వారి ఆశ,శ్వాస వ్యవసాయం. పచ్చని పైరులే వారి ఇంటి పాపలు. వాటికేమైనా జరిగితే..తట్టుకోలేరు. కాపు దశలో వాడితే ఆ బాధ వర్ణణాతీతం.ఈ దశలో వారిపాలిట శత్రువుగా విద్యుత్తు మారుతోంది. కోతలతో చంపుతోంది. ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ మొరాయించి మరమ్మతులు కోరుతున్నాయి. అధికారుల చుట్టూ తిరగలేక రైతులే తమకు తోచిన చందాన రిపేర్లు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తమ పొలాల్లోనే విగతజీవులవుతున్నారు. ఆత్మీయులకు గుండెకోత మిగులుస్తున్నారు.
కల్వకుర్తి,న్యూస్‌లైన్ : ఆరుగాలం శ్రమించే అన్నదాతల పాలిట విలన్‌గా విద్యుత్తు మారుతోంది. భారీగా పెట్టుబడులు పెట్టి ఎన్నో ఆశలు పెంచుకొని వేస్తున్న పంటలకోసం ఆఖరికి వారు తమ విలువైన ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. విద్యుత్ కోతలు తీవ్రతరమై ఎండిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు.
ఇది చాలదనక ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ మరమ్మతులకు గురవ్వడంతో అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. వారు రిక్తహస్తం చూపిస్తుండంతో వాటిని తామే బాగుచేసుకునేందుకు ఉపక్రమించి ఆ ప్రయత్నంలో మృత్యువాత పడుతున్నారు. ఎడతెరిపి లేని విద్యుత్ కోతలతో కరెంట్ వస్తూ, పోతుండటంతో ఓవర్ లోడ్‌కు గురువుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు పదేపదే పాడవుతున్నాయి.విద్యుత్ కార్యాలయానికి తీసుకెళ్లిన రైతుల నుంచి సంబంధిత సిబ్బంది ముక్కుపిండి సొమ్ములు వసూలు చేస్తున్నారు. దీంతో వారికి పుండుమీద కారం చల్లిన చందాన తయారవుతోంది.
అడిగితే ఏమవుతుందోనని.. వాస్తవానికి ఈ ఇబ్బందులు ఏ ఒక్క ప్రాంతానికి చెందిందో కాదు. జిల్లా వ్యాప్తంగా ఉన్నదే. అధికారులకూ వాస్తవం తెలుసు. అయినా ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయత. రైతులకూ ఒక్కోమారు విద్యుత్తు సిబ్బంది తీరుపై నోరు విప్పలేని స్థితి. చాలీ చాలని సిబ్బందితో తామేం చేస్తామని విద్యుత్తు అధికారుల వాదన. గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఉన్న లైన్‌మెన్లు, లైన్ ఇన్స్‌పెక్టర్లు అన్ని ట్రాన్సాఫారంలను తామెలా నిర్వహించగలమని ప్రశ్నిస్తున్నారు. ఉన్నంతలో సర్దుబాటు చేసుకొని పనులు చేస్తున్నా రైతుల అవసరాలకు తగ్గా పనికి రావడం లేదు. దీనితో కొన్ని మార్లు వారు ఎంతో కొంతో ఇచ్చి పనికానిచ్చు కుంటున్నారు. అయితే తరచూ మరమ్మతులకు గురవ్వడంతో తమకు తెల్సిన విధంగా మరమ్మతులు చేయాలనుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇదే అంశంపై విద్యుత్తు శాఖ ఉద్యోగుల వాదన మరోలా ఉంది. తాము ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసినప్పుడే అది మూడురోజుల పాటు మరమ్మతుకు గురైనా, సరఫరా లేకపోయినా అందుకు సిద్ధంగా ఉంటామని అగ్రిమెంటు రాయించుకుంటామని అలాంటప్పుడు రైతులే మరమ్మతులకు దిగితే తామేంచేస్తామని ప్రశ్నిస్తున్నారు.
చంటి పాపల్లా పెంచిన పంటలు కళ్లెదుటే వాడిపోతుంటే తట్టుకోలేక రైతులు మరమ్మతులకు ఉపక్రమించి ఆయువుకు చెల్లుచీటీ పలికేస్తున్నారు. ఒకేరోజు ఇద్దరు రైతన్నల మృత్యువాత.. ఇలాంటి సంఘటనే కల్వకుర్తి నియోజకవర్గంలో ఇరవురి రైతుల ఉసురు తీసింది. ఆమన్‌గల్ మండల పరిధిలోని ఎలుగురాళ్ల తండాకు చెందిన విజయ్,మాడ్గుల మండలానికి చెందిన నాగిళ్ల గ్రామానికి చెందిన బర్రె లక్ష్మయ్య (32) శనివారం ఉదయం ట్రాన్స్‌ఫార్మర్లను బాగుచేసేందుకు వెళ్లి ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు.
వారి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి నెలకొంది. ఇది తాజా సంఘటన మాత్రమే...జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే వారంలో కనీసం రెండు మరణాలు ఇలాంటి స్థితిలోనే సాగుతున్నాయి. పలుకుటుంబాల్లో శోకాన్ని నింపుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరమ్మతుల కోసం వచ్చే రైతుల నుంచి ‘వసూళ్లు’ చేయడం మాని, వారు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అందరికీ అన్నం పెట్టే రైతులే పంట పొలాల్లో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందడంపై ప్రజలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరుతున్నారు.
చివరికిలా...!
Published Sun, Feb 9 2014 2:43 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement