సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్న పరిశ్రమలపై రామోజీరావు విషం చిమ్ముతున్నారు. తప్పుడు లెక్కలు వేసి.. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిపోతోందంటూ ప్రజలను మభ్య పెట్టడానికి మరోసారి విశ్వప్రయత్నం చేశారు. ఆసియాలోనే ప్రముఖ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ కంపెనీ ఇండోసోల్‌పై ‘రూ. 47,809 కోట్లు దోచి పెడుతున్నారు’ అంటూ సోమవారం మరోసారి ఈనాడులో తప్పుడు రాతలు రాశారు.
పరిశ్రమలన్నిటికీ రాయితీలు ఒకేలా వర్తిస్తాయని, ఒక్కో కంపెనీకి ఒక్కోలా ఉండవని తెలిసి కూడా అవాస్తవ కథనాన్ని ప్రచురించారు. వాస్తవానికి రాష్ట్రంలో దాదాపు రూ. 59,958 కోట్ల పెట్టుబడులను ఇండోసోల్ పెడుతోంది. తద్వారా ప్రత్యక్షంగా 12వేల మందికి, పరోక్షంగా 20వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా రాసిన ఆ కథనంలో ఉన్నవన్నీ అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వితేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు తెలిపారు. సీఎండీలు వెల్లడించిన అసలు నిజాలు ఇలా ఉన్నాయి.
రెట్టించిన అబద్ధాలు
ఈనాడు తన కథనంలో చెప్పినట్టుగా పరిశ్రమల రంగంలో గరిష్ట డిమాండ్ చార్జీలు కలిపి సగటున యూనిట్‌కు రూ. 12గా విద్యుత్ పంపిణీ సంస్థలు వసూలు చేస్తున్నాయనడం పూర్తిగా అబద్ధం. 11కేవీ స్థాయిలో ఎనర్జీ ఇంటెన్సివ్ పరిశ్రమలకు సరాసరి విద్యుత్ చార్జీ యూనిట్ రూ. 6.50 కాగా, ప్రస్తుతం విధిస్తున్న ఇంధన సర్దుబాటు చార్జీలు దీనికి అదనం. ఈ ఇంధన సర్దుబాటు చార్జీలు నిరంతరం ఉండవు. గడువు అయిపోగానే ఆగిపోతాయి. ప్రస్తుతం ఈ కేటగిరీలో ఫెర్రోఅల్లాయ్ పరిశ్రమలు, ఫొటో ఓల్టాయిస్(పీవీ) ఇంగోట్–సెల్ తయారీ పరిశ్రమలు, పోలీ సిలికాన్ పరిశ్రమలు, అల్యూమినియం పరిశ్రమలు ఉన్నాయి.
లో టెన్షన్‌లో ఆ కేటగిరీయే లేదు
ఇండోసోల్ పరిశ్రమ సమర్పించిన ప్రాజెక్టు వివరాల ప్రకారం అది అత్యధిక పరిమాణంలో విద్యుత్ వినియోగించే పరిశ్రమ. ఇప్పుడు అమలులో ఉన్న అత్యధిక వోల్టేజీ స్థాయి 220 కేవీ కన్నా ఎక్కువగా 400 కేవీ స్థాయిలో విద్యుత్ వినియోగం జరగబోతోంది. అయినా గ్రిడ్‌పై ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా స్థిరంగా ఉండగలదు. దానితో ఇది దృఢమైన గ్రిడ్ నిర్వహణకు దోహద పడుతుంది.
అయితే ఇప్పుడు 400 కేవీ విద్యుత్ వినియోగ స్థాయి అనేది రిటైల్ టారిఫ్ ధరలలో లేకపోవడం వల్ల దీని కోసం ప్రత్యేకంగా ఒక ఉప కేటగిరీని ప్రతిపాదించారు. లో టెన్షన్(ఎల్‌టీ) స్థాయిలో అసలు ఎనర్జీ ఇంటెన్సివ్ పరిశ్రమ అనే ఉప కేటగిరీ లేనే లేదు. ఎనర్జీ ఇంటెన్సివ్ పరిశ్రమలు అంటేనే అవి అధిక పరిమాణంలో విద్యుత్ వాడే పరిశ్రమలని అర్థం. అవి కేవలం హెచ్‌టీ కేటగిరీలోనే ఉంటాయి.
అర్హతను బట్టే ప్రోత్సాహకాలు
ఆత్మనిర్భర్ భారత్ (మేక్ ఇన్ ఇండియా)లో భాగంగా, ఎండ్–టు–ఎండ్ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ సంస్థలను ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్‌ఐ)పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ, నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) చేపట్టిన బిడ్డింగ్ ద్వారా ఈ పధకానికి ఇండోసోల్ అర్హత సాధించింది.
దాని ద్వారా ఈ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ) రూ. 1,875 కోట్ల ప్రోత్సాహకానికి అనుమతి ఇచ్చింది. వాస్తవంగా ఈ రాయితీలు ఏ ఒక్కరికో పరిమితం కాదు. ఈ కేటగిరీలో ఎవరు వచ్చినా వాటికి ఇవే రాయితీలు వర్తిస్తాయి. పాలసీ అన్నది అన్ని పరిశ్రమలకు ఒకేలా వర్తిస్తాయిగానీ, ఒక్కో కంపెనీకి ఒక్కోలా వర్తించవు. ఈ విషయం తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ఈనాడు దినపత్రిక తప్పుడు రాతలు రాస్తోంది.
చట్టం కాకుండానే ఏడుపా
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ అధిక విద్యుత్ వాడే పరిశ్రమకు తొలి ఏడేళ్లు యూనిట్‌కు రూ.4.0గాను, ఎనిమిదో ఏట నుంచి రూ.4.50 గాను ప్రతిపాదించడం జరిగింది. ఈ పరిశ్రమకు 220 కేవీ స్థాయిలో ప్రస్తుత టారిఫ్ యూనిట్ రూ 4.90గా ఉంది. ఈ టారిఫ్ ప్రతిపాదనలు ప్రస్తుతం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) పరిశీలనలో ఉన్నాయి.
వీటిపై వచ్చే ఏడాది జనవరి 29 నుంచి 31 వరకు ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ నిర్వహిస్తామని ఇప్పటికే నోటిఫికేషన్ ద్వారా ఏపీఈఆర్‌సీ వెల్లడించింది. అంటే ఈ ప్రత్యేక విద్యుత్ కేటగిరికి టారిఫ్ చట్ట పరంగా ఇంకా నిర్ధారణ కాలేదు. ఇంతలోనే ఎంతో నష్టం జరుగుతోందంటూ ఈనాడు ఏదేదో ఊహించేసుకుని ఏడుపుగొట్టు కథనాన్ని అచ్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment