కాటేస్తున్న తీగలు | lot of farmers dying due to electrcic wires | Sakshi
Sakshi News home page

కాటేస్తున్న తీగలు

Published Sun, Sep 15 2013 12:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

lot of farmers dying  due to electrcic wires


 మెదక్, న్యూస్‌లైన్:
 కరెంట్ తీగలు అమాయకుల పాలిట మృత్యు పాశాలవుతున్నాయి. కరెంటోళ్ల నిర్లక్ష ్యం కారణంగా  రైతులు బలి అవుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ సరిగా లేక, శిథిలమైన విద్యుత్ స్తంభాలు, కాలం చెల్లిన కరెంట్ తీగలు, నేలను తాకే వైర్లు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ సేవలందిస్తున్నామంటూ కస్టమర్ సర్వీస్ చార్జి వసూలు చేసే ట్రాన్స్‌కో యంత్రాంగం అటువైపు తొంగి చూడకపోవడం గమనార్హం. విద్యుత్ సరఫరాలో లోపాలు ఏర్పడినప్పుడు నైపుణ్యం లేకపోయినా రైతులు, వినియోగదారులే సొంతంగా మరమ్మతులు చేసుకుంటున్నారు. ఈ దశలో మృత్యువాత పడుతున్నారు.
 
 పలు సంఘటనలు ఇలా..
 ఈనెల 12న ఒక్కరోజే మెదక్ మండలంలో ముగ్గురు రైతులు కరెంట్ కాటుకు బలి అయిన విషయం తెల్సిం దే. అయితే కొన్ని సంఘటనల్లో వినియోగదారుల నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు కారణమనే చెప్పాలి. మెదక్ మండలం జానకంపల్లిలో వంజరి శకుంతల, నాగాపూర్‌లో రామకిష్టయ్య పొలం ఒడ్డున గడ్డి కోసే క్రమంలో కేబుల్ వైర్‌ను కోయడంతో షాక్ గురై మృత్యువాత పడ్డారు. అదే రోజు ఇదే మండలంలోని హవేళిఘణాపూర్ పరిధిలోని చెరువు ముందటి తండా కు చెందిన రైతు బక్షి ట్రాన్స్‌ఫార్మర్ ఆఫ్ చేసే క్రమంలో విద్యుత్‌షాక్ గురై మృతి చెందాడు. పాపన్నపేట మండలం శానాయిపల్లిలో ఈనెల 8న ఏసయ్య అనే యువరైతు ఏ-బీ స్విచ్ బంద్ చేసే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు.
 
 పాపన్నపేట మండలం కొడుపాక గ్రామంలో గత జూలై నెలలో ప్రతాప్ అనే రైతు స్టార్టర్ డబ్బాకు వి ద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. గతంలో గాజులగూడెం గ్రామానికి చెందిన పుట్టల విఠల్, చిత్రియాల్‌కు చెందిన యాదమ్మ అనే మహిళ విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడ్డారు. కొడుపాక గ్రామంలో విద్యుత్ స్తంభం విరిగిపడి కర్రె నరేశ్ అనే విద్యార్థి మొకాలి వరకు తెగిపోయింది. రెండేళ్ల క్రితం నార్సింగి గ్రామంలో వీధిలోని అన్ని ఇళ్లకు షాక్ రావడంతో బోన్ల సత్తమ్మ అనే మహిళ ప్రాణాలు విడిచింది. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన లింగం అనే రైతు గత ఆగస్టు 30న తన ఇంటి ముందు పనిచేస్తున్న క్రమంలో విద్యుత్ వైర్ తెగిపడడంతో పాడిగేదెతోపాటు కన్నుమూశాడు. అంతకుముందు ఇదే గ్రామంలో లంబాడి దత్తు, మాలే రాములు అనే రైతులు విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. ఇలా ప్రతి మండలంలో విద్యుత్‌షాక్ గురై మరణిస్తున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ప్రమాద బాధితులకు ఆశించిన స్థాయిలో పరిహారాలు అందడం లేదన్న ఆరోపణలున్నాయి.
 
 అధికారుల నిర్లక్ష ్యమే కారణం..
 విద్యుత్ ప్రమాదాల్లో కొంతవరకు వినియోగదారుల పాత్ర కనిపిస్తున్నా చాలావరకు ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష ్యమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. విద్యుత్ సేవల్లో ఎలాంటి అంతరాయాలు ఏర్పడినా ట్రాన్స్‌కో సిబ్బంది మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సర్వీస్ చార్జి పేరిట డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. కానీ గ్రామాల్లో విద్యుత్ సిబ్బంది పత్తా లేకపోవడంతో రైతులే తెలిసీ తెలియని పరిజ్ఞానంతో పనులు చేసుకుంటూ ప్రమాదాలకు లోనై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
 
 కట్టెలే స్తంభాలుగా..
 వ్యవసాయ బోరుకు కొత్త కనెక్షన్ ఇవ్వాలంటే అందుకు అవసరమైన విద్యుత్ స్తంభాలను, సామగ్రిని ట్రాన్స్‌కో అధికారులే పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ స్తంభాలు ఇవ్వకపోవడంతో రైతులు కట్టెల ఆధారంగానే వైర్లు లాగుతున్నారు. గాలి దుమారం, భారీ వర్షాల కారణంగా ఆ కట్టెలు నేలకొరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కనీసం 50 నుంచి 60 మీటర్ల దూరానికో స్తంభం ఉండాలి. కానీ అలా ఏర్పాటు చేయకపోవడంతో ఒక్కో చోట వైర్లు మనిషిని తాకే ఎత్తులో వేలాడుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ నిర్వహణ కూడా సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు చోట్ల విద్యుత్ వైర్లను చెట్ల కొమ్మలు తాకుతుండటం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement