FACT CHECK: బడుగులను ఏవగించుకునే బాబు రామోజీకి గొప్పోడు! | FACT CHECK: Ramoji Rao Eenadu Fake News on AP Welfare of SC and ST | Sakshi
Sakshi News home page

FactCheck: బడుగులను ఏవగించుకునే బాబు రామోజీకి గొప్పోడు!

Published Thu, Apr 25 2024 6:47 PM | Last Updated on Thu, Apr 25 2024 6:47 PM

Ramoji Rao Eenadu Fake News on AP Welfare of SC and ST - Sakshi

దళిత, గిరిజనులకు ధోకా ఇచ్చిందే చంద్రబాబు

ఎస్సీ, ఎస్టీలకు దన్నుగా నిలిచింది సీఎం వైఎస్‌ జగన్‌

ఈ అయిదేళ్లలోనే వీరికి స్వయం ఉపాధి అండ

ఈ ప్రభుత్వంలోనే ఈ వర్గాలకు విద్యా, ఉపాధి అవకాశాలు

సంక్షేమంలో దేశానికే రాష్ట్రం ఆదర్శం

ఇంట్రో... మంచి మనిషికో మాట...మంచి గొడ్డుకో దెబ్బ ...అంటారు...రామోజీ దుర్మార్గపు రాతలపై ఎన్నిసార్లు వాస్తవాల హంటర్‌ ఝళిపించినా బజారుస్థాయి రాతలతో పత్రికను ఆసాంతం దిగజార్చుకుంటూనే పోతున్నారు...జగన్‌ ప్రభుత్వ వ్యతిరేకత అనే పూనకంలో కన్నూమిన్నూగాననంతగా తప్పుడు కథనాలను అచ్చేస్తున్నారు...విచక్షణాయుత పాత్రికేయానికి మంగళం పాడేసి దుష్ట పాత్రికేయం అంటే ఎలా ఉంటుందో పాఠకలోకానికి తన రాతల్లో చూపిస్తున్నారు...అన్నీ ఏకపక్ష కథనాలు... పవిత్ర పాత్రికేయ వస్త్రాన్ని తొలగించుకుని అక్షర దిగంబర నృత్యం చేస్తున్నట్లుగా ఉంది రామోజీ తీరు...

ఈ కథనాలు ఎవరు చదివినా చదవకపోయినా బాబొక్కడు చదివితే చాలు తన జన్మ ధన్యమైపోతుందన్న మూర్ఖత్వంలో బొంకుల దిబ్బపై కూర్చుని బొంకుడు కథనాలను రాస్తున్నట్లుగా ఉంది...బడుగులను ఏవగించుకున్న బాబు రామోజీ దృష్టిలో గొప్పోడు..అయిదేళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ లకు అన్ని రంగాల్లోనూ అగ్రాసనం వేసిన జగన్‌ అంటే మంట...మంచి చేసిన జగన్‌ కన్నా జనాన్ని ముంచే బాబే రామోజీకి ఆదర్శం..ఈ వికృతధోరణిని నిలువెల్లా ఒంటబట్టించుకుని మంగళవారం ’నా..నా...నా..అని బాకా...చేసిందంతా ధోకా’ శీర్షికన జగన్‌ ప్రభుత్వంపై రాళ్లేస్తూ...ఓ తప్పుడు కథనాన్ని జనంపైకి వదిలారు...రామోజీ బుర్ర తక్కువ రాతలకు వాస్తవాల షాక్‌ ఇచ్చే సమాధానాలివి...

సాక్షి, అమరావతిః చంద్రబాబుకు పదవీ ప్రయోజనం కోసం రామోజీ అబద్ధాల డోలు వాయించడం మానడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ధోకా ఇచ్చింది చంద్రబాబేనని తెలిసినా రామోజీ దుర్మార్గ రాతల ధోరణి మాత్రం మారడంలేదు. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నవరత్నాలతో వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వడంలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపింది. ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధితో పాటు అనేక విధాలుగా ఆదుకోవడంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పెద్ద మనస్సును చాటుకుంది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలను రద్దు చేశారని, ఉపాధి అవకాశాలను దెబ్బతీశారనే తప్పుడు ప్రచారానికి ఈనాడు బరితెగించింది.

పేదల అసైన్డ్‌ భూములను రాబందులా ఆక్రమించి ఫిలిం సిటీ కోట కట్టుకున్న రామోజీ నీతులు వల్లిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు దళితులను భయపెట్టి భూములను కాజేసినా రామోజీ కళ్లప్పగించి చూశారు. వ్యవసాయ భూమి ఉన్న దళితులకు కనీసం మోటారు కనెక్షను అయినా ఇవ్వకపోయినా అది తప్పని ఏ రోజూ బాబుకు బుద్ధి చెప్పలేదు. ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల పేరుతో బాబు అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టినా, ఎస్సీలకు దక్కాల్సిన కార్లు బినామీల పేరుతో టీడీపీ నేతలు దక్కించుకున్నా, ఈ ఎల్లో మీడియా పెద్దకు అక్షరం రాసేందుకు మనసొప్పలేదు.

రామోజీ చేసిన ఆరోపణలు ఎంత నీచమైనవో చెప్పే వాస్తవాలివి... ఆరోపణః కొత్త వైద్య కళాశాలల్లో రిజర్వేషన్ల కోత వాస్తవంః కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కొత్తగా ఎంబీబీఎస్‌ సీట్లను సీఎం వైఎస్‌ జగన్‌ సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో 5 వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో ఒక్కసారిగా 319 కన్వీనర్‌ కోటా సీట్లు పెరిగాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే సీట్లు దక్కించుకుని లబ్ధిపొందారు. మీ బాబు అధికారంలో ఉండగా ఏనాడైనా ఈ విధంగా అట్టడుగు వర్గాల పిల్లలకు మెడికల్‌ సీట్లను తెచ్చిపెట్టి మేలు చేశాడా రామోజీ? ఆరోపణః అవన్నీ సంక్షోభ వసతి గృహాలు వాస్తవంః సంక్షోభంలో వసతి గృహాలు అంటూ ఈనాడు మరో వక్రీకరణకు దిగింది.

వైఎస్సార్‌సీపీ ‍ప్రభుత్వం వచ్చాకే సోషల్‌ వెల్ఫేర్‌ స్కూళ్ల మరమ్మతుల కోసం ఇప్పటికే రూ. 64.33 కోట్లు ఖర్చు చేసింది. 39 సివిల్‌ వర్కుల కోసం మరో రూ.133.90 కోట్ల మొత్తాన్నీ వెచ్చించింది. ఈ భవనాలన్నీ నిర్వహణలోకి వచ్చాయి. దాదాపు రూ.318 కోట్లతో 177 స్కూళ్లలో నాడు–నేడు పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది, వసతి గృహాలను ఆధునికీకరించి మౌలిక వసతులు కల్పించింది. ఆరోపణః సివిల్స్‌లో శిక్షణకు విముఖత, పోటీలో నిలవకుండా కుట్ర వాస్తవంః నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ సర్వాంగ సుందరంగా మారుతున్నాయి.

పోటీ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్‌ స్టడీ సర్కిల్‌ కోచింగ్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతుల్లో స్టడీ సర్కిళ్లున్నాయి. ఒక్కో స్డడీ సర్కిల్‌లో ఒక్కో మాదిరిగా సివిల్స్‌, గ్రూప్స్‌, బ్యాంక్‌ టెస్ట్‌లకు శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వం విద్యోన్నతి పథకం కింద 9,775 మంది అభ్యర్థులను శిక్షణ కోసం ప్రైవేట్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్లకు పంపగా , ఒక అభ్యర్థి మాత్రమే ఎంపికైనా రామోజీ ఏరోజూ రాయలేదు. ఆ పథకాన్ని సవరించి సివిల్స్‌ సర్వీస్‌ పరీక్షకు ఏపీ స్టడీ సర్కిళ్లలోనే ఇప్పుడు కోచింగ్‌ ఇస్తున్నారు. ఇటీవలే జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. మెయిన్స్‌కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించి అందిస్తోంది.

పేద పిల్లలు ఉన్నత స్థానాలకు పోటీ పడి ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు అమెరికా వంటి సంపన్నదేశాలకు వెళ్లేందుకు ఊతమిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌పై రామోజీ విషం కక్కుతున్నారు. ఆరోపణః విదేశీ విద్యకు కొర్రీలు వాస్తవంః గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యా పథకంలో జరిగిన లోపాలు, అవినీతి, అక్రమాలు విజిలెన్స్‌ విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి లోపాలు, అక్రమాలకు తావులేని విధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తెచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించేలా పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తోంది.

అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్లు, ట్యూషన్‌ ఫీజు 100 శాతం చెల్లించేలా పథకాన్ని సమర్థంగా మార్చి ప్రభుత్వం అమలు చేస్తోంది. మిగిలిన వర్గాలకు రూ.కోటి లేదా అసలు ట్యూషన్‌ ఫీజు (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తోంది. ఈ స్థాయిలో విదేశీ విద్య కోసం గత ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగిందా? మరి ఈనాడు ఈ పథకంపై పదేపదే ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోందో రామోజీ పక్షపాత బుద్ధిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.. ఆరోపణః స్వయం ఉపాధికి చెల్లు వాస్తవంః ఇస్త్రీ పెట్టె.. కత్తెర ఇచ్చి.. అదే స్వయం ఉపాధి పథకం అని గత టీడీపీ ప్రభుత్వం అర్భాటపు ప్రచారం చేసుకునేది. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను అన్ని విధాలుగా ఆదుకుని వారి జీవన ప్రమాణాలను పెంచేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశేష కృషి చేసింది.

టీడీపీ హయాంలో స్వయం ఉపాధి పథకం కింద 2,02,414 మందికి రూ.2,726 కోట్లు, ఎస్టీలు 39,906 మందికి రూ.284.8 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా ద్వారా 23,27,682 మంది ఎస్సీలకు రూ.9,697.99 కోట్లు. 4,78,716 మంది ఎస్టీలకు రూ.1,895.37 కోట్ల లబ్ధి చేకూరింది. చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటుకు 6,256 మంది ఎస్సీలకు రూ.346.79 కోట్లు, 1,228 మంది ఎస్టీలకు రూ.65.90 కోట్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించింది.

స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతి కోసం పౌర సరఫరాల సంస్థ ద్వారా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.133.67 కోట్లతో ఎస్సీ లబ్ధిదారులకు 2,300, ఎస్టీలకు 701 ఫోర్‌ వీలర్‌ మినీ ట్రక్‌ మొబైల్‌ డిస్పెన్సరీ యూనిట్‌ వాహనాలను పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ డోర్‌ డెలివరీ కోసం అందించింది.ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ ద్వారా స్వయం ఉపాధి పథకంలో రూ.63.20 కోట్లతో 1,038 యూనిట్లను అమలు చేసింది. ఆరోపణః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదు వాస్తవంః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదని తప్పుడు రాతలు రాసిన ఈనాడు గత ప్రభుత్వం భూమి కొనుగోలు పథకానికి ఎంతమేర భూమి సేకరించిందనే విషయాన్ని రాయలేకపోయింది. దీన్నిబట్టే ఈ పథకాన్ని టీడీపీ ఎత్తేసిందనే సంగతి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.

దశాబ్దాల క్రితం భూమి కొనుగోలు కోసం ఎస్సీ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఎస్సీల జీవితాల్లో ఇది మైలు రాయిగా నిలిచిపోయింది. 22ఏ జాబితా నుంచి మినహాయింపుతో 14.223 దళిత మహిళలకు 16,213.51 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. అసైన్‌ భూముల క్రమబద్ధీకరణతో 3,57,805 మందికి 5,37,719 ఎకరాలపై హక్కులు దక్కాయి. అవసరమైనప్పుడు భూములను విక్రయించడానికి ఎస్సీ మహిళా లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం పూర్తి హక్కులను కల్పించింది. ఎస్సీ మహిళా లబ్ధిదారులు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ జలకళ, పంటలబీమా సాయాన్నీ పొందే సౌలభ్యాన్నీ ఏర్పరిచింది.

అసైన్డ్‌ భూముల డీనోటిఫికేషన్‌ తర్వాత, భూమి యజమానులు తమ భూములపై ఫ్రీహోల్డ్‌ హక్కులు పొందుతారు. పట్టా భూములతో సమానంగా తమ భూములను విక్రయించుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వాల కంటే అత్యధికంగా ఎస్టీలకు ఏకంగా 2.47 లక్షల ఎకరాలకు పైగా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్‌ దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాలకు గత ప్రభుత్వం ఒక్క సెంటు భూమినీ కొనుగోలు చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు ’ కార్యక్రమంలో దళితులకు, ఎస్టీలకు బాసటగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 31.19 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇస్తే , అందులో 6,36,732 మంది లబ్ధిదారులు దళిత వర్గాలకు చెందిన అక్క చెల్లెమ్మలే (మొత్తం లబ్ధిదారుల్లో 20.7 శాతం).

ఆయా కుటుంబాలకు రూ.10,949 కోట్ల లబ్ధి చేకూర్చింది. వారి కోసం చేస్తున్న 4,18,646 ఇళ్ల నిర్మాణ రూపంలో మరో రూ.10,949 కోట్ల లబ్ధి చేకూరుతోంది. 1,41,496 మంది ఎస్టీ అక్కచెల్లెమ్మలు (మొత్తం లబ్ధిదారుల్లో 6 శాతం) ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంతటి లబ్ధి ఈ వర్గాలకు దక్కడం ఇదే ప్రథమం. ఇంత భారీస్థాయిలో దళితులకు ఏ ప్రభుత్వం అండగా నిలబడలేదు. ఆరోపణః బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్స్‌కు గండి వాస్తవంః ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకాన్ని నిర్వీర్యం చేసినట్టు ఈనాడు మరో వక్రీకరణకూ దిగింది. వాస్తవానికి కనీస ప్రమాణాలు పాటించని స్కూళ్లకూ బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమును గత బాబు ప్రభుత్వం అమలు చేసింది.

ఇప్పుడు ఆ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో చదువులు అందుతున్నాయి. అత్యుత్తమంగా తరగతి గదులను డిజిటలైజ్‌ చేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నారు. బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బెక్స్, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ ఆధునాతనంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే 15 వేల స్కూళ్లలో పనులు జరిగాయి. టోఫెల్‌ లాంటి కోర్సులనూ ప్రభుత్వం ఈ పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది. పిల్లలంతా బడిలో ఉండాలనే ఏకైక ధ్యేయంతో ఎస్సీ చెందిన 8,84,131 మంది తల్లులకు రూ.15వేల చొప్పున రూ.5,335.70 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం అందించింది.

2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి ద్వారా రూ.1,714.76 కోట్లు సమకూర్చింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5,06,390 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.834.96 కోట్లు జమ చేసింది. 83,04 మంది ఎస్టీలకు రూ.135.౬౬ కోట్లను జమచేసింది. జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.5,93,926 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.2,409.76 కోట్లను అందించింది. 1,22,495 ఎస్టీ విద్యార్థులకు రూ.383.43 కోట్లను సమకూర్చింది. ఈ పథకాల నిధులన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికీ చోటు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అయ్యాయి. ఆరోపణః కేంద్ర సాయానికి మోకాలడ్డు వాస్తవంః ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరించడంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసింది.

ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, సాయాన్ని రాబట్టడంలో గత టీడీపీ ప్రభుత్వానికంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గణనీయమైన కృషి చేసింది. ఎస్సీ కాంపొనెంట్‌ అమలులో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చిన జాబితాలో దేశంలోని 20 రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదికలోను స్పష్టం చేసింది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్‌ ద్వారా మొత్తం 37.64 లక్షల మందికి మేలు జరిగితే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 35.92 లక్షల మందికి లబ్ధి చేకూరడం గొప్ప రికార్డు.

ఈ కోవలోనే గిరి బిడ్డలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారినీ సమాదరిస్తోంది. జిల్లాల విభజనతో గిరిజనులకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం రెండు జిల్లాలను ఏర్పాటు చేయడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు సమస్యలు ఉంటాయి కాబట్టి ఒకే కమిషన్‌గా ఉన్న దాన్ని వేర్వేరుగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారికి దన్నుగా నిలవడం గొప్ప విషయం. ----- సంక్షేమానికి ఇలా... -టీడీపీ హయాంలో ఎస్సీలు 21,43,853 మందికి రూ..8844 కోట్లు, ఎస్టీలు 9,17,488 మందికి రూ.2,611.3 కోట్లను వెచ్చించింది.

-వైఎస్సార్‌సీపీ ‍ప్రభుత్వం డీబీటీ ద్వారా ఎస్సీలు 1,37,72.539 మందికి రూ.45,412.12 కోట్లు, ఎస్టీలు 37,90,517 మందికి రూ.13,389.21 కోట్ల మొత్తాన్ని నేరుగా బటన్‌ నొక్కి వారి ఖాతాలకే జమ చేశారు. నాన్‌ డీబీటీ ద్వారా 69,91,349 మంది ఎస్సీలకు రూ.23,468.91 కోట్లు, ఎస్టీలు 22,71,105 మందికి రూ.5,963.43 కోట్ల లబ్ధిని ఈ ప్రభుత్వం చేకూర్చింది. ఈ ప్రభుత్వంలోనే డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా మొత్తంగా ఎస్సీలు 2,07,63,888 మందికి రూ.68,881.04 కోట్లు, ఎస్టీలు 60,61,622 మందికి రూ.19,352.64 కోట్ల లబ్ధిని అందించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement