
మరో నాలుగు ట్రాన్స్‌ఫార్మర్స్
భారీ సైజ్‌లో ఉండే రోబోలు అంతరిక్షం నుంచి వచ్చి భూమ్మీద పోరాడితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించే ‘ట్రాన్స్‌ఫార్మర్స్’ హాలీవుడ్ సిరీస్ అంటే ప్రపంచ సినీ అభిమానులకు ఎంతో క్రేజ్. హాలీవుడ్ దర్శకుడు మైఖైల్ బే తెరకెక్కించిన ఈ సిరీస్‌లోని తొలి చిత్రం 2007లో విడుదలైంది. ఆ తర్వాత వచ్చిన రెండు సీక్వెల్స్ ఘన విజయం సాధించగా, గత ఏడాది విడుదలైన నాలుగో భాగం మాత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. త్వరలో ఈ సిరీస్‌కు కొనసాగింపుగా నాలుగు భాగాలు రూపొందనున్నాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హాస్బ్రొ ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన మరో నాలుగు భాగాల స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, రానున్న పదేళ్లల్లో వీటిని విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధి స్టీఫెన్ డేవిస్ ప్రకటించారు. మొదటి నాలుగు భాగాలను తెరకెక్కించిన మైఖేల్ బే ఐదో భాగాన్ని తెరకెక్కించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు.