Transformers
-
ట్రాన్స్ఫార్మర్లు టపటపా!
సాక్షి, హైదరాబాద్: వంద, వెయ్యి, పది వేలు కాదు.. ఏకంగా లక్షకు పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. అదీ ఒక్క ఏడాదిలోనే. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో రాష్ట్ర వ్యాప్తంగా 1,06,260 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినట్లు దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎన్పీడీసీఎల్)లు.. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి తాజాగా సమర్పించిన వార్షిక (2024–25) ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లో వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,58,932 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, అందులో 19 శాతానికి పైగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఏడాదికి సగటున 50 వేల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. కానీ గతేడాది ఈ సంఖ్య రెట్టింపు కావడంపై విద్యుత్ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఈ లక్ష ట్రాన్స్ఫార్మర్ల పరిధిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగడమే కాకుండా, వాటి మరమ్మతులకు డిస్కంలు రూ.వందల కోట్లలో ఖర్చు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నాసిరకం ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లు, పాడైన ట్రాన్స్ఫార్మర్లకు కాంట్రాక్టర్లు సరిగ్గా మరమ్మతులు చేయకపోవడం, చిన్న చిన్న లోపాలను గుర్తించి సరి చేయడానికి వీలుగా పీరియాడిక్ మెయింటనెన్స్ నిర్వహించడంలో అధికారుల నిర్లక్ష్యం, లైన్లలో లోపాలు ఏర్పడడం వంటి సమస్యలకు ఓవర్ లోడింగ్ సమస్య జతకావడంతో ట్రాన్స్ఫార్మర్లు పటాకుల్లా కాలిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాసంగి పంటలకు అధిక వినియోగం టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాలైన నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌లో గత ఏడాది అత్యధికంగా 71,733 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లో మరో 34,527 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 2023 తొలి అర్ధవార్షికం (ఏప్రిల్– సెపె్టంబర్)లో 27,596 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా, 2023 అక్టోబర్– 2024 మార్చి మధ్యకాలంలో ఏకంగా 44,137 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. వర్షాభావంతో యాసంగి పంటలకు విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో పాటు గృహాలు, ఇతర అవసరాలకు సైతం వినియోగం పెరిగి ఓవర్‌లోడ్ పడటంతో రెండో అర్ధ వార్షికంలో అధిక సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లపై కాలిపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధికం నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 10,682 ట్రాన్స్ఫార్మర్లు దగ్ధం కావడం గమనార్హం. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 7,162, నాగర్‌కర్నూల్ జిల్లాలో 6,234, సిద్దిపేట జిల్లాలో 5,522, సంగారెడ్డి జిల్లాలో 5,160, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,734 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. జంట నగరాల పరిధిలో అత్యధికంగా రాజేందర్‌నగర్ సర్కిల్లో 5,076 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 22,578, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 17,992 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఈ రెండు జిల్లాల్లో ఓవర్ లోడ్‌కు, నిర్వహణా లోపాల సమస్యలకు అద్దం పడుతోంది. ఇక టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 4,289 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. మరమ్మతులకు భారీగా వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 25/63/100 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను, పట్టణ ప్రాంతాల్లో 100/160/315/500 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను వినియోగిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మరమ్మతుల కోసం సగటున కేవీఏకు రూ.200 చొప్పున మొత్తం ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యానికి బిల్లులు లెక్కించి కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రూ.15–20 వేలు, 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రూ.లక్ష వరకు డిస్కంలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్‌లో కాలిపోయిన వైండింగ్ స్థానంలో కొత్త వైండింగ్ ఏర్పాటుతో పాటు ఆయిల్‌ను ఫిల్టర్ చేసి వేస్తారు. ఒక్కోసారి పూర్తి వైండింగ్ కాలిపోతే ఖర్చు అధికం అవుతుంది. కొత్త ట్రాన్స్ఫార్మర్కు ఐదేళ్ల వారంటీ ఉంటుండగా, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేసిన తర్వాత ఆరు నెలల గ్యారెంటీ పీరియడ్ ఉంటుంది. గ్యారెంటీ పీరియడ్ లేని ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే పూర్తి వ్యయం డిస్కంలే భరించాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడానికి ప్రధాన కారణాలు... – అనధికార వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరగడంతో లోడ్ పెరిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. – ట్రాన్స్ఫార్మర్ల మెయింటినెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, వర్షాల్లో లోపలికి నీళ్లు వెళ్లకుండా లీకేజీలను అరికట్టకపోవడం వల్ల కాలిపోతున్నాయి. – జీవిత కాలం ముగిసిన అధిక శాతం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. – సరైన ఎర్తింగ్ లేకపోవడం వల్ల కూడా కాలిపోతున్నాయి. -
లెక్కల్లో మరీ ఇంత వీకా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్న పరిశ్రమలపై రామోజీరావు విషం చిమ్ముతున్నారు. తప్పుడు లెక్కలు వేసి.. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిపోతోందంటూ ప్రజలను మభ్య పెట్టడానికి మరోసారి విశ్వప్రయత్నం చేశారు. ఆసియాలోనే ప్రముఖ ట్రాన్స్ఫార్మర్ల తయారీ కంపెనీ ఇండోసోల్‌పై ‘రూ. 47,809 కోట్లు దోచి పెడుతున్నారు’ అంటూ సోమవారం మరోసారి ఈనాడులో తప్పుడు రాతలు రాశారు. పరిశ్రమలన్నిటికీ రాయితీలు ఒకేలా వర్తిస్తాయని, ఒక్కో కంపెనీకి ఒక్కోలా ఉండవని తెలిసి కూడా అవాస్తవ కథనాన్ని ప్రచురించారు. వాస్తవానికి రాష్ట్రంలో దాదాపు రూ. 59,958 కోట్ల పెట్టుబడులను ఇండోసోల్ పెడుతోంది. తద్వారా ప్రత్యక్షంగా 12వేల మందికి, పరోక్షంగా 20వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా రాసిన ఆ కథనంలో ఉన్నవన్నీ అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వితేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు తెలిపారు. సీఎండీలు వెల్లడించిన అసలు నిజాలు ఇలా ఉన్నాయి. రెట్టించిన అబద్ధాలు ఈనాడు తన కథనంలో చెప్పినట్టుగా పరిశ్రమల రంగంలో గరిష్ట డిమాండ్ చార్జీలు కలిపి సగటున యూనిట్‌కు రూ. 12గా విద్యుత్ పంపిణీ సంస్థలు వసూలు చేస్తున్నాయనడం పూర్తిగా అబద్ధం. 11కేవీ స్థాయిలో ఎనర్జీ ఇంటెన్సివ్ పరిశ్రమలకు సరాసరి విద్యుత్ చార్జీ యూనిట్ రూ. 6.50 కాగా, ప్రస్తుతం విధిస్తున్న ఇంధన సర్దుబాటు చార్జీలు దీనికి అదనం. ఈ ఇంధన సర్దుబాటు చార్జీలు నిరంతరం ఉండవు. గడువు అయిపోగానే ఆగిపోతాయి. ప్రస్తుతం ఈ కేటగిరీలో ఫెర్రోఅల్లాయ్ పరిశ్రమలు, ఫొటో ఓల్టాయిస్(పీవీ) ఇంగోట్–సెల్ తయారీ పరిశ్రమలు, పోలీ సిలికాన్ పరిశ్రమలు, అల్యూమినియం పరిశ్రమలు ఉన్నాయి. లో టెన్షన్లో ఆ కేటగిరీయే లేదు ఇండోసోల్ పరిశ్రమ సమర్పించిన ప్రాజెక్టు వివరాల ప్రకారం అది అత్యధిక పరిమాణంలో విద్యుత్ వినియోగించే పరిశ్రమ. ఇప్పుడు అమలులో ఉన్న అత్యధిక వోల్టేజీ స్థాయి 220 కేవీ కన్నా ఎక్కువగా 400 కేవీ స్థాయిలో విద్యుత్ వినియోగం జరగబోతోంది. అయినా గ్రిడ్‌పై ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా స్థిరంగా ఉండగలదు. దానితో ఇది దృఢమైన గ్రిడ్ నిర్వహణకు దోహద పడుతుంది. అయితే ఇప్పుడు 400 కేవీ విద్యుత్ వినియోగ స్థాయి అనేది రిటైల్ టారిఫ్ ధరలలో లేకపోవడం వల్ల దీని కోసం ప్రత్యేకంగా ఒక ఉప కేటగిరీని ప్రతిపాదించారు. లో టెన్షన్(ఎల్టీ) స్థాయిలో అసలు ఎనర్జీ ఇంటెన్సివ్ పరిశ్రమ అనే ఉప కేటగిరీ లేనే లేదు. ఎనర్జీ ఇంటెన్సివ్ పరిశ్రమలు అంటేనే అవి అధిక పరిమాణంలో విద్యుత్ వాడే పరిశ్రమలని అర్థం. అవి కేవలం హెచ్‌టీ కేటగిరీలోనే ఉంటాయి. అర్హతను బట్టే ప్రోత్సాహకాలు ఆత్మనిర్భర్ భారత్ (మేక్ ఇన్ ఇండియా)లో భాగంగా, ఎండ్–టు–ఎండ్ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ సంస్థలను ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్ఐ)పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ, నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) చేపట్టిన బిడ్డింగ్ ద్వారా ఈ పధకానికి ఇండోసోల్ అర్హత సాధించింది. దాని ద్వారా ఈ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) రూ. 1,875 కోట్ల ప్రోత్సాహకానికి అనుమతి ఇచ్చింది. వాస్తవంగా ఈ రాయితీలు ఏ ఒక్కరికో పరిమితం కాదు. ఈ కేటగిరీలో ఎవరు వచ్చినా వాటికి ఇవే రాయితీలు వర్తిస్తాయి. పాలసీ అన్నది అన్ని పరిశ్రమలకు ఒకేలా వర్తిస్తాయిగానీ, ఒక్కో కంపెనీకి ఒక్కోలా వర్తించవు. ఈ విషయం తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ఈనాడు దినపత్రిక తప్పుడు రాతలు రాస్తోంది. చట్టం కాకుండానే ఏడుపా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ అధిక విద్యుత్ వాడే పరిశ్రమకు తొలి ఏడేళ్లు యూనిట్‌కు రూ.4.0గాను, ఎనిమిదో ఏట నుంచి రూ.4.50 గాను ప్రతిపాదించడం జరిగింది. ఈ పరిశ్రమకు 220 కేవీ స్థాయిలో ప్రస్తుత టారిఫ్ యూనిట్ రూ 4.90గా ఉంది. ఈ టారిఫ్ ప్రతిపాదనలు ప్రస్తుతం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పరిశీలనలో ఉన్నాయి. వీటిపై వచ్చే ఏడాది జనవరి 29 నుంచి 31 వరకు ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ నిర్వహిస్తామని ఇప్పటికే నోటిఫికేషన్ ద్వారా ఏపీఈఆర్సీ వెల్లడించింది. అంటే ఈ ప్రత్యేక విద్యుత్ కేటగిరికి టారిఫ్ చట్ట పరంగా ఇంకా నిర్ధారణ కాలేదు. ఇంతలోనే ఎంతో నష్టం జరుగుతోందంటూ ఈనాడు ఏదేదో ఊహించేసుకుని ఏడుపుగొట్టు కథనాన్ని అచ్చేసింది. -
చకచకా కరెంటు.. కుళాయి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, కుళాయి కనెక్షన్లను ఇస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహయోగం కల్పించేందుకు 30.75లక్షల మంది మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ, 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ, 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 6,655 కాలనీల్లో విద్యుత్ పనులు పూర్తి పేదల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న 9,414 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 6,655 కాలనీల్లో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తయింది. ఇక నిర్మాణం పూర్తయినవాటిలో 5,02,654 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నారు. అదే విధంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ తాగునీటి సదుపాయం కల్పించారు. 1.15 లక్షల ఇళ్లకు ఇంకుడు గుంతలు కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తికావాల్సి ఉంది. అలా కాకుండా ముందుగానే సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. అందువల్ల ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఇళ్లకు తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,15,973 ఇళ్లకు ఇంకుడు గుంతలను నిర్మించారు. అదేవిధంగా వైఎస్సార్, జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్‌లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 2,394 కాలనీలకు ఆర్చ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 510 చోట్ల పనులను ప్రారంభించగా, 28 చోట్ల ఆర్చ్‌ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిర్మించిన ఇళ్లు అన్నింటికీ విద్యుత్, నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు చేశారా.. లేదా.. అని ఆడిట్ నిర్వహించాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
గ్రేటర్ ‘పవర్’ఫుల్..!
ఐటీ, అనుబంధ సంస్థల రాకతో నగరవాసుల ఆదాయం గణనీయంగా పెరిగింది. ధనిక, పేద తేడా లేకుండా ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు, టీవీలు, వాటర్ హీటర్లు, ఐరన్ బాక్స్‌లు, మిక్సీలు, గీజర్లు సర్వ సాధారణమయ్యాయి. ఫలితంగా తలసరి కరెంట్ వినియోగం కూడా భారీగా పెరిగింది. 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 2,261 యూనిట్లకు చేరడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: నగరం శరవేగంగా విస్తరిస్తోంది. కోర్‌సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహ, వాణిజ్య, పారిశ్రామిక భవనాలు వెలుస్తున్నాయి. నెలకు సగటున 2500–3000 వరకు కొత్త విద్యుత్ కనెక్షన్లు జత చేరుతున్నాయి. ఫలితంగా ఏటా విద్యుత్ వినియోగం రెండు నుంచి మూడు శాతం అధికంగా నమోదవుతున్నట్లు అంచనా. ఇక విద్యుత్ గృహోపకరణాల సంఖ్యా అదేస్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం ఎండలు భగ్గున మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవుతుండటంతో సిటీజనాలు ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా ఆన్ చేసి ఉంచుతున్నారు. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ పీక్కు చేరుకుంది. రికార్డు స్థాయిలో డిమాండ్ రాష్ట్రం ఏర్పాటు సమయంలో గ్రేటర్ పీక్ సీజన్ డిమాండ్ 48 నుంచి 49 మిలియన్ యూనిట్లు (ఎంయూ) నమోదు కాగా... ప్రస్తుతం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. మే 19న డిస్కం చరిత్రలోనే అత్యధికంగా 80 ఎంయూలు నమోదైంది. గత ఏడాది ఏప్రిల్ 28న 71.09 ఎంయూల విద్యుత్ వినియోగం నమోదు కాగా, ఈ సారి ఏకంగా ఎనిమిది ఎంయూలకు పైగా వినియోగం నమోదు కావడం గమనార్హం. రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో ఇంజనీర్లు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతుండటం, ఆయిల్ లీకేజీల కారణంగా బస్తీల్లోని పలు డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవుతుండటం, గంటల తరబడి సరఫరా నిలిచిపోతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు అప్రమత్తమై.. ఎప్పటికప్పుడు ఆయా సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నారు. -
173 కేసుల్లో నిందితులు.. పోలీసులు పక్కా స్కెచ్.. చివరికి..
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్ఫార్మర్ల కాపర్ కాయిల్స్ దొంగతనాలకు పాల్పడుతున్న ఏడు మంది ముఠా సభ్యులను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 60 కిలోల కాపర్ కాయిల్స్, టాటా ఇండికా కారు, బజాజ్ పల్సర్ బైక్, నాలుగు మొబైల్ ఫోన్లు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ కమీషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధి సీసీఎస్ క్రైం డీసీపీ మధుకర్ స్వామి ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తన బృందంతో నెల రోజుల పాటు శ్రమించి మూడు నాలుగు కమిషనరేట్‌లో పరిధిలో 173 కేసుల్లో ప్రమేయం ఉన్న ఏడు మంది దొంగల గ్యాగ్ ముఠాను అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రధానంగా ఈ ముఠా దొంగలించిన సొత్తు చిన్నది కావచ్చు కానీ ప్రభుత్వానికి, ప్రజలకు చాలా నష్టం చేకురుస్తుందని డీసీపీ తెలిపారు. ఏడుగురు నిందితులు చేసిన దొంగతనాలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 60, సైబరాబాద్ పరిధిలో 7, వికారాబాద్‌లో 68,సంగారెడ్డి జిల్లాలో 20, సిద్దిపేట జిల్లాలో 22 మొత్తం ఈ ముఠా 306 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసినట్టు సీపీ వివరించారు. చదవండి: 3 నెలలే మొగుడు పెళ్లాలుగా.. మరో వ్యక్తితో పరిచయం.. జోరువానలో.. ప్రధాన నిందితుడు సహదేవ్ హిజ్రా, అభిమన్యు రాజ్ బార్, నందులాల్ రాజ్ బార్, రాహుల్ రాజ్ బార్, రాంచందర్, కుర్వ చిన్న నర్సింహులు, ఉట్టల మహేష్, తులుగు రమణ రెడ్డి, రాంజానీ జయశ్రీలను అరెస్ట్ చేయగా, రాహుల్ రాజ్ బార్, రాంచందర్ కుర్వ చిన్న నర్సింహులు, ఉట్టల మహేష్ పరారీలో ఉనట్లు సీపీ తెలిపారు. నెల రోజులు కష్టపడి కేసును చేధించిన అధికారులను సీపీ అభినందించారు. -
ట్రాన్స్ఫార్మర్లపై పచ్చ మీడియా తప్పుడు లెక్కలు
సాక్షి, అమరావతి: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు, నిల్వలపై ‘కేరాఫ్ కడప.. విచ్చలవిడిగా ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లు’ శీర్షికతో అర్ధం లేని రాతలు, పొంతనలేని లెక్కలతో పచ్చి అబద్ధాలను ప్రచురించి పచ్చ పత్రిక అడ్డంగా దొరికిపోయింది. డిస్కమ్‌లపై బురద చల్లేందుకు ప్రయత్నించి అభాసుపాలైంది. తప్పుడు రాతల వెనుక వాస్తవాలను ‘ఏపీసీపీడీసీఎల్’ వెల్లడించింది. ఆరోపణ: 2021 ఏప్రిల్ 1 నాటికి రూ.145.86 కోట్ల విలువైన 88,88,203 ట్రాన్స్ఫార్మర్లు డిస్కమ్ పరిధిలోని వివిధ స్టోర్లలో ఉన్నాయి. వాస్తవం: 2021 ఏప్రిల్ 1 నాటికి రూ.10.77 కోట్లు విలువైన 633 ట్రాన్స్ ఫార్మర్లు మాత్రమే ఉన్నాయి. ఆరోపణ: 2021 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య రూ.956.69 కోట్లతో 4,44,09,492 ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేశారు. వాస్తవం: 2021 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య రూ.358.97 కోట్లతో 32,728 ట్రాన్స్ఫార్మర్లను మాత్రమే కొనుగోలు చేశారు. ఆరోపణ: 2022 డిసెంబర్ 31 నాటికి విజయవాడ, గుంటూరు, సీఆర్డీఏ, ఒంగోలు స్టోర్స్‌లో రూ.385.38 కోట్ల విలువైన 1,22,61,706 ట్రాన్స్ ఫార్మర్లు నిల్వ ఉంచారు. వాస్తవం: గత డిసెంబర్ 31 నాటికి అన్ని స్టోర్స్‌లో కలిపి రూ.149.86 కోట్ల విలువైన 16,634 ట్రాన్స్ ఫార్మర్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఆరోపణ: ఏడాదిన్నరలోనే ఏపీసీపీడీసీఎల్ పరిధిలో రూ.కోట్ల విలువైన ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు చేయడం వెనుక భారీ వ్యూహం ఉంది. వాస్తవం: ప్రస్తుతం స్టోర్లలో నిల్వ ఉన్న 16,634 ట్రాన్స్ఫార్మర్ల నుంచి 13,361 ట్రాన్స్ఫార్మర్లను కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం, చోరీకి గురైన చోట్ల కొత్తవి ఏర్పాటు, రోలింగ్ స్టాక్ కోసం వినియోగించనున్నారు. వర్షాలతో పొలాల్లో నీరు చేరడం, కోతల సమయం కావడంతో ట్రాన్స్ఫార్మర్లు బిగించడానికి అవకాశం లేక కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. వేసవి చివరి కల్లా పెండింగ్‌లో ఉన్న అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు నిల్వ చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వినియోగిస్తారు. ఆరోపణ: ఏబీవీ, బీహెచ్ఈఎల్, ఎల్ అండ్ టీ లాంటి ప్రముఖ కంపెనీలు తక్కువకే ఇస్తుంటే ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. వాస్తవం: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన కొనుగోళ్లు పూర్తిగా టెండర్ల ద్వారా మాత్రమే జరుగుతాయి. ఓ పత్రికలో పేర్కొన్న సంస్థలు టెండర్ల ప్రక్రియలో ఇప్పటి వరకూ పాల్గొనలేదు. 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను రూ.5 లక్షలకు, 33 కేవీ ట్రాన్స్ ఫార్మర్లను రూ.8.5 లక్షలకు కొనుగోలు చేయడం లేదు. -
డిస్క్ంకు ఉరితాళ్లు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీధుల్లో లాగుతున్న వివిధ రకాల కేబుల్ వైర్లు (ఇంటర్నెట్, డిష్)విద్యుత్ స్తంభాలకు పెద్ద గుదిబండలా మారాయి. కోర్సిటీతోపాటు శివారు మున్సిపాలిటీల్లోనూ విద్యుత్ స్తంభాలు వివిధ రకాల కేబుల్ వైర్లతో సాలెగూళ్లను తలపిస్తున్నాయి. ఒక విద్యుత్ స్తంభానికి మరో విద్యుత్ స్తంభానికి మధ్య మైనస్ (ఎర్త్), ప్లస్ (పవర్ సప్లయ్)తో పాటు త్రీ ఫేజ్ (ఎల్టీ) వైర్లు మాత్రమే ఉండాల్సిఉండగా 40 నుంచి 50 కేబుల్ వైర్లు వేలాడుతున్నాయి. ఈదురు గాలితో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడుతున్నాయి. సాధారణంగా రెండు మూడు వైర్లు మాత్రమే ఉంటే చెట్ల బరువుకు తీగలు తెగి, నష్టం కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అంతకు మించి కేబుళ్లు వేలాడుతున్నాయి. భారీ చెట్లు, కొమ్మలు విరిగి ఈ లైన్లపై పడ్డప్పుడు ఆ బరువుకు అటు ఇటుగా ఉన్న విద్యుత్ స్తంభాలు ఒరుగుతున్నాయి. ఫలితంగా సంస్థకు భారీగా ఆరి్థక నష్టం వాటిల్లడంతో పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అంతేకాదు పునరుద్ధరణకు 12 నుంచి 24 గంటల సమయం పడుతోంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 8 నుంచి 13 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జోన్ల పరిధిలో 2,153 ఫీడర్లు ట్రిప్పవగా, 361 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరో 31 డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడానికి ఈ కేబుళ్లే ప్రధాన కారణమని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. జంక్షన్ బాక్సులు..గుట్టుగా కనెక్షన్లు విపత్తులను తట్టుకుని నిలబడాల్సిన విద్యుత్ స్తంభాలు కేబుళ్ల కారణంగా అడ్డంగా విరిగిపడుతున్నాయి. స్తంభాలు ఎవరైనా ఎక్కాలన్నా..వీధి చివరిలోని డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను తాత్కాలికంగా బంద్ చేయాలన్నా డిస్కం అనుమతి తప్పని సరి. కానీ ఇంటర్నెట్, కేబుల్ సిబ్బంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఆయా స్తంభాలకు ఏర్పాటు చేసిన జంక్షన్ బాక్సులకు పోల్స్‌పై నుంచి గుట్టుగా సర్వీసు వైర్‌ను లాగి కరెంట్‌ను వాడుతున్నారు. యధేచ్ఛగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాయి. గ్రేటర్లో ఈ తరహా కనెక్షన్లు 60 వేల వరకు ఉన్నట్లు అంచనా. విద్యుత్ చౌర్యం వల్ల సంస్థకు వస్తున్న ఈ నష్టాలను క్షేత్రస్థాయి సిబ్బంది లైన్‌లాస్ జాబితాలో వేసి చేతులు దులుపుకుంటుండటం గమనార్హం. ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు విద్యుత్ స్తంభాల తయారీలో నాణ్యత లోపం స్పష్టంగా కన్పిస్తుంది. సిమెంట్, ఇసుక, ఐరన్ కూడా సరిగా వాడటం లేదు. పాతిన కొద్ది రోజులకే సగానికి విరిగిపోతున్నాయి. భూమిలో మీటరు లోతు వరకు పాతాల్సి ఉండగా, చాలా చోట్ల ఒకటి రెండు ఫీట్లకు మించి తవ్వడం లేదు. పట్టు కోసం చుట్టూ సిమెంట్ వాడక పోవడంతో ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడి నేలకూలుతున్నాయి. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు పోల్‌పైకి ఎక్కే సమయంలో పట్టు దొరక్క కారి్మకులు కింద పడుతున్నారు. ఇటీవల కందుకూరు, మహేశ్వరంలో ఇద్దరు కారి్మకులు చనిపోవడానికి కూడా ఇదే కారణం. స్తంభాల చుట్టూ కేబుళ్లు భారీగా అల్లుకపోయి ఉండటంతో ఏ వైరు దేనికి సంబంధించిందో అర్థం కావడం లేదు. కార్మికులు పోల్పైకెక్కే సమయంలో ఎల్సీ తీసుకున్నప్పటికీ..కొంత మంది ఇళ్లలో జనరేటర్లు, ఇన్వర్టర్లు పని చేస్తుండటం వల్ల ఆయా వైర్ల నుంచి పోల్‌పైకి కరెంట్ రివర్స్ సప్లయ్ జరిగి కార్మికులు విద్యుత్‌షాక్‌కు గురవుతున్నారు. (చదవండి: 19 డిపోలు లాభాలబాట) -
గ్రేటర్ వాసులను బెంబేలెత్తించిన వాన... ధ్వంసమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు
సాక్షి, హైదరాబాద్: భారీ ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలు గ్రేటర్ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున గాలివానతో అనేక చోట్ల చెట్ల కొమ్మలు, హోర్డింగ్‌లు విరిగి లైన్లపై పడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 400పైగా 11 కేవీ ఫీడర్లు, 80కిపైగా 33 కేవీ ఫీడర్లు ట్రిప్పవగా, 60పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరో నాలుగు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో సరఫరాకు తీవ్ర అంత రాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై కొన్ని చోట్ల సరఫరాను వెంటనే పునరుద్ధరించారు. మరికొన్ని చోట్ల రాత్రి అంధకారం తప్పలేదు. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి వరకు కరెంట్ లేకపోవడంతో ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల్లోని లిఫ్ట్‌లు, మంచినీటి సరఫరా మోటార్లు పని చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. అత్యవసర సమయంలో 1912 కాల్ సెంటర్ మూగబోగా, కొంతమంది లైన్మెన్లు, ఇంజినీర్లు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం గమనార్హం. 850 మెగావాట్లకు పడిపోయిన విద్యుత్ డిమాండ్ గ్రేటర్ జిల్లాల్లో చాలా వరకు ఓవర్‌హెడ్ లైన్లే. ఈ లైన్ల కిందే చెట్టు నాటుతుండటం, అవిపెరిగి పెద్దవై ఈదురుగా లులకు విరిగి పడుతుండటంతో తెగిపడుతున్నాయి. ప్రధాన వీధులు సహా శివారు ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో చాలా వరకు విద్యుత్ లైన్లను ఆనుకుంటున్నాయి. ఫ్లెక్సీలు, బ్యానర్లు చిరిగి గాలికి ఎగిరి లైన్ల మధ్య చిక్కుకుంటున్నాయి. ఒకదానికొకటి ఆనుకోవడంతో షార్ట్‌సర్క్యూట్ తలెత్తి ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. తెల్లవారుజామున అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడాల్సివ చ్చింది. వర్షం వెలియగానే కొన్ని చోట్ల సరఫరాను పునరుద్ధరించిన్పటికీ.. చెట్ల కొమ్మలు ఎక్కువగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో ఆరేడు గంటలకుపైగా శ్రమించాల్సి వచ్చింది. ఆ సర్కిళ్లలోనే ఎక్కువ నష్టం ఈదురు గాలితో కూడిన వర్షానికి సరూర్‌నగర్, మేడ్చల్, సికింద్రాబాద్, హబ్సీగూడ సర్కిళ్ల పరిధిలోనే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు డిస్కం ఇంజినీర్లు గుర్తించారు. ఎల్బీనగర్, నాగోలు, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, బీఎన్‌రెడ్డి, పసుమాముల, తుర్కయాంజాల్ పరిసర ప్రాంతాల్లోనే 37 విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు అధికారులు గుర్తించారు. చెట్ల కొమ్మలు, హోర్డింగ్‌లు ఎక్కువ ఉన్న కంటోన్మెంట్, బోయిన్పల్లి, ప్యారడైజ్, సైఫాబాద్, మెహిదీపట్నం, చార్మినార్, కాచిగూడ, ఆస్మాన్‌గడ్, ఓల్డ్‌మలక్‌పేట్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, శంషాబాద్, మీర్పేట్, బాలానగర్, ఉప్పల్, బోడుప్పల్, చర్లపల్లి, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఐదు 33 కేవీ, పదిహేను 11 కేవీ, 37 ఎల్టీ పోల్స్ నేలకూలాయి. అంతేకాదు సైబర్‌సిటీ సర్కిల్లో 11 ఫీడర్లు ట్రిప్పవగా, హబ్సీగూడలో 35 ఫీడర్లు, మేడ్చల్‌లో 35, రాజేంద్రనగర్‌లో 18, సరూర్‌నగర్‌లో 21, సికింద్రాబాద్‌లో 17, హైదరాబాద్ సౌత్‌లో 14, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లో 12, బంజారాహిల్స్‌లో ఐదు ఫీడర్లు ట్రిప్పయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా గ్రేటర్ జిల్లాల్లో సుమారు రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా. -
మీటర్లు పెట్టాలని ఆదేశించలేదు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు స్పష్టం చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని ఈఆర్సీ ఆదేశించిందని పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించిన లెక్కలను కచ్చితంగా తెలుసుకోవడానికి రానున్న రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్ఫార్మర్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగించాలని ఆదేశించామన్నారు. ఈఆర్సీ సభ్యులు ఎండీ మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్యతో కలసి సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి రఘునందన్‌రావు ఆరోపణలను ఖండించారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు బిగించాలని జారీ చేసిన ఆదేశాలను రఘునందన్‌రావుకు పంపానని, అయినా మళ్లీ అవే ఆరోపణలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టబద్ధ సంస్థ ఈఆర్సీకి దురుద్దేశాలను ఆపాదించడం సరికాదన్నారు. మహారాష్ట్రలోని ఒక విద్యుత్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించి కచ్చితమైన వినియోగంపై అధ్యయనం చేశారని, రూ.36 కోట్ల విద్యుత్ సబ్సిడీలను డిస్కంలు అదనంగా పొందాయని ఈ అధ్యయనంలో తేలిందన్నారు. తెలంగాణ సైతం ఇలాంటి ప్రయోగం చేయాలన్న ఆలోచన ఉందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. త్వరలో జిల్లాలకు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ వినియోగదారులకు హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కల్పించడంతోపాటు వారి సమస్యలను తెలుసుకోవడానికి విద్యుత్ రెగ్యులేటరీ కమి షన్ అన్ని జిల్లాల్లో పర్యటించనుందని శ్రీరంగారావు వెల్లడించారు. ఈ నెల 19న ఉదయం కామారెడ్డి జిల్లాలో, మధ్యాహ్నం మెదక్ జిల్లాలోని పలువురు వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనుందన్నారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను మొబైల్ యాప్ ద్వారా కన్జ్యూమర్ గ్రివెన్స్ రిడ్రస్సల్ ఫోరంకు పంపవచ్చని, అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా ఈఆర్సీని ఆశ్రయించవచ్చని సూచించారు. -
ఒక తొండ.. 4 గంటలు కరెంట్ కట్!
సాక్షి, డోర్నకల్: ఓ తొండ గురువారం అర్ధరాత్రి విద్యుత్ సిబ్బందికి చుక్కలు చూపించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాత్రి 8.15 గంటల నుంచి 12.05 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనికితోడు వర్షం పడటం, విపరీతంగా దోమలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో వైపు విద్యుత్ సరఫరా అంతరాయానికి కారణమేమిటని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది వెతుకులాట ప్రారంభించారు. సబ్‌స్టేషన్‌లో ఎలాంటి సమస్య లేకపోవడంతో ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇంజనీర్, ఇతర ఇబ్బంది సబ్ స్టేషన్ నుంచి రైల్వే ట్రాక్ వరకు 11 కేవీ లైన్‌కు సంబంధించి సుమారు 30 స్తంభాలపైకి ఎక్కి పరిశీలించారు. చివరకు రైల్వే ట్రాక్ సమీప స్తంభంపైన ఉన్న కండక్టర్ ఇన్సులేటర్ మీద తొండ పడి చనిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు గుర్తించారు. వెంటనే తొండను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. చదవండి: మహబూబ్‌నగర్ జిల్లాలో హైవేపై ట్రక్కు బీభత్సం -
ట్రాన్స్ఫార్మర్లు ఇక చల్లగా..!
సాక్షి, అమరావతి: వేసవిలో నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని రెండేళ్లుగా గణనీయంగా పెంచింది. సాధారణంగా వేసవిలో ట్రాన్స్ఫార్మర్లపై అత్యధిక లోడ్ పడుతుంది. దీంతో అవి తేలికగా వేడెక్కి, కాలిపోవడమో లేదా ట్రిప్ అయి ఆగిపోవడమో జరుగుతుంటాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వాస్తవ లోడ్‌ను క్షేత్రస్థాయి సిబ్బంది ముందే అంచనా వేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే వేడిని తగ్గించేందుకు కొద్దిసేపు కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. సాధారణంగా ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటినప్పుడు ట్రాన్స్ఫార్మర్లలో వేడి విపరీతంగా పెరుగుతుంది. ఎక్కువ సామర్థ్యం గల ట్రాన్స్‌కో ట్రాన్స్ఫార్మర్లలో లోడ్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్‌గా అందులో ఉండే ఫ్యాన్లు ఆన్ అయ్యి వాటిని కూల్ చేస్తాయి. వినియోగదారులకు అందించే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పద్మజనార్థన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం లోడ్‌ను కంట్రోల్ చేయడం ద్వారానే వేడిని అదుపు చేస్తున్నామని చెప్పారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చినప్పుడు ఎక్కువ లోడ్ ఉండే ప్రాంతాలను గుర్తించి నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఉష్ణోగ్రతకు గురవ్వకుండా ఆయిల్ మార్పిడి వేసవి ముందే రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్ఫార్మర్ల స్థితిని అంచనా వేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఉష్ణోగ్రతకు గురవ్వకుండా ముందే ఆయిల్ మార్పు చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చామని చెప్పారు. తరచూ చెడిపోతున్న, కాలిపోయే వాటి స్థానంలో కొత్తవి అమర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. -
పంపుసెట్లకు మీటర్లపై కేంద్రం యూటర్న్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలన్న షరతుల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. వ్యవసాయ మీటర్లకు కాకుండా దశల వారీగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు (డీటీ) అన్నింటికీ మీటర్లు బిగించాలని తాజాగా స్పష్టం చేసింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడంపై తెలంగాణ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిం చాయి. దీంతో ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందని ట్రాన్స్‌కో ఉన్నత స్థాయి అధికారవర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ తదితర అన్ని కేటగిరీలు కలుపుకొని మొత్తం 1.6 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో 25 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు లేకపోవడంతో వీటికి సరఫరా చేస్తున్న విద్యుత్‌కు స్పష్టమైన లెక్కలు లేవు. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న మొత్తం విద్యుత్‌లో 32–35 శాతం వరకు వ్యవసాయానికి సరఫరా అవుతోందని రాష్ట్ర విద్యుత్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.5,940 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా కోసం రూ.4,060 కోట్లు కలిపి డిస్కంలకు రూ.10 వేల కోట్ల సబ్సిడీలను ప్రస్తుత ఏడాది బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రైవేటీకరణ దిశగా.. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసిన కేంద్రం.. సంబంధిత విద్యుత్ సవరణ బిల్లు–2021ను ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే వ్యవసాయం సహా ప్రతి వినియోగదారుడు వాడే విద్యుత్‌కు కచ్చితమైన లెక్కలు తీసి సంబంధిత ప్రభుత్వ డిస్కంలు/ ప్రైవేటు కంపెనీలు బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది. కరోనా ఉద్దీపన ప్యాకేజీ కింద ప్రకటించిన ఆత్మ నిర్భర్ రుణాలకు అర్హత సాధించాలంటే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని అప్పట్లో కేంద్రం షరతులు విధించింది. తెలంగాణ డిస్కంలకు రూ.12,600 కోట్ల రుణాల్లో తొలి విడతగా రూ.6,300 కోట్లను గతేడాది జూలైలో విడుదల చేయగా, రెండో విడతగా చెల్లించాల్సిన రూ.6,300 కోట్ల రుణాలను ఈ షరతులకు అంగీకరించకపోవడంతో కేంద్రం నిలుపుదల చేసింది. తాజాగా కేంద్రం వెనక్కి తగ్గి వ్యవసాయ కనెక్షన్లకు బదులు రాష్ట్రంలోని అన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించాలని స్పష్టతనిచ్చింది. దీంతో త్వరలో రాష్ట్ర డిస్కంలకు రావాల్సిన రెండో విడత రుణాలు విడుదల కావొచ్చని ట్రాన్స్‌కో అధికారవర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. సీఎం పరిశీలనలో ప్రతిపాదనలు.. రాష్ట్రంలో 7.9 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. కేంద్రం సూచన మేరకు వీటికి మీటర్లు బిగించే ప్రతిపాదనలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయి. త్వరలో వీటిపై ఆయన ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. దశల వారీగా ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించే విషయంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు సానుకూలతతో ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగిస్తే దారి పరిధిలోని వినియోగదారులు వినియోగిస్తున్న మొత్తం విద్యుత్‌కు సంబంధించిన గణాంకాలు లభిస్తాయి. ఏ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఎంత విద్యుత్ సరఫరా అవుతోంది? అందులో ఎంత మేర విద్యుత్‌కు బిల్లింగ్ జరుగుతోంది? ఎంత మేరకు విద్యుత్ నష్టం/ చౌర్యం అవుతోంది? వంటి కీలక సమాచారం దొరుకుతుంది. రాష్ట్రంలో దాదాపు అన్ని వ్యవసాయ కనెక్షన్లకు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వీటికి మీటర్లు బిగిస్తే వీటి పరిధిలోని వ్యవసాయ కనెక్షన్లు వినియోగిస్తున్న మొత్తం విద్యుత్ గణాంకాలు తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. వ్యవసాయానికి ఏ మేరకు విద్యుత్ సరఫరా అవుతుందో, ఆ మేరకు విద్యుత్ రాయితీలను రా>ష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించడానికి ఈ లెక్కలు ఉపయోగపడనున్నాయి. పూర్తి స్థాయిలో సబ్సిడీలు వస్తే డిస్కంలు నష్టపోవాల్సిన పరిస్థితి ఉండదు. రాష్ట్రంలోని 7.9 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించడానికి రూ.1,600 కోట్ల వ్యయం కానుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఒక్కో మీటర్‌కు రూ.2 వేలు వ్యయం కానుందని అధికారులు పేర్కొంటున్నారు. మీటర్ల ఖర్చులో కొంత భాగాన్ని కేంద్రం భరించే అవకాశాలున్నాయి. -
ఒకే కాంట్రాక్టర్‌కు 4,769 పనులు!
►మెదక్ జిల్లా తూప్రాన్‌లోని 2 ట్రాన్స్ఫార్మర్లకు 1,458 చ.అ. కంచె ఏర్పాటు కోసం 2018 మార్చిలో చదరపు గజానికి రూ.56 ధర తో రూ. 81,648 బిల్లులను కాంట్రాక్టర్‌కు చెల్లించారు. ►మహబూబ్‌నగర్ జిల్లా ఐజలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 జూలైలో చదరపు అడుగుకు రూ. 125 ధరతో కాంట్రాక్టర్‌కు రూ. 71,750 చెల్లించారు. ►సిద్దిపేటలోని కల్వకుంట్ల కాలనీలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 290 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 నవంబర్‌లో చదరపు అడుగుకు రూ. 284 ధర చొప్పున కాంట్రాక్టర్‌కు రూ. 82,360 చెల్లించారు. ►పరిగిలోని గొండుగొనపల్లి, డి.ఎంకెపల్లిలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 220 చదరపు అడుగుల కంచె కోసం 2018 ఫిబ్రవరిలో చదరపు అడుగుకు రూ. 384 ధరతో కాంట్రాక్టర్‌కు రూ. 84,840 చెల్లించారు. ►నామినేషన్ విధానంలో ఈ నాలుగు పనులన్నింటినీ ప్రదీప్ ఎలక్రి్టకల్స్ అనే కాంట్రాక్టు సంస్థ దక్కించుకోవడం గమనార్హం. 2010–20 మధ్య ఈ ఒక్క సంస్థకే టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు రూ. 30.69 కోట్లకుపైగా విలువజేసే 4,769 పనులు అప్పగించారు. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ఏర్పాటు చేసే రక్షణ కంచెల పనుల్లో జరుగుతున్న దోపిడీ బట్టబయలైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు కొన్నేళ్లుగా కాంట్రాక్టర్లకు యథేచ్ఛగా దోచిపెడుతున్న వైనం ఫేస్బుక్ లైవ్ వేదికగా వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ల వద్ద కంచెల ఏర్పాటుకు ఒక్కో ప్రాం తంలో ఒక్కో ధరతోపాటు ఒక్కో పని పరిమాణం తో టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు అంచనాలు తయారు చేసి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారంటూ టీఎస్ఎస్పీడీసీఎల్ అదనపు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏడీఈ) కోటేశ్వర్రావు బహిర్గతం చేశారు. జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ ఏడీఈగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఆయన మంగళవారం ఫేస్బుక్ లైవ్ నిర్వహించి టీఎస్ఎస్పీడీసీఎల్లో జరుగుతున్న అక్రమాలను అధికారిక పత్రాలతో సహా ప్రజల ముందుంచారు. బుధవారం రాత్రి వరకు దాదాపు 2లక్షల మంది ఈ వీడియోను వీక్షిం చడంతోపాటు వేల మంది షేర్ చేయడంతో ఇది ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. యాజమాన్యం అండదండలతోనే... వికారాబాద్, మెదక్, జోగిపేట, సిదిపేట, సంగా రెడ్డి డివిజన్ల పరిధిలో ప్రదీప్ ఎలక్ట్రికల్స్ ఏజెన్సీకి నామినేషన్ల విధానంలో 4,769 పనులు అప్పగించా రని అధికారిక సాక్ష్యాలతో కోటేశ్వర్రావు బయటపెట్టారు. ఎస్ఈగా రిటైరైన ఓ అధికారి, మరో నలు గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు వంటి పనులకు తప్పనిసరిగా టెండర్లు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. అయితే సంస్థ యాజమాన్యం అండదండలతోనే ఈ అక్రమాలు జరిగా యన్నారు. రూ.లక్షలోపు అంచనాలు కలిగిన పను లుచేసే ఒక చిన్న కాంట్రాక్టర్ ఒకే డివిజన్ పరిధిలో పనిచేయడం సాధ్యమని, అతడికి నాలుగు డివిజన్ల పరిధిలో పనులెలా అప్పగించారని ఆయన ప్రశి్నస్తున్నారు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రబ్యూషన్ బడ్జెట్ పేరుతో కేటాయించే అత్యవసర వినియోగం నిధు ల్లో సింహభాగం అధికారులు, కాంట్రాక్టర్ల జేబు ల్లోకి చేరుతున్నాయని అన్నారు. పనులు ఏమాత్రం చేయకున్నా, పాక్షికంగా చేసినా పూర్తిగా బిల్లులు చెల్లించినట్లు తన వద్ద ఆధారాలున్నాయన్నారు. విద్యుత్ సంస్థలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తాను ఫేస్బుక్ లైవ్ నిర్వహించానని వెల్లడించారు. అక్రమాలను నిరోధించడంలో యాజమాన్యం విఫ లంకావడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం గా మారి పేదలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. 700 శాతం వరకు రేట్ల పెంపు... కోటేశ్వర్రావు సాక్ష్యాలతో చూపిన ఆధారాల్లో అత్య ల్పరేటు అయిన రూ. 56తో పోలిస్తే 700 శాతం అధిక రేటు అయిన రూ. 384తో అంచనాలు అధికారులు రూపొందించారు. ఇలా 100% నుంచి 700% వరకు రేట్లను అడ్డగోలుగా పెంచారు. అంచనాల తయారీలో ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) రేట్లను పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ మహా అయితే 120 చ.అ. కంచె ఏర్పాటు చేస్తారు. కానీ ప్రదీప్ ఎలక్రి్టకల్స్ చేపట్టిన పనులను పరిశీ లిస్తే 2 ట్రాన్స్ఫార్మర్లకు కలిపి ఒకచోట 1,458 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు, మరోచోట 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు అధికారులు బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. హైకోర్టులో కేసు... టీఎస్ఎస్పీడీసీఎల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్రపతి, ప్రధాని, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, సీఎంకు ఫిర్యాదు చేయడంతోపాటు రాష్ట్ర హైకోర్టులో సైతం కోటేశ్వర్రావు కేసులు వేశారు. ఇవి త్వరలో విచారణకు రానున్నాయని ఆయన చెప్పారు. కాగా, కోటేశ్వర్రావు సీఎంవోకు చేసిన ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరుగుతోందని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రజా సంబంధాల విభాగం వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
విద్యుత్ సమస్యలకు చెక్
సాక్షి, కొత్తపల్లి : ఏళ్లనాటి విద్యుత్ సమస్యలకు ఇప్పుడిప్పుడే మోక్షం లభిస్తోంది. ప్రత్యేక నిధుల్లేక ప్రస్తుతం ఉన్న పనులకే మరమ్మతులు చేస్తుండగా.. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ సమస్యలకు చెక్ పడుతోంది. విద్యుత్ స్తంభాలు కావాలని, విద్యుత్ లైన్లు వేలాడుతున్నాయని, విద్యుత్ స్తంభాలు వంగాయని, లో ఓల్టేజీ వస్తోందని, మీటర్లు అమర్చాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని తరచూ అధికారుల చుట్టూ తిరిగి వేసారిన ప్రజలకు ‘పవర్ వీక్’ రూపంలో రాష్ట్ర ప్రభుత్వమే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు విద్యుత్ అధికారులు సమస్యలపై నడుం బిగించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మూడు నెలల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశాలిచ్చారు. ఇదిలా కొనసాగుతుండగానే గ్రామాల్లో ఈ నెల 6 నుంచి చేపట్టన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యుత్ సమస్యలనూ అధికారులు గుర్తించారు. ఆ సమస్యల పరిష్కారమే మార్గంగా ముందుకు సాగుతున్నారు. దీంతో గ్రామాల్లో కొంతమేర విద్యుత్ ప్రమాదాలకు చెక్ పడనుంది. ప్రత్యేక నిధుల్లేక కొత్త పనులకు బ్రేక్.. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కొత్త స్తంభాలు, కొత్త లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వేయాల్సిన అవసరం ఉంది. విద్యుత్ డిమాండ్‌ను బట్టి విద్యుత్ మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు విడుదల కాకపోవడంతో ప్రస్తుతం కొత్త పనుల జోలికి అధికారులు వెళ్లడం లేదు. స్థానికంగా పరిష్కారమయ్యే పనులనే ప్రస్తుతం చేపడుతూ కొంతమేర విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే గ్రామాల్లో విద్యుత్ సరఫరా మెరుగుకానుంది. అనేక గ్రామాల్లో వంగిన స్తంభాలు, వేలాడుతున్న వైర్లు, మధ్య స్తంభాలు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, ఎర్తింగ్ లేని ట్రాన్స్ఫార్మర్లు, తుప్పు పట్టిన ఇనుప స్తంభాలు తదితర సమస్యలను అధికారులు గుర్తించారు. తుప్పు పట్టిన స్తంభాలను మాత్రమే తొలగించనున్నారు. ఇనుప స్తంభాలు బాగుంటే వాటినే కొనసాగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం వీటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మెటీరియల్ కొరత.. విద్యుత్ మెటీరియల్ లేక పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది. విద్యుత్ స్తంభాల కొరత, కాసారాలు, కండక్టర్లు, హెడ్జ్ ఫ్యూజుల కేబుళ్లు అందుబాటులో లేక పనులు ఆలస్యం అవుతున్నాయి. విద్యుత్ సమస్యలకు అనుగుణంగా ప్రభుత్వం మెటీరియల్‌ను సరఫరా చేస్తే గ్రామాల్లో త్వరలోనే విద్యుత్ సమస్యలు తొలగిపోనున్నాయి. విద్యుత్ బకాయిలపై ప్రత్యేక దృష్టి పనిలో పనిగా విద్యుత్ బకాయిలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మరమ్మతు పనులు చేపడుతూనే.. బకాయిలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలను ఇకపై తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంది. గ్రామ పంచాయతీలే విద్యుత్ బకాయిలు చెల్లిస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన దరిమిలా విద్యుత్ అధికారులు బకాయిలపై దృష్టి సారించారు. స్థానికంగానే బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు ఒత్తిడి తీసుకురానున్నారు. కరీంనగర్ జిల్లాలోని 324 గ్రామ పంచాయతీల్లో రూ.1.66 కోట్ల బకాయి డిమాండ్‌ను వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. లేనిపక్షంలో సంస్థ మనుగడకే ప్రమాదముందన్న ఆలోచనతో అధికారులు ముందుకు సాగనున్నారు. గ్రామ పంచాయతీలు : 324 విద్యుత్ పనులు పూర్తయిన గ్రామాలు : 30 పనులు ప్రారంభించిన గ్రామాలు : 124 గుర్తించిన లూజ్ వైర్లు : 2,466 కిలోమీటర్లు సరిచేసిన లూజ్ వైర్లు : 1430 కిలోమీటర్లు వంగిన స్తంభాలు : 1228 సరిచేసిన స్తంభాలు : 493 అవసరమైన మధ్య స్తంభాలు : 3899 వేసిన మధ్య స్తంభాలు : 1142 గుర్తించిన ఇనుప స్తంభాలు : 1548 వేసిన ఇనుప స్తంభాలు : 359 ఏబీ కేబుల్ వైర్లు : 307 కిలోమీటర్లు వేసిన కేబుల్ వైర్లు : 55 కిలోమీటర్లు గుర్తించిన థర్డ్ వైరు : 269 కిలోమీటర్లు వేసిన థర్డ్ వైరు : 113 కిలోమీటర్లు గుర్తించిన ఫిఫ్త్ వైరు : 35 కిలోమీటర్లు వేసిన ఫిఫ్త్ వైరు : 3.5 కిలోమీటర్లు -
దొంగే కాదు.. రేపిస్ట్ కూడా..!
పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం అందులోని రాగి వైరు చోరీ చేసే ఆరుగురు ముఠా.. ఇళ్లల్లో దొంగతనాలు చేయడమే కాదు; ఆలయాల్లో హుండీలు పగులగొట్టి నగదు దోచుకుంటున్న ఇద్దరు తమిళనాడు దొంగలను చిత్తూరు సబ్‌డివి జన్ పోలీసులు పట్టుకున్నారు. సోమల ఉదంతం నేపథ్యంలో 32 నాటు తుపాకులను సైతం స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు అర్బన్: ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం వెల్లడించిన వివరాలు..ఐరాల, తవణంపల్లె, కాణిపాకం, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాల్లో రెండేళ్ల కాలంలో పలు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగివైరును దొంగలు అపహరించారు. రైతులకు కంటికి కునుకు లేకుండా చేశారు. వీరి దెబ్బకు ఆయా ప్రాంతాల రైతులు చేతికందే పంటలు కూడా నష్టపోయారు. బాధితుల ఫిర్యాదుపై డీఎస్పీ సుబ్బారావు పర్యవేక్షణలో చిత్తూరు పశ్చిమ పోలీసులు ఎట్టకేలకు దొంగల భరతం పట్టారు. ఎస్ఐలు ప్రసాదరావు, కృష్ణమోహన్, ఉమామహేశ్వర్ సిబ్బందితో ఓ ప్రత్యేక బృందం సభ్యులు ఆరుగురు ముఠాతో కూడిన ట్రాన్స్ఫార్మర్ల దొంగలను అరెస్ట్ చేశారు. పూతలపట్టు మండలం ఆండ్రవారిపల్లెకు చెందిన రాజబాబు, నవీన్, పెనుమూరు మండలం రాజాఇండ్లుకు చెందిన చిన్నబ్బ, పెద్దబ్బ, బాబు, సురేష్‌ను అరెస్టు చేసి వీరినుంచి 250 కిలోల బరువున్న రాగి, అల్యూమినియం, మోటారు కేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. నాటు తుపాకులు సీజ్ ఇటీవల సోమల మండలంలో పోలీసులు తమను చూపి పారిపోతున్న కారును వెంబడించి పట్టుకోవడం, అందులో రెండు నాటుతుపాకులు లభ్యం కావడంతో ఉలిక్కిపడ్డారు. దీంతో అక్రమ ఆయుధాలపై పోలీసులు దృష్టి సారించారు. చిత్తూరు పశ్చిమ సీఐ ఆదినారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐలు విక్రం, మనోహర్, ఉమామహేశ్వర్ సిబ్బందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం మంగళవారం గుడిపాల, చిత్తపార అడవుల్లో పది నాటు తుపాకులు, యాదమరి, భూమిరెడ్డిపల్లె, నంజర్ల ప్రాజెక్టు సమీపంలో 12 తుపాకులు, తవణంపల్లె, ఉప్పరపల్లె, ఎర్రకొండ అడవుల్లో పది నాటు తుపాకులను గుర్తించి వాటిని సీజ్ చేశారు. కాగా ఈ కేసుల ఛేదనలో కృషి చేసిన ఏఎస్పీ సుప్రజ, డీఎస్పీ సుబ్బారావు, సీఐ ఆదినారాయణ, హరినాథ్ తదితరులను ఎస్పీ అభినందించారు. సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు. దొంగే కాదు.. రేపిస్ట్ కూడా..! ♦ పోలీసుల కన్నుగప్పి తిరుగుతూ చోరీలు చేస్తున్న తమిళనాడు వాసులు ♦ గత నెల 19న పులిచెర్ల మండలంలోని కల్లూరులో మద్యం దుకాణంలో చోరీ జరిగింది. దుకాణం పైకప్పు తొలగించి రూ.48 వేల నగదు చోరీ చేశారు. ♦ 20న గుడిపాల మండలంలోని పేయనపల్లెలో వెన్నెల అనే మహిళ ఊరికి వెళ్లగా, ఆమె ఇంట్లోకి దొంగలు పడ్డారు. రూ.36 వేలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారు. అదే రోజు గుడిపాలలోని చీలాపల్లెలో వెంకటేష్ ఇంటి తలుపులు పగులగొట్టి రూ.20 వేలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశారు. ♦ గతనెల 21న వైఎస్ గేటు వద్ద చాముండేశ్వరమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి ఉన్న బంగారు తాళిబొట్టు, హుండీ పగులగొట్టి అందులోని నగదును చోరీ చేశారు. ♦ 24న పాకాల మండలం మొగరాల పంచాయతీకి చెందిన రామ్మూర్తి ఇంటిని పగులగొట్టిన రూ.60 వేలు విలువ చేసే బంగారుచైన్ దొంగతనం చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పాకాల పోలీసులు తమిళనాడులోని వాలాజకు చెందిన బాలాజి అలియాస్ వెంకటేష్ (38), వేలూరు జిల్లా కందిపేటకు చెందిన శివం (29)ను అరెస్టు చేసి, రూ.1.75 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను పాకాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడైన వెంకటేష్ తమిళనాడులో ఇద్దరు మహిళల్ని రేప్ చేశాడని, అక్కడ ఇతనిపై పీడీ యాక్టు సైతం ప్రయోగించేందుకు ప్రతిపాదనలున్నాయి. ఓ కేసులో అక్కడి పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్నట్లు పాకాల పోలీసులు దర్యాప్తులో తేలింది. -
ట్రాన్స్ఫార్మర్ల మాఫియా!
అయ్యా... చేను చేసుకుందామనుకుంటున్నా.. నీళ్లకు ఇబ్బంది అయ్యింది.. బోరులో బాగానే నీళ్లు పడ్డాయి కానీ ట్రాన్స్ఫార్మర్ లేదయ్యా... అదేదో డీడీలు కట్టాలంట కదా కడుదునా... ఆ ఏం డీడీలు రా... ఇప్పుడు కడితే ఎప్పుడు వస్తుందో ఏమో... అప్పట్లోగా నీ పంట ఎండిపోతది.. మరెట్ల అయ్యా... ఏమి లేదు ఎట్లోలాగా నేను తెప్పిస్తాను, కొంత ఖర్చు అయితది... తెచ్చిన తర్వాత ఎట్లయినా సరే కరెంటోళ్లకు చెప్పి అధికారికంగా చేయిద్దాం.. – ఇది ఐదేళ్లుగా నడిగడ్డ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ల మాఫియా ఆడుతున్న ఆట. ఒక్కోటి రూ.50వేల నుంచి రూ.70వేల వరకు వెచ్చించి తెచ్చిన తర్వాత అది పనిచేస్తుందా లేదా అనేది మాఫియాకు సంబంధం లేదు. దీంతో రైతుల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా తయారైంది. సాక్షి, గద్వాల/ గద్వాల అర్బన్: రైతుల అవసరం.. ట్రాన్స్ఫార్మర్ల మంజూరులో అధికారుల నిర్లక్ష్యం వెరసి ట్రాన్స్ఫార్మర్ల మాఫియాకు అదనుగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్ఫార్మర్లు తెప్పించి రైతులకు కట్టబెడుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు మాత్రం కనెక్షన్‌కు, చెడిపోతే మరమ్మతు చేయించేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొం ది. అధికారులకు తెలియకుండా విద్యుత్ కనెక్షన్ తీసుకోవడం అసాధ్యం. ఒకవేళ ఏదైనా రిపేరు వస్తే అంతే సంగతులు.. కాస్తా కూస్తో అవగాహన ఉన్న మరికొందరు రైతులు గత్యంతరం లేక కర్నూలులోని ప్రైవేటు వ్యక్తుల వద్దకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసి మరమ్మతు చేయించుకుంటున్నారు. జిల్లాలో జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులతోపాటు ఏడు రిజర్వాయర్లు చేపట్టారు. సాగునీరు సమృద్ధిగా ఉండటంతో ఐదేళ్లుగా పంటల విస్తీర్ణం పెరిగింది. ముఖ్యంగా గద్వాల, ధరూరు, మల్దకల్, గట్టు మండలాల్లో వేలాది ఎకరాలు వరి, వేరుశనగ, పత్తి, మిరప, పండ్లతోటల సాగు చేస్తున్నారు. కాల్వలు, బోర్ల కింద పంటలు సాగు చేసుకునేందుకు విద్యుత్ అవసరం ఉంటుంది. ఇదే అదనుగా రైతుల అవసరాన్ని ఆసరగా చేసుకుని మాఫియా తెరపైకి వచ్చింది. ఇతర జిల్లాల నుంచి తక్కువ ధర, నాణ్యత లేని ట్రాన్స్ఫార్మర్లు తెచ్చి మూడు రెట్లు ఎక్కువకు విక్రయిస్తున్నారు. అయితే డబ్బులు పోయినా పంట కాపాడుకుందామనే సంతోషం రైతుల్లో లేకుండాపోయింది. వేల రూపాయలు ఖర్చు చేసి తెచ్చిన ట్రాన్స్ఫార్మర్లకు కనెక్షన్ ఇచ్చేందుకు అధికారుల నుంచి సమస్యలు ఎదురుకావడం, ఒకవేళ ఎలాగో ఇప్పించినా అవి పనిచేయకపోవడం, మరమ్మతుకు మళ్లీ వేల రూపాయలు ధారపోయడం రైతులకు పరిపాటిగా మారింది. అంతేకాదు తనతో కాకుండా ఇతరుల వద్ద ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేస్తే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు అంశాలు వెలుగు చూశాయి. నలుగురు వ్యక్తులతో కూడిన ఈ మాఫియా ఇప్పటికే కోట్ల రూపాయలు ఆర్జించినట్లు సమాచారం. గట్టు మండలం రాయపురంలో రైతులకు ప్రైవేట్ వ్యక్తులు అంటగట్టిన పనిచేయని ట్రాన్స్ఫార్మర్..., మల్దకల్ మండలం దాసరిపల్లిలో అధికారులు గుర్తించిన అనధికారిక ట్రాన్స్ఫార్మర్ ఇదే.. 25కేవీ ట్రాన్స్ఫార్మర్ తప్పనిసరి వ్యవసాయ రంగంలో ప్రతి 20ఎకరాలకు ఒక 25కేవీట్రాన్స్ఫార్మర్ అవసరం ఉంటుంది. సాధారణంగా డీడీ రూ.ఐదు వేలు ఉండగా ముగ్గురు, నలుగురు రైతులు కలసి దీనికోసం ఆన్లైన్లో నమోదు చేసుకుని ట్రాన్స్‌కో అధికారులకు దరఖాస్తులు ఇవ్వాలి. సీనియారిటీ ప్రకారం ట్రాన్స్ఫార్మర్ మంజూరవుతుంది. అనంతరం నాలుగు డీడీలు రూ.20వేల కలిపి 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు విద్యుత్ వైర్లు ఏబీ స్విచ్, ఏజ్ ఫ్యూజ్ సెట్, ఎల్టీ ప్యూజ్ సెట్, హెచ్‌టీ లైన్, ఎల్టీ లైన్‌తోపాటు వచ్చిన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు దిమ్మె కోసం సుమారు రూ.30వేల వరకు వెచ్చించాల్సిందే. అయితే డీడీ తీసిన తర్వాతా ఏళ్లతరబడి దానికోసం రైతులు ఎదురుచూడాల్సిందే. తప్పని పరిస్థితుల్లో చేనును కాపాడుకునేందుకు రైతులు ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా మాఫియా 25కేవీ ట్రాన్స్ఫార్మర్ను రూ.50వేల నుంచి రూ.70వేల వరకు విక్రయిస్తున్నారు. వైర్లు, విద్యుత్ స్తంభాలు, ఇతర ఖర్చులు సరేసరి. నిబంధనల ప్రకారం దీనిని రూ.20వేలకే ఇవ్వాల్సి ఉంటుంది. సరిహద్దులు దాటి.. సుమారు ఐదేళ్ల క్రితం బిజ్వారానికి చెందిన ఒకరు, ఇద్దరు సీడ్ ఆర్గనైజర్లు, ధరూరు మండలంలోని మరో వ్యక్తి కలసి ట్రాన్స్ఫార్మర్ల మాఫియాగా ఏర్పడ్డారు. వీరి వద్ద మరికొందరు పని చేస్తుంటారు. వీరు ఇతర జిల్లాల్లో నాణ్యత లేనివి, తక్కువ ధరకు లభించేవి, సక్రమంగా పనిచేయని ట్రాన్స్ఫార్మర్లను జిల్లాలోకి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు సమాచారం. మల్దకల్ మండలంలోని దాసరపల్లి, బిజ్వారం, మల్లెందొడ్డి, ధరూరు మండలంలోని మార్లబీడులో సుమారు 80అనధికారిక ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇలాంటి 200 వరకు ఉండవచ్చని చెబుతున్నారు. ఇక తమ వద్దే, చెప్పిన ధరకే కొనుగోలు చేయాలి, ఇతరుల దగ్గర కొనుగోలు చేస్తే అనుచరులతో అధికారులకు వారే సమాచారం ఇప్పిస్తారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంతోపాటు తెలంగాణలోని సంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫార్మర్ల తెప్పిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు మంజూరు చేస్తే ట్రాన్స్ఫార్మర్కు దాని సామర్థ్యం, కంపెనీ పేరు, ఉత్పత్తి చేసిన సంవత్సరం తదితర వివరాలు ఉంటాయి. కానీ మాఫియా సరఫరా చేసే దానిని అవేవి ఉండవు. బయట చెబితే అంతే సంగతులు అనధికారిక ట్రాన్స్ఫార్మర్లతో పడుతున్న ఇబ్బందులు రైతులు పూర్తి సమాచారం ఇచ్చేందుకు భయపడుతున్నారు. ‘సార్... మా వద్దకు వచ్చినట్లు తెలిస్తే కూడా ఇబ్బందే.. మేమేమీ చెప్పలేం..’ అంటూ ముఖం చాటేసి వెళ్తున్నారు. దీనిని బట్టే చూస్తే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మల్దకల్ మండలం దాసరిపల్లిలో నలుగురు రైతులు కలసి ఓ వ్యక్తితో ట్రాన్స్ఫార్మర్ను కొనుగోలు చేయగా ఇటీవల అధికారులు తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దానిని ఎవరి వద్ద కొనుగోలు చేశారో అతనికే మళ్లీ తిరిగి ఇవ్వాలని బాధిత రైతులు అతడిని ఆశ్రయిస్తే నెల రోజుల వ్యవధిలోనే రూ.పది వేలు తగ్గించి తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. అసలు ఎలాంటి కనెక్షన్ ఇవ్వక ముందే తిరిగి తీసుకోవడానికి ఇలా డిమాండ్ చేస్తున్నారంటే వారు రైతులను ముంచి ఎంత సంపాదిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే గట్టు మండలంలోని రాయపురానికి చెందిన కొందరు రైతులు ఇటీవలే ఓ వ్యక్తి నుంచి రూ.45వేలకు ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు చేశారు. తీరా తెచ్చుకున్న తర్వాతా పనిచేయకపోవడంతో తిరిగి అతనికే ఇచ్చేందుకు యత్నించగా తీసుకోవడానికి ఇష్టపడనట్టు తెలిసింది. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్ల సమస్య ఏదైనా ఉత్పన్నమైతే రైతులు, వినియోగదారులు సంబంధిత లైన్‌మన్, ఏఈలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురైతే జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్ మరమ్మతు కేంద్రాలకు తరలిస్తే ఉచితంగా చేస్తారు. అలాగే విద్యుత్ సమస్య ఏర్పడితే లైన్‌మన్, సంబంధిత అధికారులు వచ్చి సరిచేస్తారు. అయితే అనధికారిక ట్రాన్స్ఫార్మర్లు కావడంతో రైతులు మరమ్మతుకు కర్నూలుకు తీసుకెళుతున్నారు. అలాగే విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడితే సొంతంగా చేసుకుంటున్నారు. దీంతో కొంత అవగాహన లేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో జరిగే ప్రమాదాల్లో సుమారు 50శాతం అనధికార ట్రాన్స్ఫార్మర్ల వద్దే చోటు చేసుకుంటున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీçసుకుంటాం 24గంటల విద్యుత్ సరఫరా నిమిత్తం ఆటోస్టార్టర్ల తొలగింపునకు గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా పర్యటిస్తుంటే ఈ అనధికారిక ట్రాన్స్ఫార్మర్ల బాగోతం బయట పడింది. ఇవి మల్దకల్, ధరూరు, గద్వాల మండలాల్లో అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. అయితే రైతులు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్య తీసుకుంటాం. రైతులు డీడీలు కడితే త్వరలోనే ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తాం. ట్రాన్స్ఫార్మర్లు ప్రైవేట్‌గా కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరం. – సీహెచ్ చక్రపాణి, ట్రాన్స్‌కో ఎస్ఈ, గద్వాల వరి చేను ఎండుతుందని.. నలుగురు రైతులం కలసి మూడు బోర్ల కింద వరినాటు వేశాం. ప్రస్తుతం కాల్వ నీళ్లు వస్తున్నాయి. ఆ తర్వాత ఇబ్బంది అవుతుందని రూ.40వేలు వెచ్చించి మార్లబీడులోని ఓ వ్యక్తితో ట్రాన్స్ఫార్మర్ కొన్నాం. అయితే కొన్న తర్వాత తెలిసింది ఇది అనధికారిక ట్రాన్స్ఫార్మర్ అని. గ్రామంలో గిట్టని వారు కొందరు ట్రాన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వచ్చి పరిశీలించారు. వారి సూచన మేరకు కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీలు తీసి ఇవ్వగా త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. అది రాకపోతే పంట ఎండిపోతది. రెంటికీ చెడ్డ రేవడిలా మా పరిస్థితి తయారైంది. – నర్సింహులు, దాసరిపల్లి, మల్దకల్ మండలం తప్పని పరిస్థితుల్లోనే.. ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీలు కట్టి అధికారులకు దరఖాస్తు చేసుకున్నాం. ఆలస్యమవుతుందని పం టను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రైవేటు వ్యక్తులతో చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్ను రూ.25వేలకు కొనుగోలు చేశాను. రిపేరు, విద్యుత్ స్తంభాలు, ఇతర ఖర్చులకు మరో రూ.50వేల దాకా వెచ్చించాను. మరమ్మతు చేయించుకోవాలంటే కర్నూలుకు తీసుకుపోవాల్సి వస్తుంది. దీనినే రెగ్యులరైజ్ చేస్తామనడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నా. – చింత కిష్టన్న, అమరవాయి, మల్దకల్ మండలం -
డేంజర్ పవర్ !
►ప్రాణసంకటంగా విద్యుత్ లైన్లు ►మనుషులకే కాదు పశువులకూ ప్రమాద భరితం ►ఏళ్ల తరబడి మార్చని కండక్టర్లు ►కొత్త కండక్టర్ మార్చినట్లు కాగితాలకే పరిమితం ►పెచ్చుమీరుతున్న సిబ్బంది, అధికారుల అవినీతి ►సిబ్బంది కొరతతో అవస్థలు ►ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేకపోవటంతో భీతిల్లుతున్న ప్రజలు కాస్తంత గాలి వీచినా..చిన్నపాటి వర్షం కురిసినా నేలవాలే విద్యుత్ స్తంభాలు.. చేతికందే ఎత్తులో వేలాడే తీగలు.. పసిపిల్లలకు కూడా అందేంత ఎత్తులో ట్రాన్స్ఫార్మర్లు.. రక్షణ లేని ఫీజు కారియర్లు అడుగడుగునా మృత్యు పాశాలై ప్రజలకు ప్రాణసంకటాలుగా మారాయి. వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువ. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లపై సాక్షి నెట్వర్క్ కథనం. ఒంగోలు సబర్బన్: విద్యుత్ కనపడదు...అయితేనేమి సరఫరా ఉన్న తీగ తగిలితే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవాల్సిందే. విద్యుత్ వైర్లు రెండు తగిలినా...కొమ్మలు రాసుకున్నా...లేక వరిగడ్డిలాంటివి వైర్లకు తగిలినా అగ్గిరాజుకుంటుంది. విద్యుత్ సిబ్బంది, అధికారులకు విద్యుత్ ప్రభావం ఏంటో బాగా తెలుసు. కానీ అవినీతి రొచ్చులో పొర్లుతూ నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నా విద్యుత్ లైన్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో మనుషులకే కాదు మే నెలలోనే తరగుతులు ప్రారంభించి సెప్టెంబర్‌లోగా సిలబస్ పూర్తి చేస్తున్నాయి. ఆ తర్వాత మూడు, నాలుగు సార్లు తిరిగి బోధిస్తుంటారు. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం జూలై నెల పూర్తి కావస్తున్నా అధ్యాపకులు నియామకంపై ఉత్తర్వులు ఇవ్వలేదు. జూనియర్ కళాశాలలు తెరచి రెండు నెలలు పూర్తి కావస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు కాంట్రాక్టు అధ్యాపకుల సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం ఇటీవలే ఆ మూడు నెలల వేతనాన్ని విడుదల చేసింది. ఏప్రిల్‌లో విద్యా సంవత్సరం ముగిసిపోగా జూన్ వరకు ఎలాంటి వేతనాలు లేవు. ఆ సమయంలో అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ఉపాధి దొరక్క వారి కుటుంబాల ఆకలితో అలమటించాయి. జిల్లాలో 30 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో శాశ్వత ప్రాతిపదికన కేవలం 107 మంది అధ్యాపకులుండగా 241 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారు. అన్ని కళాశాలల్లో కలిపి సుమారు 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మద్దిపాడు జూనియర్ కళాశాలలో అందరూ రెగ్యులర్ అధ్యాపకులే ఉండగా అక్కడ విద్యార్థుల సంఖ్య మాత్రం నామమాత్రంగా ఉంది. అదే విధంగా దొనకొండ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మినహా మిగిలిన అధ్యాపకులందరూ కాంట్రాక్ట్ వారే. గతేడాది పని చేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు సాధారణంగానే ఈ ఏడాది కూడా కొనసాగేలా జూన్ మొదటి వారంలోనే బాండ్లు తీసుకుంటారు. కానీ జూలై ఆఖరికి కూడా రెన్యువల్ జీవో విడుదల కాలేదు. మొదటి నెల వేతనం ఇంకా వారి ఖాతాలో పడలేదు. ఉద్యోగ భద్రత లేక, కుటుంబ పోషణ భారమై ఆర్థికంగా, మానసికంగా ఆవేదన చెందుతున్నారు. జూన్ నెలలో తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ఫీజులు, పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించాలన్న నిబంధన అమలు కావడం లేదు. గతేడాది వరకు నెలకు రూ.18 వేలు వేతనం అమలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు రూ.37 వేలు వేతనం అందిస్తోంది. ఇతర ప్రయోజనాలనూ కల్పిస్తోంది. ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదని జూనియర్ లెక్చరర్ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చే వేతనం కూడా మూడు నెలలకొకసారి, ఆరు నెలలకొకసారి ఇస్తున్నారు. మహిళా అధ్యాపకులకు ప్రసూతి సెలవులు ఇవ్వకపోవడంతో జీతం లేని సెలవులు పెట్టుకోవాల్సి వస్తోంది. కుంటుపడుతున్న చదువులు ప్రభుత్వ కళాశాలల్లో ప్రధాన బోధకులు కాంట్రాక్ట్ అధ్యాపకులే కావడం, వారికి రెన్యువల్ ఉత్తర్వులు రాకపోవడంతో పర్యవేక్షణ గాడి తప్పింది. వీరికి బయోమెట్రిక్ హాజరు విధానం లేదు. వచ్చే నెల నుంచి అధ్యాపకులకు, పిల్లలకు బయోమెట్రిక్ విధానం వస్తుందని అధికారులు చెప్తున్నారు. రెన్యువల్ విషయంపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అధ్యాపకులు ఉంటారా.. ఉండరా అనే అనుమానం విద్యార్థుల్లో కూడా వ్యక్తమవుతోంది. రెన్యువల్ ఉత్తర్వులు రాకపోవడంతో బోధన కుంటుపడుతుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కుటుంబ పోషణ జరగని అధ్యాపకులు ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు గెస్ట్లుగా తరగతులు బోధించడం, ఇతరత్రా పనుల్లో ఉంటున్నారు. అంతిమంగా విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోకపోగా సమస్యలను కూడా తీర్చడం లేదు. -
పట్టణాలకు వెలుగులు
మెరుగైన విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు ఎన్పీడీసీఎల్ పరిధిలో రూ.200 కోట్లతో పనులు 33 నగరాలు, పట్టణాల్లో కొత్త సబ్స్టేషన్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లు కేంద్రం సాయంతో ప్రత్యేక ప్రాజెక్టు అమలు వరంగల్ : దేశంలోని ప్రతీ ఇంటికి మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం లక్ష్యంగా కేంద్రప్రభుత్వం సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు భారీగా మేలు జరగనుంది. ప్రతీ నగరం, పట్టణంలో అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా కోసం మెరుగైన ఏర్పాట్లను ఈ పథకం ద్వారా చేపడుతారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్రతీ కాలనీలో విద్యుత్ సరఫరా లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇలా కేంద్రప్రభుత్వ పథకం ద్వారా డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ప్రతీ ఇంటికి విద్యుత్ దేశంలోని ప్రతీ ఇంటికి విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ విద్యుదీకరణ ప్రాజెక్టును అమలు చేస్తోంది. నగరాలు, పట్టణాలు, పల్లెల్లోని ప్రతీ ఇంటికి కరెంట్ ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద చేపట్టే పనులకు 60 శాతం నిధులను కేంద్రం మంజూరు చేస్తోంది. మిగిలిన మొత్తాన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కం) భరించాల్సి ఉంటుంది. అయితే, విద్యుత్ పంపిణీ సంస్థలు భరించే మొత్తాన్ని రుణాల రూపంలో సమకూర్చుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ రుణాలను సమకూర్చుకుంటాయి. 17 జిల్లాలు.. 33 పట్టణాలు సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకం కింద తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగపరిచేందుకు పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు 17 జిల్లాల్లోని 33 పట్టణాల్లో ఈ పథకం అమలు కానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు పట్టణాల్లో ఈ పథకం పనులు చేపడుతారు. మొత్తం ప్రాజెక్టు కోసం రూ.200 కోట్లు ఖర్చవుతుందని ఎన్పీడీసీఎల్ ప్రణాళికలు రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.120 కోట్లు చెల్లిస్తుంది. ఎన్పీడీసీఎల్ మిగిలిన రూ.80 కోట్లను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణాల రూపంలో సమకూర్చుకోనుంది. కాగా, కొత్త ప్రాజెక్టు అమలులో భాగంగా వరంగల్ పట్టణంలో రెండు 33/11 కేవీ సబ్స్టేషన్లు కొత్తగా నిర్మించనున్నారు. ఇంకా మిగిలిన జిల్లాల్లోనూ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లతో పాటు కొత్త లైన్లను ఏర్పాటుచేస్తారు. -
ఏపీజెన్‌కోలో కాలిన ట్రాన్స్ఫార్మర్లు
ఒకే కన్వేయర్ నుంచి బొగ్గు రవాణా ట్రయల్ రన్ దశలో అవాంతరాలు ముత్తుకూరు: కృష్ణపట్నంపోర్టు నుంచి నేలటూరులోని ఏపీజెన్కో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌కు బొగ్గు రవాణా చేసే కన్వేయర్ బెల్టు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. దీనితో బొగ్గు రవాణా భారమంతా ఒక్క కన్వేయర్‌పై పడడంతో దీనికి తరచూ అంతరాయం ఏర్పడుతోంది. పోర్టు నుంచి బొగ్గును ఇటీవల వరకు టిప్పర్ల ద్వారా రవాణా జరిపారు. బొగ్గు తరలింపునకు రెండు కన్వేయర్ల నిర్మాణం పూర్తయితే, ట్రయల్ రన్ ప్రారంభించారు. ఒక్కొక్క కన్వేయర్ నుంచి గంటకు 1,300 టన్నుల బొగ్గు రవాణా జరుగుతుంది. ఈ విధంగా ప్రాజెక్ట్‌కు ఒక రోజుకు 15,000 టన్నుల బొగ్గు రవాణా జరగాలి. ఒక్కొక్క కన్వేయర్ బెల్టు మోటారు పనిచేసేందుకు రెండు ట్రాన్స్ఫార్మర్లు పనిచేయాలి. గుజరాత్ నుంచి తెచ్చిన వీటితో కన్వేయర్లను ట్రయల్‌రన్ జరుపుతున్నారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం ఒక కన్వేయర్‌కు సంబంధించి రెండు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. డిజైన్లలో లోపం వల్ల ఇవి కాలిపోయినట్టు నిపుణులు చెబుతున్నారు. దీంతో రెండో కన్వేయర్‌పై రవాణా ఒత్తిడి పెరగడంతో తరచూ సాంకేతిక లోపం ఏర్పడి, రవాణా నిలిచిపోతోంది. ఫలితంగా ప్రాజెక్టలో అవసరమైన మేరకు బొగ్గు నిల్వ చేయలేకపోతున్నారు. ఈ నెల 22 నాటికి ట్రాన్స్ఫార్మర్లు రాక: కాలిపోయిన కన్వేయర్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్త వాటిని అమర్చే ప్రక్రియ ప్రారంభమైనట్టు జెన్కో ఎస్ఈ దేవప్రసాద్ తెలిపారు. డిజైన్లలో మార్పు చేసి ఇప్పటికే ఒక ట్రాన్స్ఫార్మర్ రప్పించామన్నారు. రెండవది ఈ నెల 22వ తేదీనాటికి చేరుతుందన్నారు. వీటిని అమర్చడం పూర్తిచేసి, 25 తేదీకల్లా బొగ్గు రవాణా ప్రారంభిస్తామన్నారు. ట్రయల్ రన్ దశలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు బిల్లుల చెల్లింపులు ఉండవన్నారు. -
ఆ నిర్మాతలు రూ.2కోట్లు కట్టాల్సిందే!
బీజింగ్: హాలీవుడ్ మూవీ 'ట్రాన్స్ ఫార్మర్స్' నిర్మాతలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెనా సినీక్ ఏరియాకు చెందిన ఓ పార్కుకు ఆ మూవీ నిర్మాతలు దాదాపు మూడు లక్షల అమెరికా డాలర్లు పరిహారం చెల్లించనుంది. ఆ వివరాలిలా ఉన్నాయి. ట్రాన్స్ ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ ఎక్స్ టింక్షన్' మూవీలో కొన్ని సీన్లను చైనా ఉలుంగ్ సినిక్ ఏరియా, ఆ దేశ పర్యాటక ప్రాంతంలో చిత్రీకరించారు. ఇందుకు గానూ మొదట ఆ మూవీ యూనిట్ పర్మిషన్ తీసుకుంది. ఆ టూరిస్ట్ ప్లేస్ లోగో కచ్చితంగా మూవీలో చూపించాలని ఒప్పందం చేసుకున్నారు. విడుదలైన ఈ మూవీలో పర్యాటక ప్రాంతం సీన్లున్నాయి. కానీ ఆ ఫారెస్ట్ లోగో కనిపించలేదు. దీంతో చైనాలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీకి సంబంధించిన కొన్ని సీన్లపై చైనా అభ్యంతరం చెప్పింది. మూవీలో లోగో చూపించలేదని ఒప్పందాన్ని ఉల్లంఘించరాని చైనా వారు 2014లో దావా వేశారు. 20 మిలియన్లకు పైగా చెనీస్ యువాన్లను పరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు. ఈ కేసు తీర్పు వెలువడిందని, ఆ మూవీ నిర్మాతలు చైనా పార్కుకు, సంబంధిత పర్యాటకశాఖకు 3 లక్షల డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.2కోట్లు) చెల్లించాలని తుదితీర్పు వచ్చింది. మరోవైపు ట్రాన్స్ ఫార్మర్స్ మూవీ ఐదో పార్ట్ వచ్చే విడుదల చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధంగా ఉంది. -
పచ్చదనం మాటున ప్రమాదం
పచ్చదనం మాటున ప్రమాదం దాగి ఉంది. పై చిత్రాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఎలాంటి రక్షణ కంచెలు లేకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. ఈ దృశ్యాలు చెన్నూర్ మండలంలోని సుద్దాల, బావురావుపేటలో కనిపించినవి. ఇలాంటి పరిస్థితులు మండలంలోని కిష్టంపేట, బావురావుపేట, లింగంపల్లి, దుగ్నెపల్లి, సుద్దాల, కమ్మరిపల్లి తదితర గ్రామాల్లో అనేకం ఉన్నాయి. పంట పొలాల్లో, ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు ఎటువంటి రక్షణ కంచెలు లేకుండా ప్రమాదకరంగా ఉన్నాయి. అసలే వర్షాకాలం వాటి చుట్టూ పిచ్చి మొక్కలు మరింత ప్రమాదకరంగా మారాయి. ఎటువంటి ప్రమాదాలు సంభవించక ముందే అధికారులు పట్టించుకొని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు కోరుతున్నారు. – చెన్నూర్‌రూరల్ -
ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందన్నట్లు..
లండన్: ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందనే సామెత ఈ కుక్కకు అతికినట్లు సరిపోతుంది. బ్రిటన్ కు చెందిన ఫ్రేయా అనే కుక్కకు హాలీవుడ్ లో ‘న్యూ ట్రాన్స్ ఫార్మర్స్’ అనే చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఈ కుక్క 6 సంవత్సరాల నుంచి ఒక జంతువుల షెడ్డులో ఉంటోంది. ఫ్రేయాను పెంచుకోవడానికి 18,000 మంది నిరాకరించారు. న్యూ ట్రాన్స్ ఫార్మర్స్ చిత్ర దర్శకుడు మైఖేల్ బే మాట్లాడుతూ.. ఫ్రేయా ఈ చిత్ర సంపాదనతో జంతువుల షెడ్డులో జీవితాంతం జీవించగలిగే డబ్బు సంపాదిస్తుంది. ఈ పాత్రలో నటించిన తర్వాత ఆ కుక్క తిరిగి తన ఇంటిని గుర్తించకపోతే, తన దగ్గరే పెంచుకుంటానని ఆయన తెలిపారు. మైఖేల్ బే ద్వారా ఫ్రేయా ఫేస్‌బుక్‌లోనూ దర్శనమిచ్చింది. ఫ్రేయా తిరిగి తన నివాసానికి చేరుకుంటుందని ఫ్రెష్ఫీల్డ్స్ యానిమల్ రెస్క్యూ సెంటర్ సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రేయా అందమైన కుక్కే కాక మంచి విశ్వాసం కలదని ఆ కుక్క నివసిస్తున్న షెల్టర్ ఫండ్రైజర్ తెలిపారు. -
కరెంటు తీగలు కరిగిపోతున్నాయ్..
సాక్షి, సిటీబ్యూరో: ఏసీలో కూర్చుంటే ఎవరికైనా వెన్నులో వణుకుపుట్టాలి. కానీ రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్ చూస్తే విద్యుత్ అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. మహానగరం రోజురోజుకు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో తట్టుకోలేక తల్లడిల్లిపోతోంది. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా రెట్టింపైంది. విద్యుత్ పంపిణీ సంస్థ చరిత్రలో అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్ ఐదో తేదీన 54.74 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఏడాది మే 26న రికార్డుస్థాయిలో 53.2 మిలియన్ యూ నిట్ల విద్యుత్ వినియోగం జరుగగా, ఈ ఏడాది నెల రోజుల ముందే రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇది 58 ఎంయూలు దాటే అవకాశం ఉన్నట్లు ఓ అంచనా. ఉడుకుతున్న కేబుళ్లు.. కరుగుతున్న తీగలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 32.5 లక్షలు గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు మరో 40 వేలకుపైగా ఉన్నాయి. వీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైన కరెంట్ ఉన్నా పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఒక్కసారిగా వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో ట్రాన్స్ఫార్మర్లపై భారం పెరుగుతోంది. సూర్యుని వేడికి డిస్ట్రిబ్యూషన్ వైర్లు కరిగి సాగుతున్నాయి. భూగర్భ కేబుళ్లు వేడికి ఉడికిపోయి జాయింట్స్ వద్ద కాలిపో తున్నాయి. ఇలా ప్రతి రోజూ రెండు మూడు ఫీడర్ల పరిధిలో ఈ సమస్య తలెత్తుతోంది. ఇదిలా ఉంటే ఆయిల్ లీకేజీలకు తోడు ఓవర్ లోడు వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటి స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ అమర్చి విద్యుత్ పునరుద్ధరించడం లో తీవ్ర జాప్య ం జరుగుతోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు అత్యవసర లోడ్ రిలీఫ్‌ల పేరుతో కోతలు అమలు చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. -
మాకు ముందే తెలుసు
శ్రీనివాసరెడ్డి, డెరైక్టర్, ఆపరేషన్స్, టీఎస్ఎస్పీడీసీఎల్ వేసవి డిమాండ్‌పై ముందే ఓ అంచనాకు వచ్చాం. ఇప్పటికే లైన్స్‌ను పునరుద్ధరించాం. పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశాం. రూ.240 కోట్లు ఖర్చు చేసిమెరుగైన సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేశాం. ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మినహా కోతలు అమలు చేయడం లేదు. విద్యుత్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
కలెక్టర్ గారూ.. ఆలకించరూ..
ఆయన దత్తత గ్రామానికీ తప్పని కరెంటు కష్టాలు దానవారుుపేటలో లోడెక్కువై పాడవుతున్న ట్రాన్స్ఫార్మర్లు తొండంగి : కలెక్టర్ దత్తత తీసుకున్న దానవాయిపేట గ్రామానికి కరెంటు ఇక్కట్లు తప్పలేదు. తీరప్రాంత గ్రామమైన దానవాయిపేట పంచాయతీలో నర్సిపేట, తాటియాకులపాలెం, ఒంటిమామిడి, కొత్తపాకల గ్రామాలున్నాయి. కలిసి ఉండే దానవాయిపేట, నర్సిపేట, తాటియాకులపాలెం గ్రామాల్లో 4 వేల వరకూ జనాభా ఉంది. ఆయా గ్రామాల్లో 800 వరకూ ఇళ్లున్నాయి. ఓవర్‌లోడ్ విద్యుత్ సమస్య తలెత్తకుండా పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. తీరప్రాంతంలో హెచరీలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌కు డిమాండ్ ఏర్పడింది. విద్యుత్ కనెక్షన్లు అధికంగా ఉండటంతో, లోడు ఎక్కువై తరచూ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్నాయి. మూడేళ్ల క్రితం పలుచోట్ల కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. మళ్లీ అదే సమస్య పునరావృతం కావడంతో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యను ట్రాన్సకో ఉన్నతాధికారులకు నివేదించామని సర్పంచ్ చొక్కా హరిబాబు తెలిపారు. రామాలయం వెళ్లే మార్గంలోనూ, హైస్కూలు వద్ద తదితర ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్లు సక్రమంగా పనిచేయడం లేదు. టెన్త్ విద్యార్థులకూ ఇబ్బందులు విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టాన్స్‌ఫార్మర్లు మొరాయిస్తుండడంతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. రాత్రివేళ కారుచీకట్లో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ అస్తమాను పోతుంది హైస్కూలు వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నిత్యం మరమ్మతులకు గురవుతోంది. దీనిని బాగు చేసేందుకు అన్ని వేళల్లో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. దీంతో కరెంటు సక్రమంగా ఉండటం లేదు. - సిరిపిన హరిబాబు, గ్రామస్తుడు, దానవాయిపేట కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నాం రాత్రి, పగలు తేడాలేకుండా ఎక్కువ సార్లు కరెంటు పోతోంది. ఎండవేడి కారణంగా ఇంట్లోనూ కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నాం. విద్యుత్ సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలి. - సీహెచ్ చిలకమ్మ, గ్రామస్తురాలు, దానవాయిపేట విద్యార్థులకూ ఇబ్బందులు గ్రామంలో విద్యుత్ సమస్యతో పదో తరగతి, ఇతర పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రాత్రి సమయాల్లో చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మరిన్ని ట్రాన్స్ఫార్మర్లు వేసి, సమస్యను పరిష్కరించాలి. - యజ్జల మాంబుల్లోడు, గ్రామపెద్ద, దానవాయిపేట చర్యలు తీసుకుంటున్నాం గ్రామంలో విద్యుత్ సరఫరా సమస్య మా దృష్టికి వచ్చింది. అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - శ్రీనివాసమూర్తి, ఎలక్ట్రికల్ ఏఈ, తొండంగి మండలం