సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు స్పష్టం చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని ఈఆర్సీ ఆదేశించిందని పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించిన లెక్కలను కచ్చితంగా తెలుసుకోవడానికి రానున్న రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్‌ఫార్మర్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగించాలని ఆదేశించామన్నారు.
ఈఆర్సీ సభ్యులు ఎండీ మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్యతో కలసి సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి రఘునందన్‌రావు ఆరోపణలను ఖండించారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు బిగించాలని జారీ చేసిన ఆదేశాలను రఘునందన్‌రావుకు పంపానని, అయినా మళ్లీ అవే ఆరోపణలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టబద్ధ సంస్థ ఈఆర్సీకి దురుద్దేశాలను ఆపాదించడం సరికాదన్నారు.
మహారాష్ట్రలోని ఒక విద్యుత్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించి కచ్చితమైన వినియోగంపై అధ్యయనం చేశారని, రూ.36 కోట్ల విద్యుత్ సబ్సిడీలను డిస్కంలు అదనంగా పొందాయని ఈ అధ్యయనంలో తేలిందన్నారు. తెలంగాణ సైతం ఇలాంటి ప్రయోగం చేయాలన్న ఆలోచన ఉందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
త్వరలో జిల్లాలకు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్
విద్యుత్ వినియోగదారులకు హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కల్పించడంతోపాటు వారి సమస్యలను తెలుసుకోవడానికి విద్యుత్ రెగ్యులేటరీ కమి షన్ అన్ని జిల్లాల్లో పర్యటించనుందని శ్రీరంగారావు వెల్లడించారు. ఈ నెల 19న ఉదయం కామారెడ్డి జిల్లాలో, మధ్యాహ్నం మెదక్ జిల్లాలోని పలువురు వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనుందన్నారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను మొబైల్ యాప్ ద్వారా కన్జ్యూమర్ గ్రివెన్స్ రిడ్రస్సల్ ఫోరంకు పంపవచ్చని, అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా ఈఆర్సీని ఆశ్రయించవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment