ఎన్నాళ్లీ కారు చీకట్లు?
నరసన్నపేట:పెను తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ అతలాకుతలమై నాలుగు రోజులు గడిచినా జిల్లా ఇంకా అంధకారంలోనే ఉంది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుందో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పాత రోజులను గుర్తుకుతెచ్చుకుంటూ హాహాకారాలు చేస్తున్నారు. నరసన్నపేట నియోకవర్గంతో పాటు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొనడంతో విద్యుత్ కసం ప్రత్యామ్నాయాలపై ప్రజలు దృష్టిసారించారు. ఇన్వర్టర్లు కూడా చార్జింగ్ అయిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బహుళ అంతస్తుల్లో ఉన్న, అవకాశం ఉన్న వారు జనరేటర్లు ఏర్పాటు చేసుకుని తాత్కాలికంగా ఉపసమనం పొందుతున్నారు. అయితే ఎక్కువగా వీటిని నీటిని తోడడానికే వినియోగిస్తున్నారు. ఒక్కసారిగా జనరేటర్లకు గిరాకీ పెరగడంతో రోజు అద్దె రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో నేలకూలిన విద్యుత్ స్తంభాలను నిలబెట్టే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇంటర్‌నెట్, ఆన్‌లైన్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. బ్యాంకుల్లో పాత పద్ధతిలోనే పనిచేస్తున్నాయి.
కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు
ఆమదాలవలస: నేల కూలిన విద్యుత్ స్తంభాలను సరిచేసే పని కొనసాగుతోంది. నియోజకవర్గం పరిధిలో సుమారు 800 విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు అధికారులు అంచనా వేశారు. నిరంతరాయంగా పనులు చేస్తున్నా ఇంకా పూర్తికావడంలేదు. వీలయినంత త్వరలోనే పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ముమ్మరంగా విద్యుత్ పనులు
వీరఘట్టం: విద్యుత్ పునరుద్ధరణ పనులు మండలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలో 80 విద్యుత్ స్తంభాలు, 16 ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. వీటిని సరిచేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పాలకొండ-వీరఘట్టం 33/11 కేవీ ప్రధాన లైను బాగు చేయడం పూర్తయింది. రెండు రోజుల్లోగా అన్ని గ్రామాల్లో స్తంభాలు సరిచేస్తామని ఏఈ కృష్ణారావు చెప్పారు.
ఏజెన్సీలో పునరుద్ధరణకు అష్టకష్టాలు
సీతంపేట: ఏజెన్సీలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను సరిచేసి విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం కిరప, సోమగండి, గొయిది పంచాయతీల పరిధిలోని స్తంభాలు సరిచేసే పనిలో సిబ్బంది ఉన్నారు. అన్ని గ్రామాల్లో పనులు పూర్తి చేయడానికి మూడు రోజులు పడుతుందని తెలిపారు.
మరో రెండు రోజులు అంధకారమే!
పాలకొండ: మరో రెండు రోజులు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావంతో పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 32, గ్రామీణ ప్రాంతాల్లో 23 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 8 ట్రాన్స్‌ఫార్మర్లు కుప్పకూలాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరో రెండు రోజులు పడుతుందని ట్రాన్స్‌కో ఏఈ కె.హరికృష్ణ తెలిపారు. నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని రప్పించి మరమ్మతులు చేయిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్డీవో సాల్మన్ రాజు చెప్పారు. ఫోన్లు మూగబోవడం, సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో ఎప్పటికప్పుడు నష్టాల సమాచారం అందడం లేదని అన్నారు.
భామినిలోనూ విద్యుత్ కష్టాలు
భామిని: మండలంలో కరెంట్ కష్టాలు కొనసాగుతున్నాయి. నేల కూలిన విద్యుత్ స్తంభాలను నిలబెట్టడానికి ట్రాన్స్‌కో సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. సీతంపేట నుంచి విద్యుత్ సరఫరా అయ్యేలా చూసే పనిలో ఏఈఈ ఒ.భీమరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.