చినుకు పడితే చీకటే! | some places the rain-interrupted powe | Sakshi
Sakshi News home page

చినుకు పడితే చీకటే!

Published Tue, Mar 3 2015 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

చినుకు పడితే    చీకటే!

చినుకు పడితే చీకటే!

వర్షంతో 118 చోట్ల విద్యుత్ అంతరాయం
ఆదివారం రాత్రంతా జాగారం
సోమవారం మధ్యాహ్నానికి పునరుద్ధరణ
తరచూ ఇదే సమస్య పునరావృతం

 
 సిటీబ్యూరో: ‘విశ్వ’ నగరం వైపు అడుగులేద్దామంటూ ఓ వైపు సీఎం పిలుపునిస్తుంటారు. ఆ దిశగా నడవాలంటూ ఎప్పటికప్పుడు అధికారులకు కర్తవ్య బోధ చేస్తుంటారు. వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎంతో ముఖ్యావసరమైన విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో... ఎప్పుడు ఉండదో  తెలీదు. చిన్న ఈదురు గాలికే నగరం గజగజ వణికిపోతోంది. ఎండ ముదిరినా... గాలి వీచినా... వర్షం కురిసినా... గ్రేటర్‌లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలుతోంది. ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నాయి. మెరుగైన సరఫరా కోసమంటూ అధికారులు చేస్తున్న నెలవారీ సమీక్షలు... ముందస్తు హడావుడి చిన్న ఈదురుగాలిముందు బలాదూర్ అవుతున్నాయి. విద్యుత్ అధికారుల అలసత్వంతో గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా నగరంలోని 118 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల అర్థరాత్రి తర్వాత పునరుద్ధరిస్తే... మరికొన్ని చోట్ల సోమవారం మధ్యాహ్నానికి సరఫరా చేశారు. విద్యుత్ లేకపోవడంతో జనం అవస్థలు వర్ణించనలవి కాదు. దోమలతో వేగలేక...విద్యుత్ సరఫరా లేక ఆదివారం రాత్రంతా జనం జాగారం చేయాల్సి వచ్చింది.

లోపాన్ని గుర్తించే పరిజ్ఞానమేదీ?

 ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 220 కేవీ సబ్‌స్టేషన్లు పది ఉండగా... 33/11కేవీ సబ్‌స్టేషన్లు 300పైగా ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు రెండు వేల ఫీడర్లు ఉన్నాయి. సుమారు 90 వేల కిలోమీటర్ల పరిధిలో 11 కేవీ డిస్ట్రిబ్యూషన్ లైన్లు, 300 కిలోమీటర్ల పరిధిలో యూజీ కేబుళ్లు ఉన్నాయి. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ఫీడర్ల నుంచి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు... అటు నుంచి గృహాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థలో తలెత్తుతున్న లోపాలను గుర్తించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆర్-ఏపీ డీఆర్‌పీ పథకం కింద ‘జియోగ్రాఫికల్ ఇన్పర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్)’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు రెండేళ్ల క్రితం గ్రీన్ ల్యాండ్ డివిజన్‌ను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సర్వే పూర్తి చేసింది. ఇప్పటి వరకూ ఈ పరిజ్ఞానం అందుబాటులోకి రాలేదు.

మూగబోతున్న కాల్‌సెంటర్లు

విద్యుత్ ప్రమాదాలు, కోతలు, ఇతర సమస్యలపై వినియోగదాల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు డిస్కం 1219 సర్వీసు నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా ప్రతి సర్కిల్‌కు ప్రత్యేకంగా ఫ్యూజ్ ఆఫ్ కాల్‌ను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వాటికి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తడం లేదు. ఇదిలా ఉంటే... ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ఎస్‌ఈ నుంచి కింది స్థాయి లైన్‌మేన్ వరకు ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించింది. ఒక్కో ఫోన్‌కు ప్రతి నెలా రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు బిల్లు చెల్లిస్తుంది. సంబంధిత అధికారులు, ఉద్యోగులు సొంత అవసరాలకు ఫోన్‌ను ఉపయోగించుకుంటూ... అత్యవసర పరిస్థితుల్లో స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఆదివారం రాత్రి వర్షానికి గ్రేటర్‌లోని 118 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శివార్లన్నీ అంధకారంలో మగ్గాల్సి వచ్చింది. ఆ సమయంలో వేలాది మంది 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేశారు. అది మూగబోవడంతో స్థానిక లైన్‌మెన్లకు, ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ సిబ్బందికి ఫోన్ చేస్తే... ఒక్కరూ ఫోన్ ఎత్త లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement