![Telangana: Minister Jagadish Reddy About Privatisation Of Electricity - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/23/22MBNRL50-600510_1_50.jpg.webp?itok=A1eI8acI)
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ రంగాన్ని ప్రైవేటీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని విమర్శించారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాలకు టీఆర్‌ఎస్ మద్దతుగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. శుక్రవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం సంస్కరణల పేరుతో దొడ్డిదారిలో చట్టాలు తెస్తోందని ఇవి తెలంగాణ ప్రజలకు ఉరి తాళ్లుగా మారుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణను సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని, దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. కాగా, ఆర్థికంగా భారం లేని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యుత్ వినియోగంలో దేశ సగటును రాష్ట్రం దాటి పోయిందన్నారు. విద్యుత్ కోసం పరిశ్రమల యాజమాన్యాలు ధర్నాలు చేసిన చరిత్ర ఉమ్మడి ఏపీలో ఉంటే.. రాష్ట్రం వచ్చిన తరువాత 50 వేల పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని తెలిపారు.
అంతకుముందు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు, 1104 యూనియన్ సభ్యులు కీలక పాత్ర పోషించారన్నారు. కార్మికుల సంక్షేమ కోసం యూనియన్ పోరాటం చేస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోసం పోరాటం చేస్తే కాల్చి చంపారన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదన్న వారి వాదనను తిప్పికొట్టి మిగులు రాష్ట్రంగా నిలిచిందన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణను టీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. సీఎండీ రఘుమారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులే విద్యుత్ సంస్థకు ప్రత్యక్ష దేవుళ్లని అన్నారు.
విద్యుత్ ఉద్యోగుల సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్. చిత్రంలో రఘుమారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment