డబుల్‌ డెక్కర్ రెడీ | Ready for the double-decker | Sakshi
Sakshi News home page

డబుల్‌ డెక్కర్ రెడీ

Published Sat, May 10 2014 3:00 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

డబుల్‌ డెక్కర్ రెడీ - Sakshi

డబుల్‌ డెక్కర్ రెడీ

13 నుంచి అందుబాటులోకి..
 కాచిగూడ నుంచి గుంటూరు, తిరుపతిలకు బైవీక్లీ సర్వీసులు

 
 రెండంతస్తుల రైలు పట్టాలపెకైక్కనుంది. ఒకప్పటి డబుల్ డెక్కర్ బస్సును గుర్తుకు తెచ్చే ఈ ట్రైన్ కాచిగూడ నుంచి వారానికి రెండుసార్లు గుంటూరు, తిరుపతి పట్టణాలకు పరుగులు తీయనుంది. రైల్వే భద్రతా కమిషన్ అనుమతితో కూత పెట్టేందుకు సిద్ధమైన ఈ ట్రైన్.. తొలిసర్వీసు 13వ తేదీన కాచిగూడ నుంచి గుంటూరుకు, 14వ తేదీన కాచిగూడ నుంచి తిరుపతికి బయలు దేరనుంది.
 
 రెండు మార్గాల్లో ప్రయాణికులకు ఊరట..

 జంటనగరాల నుంచి ప్రతిరోజూ 80కి పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 220 ప్యాసింజర్, లోకల్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ప్రతి రోజు 2.5 లక్షల మంది సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్‌ల నుంచి బయలుదేరుతారు. కానీ నగరం నుంచి తిరుపతి, గుంటూరు పట్టణాలకు మాత్రం విపరీతమైన రద్దీ ఉంటుంది. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు తిరుపతి పుణ్యక్షేత్రానికి బయలుదేరుతారు. ప్రస్తుతం నగరం నుంచి వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి, కృష్ణా ఎక్స్‌ప్రెస్, రాయలసీమ, సెవెన్‌హిల్స్, మద్రాస్ ఎక్స్‌ప్రెస్, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు, మరో రెండు పాసింగ్ త్రూ రైళ్లు తిరుపతికి రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే గుంటూరు పట్టణానికి నగరం నుంచి  జన్మభూమి, ఇంటర్ సిటీ, శబరి, ఫలక్‌నుమా, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్, నారాయణాద్రి, నర్సాపూర్, రేపల్లె ప్యాసింజర్, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ వేలాదిమంది ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు. డబుల్‌డెక్కర్ వల్ల ఈ రెండు మార్గాల్లోను ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. పైగా ఈ సర్వీసులు పూర్తిగా  పగటిపూట మాత్రమే నడుస్తాయి. ఉదయం బయలుదేరి సాయంత్రం తిరుపతికి చేరుకొనే విధంగా, మధ్యాహ్నం గుంటూరుకు చేరుకొనే విధంగా అందుబాటులో ఉంటాయి.
 
 గుం‘టూరు’ వివరాలివీ...

కాచిగూడ-గుంటూరు (22118) ఏసీ డబుల్‌డెక్కర్ బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ఉదయం  5.30 గంటలకు  కాచిగూడ నుంచి బయలుదేరి  ఉదయం 5.46 గంటలకు మల్కాజిగిరి స్టేషన్‌కు, 7.21 గంటలకు నల్గొండకు, 7.51 గంటలకు మిర్యాలగూడకు, 8.36 గంటలకు పిడుగురాళ్లకు, ఉదయం 10.40 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది.
 
తిరుగు ప్రయాణంలో గుంటూరు-కాచిగూడ (22117) ఏసీ బై వీక్లీ డబుల్ డెక్కర్ ప్రతి మంగళ, శుక్ర వారాల్లో మధ్యాహ్నం 12.45 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.36 గంటలకు పిడుగురాళ్ల, 2.36లకు మిర్యాలగూడ, 3.01లకు నల్లగొండ, సాయంత్రం 5.41 గంటలకు మల్కాజిగిరి చేరుకుంటుంది. సాయంత్రం 5.55 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
 
 తిరుపతి ప్రయాణం ఇలా..

కాచిగూడ-తిరుపతి (22120) ఏసీ డబుల్‌డెక్కర్ ప్రతి బుధ, శని వారాలలో ఉదయం 6.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి ఉదయం 8.06 గంటలకు  మహబూబ్‌నగర్,  9.26కు గద్వాల్, 11కు కర్నూల్, మధ్యాహ్నం 12.10కి డోన్, ఒంటిగంటకు గుత్తి, 1.47కు తాడిపత్రి, 2.49కు ఎర్రగుంట్ల, 3.20కు కడప, సాయంత్రం 4.20కి రాజంపేట్, 5.35 గంటలకు రేణిగుంట, సాయంత్రం 6.18 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
 
తిరుగు ప్రయాణంలో తిరుపతి-కాచిగూడ (22119) డబుల్ డెక్కర్ ప్రతి గురు, ఆది వారాల్లో ఉదయం 5.45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి ఉదయం 6 గంటలకు రేణిగుంట, 7.13కు రాజంపేట్, 8.05కు కడప, 8.43కి ఎర్రగుంట్ల, 9.46కు తాడిపత్రి, 11కు గుత్తి, మధ్యాహ్నం 12.10కి డోన్, ఒంటిగంటకు కర్నూల్, 2.05కు గద్వాల్, 3.05కు మహబూబ్‌నగర్ స్టేషన్, సాయంత్రం 5.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
 
 ప్రత్యేకతలివీ..

 ఈ ట్రైన్ లోయర్ డెక్‌లో 48 సీట్లు, అప్పర్ డెక్‌లో 50 సీట్లు ఉంటాయి. మిడిల్ డెక్‌లో 22 సీట్లు ఉంటాయి.
 
ఒక బోగీలో 120 సీట్ల చొప్పున మొత్తం 14 బోగీలలో 1680 సీట్లు ఉంటాయి.
 
కాచిగూడ నుంచి తిరుపతికి 10 గంటల్లో, గుంటూరుకు 5 గంటల్లో  చేరుకుంటుంది.

 డబుల్ డెక్కర్ ట్రైన్ చార్జీలు : నగరం నుంచి
 గుంటూరుకు రూ. 415,
 కర్నూలుకు రూ. 335,
 తిరుపతికి రూ. 720

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement