యువ సేన @ ట్రాన్స్‌ఫార్మర్స్
చెత్త తీసుకెళ్లేవాడు వస్తేనే ఆరడుగుల దూరంలో నుంచో పెట్టడం... మాసిపోయిన దుస్తుల్లో ఎవరైనా కనిపిస్తే చాలు వారిని హీనంగా చూడటం... ఇదీ మన సమాజం తీరు. ఈ సంఘం నుంచి ఫుట్‌పాత్ మీద కునారిల్లుతున్న బతుకులను చూసి అసహ్యించుకోవడమో, ఆమడదూరం నుంచి సాగిపోవడమో తప్ప వారిని ఆప్యాయంగా స్పర్శించే మానవత్వం ఆశించగలమా ? మట్టికొట్టుకుపోతున్న ముఖాలను తుడిచి, కడిగిన ముత్యాల్లా మెరిపించే ప్రేమాభిమానాలను ఊహించగలమా?
కాచిగూడ రైల్వేస్టేషన్ ప్రాంతం..ఆదివారం.. సాయంత్రం 4 గంటలు..
ఫుట్‌పాత్ మీద ఓ వ్యక్తి ఉన్నాడు. చింపిరి జుట్టు.. అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డం.. అక్కడక్కడా గాయాలు.. ముసిరిన ఈగలు.. అటుగా వెళ్తున్న వారు అతడ్ని చూడగానే దూరంగా జరిగి వెళ్తున్నారు. కొందరు ఈసడించుకుంటున్నారు. అదే సమయంలో ఓ ఐదుగురు యువకులు అక్కడికి వచ్చారు. ఫుట్‌పాత్‌పై ఏదో ధ్యాసలో ఉన్న ఆ వ్యక్తిని పలకరించారు. ఏదో చెబుతున్నారు.. అతను వద్దంటున్నాడు (సైగలతోనే). వీరు గడ్డం పట్టుకుని బతిమాలుతున్నారు. చుట్టుపక్కల జనాలంతా ఈ తంతును వింతగా చూస్తున్నారు.
ఓ అరగంట తర్వాత అతడు సరేననడంతో సీన్ మారిపోయింది. అప్పటికప్పుడు తమ వెంటున్న సరంజామా బయటకు తీశారు. ఒకరు హెయిర్ స్టైలిస్ట్‌గా మారిపోతే, మరొకరు ఆస్పత్రిలో నర్స్ విధులను మొదలుపెట్టారు. ఒకరు వెంట తెచ్చిన క్యారియర్ నుంచి ఫుడ్ తీసి సిద్ధం చేస్తుంటే.. ఇంకొకరు ఓ వారానికి సరిపడా.. మందులు, సబ్బులు వంటివి కిట్‌లో సర్దుతున్నారు.
‘మమత కరువై.. మనుషుల మధ్యే మానుల్లా మనుగడ సాగిస్తున్న వారి జీవితాలు శిథిలమైపోతుంటే మౌనంగా ఉండటం సరైనదేనా..?’.. ఈ ప్రశ్నకు సమాధానంగా అవతరించిందే ‘ట్రాన్స్‌ఫార్మర్స్’. ఫుట్‌పాత్‌పై తెల్లారిపోతున్న బతుకులకు కాసింత వెలుగు ప్రసాదించడానికి నగర యువత తీసుకొచ్చిన కాంతిపుంజం. ఆదివారం అంటే ఆనందం అనుకునే ఈ తరం యువతకు కాస్త భిన్నంగా హాలిడేను హార్ట్ టచింగ్ డేగా కూడా మార్చుకుంటున్నారు వారు.
మ్యూజిక్ బాండ్ నుంచి యంగిస్థాన్ వరకు..
నగరానికి చెందిన అరుణ్ డేవిడ్ మరికొందరు మిత్రులతో కలసి టేకెన్ పేరుతో మ్యూజిక్ బ్యాండ్ నిర్వహించేవారు. ‘అప్పడు మేం చాలా కన్సర్ట్స్‌లో సోషల్ రెస్పాన్సిబులిటీ గురించి పాటలు పాడేవాళ్లం. వాటికి ఇన్‌స్పైర్ అయిన వారు.. ఏం చేయాలని అడిగేవారు. అప్పుడే ఓ వేదిక స్థాపించాలనుకున్నాం. అలా ఓ ఐదుగురం కలసి 2012 మార్చిలో యంగిస్థాన్ స్టార్ట్ చేశాం’ అని తమ తొలి అడుగులను గుర్తు చేసుకున్నారు అరుణ్.
ప్రస్తుతం ఇందులో 120 మంది రిజిస్టర్ట్ వాలంటీర్లు ఉన్నారు. ప్రతి ఆదివారం వీరు సమావేశమవుతారు. వారానికో వాలంటరీ ఇంట్లో వంట చేయించి 1,000 మంది నిర్భాగ్యులకు పంపిణీ చేస్తుంటారు. ప్రతి శనివారం కనీసం ఐదు అనాథ శరణాలయాలకు వెళ్లి అక్కడి పిల్లలకు ట్యూషన్ చెబుతారు. ఇదే కోవలో ఈ యువసేన వేసిన మరో ముందడుగే ట్రాన్స్ ఫార్మర్స్.
ఆలోచన వెనుక..
ఫుట్‌పాత్ మీద అపరిశుభ్రంగా ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఈ ఆలోచన కలిగిందని యంగిస్థాన్ సభ్యుడు రోహిత్ చెబుతాడు. ‘పగబట్టిన విధి వీరిని విగత జీవులుగా మార్చేసింది. నెలలు కాదు ఏళ్లకేళ్లు వీళ్లు స్నానం చేయరు. వీరి జీవితాలను ఎందుకు మార్చకూడదు అనిపించింది అనుకున్న’ ఈ యువత కాచిగూడ స్టేషన్ దగ్గర ఫుట్‌పాత్ మీదున్న ఓ వృద్ధుడి మేకోవర్‌తో ‘ట్రాన్స్‌ఫార్మర్స్’గా తొలి అడుగు వేసింది. ‘అపరిశుభ్రంగా ఉన్న ఆ వృద్ధుడ్ని ఎంతో బతిమాలితే గాని ఒంటి మీద చేయి వేయనీయలేదు. అతనికి ట్రిమ్ చేసి.. స్నానం చేయించి.. ఫొటో తీసి చూపిస్తే.. ఆయన దాన్ని ముద్దాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడ’ని
చెప్పుకొచ్చారు ఆ యువకులు.
వారానికి ఐదుగురు
వీరిలో వారానికి ఐదుగురు బ్యాచ్ చొప్పున ట్రాన్స్‌ఫార్మర్స్ అవతారమెత్తుతున్నారు. హెయిర్ కటింగ్, ప్రాథమిక చికిత్స మెళకువలు నేర్చుకుంటు న్నారు. ‘మేకోవర్‌కు గంట పడుతోంది. కొందరి వెంట్రుకల్లో పురుగులుంటాయి. కొందరి జుట్టు కట్ చేయడానికి వీలులేకుండా ఉంటాయ’ని గుర్తు చేసుకుంటూ ఆ అభాగ్యజీవుల బతుకులపై వీరికున్న సానుభూతి వ్యక్తమైంది.
అలా వదిలేయకుండా..
‘ఈ ఫుట్‌పాత్ జీవులలో వృద్ధులే ఎక్కువ. పిల్లల ఆదరణ లేని వారు, రోడ్డు ప్రమాదాలకు గురై మానసికంగా దెబ్బతిన్నవారు.. ఇలా ఎందరో ఉన్నారు. వీరిని మేకోవర్ పూర్తయ్యాక వదిలేయకుండా ట్రైనింగ్ సెంటర్స్‌కు పంపాలని ఆలోచనలో ఉన్నాం. రిహాబిలిటేషన్, స్కిల్ ట్రైనింగ్, షెల్టర్ హౌస్‌కు కూడా ప్లాన్ చేస్తున్నాం. సులభ్ వారితో మాట్లాడి వారికో శాశ్వతమైన ఐడీ తీసుకుందాం అనుకుంటున్నాం’ అంటూ తమ భవిష్యత్ ప్రణాళికలు వివరించారీ మిత్రబృందం. ‘ది సోల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు సర్వ్ హ్యుమానిటీ’ అన్న లియో టాల్‌స్టాయ్ మాటల్నే తమ చేతలకు ప్రాతిపదికగా చెబుతున్న ఈ స్నేహితులు చేస్తున్న సేవ.. యువత నడతకు కొత్త భాష్యం.