వాల్‌మార్ట్... ట్రాన్స్‌ఫార్మర్స్
వాషింగ్టన్: ట్రాన్స్‌ఫార్మర్స్ సినిమా చూశారా! అందులో అత్యాధునిక కార్లు, ట్రక్కులు సూపర్‌ఫాస్ట్‌గా పరుగులు తీస్తూ.. అంతలోనే భారీ రోబోలుగా మారిపోతుంటాయి. ఈ రోబోల భాగాన్ని పక్కన పెడితే అచ్చం ఆ తరహాలో భారీ ట్రక్కులను తయారు చేయించుకుంటోంది అమెరికన్ రిటైలింగ్ దిగ్గజం వాల్‌మార్ట్. అమెరికాలో 4,700 పైచిలుకు ఉన్న తమ స్టోర్స్‌కి సరుకులను చేరవేసేందుకు వీటిని వినియోగించనుంది. పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో పీటర్‌బిల్ట్ అనే సంస్థ వీటిని తయారు చేస్తోంది.
ప్రస్తుతం వాల్‌మార్ట్ ఉపయోగించే ట్రక్‌లతో పోలిస్తే ఇవి 4,000 పౌండ్ల మేర తేలికగా ఉంటాయి. స్లైడింగ్ డోర్లు, స్పేస్‌షిప్‌లో కెప్టెన్ చెయిర్ తరహా డ్రైవరు సీటు, వాహనానికి అన్ని వైపులా ఏం జరుగుతోందన్నది తెలుసుకోవడానికి డాష్‌బోర్డ్‌కి రెండు వైపులా మానిటర్లు .. ఒకటేమిటీ అనేక హంగులు ఈ ట్రక్‌లో ఉంటాయి. ఈ ట్రక్‌లలో ఏకంగా 18 చక్రాలు ఉంటాయి. ఇలాంటి భారీ ట్రక్కులు ఒకదాని వెనుక మరొకటి నిర్దిష్ట దూరంలో వెడుతుంటే రోడ్డు మీద ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు.
ఏకకాలంలో ముందుకు దూసుకెడుతూ, ఒకేసారి బ్రేకులు వేస్తూ ప్లాటూనింగ్ విధానంలో ఈ వాహనాలు ప్రయాణించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీని వల్ల ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గడం, రోడ్డుపై రద్దీ తగ్గడం.. భద్రత పెరగడం, సరైన సమయానికి డెలివరీ చేయగలగడంతో వంటి అనేక సానుకూల అంశాలు ఉన్నాయంటున్నారు రూపకర్తలు. మనుషుల ప్రమేయం లేకుండా పరస్పరం సమన్వయపర్చుకునేలా వీటిని తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తున్నారు.
దీంతో అసలు డ్రైవర్ల అవసరమే లేకుండా పోతుంది. ఇప్పటికే ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తున్న పీటర్‌బిల్ట్ సంస్థ.. డ్రైవర్ల పనిని మరింత సులువు చేసే టెక్నాలజీలను రూపొందించే పనిలో ఉంది. ఆన్‌లైన్ రిటైలింగ్ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే కస్టమర్లకు ఆర్డర్లను వేగంగా చేరవేసేందుకు డ్రోన్‌లను ఉపయోగిస్తోన్న సంగతి తెలిసిందే.