ఐటీ, అనుబంధ సంస్థల రాకతో నగరవాసుల ఆదాయం గణనీయంగా పెరిగింది. ధనిక, పేద తేడా లేకుండా ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు, టీవీలు, వాటర్ హీటర్లు, ఐరన్ బాక్స్‌లు, మిక్సీలు, గీజర్లు సర్వ సాధారణమయ్యాయి. ఫలితంగా తలసరి కరెంట్ వినియోగం కూడా భారీగా పెరిగింది. 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 2,261 యూనిట్లకు చేరడం గమనార్హం.
సాక్షి, హైదరాబాద్: నగరం శరవేగంగా విస్తరిస్తోంది. కోర్‌సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహ, వాణిజ్య, పారిశ్రామిక భవనాలు వెలుస్తున్నాయి. నెలకు సగటున 2500–3000 వరకు కొత్త విద్యుత్ కనెక్షన్లు జత చేరుతున్నాయి. ఫలితంగా ఏటా విద్యుత్ వినియోగం రెండు నుంచి మూడు శాతం అధికంగా నమోదవుతున్నట్లు అంచనా.
ఇక విద్యుత్ గృహోపకరణాల సంఖ్యా అదేస్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం ఎండలు భగ్గున మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవుతుండటంతో సిటీజనాలు ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా ఆన్ చేసి ఉంచుతున్నారు. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ పీక్‌కు చేరుకుంది.
రికార్డు స్థాయిలో డిమాండ్
రాష్ట్రం ఏర్పాటు సమయంలో గ్రేటర్ పీక్ సీజన్ డిమాండ్ 48 నుంచి 49 మిలియన్ యూనిట్లు (ఎంయూ) నమోదు కాగా... ప్రస్తుతం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. మే 19న డిస్కం చరిత్రలోనే అత్యధికంగా 80 ఎంయూలు నమోదైంది. గత ఏడాది ఏప్రిల్ 28న 71.09 ఎంయూల విద్యుత్ వినియోగం నమోదు కాగా, ఈ సారి ఏకంగా ఎనిమిది ఎంయూలకు పైగా వినియోగం నమోదు కావడం గమనార్హం.
రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో ఇంజనీర్లు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. సబ్‌స్టేషన్లలోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతుండటం, ఆయిల్ లీకేజీల కారణంగా బస్తీల్లోని పలు డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిల్ అవుతుండటం, గంటల తరబడి సరఫరా నిలిచిపోతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు అప్రమత్తమై.. ఎప్పటికప్పుడు ఆయా సబ్‌స్టేషన్లలోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment