుంచీ పార్టీ అధినేతతో, కొందరు లోకల్ లీడర్లతో కేశినేనికి గ్యాప్ ఏర్పడిందనే టాక్ నడిచింది. దీంతో నానికి సీటు గల్లంతయ్యేలా అక్కడి నాయకులు, పార్టీ అధినేత చంద్రబాబు కూడా పావులు కదుపుతున్నారు. కొన్నాళ్ల పాటు సహించిన కేశినేని నాని.. సైలెంట్‌గా ఉంటే ఇక తనకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తారనే ఆలోచనతో రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కేశినేని నాని తీరుతో సొంత పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా పోయిందట. ఇటీవల కాలంలో ఏ ఇద్దరు తెలుగు తమ్ముళ్లను కదిపినా కేశినేని వ్యవహారశైలి పైనే గుసగుసలాడుకుంటున్నారని చెబుతున్నారు.
ఎంపీ తీరు నచ్చని చంద్రబాబు ఆయన్ను పక్కన పెట్టాలనే ఆలోచనలో భాగంగా అతని సోదరుడు కేశినేని శివనాధ్ అలియాస్ చిన్నిని తెరపైకి తెచ్చారని టాక్. పెద్దబాబు, చినబాబు మద్దతు ఉండటంతో ఇక కేశినేని చిన్ని సొంత అన్నకే పోటీగా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధినాయకుల మద్దతుతో ఎంపీ వర్గాన్నంతా తన వైపు లాగేసుకుంటూ వస్తున్నారట. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తూ వస్తున్న నాని కామ్ గా ఉంటే తన సీట్‌కు ఎసరు పెట్టేస్తారనే ఫీలింగ్ కి వచ్చి.. కొద్దిరోజులుగా పార్టీ నేతలతో పాటు అధినేతను కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నారని బెజవాడ తమ్ముళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు.
కొద్ది రోజుల క్రితం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తన పంచ్ డైలాగ్ లతో నేరుగా పార్టీకి, అధినేతకు ఝలక్ ఇచ్చారని పార్టీ నాయకులే చెబుతున్నారు. లోఫర్లకు , డాఫర్లకు టిక్కెట్లివ్వొద్దని పార్టీ అధినేతకి నేరుగా సూచించారు. ఈ కామెంట్స్ తన సోదరుడు కేశినేని శివనాధ్ ను ఉద్ధేశించే చేశాడని బెజవాడలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవల కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలు పచ్చ పార్టీని మరింత ఇరుకున పెట్టేలా మారాయట. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేశినేని నాని.. స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావును ప్రశంసించారు.
ఎమ్మెల్యే, ఆయన సోదరుడి పనితీరు బాగుందంటూ కితాబిచ్చారు. అభివృద్ధి విషయంలో తాను భేదాలను చూడనని, పార్టీ ఫీలింగ్ కేవలం ఎన్నికలప్పుడే అని కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొండితోక బ్రదర్స్‌పై పదే పదే విమర్శలు చేస్తున్న నందిగామ టీడీపీ నేతలకు కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు. నందిగామతో సరిపెట్టకుండా.. తాజాగా మైలవరంలోనూ కేశినేని నాని తన పంచ్ డైలాగ్ లతో పార్టీ నేతలను కంగారు పెడుతున్నారు.
చదవండి: వక్రీకరణ రాతల్లో ఈనాడును కొట్టేవారు లేరు
గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తనకంటూ ఓ ట్రాక్ రికార్డ్ ఉందని..ఈసారి బెజవాడ ఎంపీ టిక్కెట్‌ను ఏ పిట్టలదొరకు ఇచ్చినా తననేం చేయలేరంటూ కామెంట్ చేశారట. తన అభిప్రాయాలతో ఏకీభవించేవారితో కలిసి నడిచేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని.. ప్రజలు ఓకే అంటే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి గెలిచే సత్తా తనకుందంటూ బాంబ్ పేల్చారట.
కేశినేని నాని చేసిన ఇండిపెండెంట్ కామెంట్స్‌పై బెజవాడ దేశంలో ఓ రేంజ్‌లో చర్చ సాగుతోందట. నాని పార్టీ నేతలను అలర్ట్ చేశారా.. లేక టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాననే సంకేతాలిచ్చారా అనే విషయం అర్థం కాక కొందరు నేతలు తల బాదుకుంటున్నారట. బెజవాడ ఎంపీ పచ్చ పార్టీ అధినేత చంద్రబాబుకు ముందు ముందు ఇంకెన్ని సిత్రాలు చూపిస్తారో?
-సత్యానందరెడ్డి, సాక్షి వెబ్‌డెస్క్
చదవండి: కోడెలకు అన్యాయం చేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment