superfast
-
మృతులు 300కు చేరువలో...
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా మూడు రైళ్ల ప్రమాదం దేశమంతటినీ తీవ్ర విషాదంలో ముంచేసింది. శుక్రవారం షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాత్రి ఏడింటి ప్రాంతంలో బహనగా రైల్వేస్టేషన్ సమీపంలో మెయిన్ ట్రాక్ నుంచి లూప్ లైన్లోకి వెళ్లడం, దానిపై ఆగి ఉన్న గూడ్స్‌ను గంటకు 128 కి.మీ. వేగంతో ఢీకొనడం తెలిసిందే. దాని బోగీలు పక్క ట్రాక్‌పై పడటం, అదే సమయంలో దానిపై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొని పట్టాలు తప్పడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 70 మందికి పైగా మరణించినట్టు తొలుత భావించినా మృతుల సంఖ్య భారీగా పెరిగింది. చిక్కుకుపోయిన బోగీలను విడదీస్తూ గాలింపు కొనసాగిన కొద్దీ శవాలు భారీగా బయట పడుతూ వచ్చాయి. 288 మంది మరణించినట్టు ఇప్పటిదాకా తేలింది. 1,175 మందికి పైగా గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని పలు ఆస్పత్రుల్లో చేర్చారు. వీరిలో 700 మందికి పైగా డిశ్చార్జి కాగా మిగతా వారు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరికాస్త పెరిగేలా కన్పిస్తోంది. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి రిజర్వుడ్ ప్రయాణికులే 2,400 మంది దాకా ఉన్నారు. వీరు గాక జనరల్ బోగీల్లో భారీ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. అంతా కలిపి 3,000 మందికి పైగా ఉంటారని చెబుతున్నారు. ప్రమాదానికి సిగ్నల్ వైఫల్యమే ప్రధాన కారణమని రైల్వే శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. ఘటనా స్థలిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు మరో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అదనపు పరిహారాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆయన వెంట ఉన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అంతకుముందు ఈ ఉదంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వేతో సహా పలు శాఖ ఉన్నతాధికారులతో మోదీ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు ఆయనకు వివరించారు. ప్రమాద స్థలి నుంచి బాధితుల తరలింపు దాదాపుగా పూర్తయింది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు వేలాది మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోదీ, రైల్వే మంత్రి బదులివ్వాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయని విపక్ష కాంగ్రెస్ మండిపడింది. పెను విషాద సమయం గనుక సహాయక చర్యలు పూర్తవడానికే ప్రస్తుతానికి ప్రాధాన్యమిస్తున్నామని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. కోరమండల్‌కు కలిసిరాని శుక్రవారం కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం కలిసిరావడం లేదు. గత 20 ఏళ్లలో ఈ రైలు మూడుసార్లు ప్రమాదానికి గురైంది. అవన్నీ శుక్రవారమే జరిగాయి. పైగా వాటిలో రెండు ప్రమాదాలు ఒడిశాలోనే చోటుచేసుకున్నాయి. హౌరా–చెన్నై మధ్య నడిచే కోరమండల్ మూడుసార్లూ చెన్నై వెళ్తూనే ప్రమాదానికి గురైంది! 2009లో ఒడిశాలోని జైపూర్ వద్ద తొలిసారి ప్రమాదం జరిగింది. అప్పుడు 16 మంది చనిపోయారు. తర్వాత 2022 మార్చిలో నెల్లూరు వద్ద జరిగిన రెండో ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. తాజా ప్రమాదం మూడోది. లోకో పైలట్లకు గాయాలు భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో లోకోపైలట్ జీఎన్ మహంతి, సహాయ లోకో పైలట్ హజారీ బెహరా తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఇరువురూ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. వీరిని ఆస్పత్రిలో చేర్పించి, ఉన్నత స్థాయి చికిత్స అందిస్తున్నారు. జీఎన్ మహంతికి పక్కటెముక విరిగింది. దుర్ఘటనలో ఊపిరితిత్తులు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో అంతర్గత రక్తస్రావమైనట్లు వైద్యులు తెలిపారు. హజారీ బెహరా ఎడమకాలి ఎముక విరగడంతో శస్త్రచికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. -
వాల్‌మార్ట్... ట్రాన్స్ఫార్మర్స్
వాషింగ్టన్: ట్రాన్స్ఫార్మర్స్ సినిమా చూశారా! అందులో అత్యాధునిక కార్లు, ట్రక్కులు సూపర్‌ఫాస్ట్‌గా పరుగులు తీస్తూ.. అంతలోనే భారీ రోబోలుగా మారిపోతుంటాయి. ఈ రోబోల భాగాన్ని పక్కన పెడితే అచ్చం ఆ తరహాలో భారీ ట్రక్కులను తయారు చేయించుకుంటోంది అమెరికన్ రిటైలింగ్ దిగ్గజం వాల్‌మార్ట్. అమెరికాలో 4,700 పైచిలుకు ఉన్న తమ స్టోర్స్‌కి సరుకులను చేరవేసేందుకు వీటిని వినియోగించనుంది. పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో పీటర్‌బిల్ట్ అనే సంస్థ వీటిని తయారు చేస్తోంది. ప్రస్తుతం వాల్‌మార్ట్ ఉపయోగించే ట్రక్‌లతో పోలిస్తే ఇవి 4,000 పౌండ్ల మేర తేలికగా ఉంటాయి. స్లైడింగ్ డోర్లు, స్పేస్‌షిప్‌లో కెప్టెన్ చెయిర్ తరహా డ్రైవరు సీటు, వాహనానికి అన్ని వైపులా ఏం జరుగుతోందన్నది తెలుసుకోవడానికి డాష్‌బోర్డ్‌కి రెండు వైపులా మానిటర్లు .. ఒకటేమిటీ అనేక హంగులు ఈ ట్రక్‌లో ఉంటాయి. ఈ ట్రక్‌లలో ఏకంగా 18 చక్రాలు ఉంటాయి. ఇలాంటి భారీ ట్రక్కులు ఒకదాని వెనుక మరొకటి నిర్దిష్ట దూరంలో వెడుతుంటే రోడ్డు మీద ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. ఏకకాలంలో ముందుకు దూసుకెడుతూ, ఒకేసారి బ్రేకులు వేస్తూ ప్లాటూనింగ్ విధానంలో ఈ వాహనాలు ప్రయాణించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీని వల్ల ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గడం, రోడ్డుపై రద్దీ తగ్గడం.. భద్రత పెరగడం, సరైన సమయానికి డెలివరీ చేయగలగడంతో వంటి అనేక సానుకూల అంశాలు ఉన్నాయంటున్నారు రూపకర్తలు. మనుషుల ప్రమేయం లేకుండా పరస్పరం సమన్వయపర్చుకునేలా వీటిని తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తున్నారు. దీంతో అసలు డ్రైవర్ల అవసరమే లేకుండా పోతుంది. ఇప్పటికే ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తున్న పీటర్‌బిల్ట్ సంస్థ.. డ్రైవర్ల పనిని మరింత సులువు చేసే టెక్నాలజీలను రూపొందించే పనిలో ఉంది. ఆన్లైన్ రిటైలింగ్ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే కస్టమర్లకు ఆర్డర్లను వేగంగా చేరవేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తోన్న సంగతి తెలిసిందే. -
డబుల్ డెక్కర్ రెడీ
13 నుంచి అందుబాటులోకి.. కాచిగూడ నుంచి గుంటూరు, తిరుపతిలకు బైవీక్లీ సర్వీసులు రెండంతస్తుల రైలు పట్టాలపెకైక్కనుంది. ఒకప్పటి డబుల్ డెక్కర్ బస్సును గుర్తుకు తెచ్చే ఈ ట్రైన్ కాచిగూడ నుంచి వారానికి రెండుసార్లు గుంటూరు, తిరుపతి పట్టణాలకు పరుగులు తీయనుంది. రైల్వే భద్రతా కమిషన్ అనుమతితో కూత పెట్టేందుకు సిద్ధమైన ఈ ట్రైన్.. తొలిసర్వీసు 13వ తేదీన కాచిగూడ నుంచి గుంటూరుకు, 14వ తేదీన కాచిగూడ నుంచి తిరుపతికి బయలు దేరనుంది. రెండు మార్గాల్లో ప్రయాణికులకు ఊరట.. జంటనగరాల నుంచి ప్రతిరోజూ 80కి పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 220 ప్యాసింజర్, లోకల్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ప్రతి రోజు 2.5 లక్షల మంది సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరుతారు. కానీ నగరం నుంచి తిరుపతి, గుంటూరు పట్టణాలకు మాత్రం విపరీతమైన రద్దీ ఉంటుంది. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు తిరుపతి పుణ్యక్షేత్రానికి బయలుదేరుతారు. ప్రస్తుతం నగరం నుంచి వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి, కృష్ణా ఎక్స్‌ప్రెస్, రాయలసీమ, సెవెన్‌హిల్స్, మద్రాస్ ఎక్స్‌ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు, మరో రెండు పాసింగ్ త్రూ రైళ్లు తిరుపతికి రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే గుంటూరు పట్టణానికి నగరం నుంచి జన్మభూమి, ఇంటర్ సిటీ, శబరి, ఫలక్‌నుమా, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్, నారాయణాద్రి, నర్సాపూర్, రేపల్లె ప్యాసింజర్, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ వేలాదిమంది ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు. డబుల్‌డెక్కర్ వల్ల ఈ రెండు మార్గాల్లోను ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. పైగా ఈ సర్వీసులు పూర్తిగా పగటిపూట మాత్రమే నడుస్తాయి. ఉదయం బయలుదేరి సాయంత్రం తిరుపతికి చేరుకొనే విధంగా, మధ్యాహ్నం గుంటూరుకు చేరుకొనే విధంగా అందుబాటులో ఉంటాయి. గుం‘టూరు’ వివరాలివీ... కాచిగూడ-గుంటూరు (22118) ఏసీ డబుల్‌డెక్కర్ బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి ఉదయం 5.46 గంటలకు మల్కాజిగిరి స్టేషన్‌కు, 7.21 గంటలకు నల్గొండకు, 7.51 గంటలకు మిర్యాలగూడకు, 8.36 గంటలకు పిడుగురాళ్లకు, ఉదయం 10.40 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గుంటూరు-కాచిగూడ (22117) ఏసీ బై వీక్లీ డబుల్ డెక్కర్ ప్రతి మంగళ, శుక్ర వారాల్లో మధ్యాహ్నం 12.45 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.36 గంటలకు పిడుగురాళ్ల, 2.36లకు మిర్యాలగూడ, 3.01లకు నల్లగొండ, సాయంత్రం 5.41 గంటలకు మల్కాజిగిరి చేరుకుంటుంది. సాయంత్రం 5.55 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుపతి ప్రయాణం ఇలా.. కాచిగూడ-తిరుపతి (22120) ఏసీ డబుల్‌డెక్కర్ ప్రతి బుధ, శని వారాలలో ఉదయం 6.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి ఉదయం 8.06 గంటలకు మహబూబ్‌నగర్, 9.26కు గద్వాల్, 11కు కర్నూల్, మధ్యాహ్నం 12.10కి డోన్, ఒంటిగంటకు గుత్తి, 1.47కు తాడిపత్రి, 2.49కు ఎర్రగుంట్ల, 3.20కు కడప, సాయంత్రం 4.20కి రాజంపేట్, 5.35 గంటలకు రేణిగుంట, సాయంత్రం 6.18 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-కాచిగూడ (22119) డబుల్ డెక్కర్ ప్రతి గురు, ఆది వారాల్లో ఉదయం 5.45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి ఉదయం 6 గంటలకు రేణిగుంట, 7.13కు రాజంపేట్, 8.05కు కడప, 8.43కి ఎర్రగుంట్ల, 9.46కు తాడిపత్రి, 11కు గుత్తి, మధ్యాహ్నం 12.10కి డోన్, ఒంటిగంటకు కర్నూల్, 2.05కు గద్వాల్, 3.05కు మహబూబ్‌నగర్ స్టేషన్, సాయంత్రం 5.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ప్రత్యేకతలివీ.. ఈ ట్రైన్ లోయర్ డెక్‌లో 48 సీట్లు, అప్పర్ డెక్‌లో 50 సీట్లు ఉంటాయి. మిడిల్ డెక్‌లో 22 సీట్లు ఉంటాయి. ఒక బోగీలో 120 సీట్ల చొప్పున మొత్తం 14 బోగీలలో 1680 సీట్లు ఉంటాయి. కాచిగూడ నుంచి తిరుపతికి 10 గంటల్లో, గుంటూరుకు 5 గంటల్లో చేరుకుంటుంది. డబుల్ డెక్కర్ ట్రైన్ చార్జీలు : నగరం నుంచి గుంటూరుకు రూ. 415, కర్నూలుకు రూ. 335, తిరుపతికి రూ. 720